Monday, December 31, 2012

హ్యాపీ న్యూఇయరు...

ప్రియమైన మిత్రులకి, ఆప్తులకి, ఆత్మీయులకు, అక్కలకి, చెల్లెళ్లకి, తమ్ముళ్ళకి, ఇంకా నా ఈ బ్లాగ్ కుటుంబం లోని సభ్యులందరికీ రాబోయే కొత్త సంవత్సరం మీకంతా బోల్డంత సంతోషాన్ని, ఆనందాన్ని, ఇవ్వాలని, అందరికి  మంచి జరగాలని, జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, నవ్వుతూ నవ్విస్తూ హాయిగా జీవించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ...........

మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు; "హ్యాపీ న్యూఇయరు"

[P.S. ఈ బ్లాగును ఆక్టివ్ గా ఉంచాలి అని......On behalf of Shankar]

Saturday, January 28, 2012

కాకినాడ కబుర్లు పార్ట్ 4 (రెండవ భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్


(మొదటి భాగం చదవని వాళ్ళు ఇక్కడ చదివి ఆ తర్వాత కంటిన్యూ చేయండి.)

ఎంట్రన్స్ గేట్ లోంచి లోపలి వెళ్ళగానే ఎడం చేతివైపు తిరిగి రెండు అడుగులు వేశామో లేదో ప్రతి ఏడాది లాగే ముందుగా నన్ను కట్టి పడేసేది సబ్బు బుడగలమ్మేవాడు. ఒక ట్రేలో వరుసగా పేర్చిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, పక్కన ఇంకో చిన్న ప్లాస్టిక్ ప్లేట్ లాంటి దాంట్లో బోలెడు ఊదే గొట్టాలు. వాడి చుట్టూ నాలాగే ఆ సబ్బు బుడగలకి ఆకర్షితులై కొనమంటూ మారాం చేసే పిల్లకాయలు, మనసులోంచి బాల్యం తొంగి చూస్తున్నా పెద్దరికం ముసుగులో దాని నోరు నొక్కేసి ఆ బుడగల నుంచి వాళ్ళ దృష్టిని మళ్ళించాలని విశ్వప్రయత్నం చేసే తల్లిదండ్రులు. వీటన్నిటి మధ్య చిద్విలాసంగా ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఊదే గొట్టం (ఒక స్ట్రా ముక్క చివర్న గుండ్రంగా చుట్టిన వైరుముక్కతో ఉంటుంది) ముంచి అలవోకగా సబ్బు బుడగలు వదిలే ఆ కుర్రాడు నాలాంటి వాళ్ళందరికీ పే...ద్ద హీరోలా కనిపించేవాడు. అలవోకగా చిన్న చిన్న బుడగలు పదుల సంఖ్యలో సృష్టించేస్తూ గాలి బుడగలలాంటి జీవితాల్ని అదే పనిగా సృష్టించే లోకల్ బ్రహ్మదేవుడిలా ఉండేవాడు.  అమ్మా ఒక్కటి కొనుక్కుంటా అడిగే వాడిని. ఎందుకురా సబ్బు నీళ్ళకి డబ్బులు వేస్టూ అనేది. అబ్బే మనం ఆగితేనా. ఇదొక్కటీ...ఇంకో రెండు మూడు ఏమయినా నచ్చితే కొనుక్కుంటా అంతే. అంతకు మించి నాకేం వద్దు. ప్లీజ్...ప్లీజ్....ప్లీజ్ అని అభ్యర్ధనతో కూడిన అధికార ప్రకటన చేసేవాడిని J. ఇహ తప్పదనుకుంటూ ఒకటి కొని నా చేతిలో పడేసేవారు. డబ్బా తీసుకుని వాడిచ్చిన గొట్టంతో సరిపెట్టుకోడానికి నేనేమన్నా గొట్టంగాడినా? అక్కడుండే వాటిలో ఇంకా ఏమేమి కలర్లు ఉన్నాయో చూసుకుని, బ్లూ కలర్ కోసం వెతికి, అది లేకపోతే కనీసం రెడ్ అయినా ఉంటె దాన్ని సెలక్ట్ చేసుకుని మరీ తీసుకునే వాడిని. నాకు ఒక్కడికీ కొంటే సరిపోదుగా, ఆస్తి పంపకాల్లా ప్రతీ దాంట్లోనూ వాటాకివచ్చే మా తమ్ముడికీ ఓ డబ్బా దక్కేది. ఇక అక్కడనుంచీ దాన్ని అపురూపంగా పట్టుకుని మిగిలిన స్టాల్స్ కి బయల్దేరేవాళ్ళం.ఓ రెండడుగులు వేయగానే కుడి వైపు ఏ ప్రెస్టీజ్ వాడిదో, బటర్ ఫ్లై వాడిదో స్టాల్ ఉండేది. ఇంక అంతే.. మాకు ఆ స్టాల్లో బోర్ కొడుతుందని కూడా పట్టించుకోకుండా లాక్కుపోయేవారు. ఇక అక్కడనుంచీ మా పెద్దోళ్ళు, ఆ స్టాల్ వాడూ ఏదో పుష్కరాల్లో తప్పిపోయిన ఆత్మీయులు పాతికేళ్ళ తర్వాత కనబడితే ఎలా మాట్లాడుకుంటారో, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే టీవీలో ఫోన్ ఇన్ ప్రోగ్రాం లలో యాంకర్ , కాలర్ మాట్లాడుకున్నట్టు కాపర్ బాటం గిన్నెలు, ప్రెజర్ ప్యాన్ మూతలు ఇలా నాకు అనవసరమైన సంగతుల గురించి విపరీతంగా మాట్లాడుకునే వారు. ఈ స్టాల్ నాకు పెద్దగా నచ్చదు కానీ పదండి ఇంకో స్టాల్ దగ్గరకి పోదాం.

