Wednesday, March 3, 2010

స్వర్గం నేలకు దింపి...కట్టించారేమో హంపి


ఫిబ్రవరి 16 , 2009 - మా మొదటి పెళ్లిరోజు సందర్భంగా (ఇక్కడ మొదటి అనేది పెళ్లి రోజుకే కానీ పెళ్లికి కాదని మనవి :)  ఎక్కడికి వెళ్దామా అని యమ సీరియస్ గా ఆలోచిస్తూ నేను, మా ఆవిడా మొత్తం భారతదేశంలోని దర్శనీయ స్థలాలన్నిటినీ కాచి వడబోసి చివరాఖరికి హంపిని ఫైనల్ చేసాం. ఫిబ్రవరి పద్నాలుగున కాచిగూడ నుంచి బయల్దేరి హోస్పేట చేరుకున్నాం. అక్కడనుంచి హంపి ఆరు కి.మీ. ముందే కర్ణాటక టూరిజం వాళ్ళ మయూర భువనేశ్వరి లో రూం బుక్ చేసుకుని ఉన్నందువలన డైరెక్ట్ గా ఆటో లో అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయి ఊరి మీద పడ్డాం. మొత్తం మూడు రోజుల మా ట్రిప్ లో మొదటి రోజు గైడ్ ని మాట్లాడుకుని అతను ఎవరో తరుముతున్నట్టు అన్నీ హడావుడిగా చూపించడం తో నచ్చక రెండవ రోజు మేమే బైక్ అద్దెకు తీసుకుని హంపి ని నచ్చిన చోట ఆగుతూ తెగ తిరిగేసాం. హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం (నిజానికి ఇది లక్ష్మీ నరసింహ శిల్పం...కానీ విజయనగర సామ్రాజ్య లక్ష్మి లాగే ఈ విగ్రహం లో లక్ష్మి ని కూడా బహమనీలు నాశనం చేశారట..ఒక్క ఈ శిల్పం అనేముంది లెండి చాలామటుకు గుళ్ళను, శిల్పాలను ఆరు నెలల పాటు హంపి లో ఉండి చేసినంత వరకు నాశనం చేసి ఇక ఓపిక నశించో ఏమో గర్భగుడులలో విగ్రహాలను నాశనం చేసి ఆ గుళ్ళను నిరుపయోగం చేసారట...వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి), ఏకశిలా రధం (నిజానికి ఇది ఏడు శిలలతో చెక్కింది కానీ ఎందుకో మనవాళ్ళు అలా అనేస్తారు), సంగీతం పలికే స్తంభాలు, హజార రామాలయం, దసరా దిబ్బ (ఇక్కడే దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవట), అష్ట లక్ష్మి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు (ఆలయం పోయి కోనేరు మిగిలింది...ఇది మాత్రం చూసి తీరవలసిన రీతిలో కట్టారు లెండి), ఇలా ఒక్క విరూపాక్ష దేవాలయం తప్ప అన్నీ చూసేసాం (అది మాత్రం చివరి రోజు ప్రశాంతం గా చూద్దాం అని ఆగాము...అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతాయి). అన్నట్టు హంపి ప్రాంతం రామాయణం టైం లో కిష్కిందగా పిలవబడేదట (అంటే వానర రాజ్యం లో వివాహ వార్షికోత్సవం అన్నమాట ) మూడో రోజు కాబ్ మాట్లాడుకుని ఉదయాన్నే బాదామి గుహలు చూసేందుకు బయల్దేరాం. దారిలో చాళుక్యుల కులదైవం అయిన  బనశంకరి దేవత గుడిని దర్శించి పదిన్నర అయ్యేటప్పటికి బాదామి గుహలకు చేరుకున్నాం. కారు దిగి తలెత్తి చూసేసరికి నాల్గంతస్తులుగా మలచిన గుహలు సరిలేరు మాకేవ్వరు అన్నట్టు స్వాగతం పలుకుతూ కనిపించాయి.
(మిగిలిన సంగతులు ఇంకో సారి  చెప్తా...అందాకా ఈ ఫొటోస్ చూసేయండి...హంపిలో అణువణువూ అద్భుతమే కాబట్టి వాటిలో మరీ అద్భుతమైనవి అని నాకు అనిపించినవి మాత్రమె ఇక్కడ అందిస్తున్నాను..)

