Saturday, June 5, 2010

ఇరవై ఏళ్ల తరువాత దొరికిన నేను వెతుకుతున్న నవల

కొన్ని పుస్తకాలు చదువుతూండగానే ఎప్పుడయిపోతుందా అనిపిస్తాయి. ఇంకొన్ని చదివినప్పుడు బావుంటాయి కానీ తరవాత గుర్తుండి చావవు. కొన్ని మాత్రం చదివి సంవత్సరాలు గడుస్తున్నా వాటి తాలూకా హ్యంగోవర్ నుంచి బయటపడలేము. గుర్తొచ్చినప్పుడల్లా మనసుని తడుముతూనే ఉంటాయి. ఈ భారమైన ఉపోద్ఘాతం అంతా దేనికంటే సుమారు ఇన్నేళ్ళు గడిచినా నా మనసులోంచి మాసిపోని, ఇరవై ఏళ్ళక్రితం నేను చదివిన ఒక నవల గురించి మీతో పంచుకోవాలని నా ప్రయత్నం. ఖంగారు పడకండి నేనేమి సమీక్షలు రాయబోవటం లేదు. ఒక మంచి నవల (పోనీ నేను అలా అనుకుంటున్నా. సరేనా..) గురించి మీతో పంచుకుంటే నాకు అదో తుత్తి!

అప్పుడు నాకు ఒక పది పన్నెండేళ్ళు ఉంటాయేమో. అప్పట్లో ఆంధ్ర భూమి లో వచ్చే సీరియల్స్ పేజీలు  చింపి వాటిని బైండింగ్ చేయించే అలవాటు మా అమ్మగారికి ఉండేది. ఇంట్లో ఉన్న పుస్తకాల నుంచీ ఇడ్లీ పోట్లానికి కట్టిన పేపర్ దాకా చదివేసే భయంకరమైన వ్యసనం నాకు ఉండేది (ఉండేది ఏంటి నా బొంద ఇప్పటికీ ఉండేడ్చింది...అలా అని క్లాసు పుస్తకాలు కూడా అలానే చదువుతాననుకుంటున్నారేమో...వాటికి మినహాయింపు). అలా నా కంటపడిందీ నవల. "సిగ్గు సిగ్గు" -  పేరు చూసి ఇదేదో ప్యూర్ పెద్దలకు మాత్రమే పుస్తకమని, అది చదవడం ఇంట్లో వాళ్ళు చూస్తే వీపు విమానం మోత మ్రోగడం ఖాయమని నాకు నేనే డిసైడ్ అయిపోయి దాన్ని క్షమించి వదిలేసా. ఆ తరువాత కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళు లేని ఒక శుభ ముహూర్తం లో చదవడానికి ఏది దొరక్క తాత్కాలికంగా నన్ను నేనే పెద్దల్లో కలిపేసుకుని (తప్పర్ధం వస్తుందేమో..."పెద్దవాడిగా నిర్ణయించేసుకుని" అని చదువుకోండి) దాని అంతు చూద్దామని డిసైడ్ అయిపోయా. 

ఏకబిగిన పుస్తకం చదివేసిన తరువాత కొంత సేపటి వరకు ఆ హ్యంగోవర్ నుంచి బయటపడలేకపోయా (అది కొన్నేళ్ళ వరకు అన్న విషయం తరవాత అర్ధం అయింది). ఆ తరువాత కొన్నేళ్ళకి ఆ పుస్తకాన్ని నా కన్నా ఇష్టంగా ఎలకలు చదివి జీర్ణిన్చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆ పుస్తకం మళ్ళీ ఎక్కడయినా దొరుకుతుందేమో అని వెదుకుతూనే ఉన్నాను. ఇంచుమించు ఇరవై ఏళ్ల తరవాత నా అన్వేషణ ఫలించింది. మొన్నామధ్య  నెట్ లో మల్లెపూలు డాట్ కాం అనే సైట్ లో అనుకోకుండా ఈ పుస్తకాన్ని చూడటం (అప్పటికింకా దాన్ని పెయిడ్ సైట్ చెయ్యకపోవడం వలన...అఫ్ కోర్స్ చేసున్నా నేను ఆ పుస్తకం డౌన్ లోడ్ చేసుకునేవాడిని) దాన్ని నేను డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిపోయాయి. ఆరోజు  చిన్నపుడు తిరనాళ్ళలో తప్పిపోయిన తమ్ముడిని పాతికేళ్ళ తరవాత అనుకోకుండా కలుసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది (నీ దిక్కుమాలిన పోలిక తగలెయ్య అని తిట్టుకోకండి ఇంతకు మించి ఎలా పోల్చాలో నాకు తట్టలేదు). 

ఎన్నార్ నంది రాసిన ఆ సైన్సు ఫిక్షన్ (ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, రిప్ వాన్ వింకిల్ టైపు స్టోరి, భారత దేశం లో స్వాతంత్ర్యానంతర పరిస్థితులు కలిపి రాసినది) నవలని ఇష్టమయితే మీరూ చదవండి. లింకులు ఇస్తున్నాను. పీడీయఫ్ ఫార్మాట్ లో ఉన్న ఈ నవల పాస్ వర్డ్  mallepoolu.com