(అదిగో ఆ ఎడం చేతి వైపు రంగు రంగుల బొమ్మలు, గన్నులు, కార్లు డిస్ ప్లేలో పెట్టాడే ఆ స్టాల్ వాడ్ని చూడండి. వెధవకి బొమ్మలిచ్చే అక్షయపాత్ర ఏమన్నా ఉందేమో. అన్ని బొమ్మలా? పదండి అక్కడికి వెళ్దాం.)ఆ స్టాల్ దగ్గరికి ఒక్కో అడుగూ వేస్తూంటే చూసిన ప్రతీదీ కొనమనకూడదు, నాన్నగారు వద్దంటే పేచీ పెట్టకూడదు, ఆల్రెడీ నీ కోటాలో ఒకటి కోనేసుకున్నావ్ ఇలా అమ్మ హెచ్చరికలు చెవిలో పడుతూ ఉండేవి. అధిష్టానం హెచ్చరికల్ని పట్టించుకోని తిరుగుబాటు ఎమ్మెల్యే టైపులో నేనూ వాటిని పట్టించుకునేవాడిని కాదులెండి. తీరా స్టాల్ దగ్గరికి వెళ్ళాక నా పరిస్థితి చూసి అటు చూస్తే ఆట తుపాకీ, ఇటు చూస్తే రైలు బొమ్మ ఎంచుకునే సమస్య కలిగిందొక పిల్లాడికి అంటూ శ్రీశ్రీ ఆత్మ ఎక్కడినుంచో నిట్టూర్చేది J. మా క్లాస్ లో వాసు గాడు కొనుక్కున్న సౌండ్, లైట్ వచ్చే గన్ను కనిపించేది. కానీ కొనుక్కుంటే వాడి తర్వాత కొనుక్కున్న వాడికిందే మిగిలిపోతాగా. పోనీ బ్యాటరీ కారు కొనుక్కుందామంటే వాడు చెప్తున్న రేటు నాన్నగారు సరే అనేలా లేదు. అయినా ఈ పెద్దోల్లున్నారే తొక్కలో కుక్కర్లకీ, గిన్నేలకీ, ఇంట్లో సామాన్లకీ వందల వందలు తగలేస్తారు. ముచ్చట పది ఓ పాతిక రూపాయల కారు కొనమంటే ఎందుకురా డబ్బులు దండగ. వారం కూడా సరిగా ఉండదు అది అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొర్రీలు పెట్టినట్టు ప్రతి కోరికకీ కొర్రీలు పెడతారు. పోనీ ఆ పక్కనున్న రైలు బొమ్మ కొనుక్కుంటే? ఇలాంటి తర్జన భర్జనల తర్వాత అప్పటికే ఆలశ్యానికి మా పెద్దోల్ల మోహంలో కనిపిస్తున్న విసుగుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ స్కూల్లో క్లాస్ మేట్ల ముందు పరువు పోకుండా ఉండేలా ఓ బొమ్మ సెలక్ట్ చేసుకునే వాడిని. నా షాపింగ్ అయ్యాక మా తమ్ముడి వంతు. వాడు నిర్ణయం తీసుకునే లోపల నేను ఆ బొమ్మలన్నిటినీ కళ్ళతో ఆడేసుకునే వాడిని.

ఇక అక్కడనుంచి ఓ రెండడుగులు ముందుకేస్తే మొత్తం ఎగ్జిబిషన్ మీద నాకు అత్యంత బోరు కొట్టే స్టాల్ కనిపించేది. గాజులు, స్టికర్లు, బొట్టుబిళ్ళలు, తొక్క, తోటకూర ఇలాంటి సామాన్లతో కూడిన పరమ బోరింగు స్టాలన్న మాట. అప్పట్లో ఎంత బోరు కొట్టినా అమ్మ షాపింగ్ అయ్యేదాకా చచ్చినట్టు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడిది నా బ్లాగేగా పదండి ఇక్కడ్నించి తొందరగా వెళ్ళిపోదాం. J
ఆ ఎడం పక్క స్టాల్లో రౌండ్ గా తిరిగే స్టేజ్ మీద స్టాండ్ వేసిన లూనాయో, టీవీఎస్ ఫిఫ్టీనో డిస్ ప్లే కి పెట్టె మా ఊరి ఆటో మొబైల్ షాపుల వాళ్ళు, ఆ పక్కనే ఓ ఎల్.ఐ.సి వాడి స్టాల్ , వాడి పక్కన అటూ ఇటూ ఆరెంజ్, పసుపు  రంగుల్లో జంతికలు తిప్పే ప్లాస్టిక్ గోట్టాలమ్మే వాడు డెమో ఇస్తూ ఓ స్టాల్, వాడికి సరిగ్గా ఎదురుగా కీ చైన్లు అమ్మే షాపు వాడు (వీడు అప్పటికప్పుడే కీ చైన్ మీద మన పేరు చెక్కేసి ఇవ్వడం అప్పట్లో పెద్ద వింత నాకు).

కాస్త ముందుకు వెళ్తే  ఎయిర్ గన్ తో బుడగలు కొట్టే స్టాల్ ఉండేది. రెగ్యులర్ గా కాదుగానీ ఓ సారి ట్రై చేస్తా అన్న నా చూపుకి మా నాన్నారు సరే అనడంతో ఉత్సాహంగా నాలో ఉన్న జస్పాల్ రాణాని, అభినవ్ బింద్రాని ప్రపంచానికి చూపించే చాన్స్ వచ్చింది కదా అని ఎగిరి గంతేసి (అప్పట్లో వాళ్ళ పేర్లు నాకు తెలీవులెండి) గన్ను చేతిలో తీసుకున్నా. పది రౌండ్లకి రెండు రూపాయలు. ఐదు బుడగలు పేలిస్తే ఇంకో రెండు రౌండ్లు ఫ్రీ. పదీ పేలిస్తే ఇలాంటి షూటర్ ని ఇంత వరకూ చూడలేదని వాడు తబ్బిబ్బైపోయి ఓ స్టీలు గ్లాసో, ప్లాస్టిక్ మగ్గో బహుకరిస్తాడన్న మాట. రెండ్రూపాయలు వాడి చేతిలో పెట్టగానే అక్కడున్న గన్ను మీద నాకు అధికారం వచ్చినట్టు ఫీలయి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి తూలి పడబోయి తమాయించుకుని వాడి కేసి చూడగానే వాడు అది పెద్ద వాళ్లకి. నువ్వు మోయలేవు. ఇంద దీంతో పేల్చు. అని చిన్న సైజ్ రివాల్వర్ లా ఉండే ఎయిర్ గన్ మొదటి రౌండ్ లోడ్ చేసి నా చేతిలో పెట్టాడు . సర్లే ఏదైతే ఏం లే అనుకుని మోసగాళ్ళకి మోసగాడులో కృష్ణ కళ్ళముందు కనిపిస్తూ ఉండగా కుసింత బిల్డప్ ఇచ్చి, కృష్ణలా ఒక పక్క కాస్త స్టైల్ గావంగి పేలిస్తే మనకి తిరుగుండదు అనుకుని ట్రిగర్ నొక్కితే అది కాస్తా నేను గురిపెట్టిన సర్కిల్ లో ఉన్న బుడగలకి కాక దాని పక్కన ఉన్న గోడకి తగిలేది. మనం సూపర్ స్టార్ కాదని గ్రహించి ఒళ్ళు దగ్గరపెట్టుకుని మొత్తం మీద పది లో ఐదో, ఆరో బెలూన్లు పేల్చానంతే. L

