Friday, March 25, 2011

కాకినాడ కబుర్లు - పార్ట్ 2 - "సినిమా హాల్ స్ట్రీట్"



కాకినాడ కబుర్లు మొదటి పార్ట్ లో కాకినాడ కాజా రుచి చూసారుగా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంకో స్పెషల్ గురించి చెప్తాను. రెడీయా?  స్పెషలంటే అలాంటి ఇలాంటి స్పెషల్ కాదు మరి. సినిమా స్పెషల్. తెలుగోడికి, సినిమాలకి ఉన్న సంబంధం మీకు తెలిసిందే కదా, మా ఊళ్ళో ఇంకో అడుగు ముందుకేసి ఒక వీధి మొత్తం వరుసగా సినిమా హాళ్ళు ఉంటాయన్నమాట. దాని సినిమా హాల్ స్ట్రీట్ అంటారు. అలా అని కేవలం ఆ వీధి లోనే సినిమా హాల్స్ ఉంటాయనుకున్నారు, మెయిన్ రోడ్ మీదా, మిగిలిన ఏరియాలలో కూడా కొన్ని  సినిమా హాల్స్ ఉన్నాయి లెండి. వాటి గురించీ ఇప్పుడే చెప్పెసుకుందాం. ఇంక సినిమా హాల్ స్ట్రీట్ విషయానికొస్తే పండగ రోజుల్లో, శలవుల్లో ఇంటికి ఎవరైనా వస్తే జగన్నాధ పురం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్న సినిమా హాల్స్ లో ఏదో ఒక దాంట్లో టికెట్ దొరక్కపోదు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మిమ్మల్ని మా ఊరికి మాత్రమే ప్రత్యేకమయిన సినిమా హాల్ స్ట్రీట్ టూర్ చేయించనున్నానన్నమాట. రెడీయా?

ముందు జగన్నాధపురం వంతెన దగ్గర నుంచి బయల్దేరదాం. వంతెన దాటేసారుగా ఆ ఇప్పుడు కుడి చేతి వైపు తిరగండి. పదండి ఆ రోడ్లోకి. పోలీస్ స్టేషన్, bsnl ఆఫీసు దాటేసి ఎడం చేతి వైపు కనిపించే రోడ్డు మొదట్లో ఆగండి. రోడ్డు కనిపించిందా? అద్గదీ అదే మా ఊరి సినిమా హాల్ స్ట్రీట్ అన్నమాట. ఇంకేంటి చూస్తున్నారు పదండి.
Add caption

అదిగో మొట్టమొదటిగా కుడిచేతి వైపు కనిపిస్తోందే, అదే స్వప్న థియేటర్. పెద్ద గేటు దాటుకు ముందుకి వెళ్తే లోపల గుబురుగా ఉన్న వెదురు పొద దాని చుట్టూ సిమెంట్ బెంచీలు, అక్కడ కూర్చుని బుకింగ్ కౌంటర్ ఎప్పుడు తెరుస్తారా అని చూసే జనాలు కనిపించారా? ఆల్రైట్..కుసింత ముందుకెళ్ళి ఎడం చేతి వైపు చూడండి అక్కడో థియేటర్ ఉంది. ఎక్కడుందీ అని వెతుకుతున్నారా? లోపలెక్కడో ఉంటుంది. బయట నుంచి కనబడే థియేటర్ టైపు కాదిది. బయట అందరికీ సినిమా కెల్తున్నామోచ్ అని చాటుకుని వెళ్ళే థియేటర్ కూడా కాదులెండి. ఆ థియేటర్ పేరు ప్యాలెస్. కేవలం పెద్దలకు మాత్రమే థియేటర్ అది. 

చాల్చాలు. పదండి. అదిగో ఆ కుడిపక్క ఇంకో థియేటర్ ఉంది కదా అదే లక్ష్మి థియేటర్. చూసారా. పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆగండి ఆ కుడిచేతి వైపు పొడుగాటి వీధిలా ఉన్న థియేటర్ కనబడిందా? అది మా కాకినాడ వాళ్ళు గర్వం గా చెప్పుకునే థియేటర్లలో ఒకటైన సత్యగౌరి. మొదట్లో మా చిన్నప్పుడు ఇక్కడ కేవలం ఇంగ్లిష్ సినిమాలే ఆడేవి. రాంబో, ఆర్మార్ ఆఫ్ ది గాడ్ లాంటి సినిమాలు ఇక్కడే చూసాం. తరవాత తెలుగు సినిమాలు కూడా మొదలెట్టాడు. అప్పుడు ఖుషీ, మాస్టర్ లాంటివి చూసామన్నమాట. అన్నట్టు ఇక్కడ బ్లాక్ టికెట్ల గొడవుండదు. ఇంక సౌండ్ సిస్టం అంటారా? కేకో కేక. మా ఊరోళ్ళుఅందరూ ముక్త కంఠం తో చెప్పే మాట "సత్య గౌరీ" వాడు మెయిన్టైన్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు అని. అంత బావుంటుంది ఈ థియేటర్. వీడి దగ్గర క్యాంటీన్ లో సేమ్య ఉప్మా, పూరి భలే ఉంటాయిలెండి. ఇంకా చాలా ఉన్నాయి పదండి పదండి.

