Wednesday, December 15, 2010

బాపు - రమణ పక్కన్నేనూ మా ఆవిడ.....అన్నట్టిది నా వందో పోస్ట్. సెంచరీ కొట్టేసా......

హమ్మయ్య ఎలాగైతేనేం ఇప్పటికి నా వందో పోస్ట్ రాయడం కుదిరింది. 

గత ఫిబ్రవరిలో నా జీవితం లో తొలిసారిగా నా అభిమాన రచయిత రమణ గారిని, నాకు నచ్చే దర్శకుడు బాపు గారిని కలుసుకున్నప్పటి విశేషాలు రాద్దామని ఎప్పటికప్పుడు ప్రారంభించడం...రాసింది సంతృప్తికరంగా లేక  మరోసారికి వాయిదా వేయడం...ఇలా మొదటి ప్రేమలేఖ రాసేటప్పుడు మనస్థితి ఎలా ఉంటుందో, అలా అనిపించేది. సరే ఈరోజు బాపు గారి బర్త్ డే కదా, ఇప్పటికీ రాయలేకపోతే కాలెండర్ మారిపోతుంది అనిపించి ధైర్యం చేసి పోస్ట్ చేసేస్తున్నా.

ఈ ఏడాది ఫిబ్రవరి  ఇరవై రెండో తేది. 
ఉదయం ఎనిమిది గంటలు

చెన్నై లోని ఓ హోటల్ రూం లో ఉన్న నేను మా ఆవిడ తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నాం. చెన్నై వచ్చి రమణ గారిని కలవకుండా వెళ్ళడం అంటే తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళడం లాంటిదే అని నేను, అంత పెద్దాయన మనల్ని కలుస్తారా? మాట్లాడుతారా అని మా ఆవిడ. సరే ఫోన్ చేసి చూద్దాం అని కోతికొమ్మచ్చి పుస్తకం లో ఉన్న రమణ గారి ఇంటికి కాల్ చేసాం. ఫోన్ లిఫ్ట్ చేసింది అర్ధ రమణ గారు (అంటే రమణ గారి శ్రీమతిగారు) . నేను కూడబలుక్కుని "ర మ ణ గారున్నారాండి? అనగానే ఆవిడ "ఇస్తున్నా" అని ఫోన్ ఆయనకిచ్చారు. ఇహ చూస్కోండి నాకు నోట్లోంచి మాట రాలేనంత ఉద్వేగం. నేను సాక్షాత్తు రమణ గారితో మాట్లాడుతున్నా అనే ఆనందం. ఇంతలో "హలో" అంటూ రమణ గారి గొంతు ఫోన్లో పలకరించింది. గుండె ఆనందం తో పేలిపోతుందేమో అనిపించింది. అప్పుడే మాటలు నేర్చుకుంటున్న వాడిలా తడబడుతూ "సర్ నేను...మేము...చెన్నై...వచ్చాము...మిమ్మల్ని కలుద్దామని...." అంటూంటే ఆయన "వచ్చేయండి"  అన్నారు. ఇంటికి ఎలా రావాలో దారి చెప్పారు. 

పెద్దవాళ్ళ దగ్గరకి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా పళ్ళో, దండలో తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్దాం? అంది మా ఆవిడ. నేను తాపీగా "ఒక కిలో జీడిపప్పు" అన్నా. నాకేసి వింతగా చూసింది. అవును మరి నేను రమణ గారి అభిమానిని...ఆయన వయసెంతని? బుడుగు కన్నా కాస్త పెద్దవాడేమో అంతే. సరే జీడిపప్పు ప్యాకెట్ పట్టుకుని ఆయన చెప్పిన ఇంటిముందు ఆటో దిగాం. గేటు దగ్గర వాచ్ మెన్ ని "రమణ గారు" అంటూండగానే అతను "పైన, రెండో ఫ్లోరు" అన్నాడు. మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా పెద్ద హాలు, ఆ వెనుక ఒక బాల్కనిలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తెల్ల బనీను, లుంగీ లో  రమణ గారు.ఆయన్ని చూడగానే ఒక్కసారి అన్నమయ్య సినిమాలొ నాగార్జున చెప్పిన పట్టరాని అలసిపోయెంత ఆనందం అంటే  ఎలా ఉంటుందో నాకు అనుభవం లోకి వచ్చింది. మేము నమస్కారం చెయ్యగానే ఆయన కూర్చోండి వస్తున్నా అన్నట్టు సైగ చేసారు. 

