Wednesday, September 21, 2011

అబ్బే ఈ మంట సరిపోదు......ఇంకా తగలేయండి


అలో...అలో....అలో  కచరాగారూ. ఏ ముహూర్తంలో మీకీ పేరు పెట్టానో కానీ స్టేట్ మొత్తాన్ని రోజు రోజుకూ కుప్పతొట్టి కన్నా హీనం చేసేస్తున్నారుగా. అబ్బే ఇది తిట్టడం కాదండీ. మీసమర్ధతని మెచ్చుకుంటున్నా. కాపోతే నాకో చిన్న డౌట్ ఈ సకల జనుల సమ్మె ఎవరి మీద కోపంతో ఎవరు చేస్తున్నట్టు? అహ నాకు తెలీక అడిగానంతే. అంటే బయట జనంలో (అదే లెండి బాబూ తెలంగాణా జనమే) టాక్ ఏంటంటే బస్సులు తిరగటం లేదు, ఆఫీసులు నడవటం లేదు, చివరాఖరికి పిల్లకాయల బళ్ళు కూడా తెరవటం లేదు. మా జీవితాల్ని నరకం చేస్తూ మాకోసమే సమ్మె అంటారేంటి ఈ బుర్ర తక్కువ సన్నాసులు (ఇది మాత్రం మీరు నేర్పించిన పదమే సుమండీ)? అనుకుంటున్నారు. నాకు తెలియక అడుగుతున్నానూ ఈ సమ్మె వలన ఒక్క సీమాంధ్ర వాడయినా ఇబ్బంది పడుతున్నాడా? ఆర్టీసీ బస్సులు లేక, ప్రైవేట్ వాహనాల అడ్డగోలు దోపిడీ భరించలేక ఈ సమ్మె ఆలోచన చేసిన వాడిని జనం (అక్షరాలా తెలంగాణా ప్రజలు) అమ్మ నా బూతులూ తిట్టుకుంటున్న సంగతి మీకు కనబడలేదా?  

అవును కచరా గారూ నిన్న ఓ బ్రహ్మాండమయిన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణా వచ్చాక ఇప్పుడు సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలిస్తాం, తెలంగాణా వచ్చే దాకా ఈ సమ్మె ఆగదు అన్నారు. అబ్బ ఎంత సూపర్ డైలాగండీ అది! సూపరో సూపరు. అవునూ మరి మొన్నామధ్య మీరే 2014 దాకా తెలంగాణా వచ్చేలా లేదు అని బోలెడంత బాధపడిపోయిన విషయం ఈ సమ్మె చేస్తున్నా ఉద్యోగుల్లో ఒక్కడికీ గుర్తురాకపోవడం భలే చిత్రం సుమండీ. మరి ఊరికే అన్నారా వినేవాడు వీపీ జాన్ అయితే హరికథ మలయాళంలో చెప్తారని. 

ఇక స్కూళ్ళ విషయానికి వద్దాం. ఉద్యోగులకి అంటే పాపం డబ్బులే కాబట్టి వడ్డీతో సహా ఇచ్చేస్తారు. మరి పిల్లకాయల సంగతేంటి మాస్టారూ?. వాళ్ళు నష్టపోయిన, పోతున్న చదువులకి ఏ వెల కడతారు?  లేకపోతే ఉద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా వీళ్ళకీ డైరక్ట్ గా డబుల్ ప్రమోషన్ ఇచ్చేసి ఆరో క్లాసు వాడ్ని ఎనిమిదో క్లాస్ కి, డిగ్రీ వాడ్ని పీజీకి ప్రమోట్ చేసేస్తారా? మీరు చేసినా చేసేయగలరు లెండి. మీ సొమ్మేంపోయింది? మీరంటే ఉదారమైన మనసుతో తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్ధి కాంక్షించి పిల్లకాయలు పరీక్షలు రాయకపోయినా పాస్ చేసేస్తాం అంటారు అనుకోండి మరి ఆ బిట్స్ , ఐ ఐ టి లాంటి సంస్థలు మార్కులు లేకపోయినా క.ఛ.రా గారు చెప్పారని ఓ ఎగేసుకుని చేర్చేసుకోవు కదండీ. అయినా పోయేదేం లేదు లెండి ఆ పరిస్థితి ఎదురయితే అది ఆంధ్రోళ్ళ కుట్ర అని కవర్ చేసేసుకోవచ్చు. ఉందిగా సర్వరోగ నివారిణి జిందా తెలిస్మాత్. కాపోతే ఈ మాట మరీ అన్నిటికీ వాడేయకండి సార్. మీ అనుచర గణానికి బాగా అలవాటయి చివరికి భార్య గర్భవతి అన్న వార్త విన్నా అలవాటులో పొరపాటుగా "ఇది ఆంధ్రోల్ల కుట్ర" అనేసినా అనేస్తారు. వినడానికి అంత బాగోదుగా. ఏటంటారు?