ఆ సంత చెరువు దగ్గరకి వచ్చేసాం. ఆ నెక్స్ట్ కుడి చేతి వైపు ఒక థియేటర్ కనిపిస్తోంది కదా. ఆ థియేటర్ గురించి మీకు కుసింత చెప్పాల్లెండి. దాని పేరు మెజిస్టిక్ థియేటర్. ఇక్కడ ఒక నాటక సమాజం కూడా ఉండేది.యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని. ఆ నాటక సమాజం నుంచే సినీ పరిశ్రమకు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. అబ్బే పెద్ద పేరున్న వాళ్ళు కాదు లెండి. ఏదో ఎస్వీ రంగారావు, అంజలీదేవి లాంటి వాళ్ళన్నమాట. పదండి ఆ పక్కనే ఇంకో థియేటర్ కనిపిస్తోంది కదా అది కాస్త కొత్త థియేటర్. "మయూరి" అని. ఇంకాస్త ముందుకేల్తే "పద్మనాభ థియేటర్". రండి ఇంకాస్త ముందుకి వెళ్దాం.


















ఆ ఎడం చేతి వైపు ఒక పెద్ద పెట్రోల్ బంక్ కనిపిస్తోందా? దాని ప్లేస్ లో మా చిన్నప్పుడు రెండు థియేటర్ లు ఉండేవి. క్రౌన్, విజయ్ అని. అవి మొదటి తరం థియేటర్ల కోటాలోకి వస్తాయి. అన్నట్టు ఇందాకా చూసిన మెజిస్టిక్ కూడా ఆ బాపతే. ఇంకాస్త ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పెద్ద రోడ్ కనిపిస్తోందా? అది దేవి, శ్రీదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్ అన్నమాట. మొదట్లో ఈ కాంప్లెక్స్ లో దేవి, శ్రీదేవి మాత్రమే ఉండేవి, ఆ తర్వాత రుక్మిణి, పద్మ అని ఇంకో రెండు థియేటర్లు కట్టారు. మొత్తం నాలుగు థియేటర్లు ఓకే కాంప్లెక్స్ లో అన్నమాట. అన్నట్టు బ్లాక్ టికెట్లు ఈ కాంప్లెక్స్ లో దొరికినట్టుగా ఇంకెక్కడా దొరకవు. అంత పేరుంది ఈ థియేటర్లకి. పదండి పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి కాళ్ళు నొప్పెడుతున్నాయా? ఆ ముందు ఉడిపి వీనస్ భవన్ లో ఒక టీ కొట్టి వెళ్దాం లెండి. 

వచ్చేసాం. ఇదే మున్సిపల్ ఆఫీస్ సెంటర్. అదిగో ఆ కుడిచేతి పక్కన కనిపిస్తోంది అదే "కల్పన" థియేటర్. ఇదిగో ఇదే ఉడిపి వీనస్ భవన్. ఏంటి టీ అన్నాను కదా అని గుర్తు చేస్తున్నారా? ఒక్క నిమిషం కొద్దిగా ముందు ఇంకో మూడు థియేటర్లు ఉన్నాయి. దానితో సినిమా హాల్ స్ట్రీట్లో ఉన్న థియేటర్లు అయిపోతాయి. అవి కూడా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ తాగి తరవాత  మెయిన్ రోడ్ లో ఉన్న సినిమా హాల్స్, మా ఊర్లో ఉన్న మిగిలిన థియేటర్ల ని చూసొద్దాం. ఓ..కే నా. పదండి.

అదిగో ఆ కుడి చేతి వైపు కనబడేదే మున్సిపల్ ఆఫీసు. ఆ రోడ్డు కనబడుతోంది చూసారా? తిన్నగా వెళ్తే సాంబమూర్తి నగర్ మీదుగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. ఇంకోసారెప్పుడైనా తీసుకెళ్తాలెండి. అదిగో ఆ ఎడం చేతి వైపు చూడండి అదే "సూర్య కళా మందిర్ అనబడే సరస్వతీ గాన సభ". ఆంధ్రప్రదేశ్ లో సంగీత విద్వాంసులు, నటులు ఇలా కళాకారులందరూ ఈ వేదిక మీద ఒక్కసారైనా ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత పేరుంది దీనికి. దీని గురించి మళ్ళీ ఒక సెపరేటు పోస్ట్ వేసుకుంటా. ఆ పక్కనే వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారిపోయింది అనుకోండి. దాని పక్కనే పెద్ద బిల్డింగ్ కనిపిస్తోందా? అవే చాణక్య, చంద్ర గుప్త థియేటర్లు. అదండీ సినిమా హాల్ స్ట్రీట్. ఇక్కడితో ఈ వీధిలో సినిమా హాళ్ళు అయిపోయాయి. మరి రోడ్డింకా ఉంది కదా అంటారా? తిన్నగా వెళ్తే ఆనందభారతి, కొత్తపేట మార్కెట్ దగ్గర రైల్వే గేటు, RTC కాంప్లేక్స్ వస్తాయన్నమాట. అవి దాటి కొంచం ముందుకి వెళ్లి ఎడం చేతి వైపు తిరిగితే భానుగుడి సెంటర్లో కలుస్తారు. ముందు ఉడిపి వీనస్ భవన్ లో టీ తాగి అక్కడికి వెళ్దాం.


















