Showing posts with label నచ్చితే కవిత్వం...లేకుంటే కపిత్వం. Show all posts
Showing posts with label నచ్చితే కవిత్వం...లేకుంటే కపిత్వం. Show all posts

Sunday, January 9, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరాఖరి భాగం. సెంచరీ కొట్టేసానోచ్........... :)


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౭౬
పిజ్జా కి నా నిర్వచనం 
చాలా సింపుల్ 
అది ఇటలీ వాళ్ళ ఊతప్పం 

౭౭ 
చిన్నప్పటి నా ఫోటో
నేనేం కోల్పోయానో 
వెక్కిరిస్తున్నట్టు చెప్పింది 

౭౮ 
అవసరమైతే రాజీనామా
అడ్డమైన లీడరూ
ఈ మధ్య ఇదే డ్రామా

౭౯ 
చిన్నప్పుడు పెద్దవ్వాలని
పెద్దయ్యాక బాల్యమే బెటరని
మనిషికి ఎప్పుడూ ఏడుపే 

౮౦ 
కొత్త హీరోయిన్
ఒక్క సినిమాతో 
పది షోరూం ఓపెనింగులు 

౮౧ 
కన్వీనియంట్ గా మార్చుకునే
ఒకే ఒక పుస్తకం
భారత రాజ్యాంగం 

౮౨
భలే చిత్రం గా ఉంది
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" ఫ్యూచరిప్పుడు
ఒక "ఇటాలియన్" చేతిలో ఉండటం

౮౩ 
"తెలుగు తల్లి ఎవరు?"
ఈ మాటని కెసిఆర్ 
ఇంకేదయినా భాషలో చెప్పి ఉండాల్సింది 

౮౪ 
అదేం చిత్రమో 
శలవురోజులు మాత్రం 
త్వరగా గడిచిపోతాయి

౮౫ 
మా ఆవిడ 
"మా పుట్టింటి వాళ్ళని చూడాలనుంది" అంది
నేను జూకి తీసుకెళ్లా

౮౬ 
అవును నిజమే
ఉద్యమాల్లో నేతలే ముందుంటారు
పోరుకోసం కాదు, పేరు కోసం

౮౭ 
పదిమంది ఎంపీలు నిరసన తెలిపితే
కసబ్ ని కూడా
వదిలేస్తుందేమో ఈ ప్రభుత్వం 

౮౮ 
ఓటేసి ఐదేళ్లవుతోంది
మా వూరి రోడ్డు మాత్రం
ఇంకా అలానే ఉంది

౮౯ 
హైదరాబాద్ లో పదేళ్లుగా కలిసున్న నా మిత్రుడు 
అకస్మాత్తుగా
నన్ను "సీమాంధ్రుడు" అంటున్నాడు 

౯౦ 
సకుటుంబంగా సినిమాకెళ్లా
సహస్రం వదిలింది
తలనొప్పి మిగిలింది 

౯౧ 
అవినీతి 
ఇది కూడా దేవుడిలా 
సర్వాంతర్యామే!

౯౨
జలుబు చేస్తే హాస్పిటల్ కెళ్లా
ఒక్క రోజులో
ప్రపంచంలో ఉన్న టెస్టులు అన్నీ తెలిసాయి

౯౩
"ఉభయకుశలోపరి"
ఈ మాట మర్చిపోయి
అప్పుడే ఒక తరం అయిపోతోంది

౯౪ 
"ట్వింకిల్ ట్వింకిల్" మోజులో
"సరస్వతీ నమస్తుభ్యం"
వెలవెలబోతోంది 

౯౫
బేబీ సోప్ యాడ్ లో
బికినీ పాపెందుకో
నాకిప్పటికీ అర్ధం కాదు 

౯౬ 
2010 ప్రశాంతంగా గడిచిందట
చిదంబరం
టీవీ చూస్తున్నట్లు లేదు 

౯౭ 
కాలం కన్నా
గొప్ప యాంటిబయోటిక్ 
నాకు ఇంతవరకు దొరకలేదు

౯౮ 
అమ్మకానికి "మనుషులు"
నమ్మకపోతే 
ఐపిఎల్ వేలం చూడండి 

౯౯ 
నువ్వు నువ్వుగా ఉండటమే
నా దృష్టిలో 
బాల్యమంటే 

౧౦౦ 
ఈ పోస్ట్ వలన నాకో లాభం 
వంద వరకు
తెలుగు అంకెలు తెలిసాయి 



అయ్యబాబోయ్!!!!!! వంద హైకూలు (వీటిని నేను అలా అనేసుకునే రాసేశా) పూర్తయిపోయాయి. కామెంట్లతో ఇప్పటివరకు నన్ను ప్రోత్సాహించిన బ్లాగ్మిత్రులందరికీ ఇదే నా "వంద"నం. 