మీరేం అనుకోకపోతే నాదో సందేహం. ఏమీ అనుకోకూడదు మరి. అబ్బే ఏం లేదండీ. తెలంగాణా ప్రజలు అందరూ సమ్మెలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడ చూసినా గులాబీ జండాలు పట్టుకున్న మీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారు తప్ప మామూలు జనం ఆట్టే కనిపించటం లేదేంటి? చూడబోతే తె.రా.స. వాళ్ళు కాకపోతే వాళ్ళు తెలంగాణా వాళ్ళు కాదు అన్నట్టు కనిపిస్తోంది. (మనలో మనమాట అసలు మీనింగ్ అదే కదా). మొన్నామధ్య ఎవరో మామూలు పౌరుడు టీవీ వాళ్ళతో సమ్మె వలన ఇబ్బందులు చెబుతుంటే గులాబీయులు ఆ అర్భకుడిని అడ్డుకున్న తీరు, నేనూ తెలంగాణా వాడినే మొర్రో అని వాడు మొత్తుకుంటున్నా వాడి నోరు నొక్కేసిన తీరు చూసి ఒక్క సారి హిట్లరు గుర్తోచ్చాడంటే నమ్మండి. మీరు సూపరెహే!!

ఇక ఈ మధ్య "సీమాంధ్ర ప్రభుత్వం" అని ఇంకో మాట వింటున్నానండోయ్. పదం బావుంది కానీ మంత్రి వర్గంలో తెలంగాణా మంత్రుల్ని పెట్టుకుని సీమాంధ్ర  ప్రభుత్వం అంటే ఆట్టే బాగోదేమో ఆలోచించండి. మీరంటే నోటికి ఎంతోస్తే అంత అంటారు కాబట్టి ఓ.కే అనుకోవచ్చు. స్వయంగా మంత్రి వర్గంలో ఉండి ఈ ప్రభుత్వం చేత కానిది, చేవలేనిది, దద్దమ్మ, సీమాంధ్ర ప్రభుత్వం వగైరా వగైరా అని అనర్ఘళంగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రుల్ని చూస్తే నవ్వాపుకోలేక చస్తున్నా. 

తెలంగాణా కోసం రాజీనామా చేయని నాయకులని తరిమి కొట్టండి, రాజీనామాలు ఆమోదించుకోనివారు చవట దద్దమ్మలు అని మీరు, మీ తోక (అదేలెండీ కో.రా) నినాదాలు ఇచ్చేసరికి ఓ ఎగేసుకుంటూ కాంగ్రెస్, తె.దే.పా ఎంపీలని, ఎమ్మెల్యేలని ఘోరావులు గట్రా చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలకి తమరు, తమ అనుంగు పదో చెల్లి, తమ కుమారుడు, తమ మేనల్లుడు చేసిన రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదని, వాటిని ఆమోదింపచేసుకునే ప్రయత్నం తమరు కుసింత కూడా చేయలేదని, కాబట్టి తమరూ, తమ పరివారం కూడా సోకాల్డ్ "చవట దద్దమ్మల" క్యాటగిరీలోకి వస్తారని గుర్తులేకపోవడం భలే చిత్రం సుమండీ. జనాల్ని గొర్రెలతో పోల్చారంటే పోల్చరూ మరి. 

