Wednesday, December 29, 2010

బాపు - రమణ పక్కన్నేనూ మా ఆవిడ.....రెండవ భాగం.

బాపు గారితో ఆయన స్టూడియో లోకి అడుగుపెడుతూనే ఎదురుగా లారెల్ అండ్ హార్డీ ఇలా పలకరించారు.

















 పెద్ద హాలు...ఎటు చూసినా నేల మీద  చిందర వందరగా పరచిన కాగితాలు, పుస్తకాలు, షెల్ఫ్ ల నిండా పుస్తకాలు, గదికి ఆ మూల ఒక కిటికీ, దాని పక్కన బాపు గారు నేలమీదే కూర్చుని బొమ్మలేసుకునే చిన్న టేబుల్. నాకు ఆ గదిలో అడుగుపెడుతూనే నాకు బాగా నచ్చినది ఆ కిటికీ. వర్షాకాలం ఆ కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ, వేడి వేడి పకోడీలు, టీ కాంబినేషన్ తో బాపు, రమణ గార్లతో  బాతాఖాని వేస్తే భలే ఉంటుందనిపించింది. 















ఇక అక్కడున్న ఫోటోలు అన్నిటిలో నాకు బాగానచ్చినది బడే గులాం అలీ ఖాన్, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గార్లు కలిసి ఉన్న ఫోటో. అక్కడే మెహదీ హసన్ హార్మనీ వాయిస్తూ ఉన్న స్కెచ్ చూసి నాకు కోతి కొమ్మచ్చి లో చదివిన దాని కధ గుర్తొచ్చింది. అలమారా అరల్లో వరుసగా పేర్చి ఉన్న ఆడియో కేసెట్ల కలెక్షన్ చూస్తేనే అవన్నీ బాపు గారికి ఇష్టమయిన ఘజల్స్ అని అర్ధమయిపోయింది. 


















ఇందులో మెహదీ హసన్ గారి సంతకం ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం.(తెలియక పోతే కోతి కొమ్మచ్చి మొదటి భాగం ఒక సారి తిరగెయ్యండి)


ఇంతలో ఆయన మెల్లగా తన ఆస్థాన స్థానం (అదే లెండి  కిటికీ పక్కన బల్ల దగ్గర) లో కూర్చుని మమ్మల్నీ కూర్చోమంటూ సైగ చేసారు. కూర్చుని ఆయన గది మొత్తం అబ్బురంగా (బాపు బొమ్మ పుట్టింది, పుట్టేది, పుట్టబోయేది ఇక్కడే కదా మరి) చూస్తూండగా ఆయన తన బొమ్మల ప్రింట్ లు తీసి "ఇందులో మీకు కావాల్సినవి తీసుకోండి" అన్నారు. ఆ క్షణంలో  భగవంతుడు బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి కావలసినన్ని వరాలు డ్రా చేసుకో అన్నట్టు అనిపించింది. అవి ఒక యాభై దాకా ఉన్నాయి. అన్నీ తీసుకుంటే ఏమనుకుంటారో (పరమ కక్కుర్తి వెధవ అనుకోవచ్చేమో అన్నా భయం....పాపం ఆయనకేం తెలుసు బాపు బొమ్మ ఇష్టపడని తెలుగోడు పుట్టలేదు, పుట్టబోడు అని?) ఆ క్షణం లో అన్ని చాయిస్ లు ఉండటం కూడా పే...ద్ద ఇబ్బందే సుమీ అనిపించింది. 

ఇంతలో నాకు బాపు గారి పైప్ విషయం గుర్తొచ్చి "సార్ మీ పైప్ ఒక సారి చూడచ్చా?" అన్నాను. ఆయన జవాబు చెప్పే లోపలే డాక్టర్ దగ్గరనుంచి ఆయనకోసం మందు తీసుకొచ్చిన బాపు గారి అమ్మాయి లోపలి వస్తూ కనిపించారు. వెంటనే బాపు గారు కళ్ళతోనే ఆగమని సైగ చేసి ఆవిడ రాగానే "మా అమ్మాయి" అంటూ మాకు పరిచయం చేసారు. ఆవిడ మమ్మల్ని పలకరించి డాక్టరు చెప్పిన సూచనలని (పధ్యం వగైరా) బాపు గారికి చెప్పి వెళ్ళిపోగానే "ఏమయింది సర్" అన్నా? " కాలు కాస్త బాలేదు" ఇదీ ఆయన సమాధానం. (వార్నీ ఇంత మిత భాషా? ). మళ్ళీ పైప్ విషయం గుర్తొచ్చి "అదీ మీ పైప్ గురించి ఏదో చెప్పబోయారు ..." అన్నా. "మానేయాల్సొచ్చింది. అది ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, గుర్తు చెయ్యకండి...మళ్ళీ ఎక్కడో మనసు లాగుతుంది' అంటూ నవ్వారు. 