ఆ... టీ తాగడం అయిపోయిందా? పదండి పదండి. ఇందాక చెప్పిన రూట్లో భానుగుడి సెంటర్ కి వెళ్ళిపోదాం. 

హమ్మయ్య, ఇదే భానుగుడి సెంటర్. ఈ కుడి చేతి వైపు చూసారుగా. ఇదే పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్ల కాంప్లెక్స్. బాబూ ఆ కిందున్న "యతి" కేసి చూడకండి. అక్కడి కెళ్తే ఓ పట్టాన బయటకి రారు. పోన్లెండి ఎవరికయినా ఆకలేస్తే వెళ్లి ఓ పిజ్జాయో ఏదో తినేసి తొందరగా వచ్చేయండి. ఇందాక టీ తాగని వాళ్లెవరైనా ఉంటే ఆ ఎదురుగా సిగ్నల్స్ దగ్గర కనిపిస్తోందే అదే "చార్మినార్ టీ సెంటర్" అక్కడికెళ్ళి టీ తాగేసి వచ్చేయండి. అన్నట్టు వాడి దగ్గర స్పెషల్ బాదం టీ ఉంటుంది ట్రై చేయండి. ఆ సెంటర్ మొత్తం చూసేయకండి. అక్కడికి మళ్ళీ ఇంకో పోస్ట్ లో తీసుకెళ్తా. తొందరగా రావాలండీ. జిడ్డు చేయకూడదు.
పద్మప్రియ కాంప్లెక్స్ 

















రెడీయా? అందరూ వచ్చేశారా? పదండి ఇక్కడనుంచీ మనం టూ టౌన్ వంతెన మీదుగా మెయిన్ రోడ్ కి వెళ్తాం అన్నమాట. 

అదిగో ఆ ఎడం చేతి వైపు కనిపిస్తోంది కదా అదే ఆనంద్ కాంప్లెక్స్. కాకినాడలో ముప్పాతిక మంది కాలేజి స్టూడెంట్స్ ఆస్థాన థియేటర్ కాంప్లెక్స్ ఇది. లోపల ఆనంద్, అంజని, గీత్, సంగీత్ అని నాల్గు థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలూ బోండా సైజు పకోడీ,  ఐస్ క్రీం తింటే నాసామి రంగా. ఆ టేస్టే వేరు. ఇక్కడనుంచీ అదిగో ఆ ఓవర్ బ్రిడ్జి కనబడుతోంది కదా దాని మీదుగా వెళ్తే టూ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం. పదండి.

ఆనంద్ కాంప్లెక్స్ (బయట నుంచి)

















ఆనంద్ కాంప్లెక్స్ (ఆనంద్ థియేటర్ ఎంట్రన్సు)















గీత సంగీత్ థియేటర్లు   






















మెయిన్ రోడ్ కి వచ్చేసాం. అదిగో అది విజయలక్ష్మి హాస్పిటల్. కొంచం ముందుకి వెళ్తే ఆ ఎడం చేతి వైపు కనిపించేదే టౌన్ హాల్ దాన్ని దాటేస్తే నెక్స్ట్ సెంటర్లో హెడ్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ ఓ సారి ఆగి అల్లదిగో ఆ కుడిచేతి వైపు చూడండి అది తిరుమల థియేటర్. ఈ పోస్ట్ ఆఫీస్ పక్క వీధిలో వెళ్ళిపోతే మళ్ళీ దేవి శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి పోతారన్నమాట. అవండీ మెయిన్ థియేటర్లు. 

ఇవి కాక జగన్నాధపురం లో చంద్రిక, తూరంగి సూర్య మహల్ (ఇప్పుడు రాఘవేంద్ర అని పేరు మార్చినట్టు ఉన్నారు), విద్యుత్ నగర్ కమల్ - వీర్ (ఇవి రెండు థియేటర్లు), వాకలపూడి సూర్య మహల్ ఇవీ ఉన్నాయి. 

కమల్ వీర్  థియేటర్ 



















అదండీ. మొత్తం మీద మా కాకినాడలో సినిమా హాల్స్ అన్నీ చూసేసారు కదా. నెక్స్ట్ టైం మా ఊరొస్తే  ఏ సినిమా హాల్ ఎక్కడుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఎవరినీ అడగక్కర్లేకుండా వెళ్లి పోవచ్చన్నమాట. 

(NEXT : భానుగుడి సెంటర్)