ససివేకలు (ఆవాలని అర్ధమాట) వినాయకుడిగా పిలవబడే ఈ ఎనిమిది అడుగుల విగ్రహం ముందు నుంచి చూస్తే వినాయకుడిలా వెనుక నుంచి చూస్తే స్త్రీమూర్తి కూర్చుని ఉన్న భంగిమలో కనిపిస్తుంది)














ఇక ఈ విగ్రహానికి కాస్త దూరం లో ఉన్న కడలెకలు వినాయకుడిగా పిలవబడే పదిహేను అడుగుల వినాయక విగ్రహం ఇంకా విచిత్రం. ముందు నుంచి వినాయకుడిగా, వెనుక నుంచి స్త్రీమూర్తి కూర్చి ఉన్నట్టుగా, ఎడమ పక్క ఒక యాంగిల్ నుంచి చూస్తే వరాహావతారం లా (యద్భావం తద్భవతి లా) అనిపిస్తుంది. అయితే గుడి లోపలంతా పూర్తి చీకటిగా ఉంటుంది కాబట్టి టార్చ్ తీసుకెళ్తే మంచిది) బయటకొచ్చి ఎడమ వైపు చూస్తే కనిపించే  విరూపాక్షాలయం గోపురం చూడటానికి భలే ఉంటుంది.



ఇక ఇదిగో హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం. 
ఇక హంపి లోని శ్రీ కృష్ణాలయం ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన కొంత మంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ పెయింటింగ్ వేస్తుండగా తీసిన ఫోటోలివి .
















































(మరి కొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో.... ఇవి ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి :)


4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీ అభిరుచి చాలా బావుందండీ! ఎక్కడికైనా వెళ్తే ఇలాగే అన్నీ వివరంగా చూడాలి. నేనొకసారి హంపి వెళ్ళి హడావిడిగా చూసి రావటం గుర్తొచ్చింది. ఇంకోసారి వెళ్ళాలి.బొమ్మ కూడా చాలా బాగా గీశారెవరో.

సుజాత వేల్పూరి said...

అవునండీ,హంపీ నాక్కూడా భలే నచ్చింది. ఇవేనా ఫొటోలు? రాణీ గారి భవనం, కోనేరు, దర్బారు, విరూపాక్ష దేవాలయం ..అవన్నీ ఏవి? అవి కూడా పెట్టండి, వీలైతే!

రతనాలు రాసులు పోసిన ఆ వీధి,విఠల దేవాలయం కూడా అద్భుతం. మేము వెళ్ళినపుడు అక్కడ విరూపాక్ష స్వామి రధోత్సవం జరుగుతోంది. పెద్ద తిరునాళ్ల.

మేము కూడా బైక్ తీసుకునే తిరిగాం, మనిష్టం వచ్చినవి చూడొచ్చని! నరసింహుడి విగ్రహం చుట్టూ ఉన్న పచ్చదనం చాలా బావుంటుంది. దాని పక్కనే ఉన్న శివలింగం కూడా!


తుంగభద్రా తీరంలో అరటితోటలు దాటి "మాంగో ట్రీ" రెస్టారెంట్ కి వెళ్లారా లేదా?

budugu said...

బాగుందండీ మీ హంపీ ట్రిప్పు. మేము వెళ్ళినపుడు ఫిబ్రవరి మాసంలోనే భీకరమైన ఎండలు. రెండ్రోజులుండీ అన్నీ వివరంగా చూశాం కానీ తుంగభద్రలో మాత్రం ఈతలు కొట్టలేదన్న బాధ ఒకటి మిగిలింది. ప్చ్. మీ బాదామి దాకా వెళ్ళి పట్టడకల్ దేవాలయాలు చూడలేదా? చాలా మిస్సయ్యారు. అక్కడికి దగ్గిరే. బాదామీ కూడా చూడచక్కని ప్రదేశం. గుహలు బాగుంటాయి. ఆ ఊరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పల్లె వాసన వీడని పట్టనంలా.

SHANKAR.S said...

@ సుజాత గారు
సారి అండీ కాస్త లేట్ రిప్లయ్..:)
అవేనా, దసరా దిబ్బ, హజార రామ దేవాలయం, విఠల దేవాలయం, చాలా ఫోటోలు ఉన్నాయండి..మెల్లిగా అప్ లోడ్ చెయ్యాలి....ఈ మధ్య కుసింత బిజీ.ఈ మార్చి చివరాఖరిదాకా అంతే! ఆ తరవాత ఇహ చూస్కోండి! :)

ఆ మాంగో ట్రీ రెస్టారెంట్ కి వెళ్ళడానికి కుదరలేదండి...దాని గురించి చాలా విన్నా...ఇంకో సారి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలి.


@ బుడుగు గారు

సారి అండీ కాస్త లేట్ రిప్లయ్..:)
పట్టడికల్ తో పాటు అక్కడికి కాస్త దూరం లో ఉన్న ఐహోల్ కూడా చూసామండి. ఆ ట్రిప్ మొత్తం ఎక్కడాగితే అక్కడ నుంచి కదలడానికి మనసొప్పని పరిస్థితి. ఎటు చూసినా అద్భుతమే!

@ మందాకిని గారు
నిజానికి మాకు తనివి తీరలేదండి. ఎన్ని సార్లు చూసినా అంతేనేమో ఆ అద్భుతం!