అదేంటో ఈ మధ్య బ్లాగ్లోకంలో పేర్ల గురించి విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. భయపడకండి నేను నా పేరు, దాని పుట్టు పూర్వోత్తరాలు, జనాలు దాన్ని ఖూనీ చేసిన విధానాలు గురించి చెప్పబోవట్లేదు. నేను చెప్పదలచుకున్నది నాని, బుజ్జి, చిన్న, చిట్టి, కన్నా ల గురించి. అదేనండీ ముద్దు పేర్ల గురించి. అసలీ ముద్దు పేర్లు ఎవరు కనిపెట్టారో గానీ ఒక్కోసారి అసలు పేర్ల కన్నా వీటితోనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. పిల్లలు పుట్టగానే ముద్దుగా వాళ్ళకి ఏదో ఒక ముద్దు పేరు తగిలించేస్తారు బుజ్జిగాడు, చిట్టి కన్నా ఎక్సెట్రా..ఎక్సెట్రా. ఇంట్లో వాళ్ళతో పాటు క్రమంగా పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అలా అలా ఆ పేరు అసలు పేరు కన్నా పాపులరయి కూర్చుంటుంది. ఇక పెద్దరికపు పిలుపులు కొన్నుంటాయి. వీటిని ముద్దు పేర్లు అనలేం కానీ ఇవీ అలాంటివే. పాపా, అమ్మాయీ టైపు అన్నమాట. కొన్నాళ్ళకి వాళ్ళ అసలు పేరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ మర్చిపోయినా హాశ్చర్యం లేదు. అంతెందుకు నా క్లోజ్ ఫ్రెండ్ నాని గాడి పేరు లక్ష్మీ నారాయణ అని నాకు చాన్నాళ్ళ దాకా తెలియదు. అసలు వాడి పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడూ కలగలేదు.
కొంతమంది క్లోజు సర్కిల్లో ముద్దు పేరు కంటిన్యూ చేస్తూనే బయట ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ అసలు పేరుతో చలామణీ అయిపోతూ ఉంటారు. వీళ్ళతో మరీ కష్టం.దగ్గర వాళ్లకి అసలు పేరు గుర్తుండదు, అవతల వాళ్లకి ముద్దు పేరు తెలియదు. వాళ్ళ కోసం వాళ్ళ ఆఫీసుకి వెళ్లి ఫలానా బుజ్జిగాడు కావాలండీ అని అడిగామనుకోండి. వాళ్ళు తెలియదు అంటారు. మళ్ళీ అక్కడ నుంచి వాడి పేరు తప్ప అన్ని గుర్తులూ చెప్పాల్సిందే. పొడుగ్గా ఉంటాడు, ఫుల్ హాండ్స్ చొక్కాలే వేస్తాడు, వాళ్ళది కాకినాడ, వాడికి హీరో హోండా బండుంది ఇలా దిక్కుమాలిన వివరాలన్నీ చెప్పాలి. అదే అసలు పేరు తో ఈ ప్రాబ్లెమ్స్ ఉండవు కదా.
కొంత మందికి వారి హోదా, ఉంటున్న ప్రదేశం తదితర వివరాలతో ముద్దు పేర్లు వచ్చేస్తాయి. ఉదాహరణకి రైల్వే లో పనిచేసే మామయ్య రైల్వే మామయ్య అయిపోతాడు. చుట్టాల్లో ఎవరో ఒకరు ఆ పిలుపు మొదలెడతారు ఇంక ఆయన బంధు మిత్ర సపరివారంగా అందరికీ రైల్వే మామయ్యే. ఇక రామచంద్రపురం పిన్ని, మద్రాస్ అత్తయ్య ఇలాంటివి కూడా మనకి తెలిసినవే.
సాధారణంగా ఈ ముద్దు పేర్లు ఇంట్లో మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు (అన్నయ్యలు, అక్కలు) ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంట్లో వాళ్ళు, ఆ తరవాత అలా అలా...... అన్నమాట. ఉదాహరణకి మా అమ్మగారు పుట్టినప్పుడు మా పెద్ద మామయ్య పాప పాప అని తిరుగుతుంటే మా అమ్మమ్మ పాప కాదురా చెల్లి అనాలి అందట. మా మామయ్య మహా మేధావి మరి...పాపకు ముందు చెల్లి జోడించి చెల్లిపాప అని పిలవడం మొదలు పెట్టాడు. ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో కానీ చుట్టపక్కాల్లో అదే పేరు ఫేమస్ అయిపోయింది. అన్నట్టు మా పెద్ద మామయ్య ముద్దు పేరు బాబ్జీ. చిన్నమామయ్య ముద్దు పేరు బాబు. ఇక మా బేబి పిన్ని ముద్దు పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేం చిత్రమో మా ఇంట్లో మా జనరేషన్లో ఒక్కరికీ ముద్దు పేరు లేదు (చిన్నప్పుడు అంత ముద్దుగా లేమేమో :) ).
నాకు తెలిసిన కొన్ని ముద్దు పేర్లు : నాని, చిన్ని, కన్నా, బుజ్జి, చిట్టి, బంగారం, బాబు, బేబి, పాప, బాబ్జీ ఎక్సెట్రా ఎక్సెట్రా... మీకూ ఏదయినా ముద్దు పేరుంటే చెప్పండి మరి..