"త్వరలో పావలా ని రద్దు చేసేస్తున్నరట్రా ఇక నుంచి అర్ధ రూపాయే కనీస విలువగా చలామణీ లో ఉంటుందిట" పేపర్లో చదివిన వార్త మా ఫ్రెండ్ తో పంచుకున్నప్పుడు "వెధవ పావలా దాన్ని ఉంచితే ఎంత? రద్దు చేస్తే ఎంత?, అయినా ఈ రోజుల్లో ఏమొస్తుంది పావలాకి? ముష్టి వాడు కూడా తీసుకోడు" అన్న వాడి మాటలకి కాస్త చివుక్కుమంది. నిజమే పావలాకి ఇప్పుడు ఏమొస్తుంది? ప్రభుత్వ పధకాలలో, ఎన్నికల వాగ్దానాలలో "పావలా వడ్డీ" అని చెప్పుకోడానికి తప్ప ఇప్పుడు దానికి విలువేముంది? కానీ ఒకప్పుడు ఆ పావలాతోనే ఎన్నో సంతోషాలని కొనుక్కున్నా.
చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఐస్ సోడా, వేరుశనగ ఉండలు, ఉప్పూ కారం అద్దిన మావిడికాయ ముక్కలు, కారపు నీళ్ళలో ఊరబెట్టిన పెద్ద ఉసిరికాయలు, పీచు మిఠాయి, సొంపాపిడి, చిన్న చిన్న మావిడి తాండ్ర ముక్కలు, బుల్లి కోన్ తో ఐస్ క్రీం, కాస్త పెద్ద సైజు రబ్బరు (ఇప్పుడు స్టైల్ గా ఎరేజర్ అంటున్నాం లెండి), బాల్ పాయింట్ పెన్ రీఫిలు, చిన్న సైకిల్ గంట అద్దె ..ఇలా ఒకటా.. రెండా చేతిలో పావలా ఉంటే నా పరిధిలో అన్ని విలాసాలు తీర్చేసుకోవచ్చు అని నమ్మేవాడిని. అవును మరి.. . అప్పట్లో ఎలిమెంటరీ స్కూలు కుర్రాడి రోజువారీ పాకెట్ మనీ పావలా ఉంటే వాడు మహా రిచ్ గా లెక్క.
స్కూలు ముందు ఒక ముసలాయన కర్రకి ఆ చివర రంగు రంగుల జీడిపాకం లాంటిది కట్టుకుని దాంతో వాచీ,కోతిబొమ్మ చేసేవాడు, దాని విలువ పావలాయే. ఇక మా ఊరి చొల్లంగి తీర్ధం లో పావలాకి ఇచ్చే జీళ్ళు (సాధారణం గా పావలాకి రెండు ఇచ్చేవాళ్ళు), అలాగే ఆ తీర్ధం లో దాదాపు మా ఈడు కొడుకును పక్కనే నిలబెట్టుకుని చేత్తో తిప్పే రంగుల రాట్నం నడిపే ఒకతను దాన్ని ఎక్కడానికి మా దగ్గరనుంచి వసూలు చేసేది పావలాయే. రంగుల రాట్నం లో తిరుగుతున్న మమ్మల్ని ఆశగా చూసే ఆ కుర్రాడి చూపుల్లో "నీకూ నాకు తేడా ఒక్క పావలాయే" అన్న అర్ధం ఉండేదేమో అని ఇప్పుడనిపిస్తుంది.
ఇక సంక్రాంతికి ఇంటిముందుకి వచ్చే హరిదాసుకి దోసిలి నిండా బియ్యం తో పాటు ఒక పావలాయో, అర్ధరూపాయో ఇవ్వడం, గంగిరెద్దులవాళ్ళు ఇంటి ముందు చేయించిన విన్యాసాలకి బహుమతిగా మా తాతగారు రూపాయో, రెండ్రూపాయలో ఇచ్చినప్పుడు, నేను సైతం అంటూ నా నిక్కరు జేబులో అపురూపంగా దాచుకున్న పావలాని వాళ్లకిచ్చేయడం (ఆ తరువాత నా దగ్గర దాచుకున్న పావలా వాళ్లకిచ్చేసానని మా తాతగారు నా చేతిలో ఏ అర్ధ రూపాయో పెట్టడం వేరే సంగతనుకోండి :) )
ఒక్కటా రెండా...పావలాతో ఇన్ని జ్ఞాపకాలు. అలాంటి ఆ పావలా ఇక ముందు కనిపించదంటే కలుక్కుమనదా మరి.
13 comments:
అసలు పావలా ఇంకా ఉందంటే నాకు ఆశ్చర్యం! ఎక్కడా అమల్లో అయితే లేదు. పావలాలు, పది పైసళ్ళూ ఎప్పుడో మాయమైపోయాయి. మన ముందు తరాల వాళ్ళు "పావలా కాసంత బొట్టు" అని చదివి "అంటే ఏమిటి" అనడుగుతారేమో ఇహ!