మొదటి ఐదు భాగాలు ఇదిగో ఇక్కడున్నాయి. 









 



 









Saturday, January 8, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరన్నర భాగం.......................వందయ్యేదాకా వదల బొమ్మాళీ వదల --ప్రస్తుతానికి ఒక పాతిక - చివరాఖరి భాగం ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి...చూస్తూనే ఉండండి www.blogavadgeetha.blogspot.com

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి



౫౧. 
సిగరెట్ 
మనిషిని శివుడ్ని చేస్తుంది
గొంతులో గరళం నింపి

౫౨. 
అంతరిక్షం వైపు
రాకెట్, రేట్లు రెండూ ఎగిరాయి
రాకెట్ ఓడిపోయింది

౫౩. 
అవార్డులంటే 
అర్హులకు తప్ప
అందరికీ వచ్చేవి

౫౪. 
ఒక్కడి సంపాదనతో
చాలా మంది బతికే చోటు
దేవస్థానం

౫౫ 
మా ఆవిడ కొత్త వంట చేస్తోంది
అద్దంలో నాకు నేను
ల్యాబ్ లో ఎలకలా కనిపించాను 

౫౬ 
కొత్త ఊళ్ళో లైబ్రరీకెళ్లా
ప్రతి అరలోనూ
ఎంత మంది ఫ్రెండ్సో!!!

౫౭.
అవార్డు సినిమా ప్రీవ్యూ 
ఆడియన్సందరి గురక
స్పష్టంగా వినిపిస్తోంది 

౫౮ 
మళ్ళీ లేవక్కర్లేకుండా 
హాయిగా బజ్జోవడమే 
మరణం

౫౯ 
హిమాలయాల్లో సేల్స్ మాన్ 
మహర్షులని చూసి
రేజర్లమ్మడం మొదలెట్టాడు 

౬౦ 
పెళ్ళాం కన్నా ప్రేయసే బెటర్
తన తరపు ఫంక్షన్లకి 
వెళ్ళనవసరం లేదు

౬౧ 
వార్తల్లేని ఓ న్యూస్ చానెల్
భార్య భర్తల మధ్య
అక్రమసంబంధం వెలుగులోకి తెచ్చింది 

౬౨. 
అరవై మూడేళ్ళ స్వతంత్రం
అన్నీ నేర్చుకున్నాం
ప్రశ్నించడం తప్ప

౬౩ 
నాదో చిన్న సందేహం
"ఓంకారన్నయ్య"ని
వాళ్ళావిడ ఏమని పిలుస్తుందో?

౬౪. 
నా సెల్ పోయింది
ఒక్కసారిగా
బంధాలన్నీ తెగిపోయాయి 

౬౫ 
ఇంగ్లీష్ చదువు
బాబాయి, మావయ్య
ఇద్దరూ అంకుల్సే 

౬౬ 
మాతృభాష బ్రతికే ఉంది
దెబ్బ తగిలినప్పుడు 
"అమ్మా" అంటున్నాంగా

౬౭ 
టీవీలో యాంకర్ అమ్మాయి
ఎంత అందంగా
భాషను ఖూనీ చేస్తోందో !!!