ఇక కాస్త ముందుకి వెళ్తే మాయా దర్పణం అనో మ్యాజిక్ మిర్రర్ అనో పేరు సరిగా గుర్తులేదు గానీ ఓ టెంట్ ఉండేది. దాని ముందు ఒకడు గాడ్రెజ్ కుర్చీలో కూర్చుని ముందు ప్లాస్టిక్ స్టూల్ మీద ఓ చిన్న అల్యూమినియం స్కూల్ బాక్స్ లో టికెట్లు, చిల్లర పెట్టుకుని కూర్చునే వాడు. టికెట్ రూపాయి. లోపల వరసగా పదో పదిహేనో మిర్రర్లు ఉండేవి. ఒక్కో దాంట్లో మన ప్రతిబింబం ఒక్కోలా కనిపించేది. ఒక చోట లావుగా, ఒక చోట పొట్టిగా ఇలా అన్నమాట.

దాని పక్కన ఓ వెంట్రిలాక్విజం షో గానీ, మ్యాజిక్ షో గానీ జరిగే టెంట్ ఉండేది. ఇక్కడా టికెట్లమ్మే వాడిది సేమ్ సెట్టింగ్. పైగా ఇక్కడ టికెట్టు ఐదు రూపాయలు. అదీ లోపల కుర్చీలు అన్నీ నిండితే కానీ షో మొదలు పెట్టేవాడు కాదు. కాకపోతే ఎగ్జిబిషన్ మొత్తానికి వినబడేటట్టు వాడి షో గురించి పబ్లిసిటీ మాత్రం ఊదరగొట్టేసేవాడు. ఈ రెండు టెంట్ల మధ్య ఒక పీచు మిఠాయి వాడి స్టాల్. ఎటు చూసినా పాలిథిన్ ప్యాకింగ్ లో వేలాడదీసిన గులాబీ రంగులోని పీచు మిఠాయి బంతుల మధ్యలో గిర్రున తిరిగే వెట్ గ్రైండర్ లా కనిపించే దాంట్లో వెదురు పుల్లతో నేర్పుగా చేయి తిప్పుతూ క్షణాల్లో దాని చుట్టూ పీచు మిఠాయి చుట్టేసేవాడు. ప్రతి సారి తప్పకుండా పీచు మిఠాయి కొనిపించుకునే కార్యక్రమం మాత్రం ఉండేది.చేతిలో వెదురు పుల్ల, దాని పైన పే......ద్ద పీచుమిఠాయి ఉండ. కొరికేలోగానే సగం ముక్కూ, మూతి అంతా అయిపోయేది. అలా దానితో తంటాలు పడుతూ నాలుగడుగులు వేయగానే కళ్ళముందు జెయింట్ వీల్ టికెట్ కౌంటర్ ఎదురయ్యేది.
తల ఎత్తి చూస్తే ఈ ప్రపంచంలో చాలా విషయాల ముందు నువ్వు చాలా అల్పుడివిరా అని గుర్తు చేసేట్టు అంతెత్తున జెయింట్ వీల్. ఈ సకల చరాచర ఎగ్జిబిషన్ ఆకర్షణ అంతా నాయందే ఉన్నది చూడు అని చెప్తున్నట్టు ఉండేది. మొత్తం నిండిన తరువాత తిరగడం మొదలు పెట్టి మెల్లి మెల్లిగా స్పీడు పెంచూంటే అందులో ఎక్కిన వాళ్ళ అరుపులు, కేకలు, కేరింతలు ఒక్కసారైనా జెయింట్ వీల్ ఎక్కాలనే నా కోరికని మరింత పెంచేవి. నాన్నగారండీ ప్లీజ్ ఒక్క సారి ఎక్కుతాఅనేవాడ్ని. వద్దు కళ్ళు తిరుగుతాయి, భయపడతావు. కావాలంటే పక్కనున్న రంగుల రాట్నం ఎక్కు అనేవారు. ఛీ...అదా? అది కావాలంటే చొల్లంగి తీర్థంలో అయినా ఎక్కచ్చు. నేను ఇదే ఎక్కుతా అని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కానీ అలా చెప్తే ఆ తర్వాత ఆయన పెట్టే చీవాట్లకి జెయింట్ వీల్ ఎక్కకుండానే కళ్ళు తిరుగుతాయని తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయేవాడిని. అసలు నాకు కళ్ళు తిరుగుతాయని ఈ పెద్దోళ్ళు ఎలా డిసైడ్ చేసేస్తారో ఏంటో. ఉత్తప్పుడు వీధి చివర షాప్ కి వెళ్లి ఏమన్నా సరుకులు తీసుకురమ్మన్నప్పుడు రోడ్డు మీద కుక్కలున్నాయని భయపడి వెనక్కి వస్తే ఇంత పిరికి వెధవ్వెంట్రా అంటారు. ఇలాంటప్పుడు ధైర్యంగా జెయింట్ వీల్ ఎక్కుతానంటే భయపడతావు అని మనసులో ఎక్కించి వెనక్కి లాగేస్తారు. అసలు ఈ పెద్దోల్లున్నారే...
ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ అడుగుతానేమో అని వాళ్ళు బయల్దేరగానే వెనకాలే నేను కూడా నిరాశ నిండిన మనసుతో రెండు సెకన్లకోసారి ఆరాధనగా తలతిప్పి జెయింట్ వీల్ కేసి చూస్తూ వాళ్ళ వెనకే నడిచేవాడిని. 