పావలా స్కూలుకు తీస్కెళితే మీరన్నట్లు పక్క పిల్లలకు కూడా కొనగలిగేంత రిచ్ ఒకప్పుడు. పావలా కథాంశంతో ఆలిండియా రేడియోలో ఒక నాటిక కూడా వచ్చింది. "పావలా" అని! ఇప్పుడున్న నటి పావలా శ్యామల ఆ నాటకం లో వేసిన పాత్ర ఆధారంగా తన పేరుకు పావలాను ముందు చేర్చుకుంది.
అవునండీ గణేష్ పాత్రో గారు రాసిన ఆ "పావలా" నాటిక ఎక్కడైనా దొరికితే చదవాలనుంది.
Today a begger rejects 50paisa. There is no value for even one rupee..the other day when i gave a one rupee note to some vendor..he rejected taking it saying 'ivi chellavammaa..'
i remember buying 'goli soda' for 10paisa in my schooldays.I dont remember the film...in a scene a heroine gives a long list of items we can buy with a 'paavalaa'..:)
పావలా గురించి మీరు రాసినది చదివి ఎంత సరదా వేసిందో ! ఎంత బాధ కలిగిందో ! మన తరం (?)
వారి జేబుతో మీరన్నట్టు ఒక పావలా ఉంటే నేలకి బెత్తెడు నడిచే వాళ్ళం. తిరణాళ్ళలో బోలెడు కొనుక్కొనే వాళ్ళం.
నా దగ్గర చాలా పావలా కాసలు పోగు పడ్డాయి. ఈ సారి వీలు చూసుకుని వాటి ఫొటోని నా బ్లాగులో పెట్టి, మీకు తెలియ జేస్తానేం ?
మంచి టపా పెట్టినందుకు మీకు నా అభినందనలు.
గురువుగారూ మీరు పెట్టిన "(?) " నిజమే. నాది మీ తరువాతి తరం. నాకే పావలా కనిపించదంటే కాస్త బాధగా ఉందంటే మీ తరం వారికి దాంతో ఇంకా ఎక్కువ జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. త్వరలో మీ నుంచి ఈ విషయమై మంచి పోస్ట్ ఆశించవచ్చన్నమాట.
పడిపోయినది పావలా విలువ మాత్రమే కాదండి. మన భారతదేశ సంప్రదాయవిలువలు నిలువ చెయ్యలేకపోతోంది ఈ తరం, ఈ సంఘం, ఈ సర్కారు. మంచి టప వ్రాశారు - అభినందనలు.
పావల ఎప్పుడో పోయిందండీ. ఇప్పుడు ఎవరికైనా అర్థరూపాయి ఇస్తే నువ్వే ఉంచుకో అని వెనక్కితిరిగి ఇచ్చేస్తున్నారు.
చిన్నప్పుడు పావల పెట్టుకుని హౌసీ ఆడుకునేవాళ్ళం. పావలా కి ఒక షాంపూ పేకెట్ వచ్చేది. పావలాకి ఐదు పనసతొనలు (ఆ ఆకారంలో ఉండే రంగు బిళ్లలు) వచ్చేవి. :(
ఆర్థిక సమరంలో వీరోచితంగా పోరాడి మరణించిన పావలాకు ఇదే ఆశృతర్పణం.
నన్నడిగితే రూపాయ విలువ ఓ బ్రిటిష్ పౌండు అనేయాలి అంతే, ఏమైతే అయిపోని. పోయిన రాగి పైసా నుంచి అన్నీ లేచి వస్తాయి. నా ప్రతిపాదన నచ్చినోళ్ళు చేతులెత్తండి. :)
ఎవరో రద్దుచేయడమేమో కాని నేను పావలాచూసి చాలా ఏళ్లైందండి. మీ టపా మాత్రం బోలెడు ఙ్ఞాపకాలను కదిలించింది.
gurthukostunnayii...is the song that i cna hum after reading this :) beautiful post!
pasidi tho samaanamaina aa pavala ippudu paniki rani pavala ayindi... edemaina marpu manchide... manaku navvuthu nivali iche sandarbhalu chala takkuvaga dorukutay... ippudee pavala ki iche nivali ni kuda navvuthu iddam... repeppudo mutapadipoye rupaayi akkuna cherchukundam... mee write-up chala bagundi...
naaku inkoka bombaayi mitaayi senhitulu dorikaaroch....meeru cheppaare aa jeedi paakam to vaacheelu avee...daanni bombayi mitaayi anevaallam.(maa oollo haloveen lo wraasaanu deeni gurinchi) ...bhale undi yee tapa....
Chollangi teertham ?
E vooru meedi ?
Post a Comment