ఫిబ్రవరి పదహారు, మా పెళ్లిరోజు. ఈ మూడేళ్ళలో నన్ను ప్రతి విషయం లోనూ భరించి (ముఖ్యంగా నా షార్ట్ టెంపర్), నాకు ప్రతి విషయం లోనూ అండదండగా నిలిచి,నాతో నడిచి సహధర్మచారిణి అన్న పదానికి అర్ధంగా నిలిచిన నా భార్య స్వాతికి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు చెప్పుకోవాలనే ఈ టపా.
అమ్మ వంట తప్ప మరేదీ నచ్చని నాకు, ప్రతీదీ అమ్మ బ్రతికున్నట్లయితే ఇలా చేసేది, అలా చేసేది అనుకునే నాకు పెళ్ళయిన దగ్గరనుంచీ నాకు ఎలా చేస్తే నచ్చుతుందో, ఏమేమి ఇష్టమో కనుక్కొని, నేర్చుకుని మరీ అమ్మలా వండి పెట్టిన, పెడుతున్నందుకు థాంక్యూ స్వాతి.
బంధుత్వాల పట్ల ప్రేమలూ, ఆత్మీయతలూ ఉన్నా వాటిని వ్యక్తపరిచడం తెలియని నాకు పెళ్ళయిన దగ్గరనుండీ మా అమ్మతరపు, నాన్నగారి తరపు బంధువులందరితో చక్కగా అనుబంధాలు మెయిన్ టైన్ చేస్తున్నందుకు థాంక్యూ స్వాతి.
పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఉద్యోగరీత్యా తను త్రివేండ్రం లో (అప్పట్లో తను ఇస్రో లో చేసేది లెండి) నేను హైదరాబాద్ లో ఉంటున్నా (పెళ్లి పుస్తకం గుర్తొస్తోందా? రమణగారూ ఇదే అన్నారు..ఆ విషయాలు బాపు-రమణ పక్కన్నేనూ మా ఆవిడ - మూడో భాగం లో చెప్తాలెండి) , ఇప్పుడు తను తిరుపతి ( టి.టి.డి) లోను నేను అదే హైదరాబాద్ లోనూ ఉంటూ అదేదో సినిమాలోలా "మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు" అని చంద్రుని చూస్తూ పాడుకుంటున్నా ప్రతిక్షణం తను నా వెన్నంటే ఉంది అనిపించేలా చేస్తున్నందుకు థాంక్యూ స్వాతి.
ఏం చెప్పినా సరే అంటుంది, మంచి ఫ్రెండులా సలహాలిస్తుంది, నా ఇష్టాలు, అభిరుచులు పంచుకుంటుంది... ఒక్కటేంటి ప్రతి విషయం లో నాకు తోడుగా ఉంటున్న తనకి ఏం చెప్పగలను "థాంక్యూ స్వాతి" అని తప్ప.