౬౮ 
నేటి తెలుగు సినిమా పాట
శ్రద్ధగా వింటే 
ఒకట్రెండు తెలుగు పదాలు దొరక్కపోవు 

౬౯ 
అవసరాల్లోనే  గుర్తొచ్చే
ఒకే ఒక ఫ్రెండు 
దేవుడు

౭౦ 
ఒక్కసారీ లక్కు తగలని
ఏకైక లాటరీ
ఎన్నికలు

౭౧ 
చదువయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?
నాన్నారి ప్రశ్నకి నా సమాధానం 
సరైన సమయం లో సరైన నిర్ణయం 

౭౨ 
ఈజిప్ట్ లో  నే చూసిన గొప్ప విచిత్రం
డాడీ కూడా
చచ్చాక మమ్మీ అవడం 

౭౩ 
కొత్త బైక్ కొన్నా
చిత్రంగా
రోడ్డు రేస్ ట్రాక్ లా కనిపించింది 

౭౪ 
వెధవ బ్యాంకులు
వెహికల్ కి లోనిస్తారట కానీ
వెజిటబుల్స్ కి ఇవ్వరట 

౭౫ 
ఫస్ట్ టైం స్పీల్బర్గ్ సినిమా చూస్తున్న 
పక్కసీట్లో తాతగారి కామెంట్
"ఇవన్నీ విఠలాచార్య ఎప్పుడో తీసేసాడుగా"

ఇంకో పాతిక ఈ ఆదివారం సాయంత్రం పోస్ట్ చేస్తా... దాంతో వంద పూర్తవుతాయి. అన్నీ ఒకసారే అయితే బోరు కొట్టేయ్యదూ!! ముందు నాలుగు భాగాలూ చదివే ఉంటారుగా. లేకపోతే ఇదిగో ఓ లుక్కేయండి. 



Thursday, January 6, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరి భాగం -.... యాభై అయ్యాయి కదా!!! ఇంక చాల్లెండి. మిమ్మల్ని మరీ ఎక్కువ హింసిస్తున్నానేమో అనిపిస్తోంది.


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౩౭ 
తెలంగాణా ఉద్యమం
జనాల కన్నా
జేఏసి లే ఎక్కువున్నాయి

౩౮ 
ఛానెల్లో చర్చలు
ఎప్పుడు చూసినా
అవే మొహాలు 

౩౯ 
అతివృష్టి
ఎటుచూసినా నీళ్ళే
పొలంలో, రైతు కళ్ళలో

౪౦ 
గతేడాది పిల్లలకి
వేసవి శలవలతో పాటు
వేర్పాటు శలవలూ వచ్చాయి 

౪౧ 
కమిటీ రిపోర్టిచ్చింది
ఏడాది క్రితం పరిస్థితికి
తీసుకొచ్చి వదిలేసింది 

౪౨ 
శ్రీ కృష్ణ కమిటీ
కొండని తవ్వి
ఎలకనీ వదిలేసింది 

౪౩ 
అందరికీ ఆమోదయోగ్యం
అంటే
ఎవరికీ అక్ఖర్లేదని అర్ధం

౪౪ 
ఎవరన్నారు 
దేశం క్రీడల్లో వెనకుందని?
నేతలు జనాలతో ఆడుకోవట్లేదూ

౪౫ 
మార్కెట్ కెళ్లా
జేబు ఖాళీ అయి
సగం సంచి నిండింది 

౪౬ 
డైలీ సీరియల్ హీరొయిన్ 
వీలునామాలో 
తన పాత్ర మునిమనవరాలికి రాసింది 

౪౭ 
మా ముత్తాతకి , శ్రీ శ్రీ కి  
ఒక పోలికుంది
ఇద్దరూ కీర్తి శేషులే 

౪౮ 
ఎవరో అడిగారు నా వయసెంతని
12045 డైలీ సీరియల్ ఎపిసోడ్లు 
నా సమాధానం

౪౯ 
మా ఊరికి రైల్లో ప్రయాణం
రైలు ముందుకి
ఆలోచనలు వెనక్కి

౫౦ 
దేవతలకే కాదు మనకీ తెల్సు 
అమృతం రుచి
కాపోతే మనం అమ్మచేతి వంట అంటాం 



ఇంక చాలు మహాప్రభో అనుకుంటున్నారా? ఏదో మీ అభిమానం. ఈ సారికిలా కానిచ్చేయండి.










అయ్యబాబోయ్..ఈ రోజేంటి ఇలా బ్లాగేస్తున్నాను!!!! - జస్ట్ రాయాలనిపించింది అంతే - మూడవ భాగం .