మనలో మనమాట, మొన్న పదిహేడో తారీఖున తెలంగాణా విమోచన/ విలీన/విద్రోహ (ఏంటో ఇదెప్పుడూ నాకు కన్ఫ్యూజనే ఒక్కోసారి ఒక్కో మాట వాడతారు మీరు) దినాన సోకాల్డ్ అంద్రోల్లయిన బాబుగారు తె.దే.పా పార్టీ ఆఫీసులోను, బొత్సబాబు గాంధీ భవన్ లోనూ జండాలు ఎగరేశారు కదా మరి మీరేంటి సార్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరు ఎక్కడా పత్తాలేరు? అంత ముఖ్యమయిన రోజున జండా ఎగరేసి మైకు ముందు విశ్వరూపం చూపిస్తారని ఆశగా ఎదురుచూశా. మీరు చూస్తే గప్ చుప్ సాంబార్ "బుడ్డి" అని సైలెంట్ గా ఉన్నారు. పోనీ పార్లమెంటులో ఎప్పుడైనా చించేసారా అంటే మొట్టమొదటి సారి గత సమావేశాలలో ఏదో రెండ్రోజులు మీరు, మీ పదో చెల్లి కుసింత హడావుడి చేసి ఢిల్లీ మీడియా ఫొటోలకి ఫోజులిచ్చి చక్కా వచ్చారు. ఈసారి అసలు సమావేశాలకి హాజరయ్యారో లేదో డౌటే. బహుశా మీకేమయినా "చట్టసభాఫోబియా" ఉందేమో డాక్టర్ కి చూపించుకోండి. రాజీనామా చేశాను కాబట్టి ఈ సారి వెళ్ళలేదు అంటారా? అది ఆమోదించబడలేదుగా :)). సర్లెండి మీ ఇష్టం మీది. 

అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే ఎలాగూ రాష్ట్రాన్ని తగలెట్టడం మొదలెట్టారు కాబట్టి ఆ తగలేట్టేదేదో మళ్ళీ కోలుకోకుండా పూర్తిగా తగలేట్టేయండి. అఫ్కోర్స్ ఆ ముక్క నేను మీకు చెప్పక్కర్లేదనుకోండి. ఇంక ప్రభుత్వం అంటారా? పేపర్లలో ఆ పదం చూడటం తప్ప అలాంటిది అంటూ ఒకటుందని ప్రజలతో పాటూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే మర్చిపోయారు. స్పీకర్ని తీసుకొచ్చి సీయం చేస్తే అసెంబ్లీలో లాగానే ఆయన నోటికొచ్చిన నాలుగు ముక్కలు "ప్లీజ్", "గొడవ చేయకండి", "సైలెన్స్", "ఇలా అయితే ఎలా?" తోనే నెట్టుకొచ్చేస్తున్నాడు. కాబట్టి మీకు ఎదురు లేదు. రెచ్చిపోండి. జనం సంగతి మీరెప్పుడు పట్టించుకున్నారు?

కొసమెరుపు: మీరు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని టీవీల్లో స్క్రోలింగ్ తో పాటూ "మీ ఆరోగ్యం సహకరించని దృష్ట్యా ఆ ఆలోచన మానుకోమని చెబుతున్నామని, తెలంగాణా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని" తమ అనుంగు కుమార్తె కవిత గారి స్టేట్మెంట్ ఎలా అర్ధం చేసుకోవాలో కుసింత వివరిద్దురూ. అయినా కామెడీ కాకపోతే ఆకలేసే దాకా ఆమరణనిరాహార దీక్ష చేసే దానికి పిచ్చి జనం, మీడియా ఇంత హడావుడి చేయడం ఎందుకండీ? :)  