తరువాత మజిలీ పే...ద్ద అప్పడాల స్టాల్. ఇది ఎగ్జిబిషన్లో ఇంకో ప్రధాన ఆకర్షణ అన్నమాట. మామూలుగా ఇంట్లో చూసే రెగ్యులర్ అప్పడాలు కాదు. న్యూస్ పేపర్లో సగం సైజ్ లో ఉండేవి. వాటిని చూస్తే పోర్టబుల్ టీవీలో సినిమాలు చూసుకునే వాడు మొదటి సారి ఐమాక్స్ స్క్రీన్ చూస్తే ఎలా ఫీలవుతాడో అంత అబ్బురంగా ఉండేది. ఆ స్టాల్ లోనే మిర్చి బజ్జీలు కూడా వేసేవాడు. నాకు మా తమ్ముడికి చెరో పెద్ద అప్పడం చేతిలో పెట్టి వాళ్ళిద్దరూ మిర్చి బజ్జీలు తీసుకునే వాళ్ళు. అవి తింటూ కుళాయి చెరువు గట్టు మీదకి ఎక్కగానే అక్కడ బఠానీ స్టాల్ ఉండేది. ఒక పెద్ద పళ్ళెంలో ఉడుకుతున్న బఠానీ దాని చుట్టూ కలర్ ఫుల్ గా డెకరేట్ చేసిన కేరట్, బీట్రూట్, ఉడికిన ఆలూ ముక్కలు, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు, ఓ పక్కన ప్లేట్లో నిమ్మకాయ ముక్కలు. ఆ స్టాల్ కి అటూ ఇటూ పదో పదిహేనో ప్లాస్టిక్ కుర్చీలు. స్టాల్ దగ్గర ఇచ్చిన ఆర్డర్ చేతికందేదాకా వెయిట్ చేస్తూ ముప్ఫై నలభై మంది జనాలు. టోకెన్లు తీసుకుని స్టాల్ వాడికి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసే లోగా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించడం, వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి రెండు నిమిషాలకీ ఆర్డర్ ఏమయిందో కనుక్కురమ్మని నన్ను, మా తమ్ముడిని పంపించడం. మొత్తానికి ఎలాగైతేనేం వాడిచ్చిన ప్లేట్లు చేత్తో పట్టుకుని నేను, మా తమ్ముడు రాగానే నలుగురం కలిసి ఖాళీ ఉంటె కుర్చీలు, లేకపోతే అక్కడే గట్టు మీద పచ్చికలో కూర్చుని ఎదురుగా చెరువులో బోటింగ్ చూస్తూ ప్లేట్లు ఖాళీ చేసేవాళ్ళం.
అక్కడ నుంచి బయల్దేరి గట్టు మీదే మెల్లిగా నడుచుకుంటూ చివరికి రాగానే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగే వేదిక కనిపించేది. ఏ మిమిక్రీయో, గంగాధరం మ్యూజికల్ పార్టీ ఆర్కెస్ట్రాయో అయితే ఓ రెండు నిమిషాలు ఆగి చూడటం, మైక్ సెట్ వాడూ, ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళూ తప్ప జనాలు ఎవరూ లేని ప్రోగ్రాం అయితే అసలు ఆ వైపే చూడనట్టు ముందుకు నడవడం జరిగేది. J. ఇక ఆ వరసంతా ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఉండేవి. అదేంటో మిగిలిన స్టాళ్ళ వాళ్ళు రమ్మని పిలిచినట్టు వీళ్ళు పిలిచే వారు కాదు. అసలామాట కొస్తే లోపల మొక్కుబడిగా పెట్టే ఫోటోలు తప్ప జనాలూ ఉండేవారు కాదనుకోండి. జస్ట్ బయటకన్నా స్టాల్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ లోంచి వెళ్లి ఏదో చూడక తప్పదు అన్నట్టు ఆ ఫోటోల కేసి చూస్తూ ఎగ్జిట్ లోంచి బయటకి వచ్చేసేవాళ్ళం.
ఇవన్నీ దాటాక వ్యవసాయ శాఖ వాళ్ళ ఫలపుష్ప ప్రదర్శన స్టాల్. రెండు మూడు స్టాల్స్ పొడుగు ఉండే దాంట్లో నాకు తెలిసి నేను వెళ్ళిన ప్రతి సారీ అవే ఐటమ్స్ ఉంచేవారు. ఓ పెద్ద పనసపండు, అంతకన్నా పెద్దగా ఉండే గుమ్మడి కాయ, నిండుగా కాసిన అరటి గెల ఇలా ఎప్పుడు చూసినా, ఎన్నేళ్ళయినా టెలిస్కూల్ లో పిల్లల్లా అవే స్టాండర్డ్ గా ఉండేవి. కనీసం ఆర్డర్ కూడా మార్చేవారు కాదు. J. తెలిసినవే అయినా టికెట్ కొన్నాం కాబట్టి మరో సారి మొహమాటంగా ఆశ్చర్యపడిపోయి బయటకి వచ్చేవాళ్ళం.

స్టాల్ లోంచి బయటకి రాగానే ఎదురుగా కడియం నర్సరీ వాళ్ళు, ఉద్యాన వన శాఖ వాళ్ళు దాదాపు నాలుగు స్టాళ్లు పట్టే ఖాళీ ప్లేస్ లో చుట్టూ దడి కట్టి బోలెడు పూల మొక్కలు ఉంచేవారు. ఆ మొక్కలతో పాటూ ఖాకీ డ్రస్ వేసుకుని ఓ ముసలి కాపలాదారు కూడా ఉండేవాడు. ఎవరైనా ఆ దడి దగ్గరకి వస్తే చాలు కీ ఇచ్చినట్టు ఏయ్..దూరం దూరం. పూలు కోయకూడదు...మొక్కలు ముట్టుకోకూడదు అని అరిచేవాడు. బహుశా ఇప్పుడు కాపలావాడు మారి ఉంటాడు కానీ కేకలు మాత్రం అవే ఉండుంటాయి.