పైప్ - బాపు (పైపెక్కిన మెహది హసన్ పై అభిమానం)




















ఇంతలో మా ఆవిడ ఆయన ఇచ్చిన బొమ్మలలోంచి "కోటప్ప కొండ ఆలయమండలి మూల విరాట్" అని ఉన్న బొమ్మ ఆయనకు చూపించి "ఇది నేను తీసుకుంటా" అంది. ఆయన నవ్వుతూ తలూపారు. ఇంతలో నేను బాదామి గుహలలో పద్దెనిమిది చేతుల నటరాజు శిల్పం గురించి ఆయనకీ చెప్పి ఆ ఫోటో నా లాప్ టాప్ లో ఆయనకు చూపించా. "ఆ బొమ్మ మీరేస్తే చూడాలని ఉంది" అని నా కోరికను కూడా చెప్పా. "ఇది నాకొక కాపీ పంపించండి. వేసిస్తా" అన్నారు. అంటూ "అలాంటిదే ఆ మధ్య ఒక కృష్ణుడి బొమ్మ వేసాను...అన్ని చేతులు కాదు కానీ ఎనిమిది చేతులతో ఉంటుంది. ఉండండి చూస్తా" అంటూ వెతికి ఒక బొమ్మ తీసి చూపించి "ఇది మీ దగ్గరుంచండి" అన్నారు. ఇంతలో మా ఆవిడ మొహమాటం తో ఒకే బొమ్మ తీసుకుని మిగిలినవి నా చేతిలో పెట్టింది. "మీరూ కావలసినవి తీసుకోండి" అన్నారాయన. నేను ఆ బొమ్మల్లోంచి ఒక సరస్వతి దేవి బొమ్మ తీసుకుని "ఈ గెటప్ లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి  బొమ్మ గీసిస్తారా? అంటే ఇది తీసుకుంటున్నాను, సరస్వతి దేవి రూపం లో సుబ్బలక్ష్మి గారు కూర్చున్నట్టు బొమ్మ" అని ఆయన్నడిగా. 'ఆ మధ్య భానుమతి గారిది ఇలా వేసినట్టు గుర్తు. సుబ్బలక్ష్మి గారు అలా చూస్తున్న ఫోటో ఏదయినా దొరికితే పంపండి, నేనూ వెతుకుతా, ఐడియా బావుంది' అన్నారు. 
నాకిచ్చిన సరస్వతీ దేవి బొమ్మమీద సంతకం చేస్తూ బాపు గారు


















ఇంతలో మా ఆవిడ తను తీసుకున్న "కోటప్ప కొండ ఆలయమండలి మూల విరాట్" బొమ్మ ఆయన ముందు పెట్టి "మీరు ఆటో గ్రాఫ్ చేసి ఇవ్వండి" అని అడిగింది. ఆయన నవ్వుతూ ఆ బొమ్మ తీసుకుని దాని మీద "చి. సౌ. స్వాతి శంకర్ కు శుభాకాంక్షలతో బాపు" అని తారీఖు వేసి ఇచ్చారు. ఆయన రాస్తున్నప్పుడు నాకు కంప్యూటర్ లో బాపు ఫాంట్ గుర్తొచ్చింది. ఇంతలో మా ఆవిడ నా చేతిలో ఉన్న రెండు బొమ్మలూ తీసుకుని ఆయన ముందు పెట్టింది. ఆయన వాటి మీద కూడా "చి. సౌ. స్వాతి శంకర్ కు శుభాకాంక్షలతో బాపు" అనే రాశారు. చెప్పద్దూ!  నాకు మా ఆవిడ మీద భలే కోపం, ఉక్రోషం వచ్చింది. తీసుకున్న మూడు బొమ్మల మీదా తన పేరే వచ్చేసిందే అని. అంతలోనే అందులో ఉన్న "శంకర్" ను చూసి పోన్లే నన్నూ కలిపారు అనుకుని కాస్త కంట్రోల్ చేసుకున్నా.


 ఇవే "బాపు" ప్రసాదం :) - బాపుగారి వద్ద నుండి తీసుకున్న బొమ్మలు 




































దీనిమీదే  తరవాత నేను రమణ గారి ఆటో గ్రాఫ్  కూడా తీసుకున్నా  



















ఇంతలో బాపు గారు లేచి "పదండి పైకి వెళ్దాం" అంతతో రమణ గారి పోర్షన్ వైపు దారి తీసారు. మేమిద్దరం ఆయన్ని అనుసరించాం.

(మిగిలినది మూడో భాగం లో )