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే . నచ్చితే భుజం తట్టండి

౨౨. 
రెండో క్లాసు కుర్రాడు 
పొద్దున్న స్కూలుకి 
సాయంత్రం ఐ ఐ టి కోచింగ్ కి

౨౩. 
ఒంటి నిండా బట్టలేని జనం
మురికివాడల్లోనూ
మెట్రో పబ్బుల్లోనూ 

౨౪. 
ఈ గతుకుల మీదొట్టు
ఈ రోడ్డు
మొన్నే వేశారు

౨౫. 
అన్ని చానెళ్ళలో 
అదే న్యూస్ 
ఎవడికి వాడే "ఎక్స్లూజివ్"

౨౬. 
దున్నపోతు ఈనిందట 
ఇది సీమాంధ్రుల కుట్రే 
ఓ వేర్పాటు వాది స్టేట్మెంట్  

౨౭. 
రోడ్ల భద్రతపై అధ్యయనానికి 
మన అధికారులు 
వెనిస్ వెళ్లి వచ్చారు 

౨౮. 
జీతం వచ్చింది
కాగితం మీద బడ్జెట్ తర్వాత
లోటు వెక్కిరించింది 

౨౯.
తాగుబోతు డ్రైవింగ్ 
వెధవరోడ్లు
తిన్నగా ఉండి చావవు

౩౦. 
ఈ ప్రపంచం లో 
అనంతమయినవి ఏమి లేవు
డైలీ సీరియల్స్ తప్ప

౩౧. 
బాలకృష్ణ సినిమా హిట్టట 
పుష్కర కాలం 
అసలు గడిచినట్టే తెలియలేదు 

౩౨. 
పైరసీని అరికట్టండి
హాలీవుడ్ కధ కాపీ కొట్టిన 
దర్శకుడి విజ్ఞప్తి 

౩౩. 
మా ఊళ్ళో బస్సు దిగా
అమ్మ ఒడిలో 
తలపెట్టినట్టు ఉంది 
(ఇప్పుడే "తోటయ్య" పోస్ట్ తో మా ఊరిని గుర్తుకు తెచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలతో)

౩౪. 
అల్మారా సర్దుతుంటే 
పాత ఆల్బం దొరికింది
దాంతో పాటే జ్ఞాపకాలూనూ

౩౫ 
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడుతోంది
చిన్నప్పుడు
ఉగ్గు బదులు తేనె తాగేసిందేమో 

౩౬. 
రెండు శరీరాల్లో 
ఒకే ఆత్మ
బాపు - రమణ 


జస్ట్ రాయాలనిపించింది అంతే - రెండవ భాగం

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧౧. 
ఇప్పుడే భోజనమయింది 
ఇక ప్రకటించేయ్యచ్చు
ఒక్క పూట ఆమరణ దీక్ష

౧౨. 
మూడు తరాలుగా సాగుతోంది
ఆ టివి సీరియల్ 
ఇంకా సగం కూడా కాలేదట 

౧౩ 
ర్యాంక్ తగ్గింది
రైలు పట్టాల మీద 
ఇంటర్ కుర్రాడి శవం 

౧౪. 
అంతా ప్రశాంతం గా ఉంది 
ఆనందం గా లేనిది 
ఆ న్యూస్ చానెల్ వాళ్ళే 

౧౫. 
మన దేశం లో దొంగలకి 
మర్యాదేక్కువ
పార్లమెంట్లో కూర్చోపెడతాం 

౧౬. 
సొనియమ్మ కి మూడ్ బాలేదట 
ఎపి సిఎం 
మళ్ళీ మారతాడేమో

౧౭. 
నాస్తిక నేత మరణం 
కాల్చాలా? పూడ్చాలా? 
న్యూస్ చానెల్ లో SMS POLL 

౧౮.
పెళ్లి చూపులయ్యాయి 
అధిష్టానంతో సంప్రదించి చెప్తాం 
అబ్బాయి తరపు వారి సమాధానం

౧౯ 
అన్నిటికీ రాజీవ్, ఇందిరే
తన కొడుక్కి మాత్రం 
ఆ పేరు పెట్టలేదేందుకో ఆ నేత 

౨౦ 
మా వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలట 
ఇంటికి ఇద్దరు చొప్పున రమ్మని
స్కూల్ నించి ఆహ్వానం 

౨౧. 
ఘంటసాలా? ఏ ప్రోగ్రాం లో సింగర్? 
స్రిప్ట్ చదువుతున్న 
మ్యూజిక్ షో యాంకరమ్మ ప్రశ్న 

జస్ట్ రాయాలనిపించింది అంతే

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు . జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧.
పెద్ద బాలశిక్ష 
పేరెక్కడో విన్నా
వీక్లీయా? మంత్లీయా?