దాన్ని దాటి రాగానే బ్రహ్మకుమారీ వాళ్ళ స్టాల్. దాని పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వాళ్ళ స్టాల్. ఆ స్టాల్ కి వెళ్లి నాన్నగారిచ్చిన పది పైసలో, పావలాయో అక్కడున్న హుండీలో వేసేసి వచ్చే ఏడాదైనా క్లాసులో అందరికన్నా ముందు ఎగ్జిబిషన్ చూసేలా చేయమని దండం పెట్టుకునే వాడిని. ఏంటో ఆ దేవుడు విన్నపం ఎప్పటికీ పట్టించుకోలేదు L


ఇంక లాస్ట్ లో ఎగ్జిట్ గేట్ దగ్గర హెలికాప్టర్ లు ( లోపల స్ప్రింగ్ తో గుండ్రని బాక్స్ లా ఉండి పైన బొడిపె ఉంటుంది. ఒక ప్లాస్టిక్ చక్రాన్ని దాని మీద పెట్టి స్ప్రింగ్ కి ఆపోజిట్ డైరక్షన్ లో తిప్పి బటన్ నొక్కితే ఆ చక్రం జుయ్య్య్య్ మని తిరుగుతూ గాల్లోకి ఎగురుతుంది), రేకు కప్పలు అమ్మేవాడు మాటేసేవాడు నా కోటాలో ఇంకా రెండు మిగిలే ఉన్నాయన్న విషయం అమ్మకి గుర్తు చేసి ఆ రెండూ కొనిపించుకుని తృప్తిగా బయటకి నడిచే వాళ్ళం.

కాలేజ్ కి వచ్చాక చాలా సార్లు ఎగ్జిబిషన్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళినా చిన్నప్పుడు వెళ్ళిన జ్ఞాపకాలే ఇంకా పదిలంగా మనసులో ఉన్నాయి. బహుశా ఎవరికైనా అంతేనేమో! అదండీ మా ఊరి ఎగ్జిబిషన్ సంగతి. ఇంత వరకూ వచ్చారుగా కామెంట్ కూడా పెట్టే వెళ్ళండి. నేనేం అనుకోను J
NEXT : గాంధీ నగర్ పార్క్ 

Friday, January 27, 2012

కాకినాడ కబుర్లు పార్ట్ 4 (మొదటి భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్


మొన్నా మధ్య ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం పార్ట్ 3 లో మా ఊరి భానుగుడి సెంటర్ లో మిమ్మలందరినీ అలా అలా షికారు చేయించానా. ఇప్పుడు ఈ సారి మా ఊరి ఇంకో స్పెషల్ గురించి చెప్తానన్న మాట. అదే ప్రతి ఏటా మా ఊరి కుళాయి చెరువు దగ్గర జరిగే ఎగ్జిబిషన్. అసలు కాకినాడలో జనవరి నెలలో ఈ ఎగ్జిబిషన్ చూడని చిన్నా, పెద్దా ఉండరంటే అతిశయోక్తి కాదు. నాలాగ ఊరికి దూరంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా కళ్ళ ముందు సినిమా రీలులా తిరిగే ఆ ఎగ్జిబిషన్ కబుర్లు మీకోసం. ఈ పోస్ట్ కోసం నేను అడగ్గానే మా ఊరి ఎగ్జిబిషన్ కి వెళ్లి ఫోటోలు తీసి పంపించిన నా ఫ్రెండ్ జగన్నాధ రాజుకి బ్లాగ్ముఖతా మరో మారు థాంకులు.

చిన్నప్పుడు జనవరి నెల మొదలయిన దగ్గరనుంచీ హడావుడి మొదలయ్యేది. జనవరి ఒకటి నుంచీ ఫిబ్రవరి పది పదిహేనో తారీకు వరకూ జరిగే ఆ ఎగ్జిబిషన్ వచ్చిన రోజే చూసేయాలనేది మా ఆత్రం. అందుకే జనవరి ఒకటో తారీకునే ఇంట్లో ఎగ్జిబిషన్ కి టెండర్ పెట్టేవాళ్ళం. నాన్నగారండీ సాయంత్రం ఎగ్జిబిషన్ కి వెళ్దామా? అని ఒకటో తారీకు మొదలు ప్రతి రోజూ ఉదయాన్నే అడగడం. ఆయన షరామామూలుగానే ఇంకా ఏమీ పెట్టలేదు. ఏమీ ఉండదు అక్కడ. మెల్లిగా చూద్దాం లే అని వాయిదా వేయడం. ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు తీసుకెళ్తారని తెలుసు. కానీ ఆ ఎప్పుడు అనేది ఎప్పుడు వస్తుందా అనేదే ప్రశ్న. L

