Sunday, January 2, 2011

"పావలా" కు నివాళి


"త్వరలో పావలా ని రద్దు చేసేస్తున్నరట్రా ఇక నుంచి అర్ధ రూపాయే కనీస విలువగా చలామణీ లో ఉంటుందిట" పేపర్లో చదివిన వార్త మా ఫ్రెండ్ తో పంచుకున్నప్పుడు "వెధవ పావలా దాన్ని ఉంచితే ఎంత? రద్దు చేస్తే ఎంత?, అయినా ఈ రోజుల్లో ఏమొస్తుంది పావలాకి? ముష్టి వాడు కూడా తీసుకోడు" అన్న వాడి మాటలకి కాస్త చివుక్కుమంది. నిజమే పావలాకి ఇప్పుడు ఏమొస్తుంది? ప్రభుత్వ పధకాలలో, ఎన్నికల వాగ్దానాలలో "పావలా వడ్డీ" అని చెప్పుకోడానికి తప్ప ఇప్పుడు దానికి విలువేముంది?  కానీ ఒకప్పుడు ఆ పావలాతోనే ఎన్నో సంతోషాలని కొనుక్కున్నా. 

చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఐస్ సోడా, వేరుశనగ ఉండలు, ఉప్పూ కారం అద్దిన మావిడికాయ ముక్కలు, కారపు నీళ్ళలో ఊరబెట్టిన పెద్ద ఉసిరికాయలు, పీచు మిఠాయి, సొంపాపిడి, చిన్న చిన్న మావిడి తాండ్ర ముక్కలు, బుల్లి కోన్ తో ఐస్ క్రీం, కాస్త పెద్ద సైజు రబ్బరు (ఇప్పుడు స్టైల్ గా ఎరేజర్ అంటున్నాం లెండి), బాల్ పాయింట్ పెన్ రీఫిలు, చిన్న సైకిల్ గంట అద్దె ..ఇలా ఒకటా.. రెండా చేతిలో పావలా ఉంటే నా పరిధిలో అన్ని విలాసాలు తీర్చేసుకోవచ్చు అని నమ్మేవాడిని. అవును మరి.. . అప్పట్లో ఎలిమెంటరీ స్కూలు కుర్రాడి రోజువారీ  పాకెట్ మనీ పావలా ఉంటే వాడు మహా రిచ్ గా లెక్క. 

స్కూలు ముందు ఒక ముసలాయన కర్రకి ఆ చివర రంగు రంగుల జీడిపాకం లాంటిది కట్టుకుని దాంతో వాచీ,కోతిబొమ్మ చేసేవాడు, దాని విలువ పావలాయే. ఇక మా ఊరి చొల్లంగి తీర్ధం లో పావలాకి ఇచ్చే జీళ్ళు (సాధారణం గా పావలాకి రెండు ఇచ్చేవాళ్ళు), అలాగే ఆ తీర్ధం లో  దాదాపు మా ఈడు కొడుకును పక్కనే నిలబెట్టుకుని  చేత్తో తిప్పే రంగుల రాట్నం నడిపే  ఒకతను దాన్ని ఎక్కడానికి మా దగ్గరనుంచి వసూలు చేసేది పావలాయే. రంగుల రాట్నం లో తిరుగుతున్న మమ్మల్ని ఆశగా చూసే ఆ కుర్రాడి చూపుల్లో "నీకూ నాకు తేడా ఒక్క పావలాయే" అన్న అర్ధం ఉండేదేమో అని ఇప్పుడనిపిస్తుంది. 

ఇక సంక్రాంతికి ఇంటిముందుకి వచ్చే హరిదాసుకి దోసిలి నిండా బియ్యం తో పాటు ఒక పావలాయో, అర్ధరూపాయో ఇవ్వడం, గంగిరెద్దులవాళ్ళు ఇంటి ముందు చేయించిన విన్యాసాలకి బహుమతిగా మా తాతగారు రూపాయో, రెండ్రూపాయలో ఇచ్చినప్పుడు, నేను సైతం అంటూ నా నిక్కరు జేబులో అపురూపంగా దాచుకున్న పావలాని వాళ్లకిచ్చేయడం (ఆ తరువాత నా దగ్గర దాచుకున్న పావలా వాళ్లకిచ్చేసానని మా తాతగారు నా చేతిలో ఏ అర్ధ రూపాయో పెట్టడం వేరే సంగతనుకోండి :) ) 

ఒక్కటా రెండా...పావలాతో ఇన్ని జ్ఞాపకాలు. అలాంటి ఆ పావలా ఇక ముందు కనిపించదంటే కలుక్కుమనదా మరి. 

జనవరి ఐదవ తేదీ రాత్రి సమైక్య, వేర్పాటు వాదుల ఆలోచన ఎలా ఉంటుందన్న చిన్న చిలిపి ఆలోచనతో - ఒక పేరడీ

మంచి మిత్రులు సినిమాలో "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" నాకు చాలా ఇష్టమయిన పాటల్లో ఒకటి. రేపు జనవరి ఆరో తేదీన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మన ముందుకు రానున్న తరుణంలో ఐదవ తేదీ రాత్రి సమైక్య,వేర్పాటు వాదుల  ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న చిలిపి ఆలోచనతో ఏ పాట రాయడం జరిగింది. ఆ సినిమాలో ఇద్దరు మిత్రులు ఒకరినొకరు కలుసుకొనేటప్పుడు తమ ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి అవతలివాళ్ళకి చెప్పాలనే ఆత్రుతతో తెల్లరడం గురించి ఎదురుచూస్తూ ఉంటారని మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఆరవ తేదీ గురించి సమైక్య, విభజన వాదులు తమ ఆలోచనలు మార్చుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ పేరడీ కి స్ఫూర్తి. ఇంత సూపర్ హిట్ పాట  ట్యూన్ మీకు తెలియదని కాదు. అయినా ఏదో నా తృప్తి కొద్దీ పాట లింక్ కింద ఇస్తున్నాను. ట్యూన్ కి తగ్గట్టు పేరడీ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. 


http://www.box.net/shared/e3f7u0du1p



ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే 

ఇన్నినాళ్ళు దాచిన సత్యం
ఉబికి ఉబికి వస్తుంటే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

ఒకటిగా నిలిచిన జాతిని 
ఏ తంత్రం ఏమీ చేయదని 
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

నేనెరిగిన సమైక్య వాదం
నీతో చెప్పాలని వస్తే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

నేతలు తిరిగే జాతిలో 
ఏ ఐక్యత పనికి రాదనీ
ప్రగతిని కోరే స్టేటులో 
తమ ప్రాంత స్వార్ధమే మేలని 
నేచూసిన విభజనిజం
నీతో చెప్పాలని వస్తే 

ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

"విభజనిజం" అనే కొత్త పదం పుట్టించాల్సి వచ్చింది. దీనికి వీరతాడు వేసినా (ఎవరూ పుట్టించకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి - మాయా బజార్ లో ఘటోత్కచుడు), భాషను ఖూనీ చేసానని తిట్టుకున్నామీ  ఇష్టం. ఈ ప్రయత్నం నచ్చితే ఒక చిన్న కామెంట్ తో భుజం తట్టండి చాలు!!!!