మహారాజశ్రీ మూర్ఖ రాజకీయవాదులకు,
మొన్న బందు....నిన్న బందు.....నేడు బందు.....రేపు బందు...
అనుకున్నది జరగకపోతే బందు... అనుకున్నట్టు జరగకపోయినా బందు
అసలేమనుకుంటున్నారు మీరు? ప్రతి చిన్న విషయానికి...చీటికి మాటికీ అదేదో దేశరక్షణకు పిలుపు నిచ్చినట్టు బందుకు పిలుపునిస్తున్నాం అంటారు? ఎవరి గురించి చేస్తున్నారు ఈ బందులు? పోనీ ఈ బందుల వలన సామాన్య ప్రజలకు ఒరిగేదేమయినా ఉందా అంటే అదీ లేదు. పొట్ట కూటికోసం వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, చదువు సాగుతుందో లేదో తెలియక ఆందోళనలో విద్యార్ధులు...గృహిణులు, చిన్నారులు, వృద్ధులు ఒక్కరేంటి ప్రతివారూ ఈ బందుల వలన ఇబ్బందులు పడేవాళ్ళే. మరి ఎవర్ని ఉద్ధరించడానికి ఈ బందులు?
బందు అనేది స్వచ్చందంగా జరగాలి తప్ప ఈ నిర్భంద బందుల వలన ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో మీలో ఎవరికయినా పట్టిందా? మొన్నామధ్య ఎక్కడో చదివాను బెంగాల్లో ఈ బందులు సర్వ సాధారణమట. సంవత్సరానికి కనీసం ఒక నలభయి, యాభయి రోజులు ఏదో కారణంతో బందులు తప్పనిసరట. అక్కడ కొన్ని గంటల నుంచి రెండు రోజుల వరకు బందు జరిగిన సందర్భాలున్నాయట. ఈ లెక్కన మీరు వాళ్ళనీ మించిపోయారు.ఏకంగా డెబ్భై రెండు గంటల బందుకు బిజెపి రెడీ అయిపోయింది (అదృష్ట వశాత్తూ అది ఆచరణ లోకి రాలేదు). ఇక తెరాస నాయకుడు ఒకరు వీరావేశంగా నిరవధిక బందు చేస్తామని హెచ్చరించారు. నిరవధిక అంటే ఎప్పటిదాకా చేస్తారు? జనాల ఓపిక నశించి మీ రాజకీయ భవిష్యత్తు ను సమూలంగా బందు చేసేదాకానా? అలా చేయండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది.
మహానుభావా మీకు అంత బందు చేయాలని ఉబలాటంగా ఉంటే చెత్త రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతి, బంధు ప్రీతి లాంటివి బందు చేస్తామని పిలుపునివ్వండి....ఏళ్ల తరబడి స్వచ్చందంగా పాల్గోడానికయినా మేమంతా సిద్ధం.
ఇకనుండయినా ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా మీకు నచ్చినప్పుడల్లా బందు ప్రకటిస్తే మీలాంటి మూర్ఖ రాజకీయవాదుల ఆటలను నిస్సంకోచంగా బందు చేయడానికి వెనుకాడమని సవినయంగా హెచ్చరిస్తున్నాము. మీ తలతిక్క బందుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ పాట విని తెలుసుకోండి. ఇకనయినా బుద్ధి తెచ్చుకోండి.
ఇట్లు
మీ చేష్టలకు తిక్కరేగిన సామాన్య ఓటరు
(నా అభిప్రాయాలతో ఏకీభవించేవారు ఓ కామెంట్ తో నన్ను సపోర్ట్ చేయండి)