దానికి తోడూ ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ ఎగ్జిబిషన్ కి వెళ్లి వచ్చిన వాళ్ళు క్లాసులో దాని గురించి చెప్పే కథలు మరింత ఊరించేవి. ఈ సారి జెయింట్ వీల్ ఎంత పెద్దగా ఉందో తెల్సా. మా నాన్నగారు నన్ను ఎక్కనివ్వలేదు గానీ ఎక్కి చూసిన మా అన్నయ్య చెప్పాడు. పై నుంచి చూస్తె  రాజమండ్రి గోదారి బ్రిడ్జీ కనపడతాదంట అని ఓ కోతలరాయుడు కోస్తే ఆసక్తిగా వింటూండే మేమంతా పిచ్చి వెధవల్లా ఆ మాటలు నమ్మేసే వాళ్ళం. ఏమైనా మీ అన్నయ్యకి ధైర్యం ఎక్కువెహే అని ఆ కోతలరాయుడి అన్నకి ఇంకో ఫ్రెండ్ కితాబు. ఇంకో రోజు ఇంకోడు క్లాస్ కి ఎగ్జిబిషన్ లొ కొన్న రేకు కప్ప (రేకుతో చేస్తారు దీన్ని నొక్కుతూ ఉంటే టిక్కు టిక్కు మని భలే సౌండ్ వస్తుంది) తీసుకొచ్చి ఇంటర్వెల్ లొ అందరికీ గర్వంగా చూపించేవాడు. ఇంకోడైతే వాళ్ళ నాన్నగారు కొన్న సౌండ్, లైట్ వచ్చే గన్ను గురించి చెప్పి చెప్పి ఊరించే వాడు. ఇవన్నీ చూస్తూ, వింటూ అప్పటిదాకా ఎగ్జిబిషన్ కి వెళ్ళని నాలాంటి వాళ్లకి అసహనం ఓ రేంజ్ లొ పెరిగిపోతూ ఉండేది. మొత్తానికి ఎలాగయితేనేం ఆ శుభముహూర్తం రానే వచ్చేది. స్కూలయ్యాక గ్రౌండ్ లొ ఆటలంటూ కూర్చోక ఇంటికి వచ్చేయ్. సాయంత్రం వీలయితే ఎగ్జిబిషన్ కి వెళ్దాం అని ఇంట్లో మా నాన్నగారి హెచ్చరికతో కూడిన ప్రకటన వినబడేది. ఇహ చూస్కోండి! స్కూల్ కి వెళ్ళేటప్పుడు దార్లో కనిపించిన ఫ్రెండ్స్ తో సహా (వేరే సెక్షన్ వాళ్ళు), స్కూల్ కి వెళ్ళాక మా క్లాసులో ప్రతి ఒక్కరికీ ఒరేయ్ ఈ రోజు మేం ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం తెలుసా? అని అదేదో ఆరోజు నాకు విజయనగర సామ్రాజ్య అధినేతగా పట్టాభిషేకం చేస్తున్న రేంజ్ లొ చెప్పి ఊదరగొట్టేసే వాడిని. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఓస్ ఇంతేనా అన్నట్టు చూస్తుంటే ఆ చూపులు పట్టించుకోకుండా, ఇంకా ఎగ్జిబిషన్ చూడని వాళ్ళు అసూయతో చూసే చూపుల్ని మాత్రం తెగ ఎంజాయ్ చేసేవాడిని. (వెధవ శాడిజం అనుకుంటున్నారా. ఆ ఏజ్ లో అదే థ్రిల్ మరి J ).

ఇక సాయంత్రం ఇంటికి రాగానే అరుగు మీదే కూర్చుని మా నాన్నగారి కోసం వెయిటింగ్ మొదలు. వెధవ ఆఫీసులు ఐదింటి దాకా పెట్టకపోతే ఏ నాలుగింటికో మూసేయకూడదూ అని తిట్టుకుంటూ ఆయన ఎప్పుడు వస్తారా అని నేను, మా తమ్ముడు అరుగు మీదే కూర్చుని ఆశగా ఎదురుచూసేవాళ్ళం. వీధి మలుపులో ఆయన వస్తూ కనిపించగానే అమ్మా! నాన్నగారు వచ్చేస్తున్నారు. నేనెళ్ళి రిక్షా తీసుకొచ్చేయనా? అని ఇంట్లోకెళ్ళి మా అమ్మగారిని అడగడం. తనేమో ఉండరా ఇంకా అప్పుడే? అనడం. ఈ లోపు ఇంట్లోకి వచ్చిన మా నాన్నగారు మొహం కడుక్కుని బయటకి రాగానే అక్కడే టవల్ పట్టుకుని నిలబడి నాన్నగారండీ రిక్షా తెచ్చేయనా? అని ఒక సారి, ఆయన కాస్త రిలాక్సయి అమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకోగానే మళ్ళీ ఇంకోసారి అదే ప్రశ్న రిపీట్ చేయడం. ఇలా ఆయన ఇహ తప్పదు అనుకునే దాకా అడిగీ అడిగీ చివరికి ఆయనకి విసుగొచ్చి సరే తగలడు అనేవారు. ఆమాట అనడం ఆలశ్యం వీధి మొగలో రిక్షా స్టాండ్ దగ్గరకి ఒకటే పరుగు.

అప్పట్లో మేముండే జగన్నాధపురంలో రిక్షా ఎక్కి కుళాయి చెరువు దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి పట్టే ఆ అరగంటా మనసులో ఎన్నో ఆలోచనలు, బోలెడన్ని లెక్కలు. అప్పటి వరకూ స్కూల్లో ఎవరెవరు ఎగ్జిబిషన్లో ఏమేం కొనుక్కున్నారు, వాటి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఫోజు కొట్టారు, ఈ సారైనా నాన్నగారు నేను జెయింట్ వీల్ ఎక్కడానికి ఒప్పుకుంటారా?, ఒక వేళ ఒప్పుకుంటే నేను గోదావరి బ్రిడ్జి సరిగా చూడగలనా? ఇలాంటి తీవ్రమైన జీవన్మరణ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండగానే అల్లంత దూరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణుడి విశ్వరూపంలా అంతెత్తున జెయింట్ వీల్ కనిపించేది. దాన్ని తన్మయత్వంతో చూస్తూండగా ఎగ్జిబిషన్లో అటూ ఇటూ వెళ్లిపోవద్దని, అది కొనమని, ఇది కొనమని పేచీలు పెట్టద్దని వగైరా వగైరా సూచనలతో కొనసాగే మా నాన్నగారి ఉపన్యాసం నా చెవులకి చేరకముందే గాల్లో కలిసిపోయేది J

ఇక ఎగ్జిబిషన్ ముఖద్వారం వద్దకి రాగానే వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అన్న బోర్డుని అపురూపంగా చూసుకుని లోపలి అడుగుపెట్టేవాడిని. లోపలి వెళ్తూనే ఎదురుగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వాళ్ళ స్టాల్ ఉండేది. ఎంట్రన్స్ గేట్ నుంచీ ఎడం చేతి వైపు స్టాల్స్ తో మొదలు పెట్టి ప్రదక్షిణ చేసినట్టు ఎగ్జిబిషన్ మొత్తం చుట్టేసి అవుట్ గేట్ దగ్గరకి రావాలన్న మాట.