Friday, September 16, 2011

సంగీత సరస్వతి పుట్టిన రోజు - మీకో కానుక



"ఎమ్మెస్" - ఈ పేరు చాలు. అప్రయత్నంగానే మన మనసులో భజగోవిందమో, విష్ణు సహస్రనామ సంకీర్తనో లేక తెల్లవారింది లే స్వామీ అని వేంకటేశ్వరుని మేల్కొలిపే సుప్రభాతమో మారుమ్రోగుతుంది. తస్సదియ్య బ్రహ్మదేవుడు క్షీర సాగర మధనం టైం లో కాస్త అమృతాన్ని ఎవరికీ తెలియకుండా దాచి, ఎమ్మెస్ ను తయారుచేసినప్పుడు  ఆ కాస్తా ఈవిడ గొంతులో పోసి భూమ్మీదకి వదిలాడేమో. మనిషిని చూస్తే పెద్ద బొట్టు, తలనిండా పూలు, ధగ ధగ మెరిసే ముక్కుపుడక, కళ్ళలో ప్రశాంతత, పవిత్రతతో పార్వతీదేవిలా కనిపిస్తుంది. స్వరంలో సరస్వతీదేవి గొంతు వినిపిస్తుంది. పేరు చూస్తే లక్ష్మాయే! అసలు ఈవిడ దేవత కాదు మనిషి అంటే ఎట్టా నమ్మేది? 

మూడ్ బాలేనప్పుడు ఎమ్మెస్ పాట ఒక్క సారి విని చూడండి. అమ్మ ఒళ్లో తలపెట్టుకు పడుకున్నంత హాయిగా ఉంటుంది. అసలు ఆ గొంతులో ఏ పాటైనా అమృతం జల్లులా మారిపోతుందేమో. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మీరా వీళ్ళంతా ఏ లోకానున్నా తమ భక్తి ఎమ్మెస్ గొంతులోంచి జాలువారుతుంటే పరవశంతో పులకించిపోయి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి సంగీత సరస్వతి ఈ భూమ్మీద అవతరించిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆవిడని స్మరిస్తూ మీకోసం ఒక అపురూపమైన కానుక. ఎమ్మెస్ తొలి హిందీ చిత్రం "మీరా" (1947) గ్రామఫోన్ రికార్డ్ లో అన్ని ట్రాక్ లు అందిస్తున్నాను. ఈ పాటలు నెట్లో ఉంచిన వారెవరో గానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 


భారత రత్న పురస్కారం పులకరించిన ఘట్టం 





Wednesday, September 7, 2011

ఝలక్ - జరుక్


తెలుగు సాహిత్యం లో నాకిష్టమైన ప్రక్రియలు చాటు కవిత్వం, పేరడీలూనూ. చాటువులంటే శ్రీనాధుడు గుర్తొచ్చినట్టే పేరడీలంటే జరుక్ శాస్త్రి గా సుప్రసిద్దుడైన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు గుర్తురాక మానరు. చిత్రమేమిటంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో పేరడీ ప్రక్రియకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జరుక్ కేవలం పేరడీకే పరిమితం కాలేదని తనదైన శైలిలో కథలు, వ్యాసాలూ రాసారని చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే మన తెలుగోళ్ళు తెనాలి రామలింగడ్ని కూడా కామెడీ కవిగానే చూస్తారు తప్ప పాండురంగ మహత్యం గురించి కన్వీనియంట్ గా మర్చిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ముద్ర వేసేస్తాం మనం. దాన్ని దాటి బయటకి చూడటానికి ఎందుకో ఇష్టపడం. ఉదాహరణకి బుడుగుని చూపించి ముళ్ళపూడి వారికి హాస్య రచయిత అనే ముద్ర వేసేస్తాం. అదే టైం లో ఆయన "కానుక" గురించి మర్చిపోతాం. విశ్వనాధ గారంటే చిన్న తలగడ సైజులో ఉన్న  వేయిపడగలే గుర్తొస్తుంది కానీ విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు మన ఆలోచనల్లోకే రాదు.  