                                                                 రమణ గారు వారి శ్రీమతి 

                                                                          వాళ్ళిద్దరితో మేమిద్దరం 

ఫోన్ ముగించుకుని వచ్చిన రమణ గారు "ఆ చెప్పండి" అన్నారు. నాకు చూస్తే ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు. అర్ధం కావటం ఏంటి నా బొంద..అసలు మాటే పెగలటం లేదు. గుండె గొంతుకలోన కొట్టాడుతున్డాది అని నండూరి వారు అన్నమాటకు అర్ధం అప్పుడు అనుభవం లోకి వచ్చింది. ఇంతలో పాపం మా ఆవిడే కలుగజేసుకుని "ఈయన మీకు పెద్ద ఫ్యానండి" అంది. ఆయన నవ్వుతూ తల ఊపారు. ఏం చెయ్యాలో తోచని నేను చటుక్కున తెచ్చిన జీడిపప్పు ప్యాకెట్ ఆయన చేతికిచ్చి "సర్ మీ కోసం..." అన్నా. రమణ గారు నవ్వుతూ "భలే. జీడిపప్పు తెచ్చారు. అన్నట్టు బాపుగారు  దీనిమీద ఒక కార్టూను కూడా వేసినట్టు గుర్తు. ఈ సన్మానాలు వాటిలో దండలూ అవీ వేసి వేస్ట్ చేసే బదులు ఎంచక్కా ఓ కిలో జీడిపప్పు ఇవ్వరాదూ, పంటికిందకయినా పనికొస్తుంది.. అంటూ ఏదో ఉండాలి." అన్నారు. 

ఆయన ఆమాట అంటూండగానే నేను "సర్ బాపూ గారూ?" అన్నా. ఆయన "కిందే. ఉండండి పిలుస్తా' అని ఇంటర్ కాం నొక్కి "ఒకసారి పైకి రా" అని పిలిచారు. అరనిముషంలో గుమ్మం ముందు లుంగీ, జుబ్బా వేసుకుని కదిలే కుంచెలా బాపు గారు ప్రత్యక్షం. "బాపురే...ఇద్దర్నీ ఒకేసారి చూడటం...ఇది చాలు నా జన్మకి " అనిపించింది. చిరునవ్వుతో లోపలి వచ్చిన బాపు గారికి నన్ను రమణ గారు పరిచయం చేసారు.ఆయన నవ్వుతూ అంతలో అక్కడున్న జీడిపప్పు ప్యాకెట్ కేసి, రమణ గారి కేసి చూసి ఒక చిలిపి నవ్వు నవ్వారు (అంతా నీకేనా అన్నట్టు). రమణ గారు "ఇప్పుడే సన్మానాలలో జీడిపప్పు ఇవ్వచ్చంటూ నువ్వేసిన ఆ కార్టూను గురించి చెప్తున్నా" అంటూ "వీళ్ళకి నీ స్టూడియో చూపించు" అన్నారు. ఉత్సాహంగా బాపు గారు "రండి" అంటూ మమ్మల్ని ఆయన స్టూడియో కి తీసుకెళ్ళారు.

(మిగిలినది రెండో భాగం లో) 

రెండేళ్ళు పూర్తి చేసుకున్న బాపు గారికి (ఈ మాట రమణ గారిదే) జన్మదిన శుభాకాంక్షలు.
ఇదే రోజు మా పిన్ని కూతురు వినీత బర్త్ డే కూడా. తనకీ బ్లాగ్ముఖతా హ్యాపీ బర్త్ డే.