(పదండి ఒక్కో స్టాల్ ని నా కళ్ళతో పరిచయం చేస్తాను. నాకు బోరుకొట్టే స్టాల్స్ దగ్గర పెద్దగా ఆగను. ముందే చెప్తున్నా.)

రెండో భాగం కోసం మళ్ళీ రేపు ఇదే టైం కి ఇక్కడికి వచ్చేయండి. అన్నట్టు కామెంట్లు పెట్టడం మర్చిపోకూడదు మరి.

Wednesday, September 21, 2011

అబ్బే ఈ మంట సరిపోదు......ఇంకా తగలేయండి


అలో...అలో....అలో  కచరాగారూ. ఏ ముహూర్తంలో మీకీ పేరు పెట్టానో కానీ స్టేట్ మొత్తాన్ని రోజు రోజుకూ కుప్పతొట్టి కన్నా హీనం చేసేస్తున్నారుగా. అబ్బే ఇది తిట్టడం కాదండీ. మీసమర్ధతని మెచ్చుకుంటున్నా. కాపోతే నాకో చిన్న డౌట్ ఈ సకల జనుల సమ్మె ఎవరి మీద కోపంతో ఎవరు చేస్తున్నట్టు? అహ నాకు తెలీక అడిగానంతే. అంటే బయట జనంలో (అదే లెండి బాబూ తెలంగాణా జనమే) టాక్ ఏంటంటే బస్సులు తిరగటం లేదు, ఆఫీసులు నడవటం లేదు, చివరాఖరికి పిల్లకాయల బళ్ళు కూడా తెరవటం లేదు. మా జీవితాల్ని నరకం చేస్తూ మాకోసమే సమ్మె అంటారేంటి ఈ బుర్ర తక్కువ సన్నాసులు (ఇది మాత్రం మీరు నేర్పించిన పదమే సుమండీ)? అనుకుంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నానూ ఈ సమ్మె వలన ఒక్క సీమాంధ్ర వాడయినా ఇబ్బంది పడుతున్నాడా? ఆర్టీసీ బస్సులు లేక, ప్రైవేట్ వాహనాల అడ్డగోలు దోపిడీ భరించలేక ఈ సమ్మె ఆలోచన చేసిన వాడిని జనం (అక్షరాలా తెలంగాణా ప్రజలు) అమ్మ నా బూతులూ తిట్టుకుంటున్న సంగతి మీకు కనబడలేదా?  

అవును కచరా గారూ నిన్న ఓ బ్రహ్మాండమయిన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణా వచ్చాక ఇప్పుడు సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలిస్తాం, తెలంగాణా వచ్చే దాకా ఈ సమ్మె ఆగదు అన్నారు. అబ్బ ఎంత సూపర్ డైలాగండీ అది! సూపరో సూపరు. అవునూ మరి మొన్నామధ్య మీరే 2014 దాకా తెలంగాణా వచ్చేలా లేదు అని బోలెడంత బాధపడిపోయిన విషయం ఈ సమ్మె చేస్తున్నా ఉద్యోగుల్లో ఒక్కడికీ గుర్తురాకపోవడం భలే చిత్రం సుమండీ. మరి ఊరికే అన్నారా వినేవాడు వీపీ జాన్ అయితే హరికథ మలయాళంలో చెప్తారని. 

ఇక స్కూళ్ళ విషయానికి వద్దాం. ఉద్యోగులకి అంటే పాపం డబ్బులే కాబట్టి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. మరి పిల్లకాయల సంగతేంటి మాస్టారూ?. వాళ్ళు నష్టపోయిన, పోతున్న చదువులకి ఏ వెల కడతారు?  లేకపోతే ఉద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా వీళ్ళకీ డైరక్ట్ గా డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి ఆరో క్లాసు వాడ్ని ఎనిమిదో క్లాస్ కి, డిగ్రీ వాడ్ని పీజీకి ప్రమోట్ చేసేస్తారా? మీరు చేసినా చేసేయగలరు లెండి. మీ సొమ్మేంపోయింది? మీరంటే ఉదారమైన మనసుతో తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించి పిల్లకాయలు పరీక్షలు రాయకపోయినా పాస్ చేసేస్తాం అంటారు అనుకోండి మరి ఆ బిట్స్ , ఐ ఐ టి లాంటి సంస్థలు మార్కులు లేకపోయినా క.ఛ.రా గారు చెప్పారని ఓ ఎగేసుకుని చేర్చేసుకోవు కదండీ. అయినా పోయేదేం లేదు లెండి ఆ పరిస్థితి ఎదురయితే అది ఆంధ్రోళ్ళ కుట్ర అని కవర్ చేసేసుకోవచ్చు. ఉందిగా సర్వరోగ నివారిణి జిందా తెలిస్మాత్. కాపోతే ఈ మాట మరీ అన్నిటికీ వాడేయకండి సార్. మీ అనుచర గణానికి బాగా అలవాటయి చివరికి భార్య గర్భవతి అన్న వార్త విన్నా అలవాటులో పొరపాటుగా "ఇది ఆంధ్రోల్ల కుట్ర" అనేసినా అనేస్తారు. వినడానికి అంత బాగోదుగా. ఏటంటారు?

మీరేం అనుకోకపోతే నాదో సందేహం. ఏమీ అనుకోకూడదు మరి. అబ్బే ఏం లేదండీ. తెలంగాణా ప్రజలు అందరూ సమ్మెలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడ చూసినా గులాబీ జండాలు పట్టుకున్న మీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారు తప్ప మామూలు జనం ఆట్టే కనిపించటం లేదేంటి? చూడబోతే తె.రా.స. వాళ్ళు కాకపోతే వాళ్ళు తెలంగాణా వాళ్ళు కాదు అన్నట్టు కనిపిస్తోంది. (మనలో మనమాట అసలు మీనింగ్ అదే కదా). మొన్నామధ్య ఎవరో మామూలు పౌరుడు టీవీ వాళ్ళతో సమ్మె వలన ఇబ్బందులు చెబుతుంటే గులాబీయులు ఆ అర్భకుడిని అడ్డుకున్న తీరు, నేనూ తెలంగాణా వాడినే మొర్రో అని వాడు మొత్తుకుంటున్నా వాడి నోరు నొక్కేసిన తీరు చూసి ఒక్క సారి హిట్లరు గుర్తోచ్చాడంటే నమ్మండి. మీరు సూపరెహే!!