ఆ మాటకొస్తే మరి జలసూత్రం వారూ తక్కువ తినలేదులెండి . ఒరిజినల్ లోని లోపాలని ఎత్తిపోడవటంలో ఆయనకు ఆయనే సాటి. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఏకిపారేశారు. వెక్కిరింపుల్లో తెనాలి రామలింగడి సాటిగా తన తరం కవులను గౌరవిస్తూనే మొట్టికాయలేశారు. అయితే ఆ మహానుభావులు కూడా ఈ మొట్టికాయలని సద్విమర్శగా తీసుకున్నారులెండి. విద్వత్తు, తుంటరితనం కలబోసిన జరుక్ తన సమకాలీకులలో దాదాపు అందరినీ ఆటపట్టించారు. 

"అసలు శ్రావణ మాస మధ్యమ్మునందు
 కురిసి తీరాలి వర్షాలు కొంచె కొంచెం 
 మేని రాలాలి తుంపరలేని, కానీ
 ఉక్కమత్ర మేమాత్రమూ ఉండరాదు"

అని కృష్ణ శాస్త్రి తన "శ్రావణం" లో అంటే జరుక్ తిన్నగా ఉండకుండా 

"అసలు సిగరెట్లు కాల్చుట భ్యాసమై ఫ
 దేడులవుతోంది ఎన్ని వూదేశినానొ
 నేడు సిగరెట్లు కాల్చను పాడను ఇంక
 కరువు రోజులు అరువులివ్వరులె మనకు"  అని సరదాగా వెక్కిరించారు.

పోనీ తన స్నేహితుడు శ్రీశ్రీనయినా వదిలారా అంటే అదీ లేదు. 

"నేను సైతం కిళ్ళీకొట్లో
పాతబాకీలెగురగొట్టాను 
నేను సైతం జనాభాలో 
సంఖ్యనొక్కటి వృద్ధి చేశాను" అంటూ పేరడీ అస్త్రం సంధించారు. ఇది దేనికి పేరడీయో ప్రత్యేకంగా చెప్పాలా? :))

ఒక్కరా ఇద్దరా ఆనాటి ఉద్దండులందర్నీ దాదాపు ఆడేసుకున్నారు. ఇక కవిరాజు విశ్వనాధ వారి విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. కఠినంగా ఉండే పదాలు, సమాసాలతో పద్యాలను ఎత్తుకునే విశ్వనాధ వారి శైలిని ఆటపట్టిస్తూ కాస్త విసుగ్గా

"కించిత్తిక్త  కాషాయ షాడబ రసక్షేఫాతిరేకాతివా 
క్సంచార ప్రచయావకాశాములలో కవ్యుద్ఘః గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా
పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాక ప్రభూ" అన్నారు. అర్ధమయిందా :))

అయితే ఇంత అల్లరి చేసినా విశ్వనాధ వారి పట్ల కుసింత భయభక్తులతోనే మసలుకునేవారు. విశ్వనాధ గారి గురించి జరుక్ రాసిన వ్యాసం చూస్తే ఆయన పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది. ఆ వ్యాసం ఇక్కడ చూడచ్చు. ఇంత అపురూపమైన వ్యాసాన్ని అంతే అపురూపం గా మనకందించిన వంశీమోహన్ గారికి బోలెడన్ని థాంకులు. 


కేవలం ఇలా కవిత్వానికి, పద్యాలకే తన అల్లరిని పరిమితం చేయలేదు జరుక్ గారు. " అసలు సత్యాశ్రయ కందశిలా శాసనం" లో చరిత్ర పరిశోధకుల మీద తనదైన శైలిలో చురకలేశారు. విశ్వనాధ వారి నర్తన శాలని పేరడీ చేసి "కీచక వధ" నాటికగా వదిలారు. ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచికలో జరుక్ శాస్త్రి గారు రాసిన "వైదీకుల పరిభాషలు" అనే వ్యాసం చూసి తీరాల్సిందే. ఉద్యోగ కారణాల వలన చాలా వరకు మారు పేర్లతో రాయడం వల్ల ఈయన రచనలు అంతగా దొరకట్లేదు. జరుక్ శాస్త్రి రాసిన కధలను నవోదయ వారు "శరత్ పూర్ణిమ" పేరుతో ప్రచురించారు. 