౨. 
కూతురు పుట్టిందట
grl brn అని 
బామ్మర్ది sms 

౩. 
మా వీధిలో గేదె ఈనింది
ఇందాకనే చూసా
ఏదో టీవి బ్రేకింగ్ న్యూస్ లో

౪. 
ఉల్లిపాయ 
కోసినా, కొన్నా
కన్నీళ్ళే 

౫ 
ఆదివారం తర్వాత ఏ వారం?
ఈ వారం రియాల్టీ షో లో 
ప్రేక్షకులకు sms ప్రశ్న

౬. 
బందులు, ధర్నాలతో 
ఏడాదంతా గడిచిపోయింది
రేపట్నించి కాలేజి లో ఎగ్జామ్స్ 

౭. 
రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
ముఖ్యమంత్రి స్టేట్మెంట్ 
సచివాలయం ఎదురుగా లాఠిచార్జ్ 

౮.
అహింసాయుత మార్గం లో స్వాతంత్రం
గొప్పగా చెప్పుకుందాం
రక్తపాతాల ఆర్తనాదాల మధ్య 

౯. 
నేటి పిల్లలకి 
టెల్గు బాగా వచ్చు
అ ఆ ఇ ఈ F 

౧౦
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని 
పుస్తకాల్లో హైదరాబాదే 
పాలన మాత్రం ఢిల్లీ లో 

Monday, December 20, 2010

బాపు గారి శ్రీరామ రాజ్యానికి నేను రాసుకున్న టైటిల్ సాంగ్ .....

నిన్న ఏదో మాటల్లో బాపు గారు తీస్తున్న శ్రీరామ రాజ్యం సినిమా గురించి నేను నా శ్రీమతి మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఆ సినిమాకి టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందా అనిపించింది. అంటే రామరాజ్యం గురించి ఏం చెప్తే బావుంటుంది అన్న ఆలోచనతో రాయడం మొదలు పెట్టా. మొత్తం పాట రాయడానికి జస్ట్ ఇరవై నిమిషాలు పట్టింది (అంటే అది నా గొప్ప కాదు లెండి రాములోరిది). చదివి మీ అభిప్రాయం చెప్తే ఆ ధైర్యం తో రమణ గారికి కూడా వినిపించే సాహసం చేస్తా. 

ధర్మం నాలుగు పాదాల నడచిన రాజ్యమిది
దైవం మానుష రూపేణా ఏలిన రాజ్యమిది 

కరకు బోయ కడు రమ్యముగా కీర్తించిన రాజ్యమిది 
భవిష్యత్ బ్రహ్మే బంటుగా ఒదిగిన సిత్రపు రాజ్యమిది 
రామనామమే రాజముద్రగా సాగిన రాజ్యమిది 
ప్రజల క్షేమమే ధర్మసూత్రమై నడచిన రాజ్యమిది  

బడుగు మడేలు మాటకు సైతం విలువిచ్చిన రాజ్యమిది 
ఆలి కన్నా పాలితులే ప్రియమని సెలవిచ్చిన రాజ్యమిది 
పాలనలో ఇల సాటిలేదని కొలచిన రాజ్యమిది 
పాలకులే ప్రజ సేవకులని నేర్పించిన రాజ్యమిది  




ఇదండీ రామరాజ్యం అంటే నాకు తోచినది. ఎలా రాసానో మీరే చెప్పాలిక. 


Tuesday, December 8, 2009

ఉలిదెబ్బలు పడకుండా ఏ రాయీ శిల్పమవదు...

మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే పక్క పేజి లో ఓపెన్ అవుతుంది. నా ప్రయత్నం మీకు నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టడం మర్చిపోకండి. నా ప్రయత్నం లో లోపాలేమయినా ఉంటే తగు సూచనలందిస్తే సరిదిద్దుకుంటాను.