ఇక ఈ మధ్య "సీమాంధ్ర ప్రభుత్వం" అని ఇంకో మాట వింటున్నానండోయ్. పదం బావుంది కానీ మంత్రి వర్గంలో తెలంగాణా మంత్రుల్ని పెట్టుకుని సీమాంధ్ర  ప్రభుత్వం అంటే ఆట్టే బాగోదేమో ఆలోచించండి. మీరంటే నోటికి ఎంతోస్తే అంత అంటారు కాబట్టి ఓ.కే అనుకోవచ్చు. స్వయంగా మంత్రి వర్గంలో ఉండి ఈ ప్రభుత్వం చేత కానిది, చేవలేనిది, దద్దమ్మ, సీమాంధ్ర ప్రభుత్వం వగైరా వగైరా అని అనర్ఘళంగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రుల్ని చూస్తే నవ్వాపుకోలేక చస్తున్నా. 

తెలంగాణా కోసం రాజీనామా చేయని నాయకులని తరిమి కొట్టండి, రాజీనామాలు ఆమోదించుకోనివారు చవట దద్దమ్మలు అని మీరు, మీ తోక (అదేలెండీ కో.రా) నినాదాలు ఇచ్చేసరికి ఓ ఎగేసుకుంటూ కాంగ్రెస్, తె.దే.పా ఎంపీలని, ఎమ్మెల్యేలని ఘోరావులు గట్రా చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలకి తమరు, తమ అనుంగు పదో చెల్లి, తమ కుమారుడు, తమ మేనల్లుడు చేసిన రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదని, వాటిని ఆమోదింపచేసుకునే ప్రయత్నం తమరు కుసింత కూడా చేయలేదని, కాబట్టి తమరూ, తమ పరివారం కూడా సోకాల్డ్ "చవట దద్దమ్మల" క్యాటగిరీలోకి వస్తారని గుర్తులేకపోవడం భలే చిత్రం సుమండీ. జనాల్ని గొర్రెలతో పోల్చారంటే పోల్చరూ మరి. 

మనలో మనమాట, మొన్న పదిహేడో తారీఖున తెలంగాణా విమోచన/ విలీన/విద్రోహ (ఏంటో ఇదెప్పుడూ నాకు కన్ఫ్యూజనే ఒక్కోసారి ఒక్కో మాట వాడతారు మీరు) దినాన సోకాల్డ్ అంద్రోల్లయిన బాబుగారు తె.దే.పా పార్టీ ఆఫీసులోను, బొత్సబాబు గాంధీ భవన్ లోనూ జండాలు ఎగరేశారు కదా మరి మీరేంటి సార్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరు ఎక్కడా పత్తాలేరు? అంత ముఖ్యమయిన రోజున జండా ఎగరేసి మైకు ముందు విశ్వరూపం చూపిస్తారని ఆశగా ఎదురుచూశా. మీరు చూస్తే గప్ చుప్ సాంబార్ "బుడ్డి" అని సైలెంట్ గా ఉన్నారు. పోనీ పార్లమెంటులో ఎప్పుడైనా చించేసారా అంటే మొట్టమొదటి సారి గత సమావేశాలలో ఏదో రెండ్రోజులు మీరు, మీ పదో చెల్లి కుసింత హడావుడి చేసి ఢిల్లీ మీడియా ఫొటోలకి ఫోజులిచ్చి చక్కా వచ్చారు. ఈసారి అసలు సమావేశాలకి హాజరయ్యారో లేదో డౌటే. బహుశా మీకేమయినా "చట్టసభాఫోబియా" ఉందేమో డాక్టర్ కి చూపించుకోండి. రాజీనామా చేశాను కాబట్టి ఈ సారి వెళ్ళలేదు అంటారా? అది ఆమోదించబడలేదుగా :)). సర్లెండి మీ ఇష్టం మీది. 

అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే ఎలాగూ రాష్ట్రాన్ని తగలెట్టడం మొదలెట్టారు కాబట్టి ఆ తగలేట్టేదేదో మళ్ళీ కోలుకోకుండా పూర్తిగా తగలేట్టేయండి. అఫ్కోర్స్ ఆ ముక్క నేను మీకు చెప్పక్కర్లేదనుకోండి. ఇంక ప్రభుత్వం అంటారా? పేపర్లలో ఆ పదం చూడటం తప్ప అలాంటిది అంటూ ఒకటుందని ప్రజలతో పాటూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే మర్చిపోయారు. స్పీకర్ని తీసుకొచ్చి సీయం చేస్తే అసెంబ్లీలో లాగానే ఆయన నోటికొచ్చిన నాలుగు ముక్కలు "ప్లీజ్", "గొడవ చేయకండి", "సైలెన్స్", "ఇలా అయితే ఎలా?" తోనే నెట్టుకొచ్చేస్తున్నాడు. కాబట్టి మీకు ఎదురు లేదు. రెచ్చిపోండి. జనం సంగతి మీరెప్పుడు పట్టించుకున్నారు?

కొసమెరుపు: మీరు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని టీవీల్లో స్క్రోలింగ్ తో పాటూ "మీ ఆరోగ్యం సహకరించని దృష్ట్యా ఆ ఆలోచన మానుకోమని చెబుతున్నామని, తెలంగాణా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని" తమ అనుంగు కుమార్తె కవిత గారి స్టేట్మెంట్ ఎలా అర్ధం చేసుకోవాలో కుసింత వివరిద్దురూ. అయినా కామెడీ కాకపోతే ఆకలేసే దాకా ఆమరణనిరాహార దీక్ష చేసే దానికి పిచ్చి జనం, మీడియా ఇంత హడావుడి చేయడం ఎందుకండీ? :)