జరుక్ గారి గొంతు వింటారా? అయితే ఇదిగో వినండి మరి 

("కొన్ని అపురూపమైన గొంతుకలు"  పేరుతో ఈమాట లో పరుచూరి శ్రీనివాస్ గారు అందించిన స్వరాల మాలలో ఉన్న జరుక్ గారి గొంతు మీకోసం. ఇంత అరుదైన స్వరం మనకు అందించినందుకు శ్రీనివాస్ గారికి మరోసారి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు.)

ఇక అబ్బూరి వారు, ఆరుద్ర, శ్రీశ్రీ లతో జరుక్ స్నేహం సుప్రసిద్ధం. వీళ్ళు జరుక్ శాస్త్రి పై ఏకంగా రుక్కుటేశ్వర శతకం కూడా రాశారు :) (వందా కాదు లెండి). రుక్కాయి, జరూ అని ముద్దుగా పిల్చుకుంటూ అబ్బూరి వారు మొదలెట్టిన ఈ శతకాన్ని శ్రీ శ్రీ, ఆరుద్ర కలిసి రాశారు. ముందు అబ్బూరి వారు ఏమన్నారో చూద్దాం.

"ద్విగుణీకృత కర్తరికా 
సిగరెట్ పొగరీకృతుండు, జిహ్వాగ్ర నటత్ 
భుగ భుగ భుగాయితోజ్జ్వల 
రిగసా సగరీ గరీసరిగ సారుండున్ " అంటూ అబ్బూరి వరదరాజేశ్వర రావు గారు మొదలెడితే ఇక శ్రీ శ్రీ , ఆరుద్ర కలిసి 

"అవధరింపుము ఋగ్దేవా!
వచియించే "వరద" లోగడ
రచియింతునని రుక్కుటేశ్వర శతకమును మే
మచలిత ధైర్యమ్మున నా
మా చౌర్యమొనరించినాము మన్నించు జరూ!"  అంటూ మొదలెట్టి కొనసాగించారు. ఇందులో మచ్చుకి ఒక రెండు పద్యాలు మీకోసం

"గోల్డ్ వ్యామోహం చెడ్డది
 మైల్డ్ వ్యాయామం శరీరమాద్యం ఖలుడా,
చైల్డ్ వ్యాపారం కూడదు
ఓల్డ్ వ్యూలను హోల్డు చేయకుండుముర, జరూ !"

"దోచేసే వాళ్ళను ఏ
దో చేస్తుందని శివాశతో చూస్తుంటే
దోచేస్తోంది కదా కం
చే చేనుమేసినట్టు లీ ప్రభుత జరూ!" 




కొసమెరుపు: ఏ కవీ ఖూనీ చేయడానికి కూడా సాహసించని "సరస్వతీ నమస్తుభ్యం" ను జరుక్ ఏం చేశారో చూడండి. ఇదీ జరుక్ మార్క్ ఝలక్ అంటే! :)))

"ఛోటాహజ్రీ నమస్తుభ్యం
  వరదే కామరూపిణీ 
  కాఫీ పానం కరిష్యామి
  సిద్ధిర్భవతుమేసదా"

ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకి మనందరి తరపునా నివాళులు అర్పిస్తున్నాను. 

జరుక్  శాస్త్రి  గారు  రాసిన కీచక వధ నాటిక నా "జాటర్ ఢమాల్" బ్లాగులో పోస్ట్ చేశా. అక్కడా "రుక్కాయి" రచనపై ఓ లుక్కేసిపొండి. :))


అలాగే ఒక రెండేళ్ళ క్రితం జరుక్ స్ఫూర్తితో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేను చేసిన ఈ చిన్ని ప్రయోగాన్ని ఓ సారి చూడండి "మహా కవుల తెలంగానం"