Tuesday, January 11, 2011

గుత్తావకాయ కూర



"ఇల్లు నీట్ గా ఉంచండి. తమ్ముడు-నువ్వు కొట్టుకోకండి, టైం కి భోజనం చేయండి, కుక్కర్ మూడు విజిల్స్ వస్తే కట్టేయి..టీవీ చూస్తూనో..ఏదో పుస్తకం చదువుతూనో పరధ్యానం తో మర్చిపోకు, రోజు రాత్రి గ్యాస్ కట్టేసి ఉందో లేదో చూసి మరీ పడుకో,  డబ్బులు నాన్నగారు ఫ్రిజ్ కింద కవర్ లో పెట్టారు..అన్ని కూరలూ ఒకే సారి తేవద్దు, రెండ్రోజుల కొకసారి తెచ్చుకోండి, తెచ్చిన వెంటనే  ఫ్రిజ్ లో పెట్టు, సంచీలో వదిలేస్తే పాడయిపోతాయి" ఇలా మా అమ్మ చెప్తూ పోతోంది. అప్పటికి నేను సెవెంత్ క్లాస్, అంత పెద్దాడిని అయిపోయాక కూడా ఊరెళ్ళే ముందు ఇన్ని జాగ్రత్తలు చెప్తూంటే విసుగొచ్చేసింది. ఫస్ట్ టైం మా పేరెంట్స్ వారం రోజులు మమ్మల్ని వదిలేసి ఊరు వెళ్తున్నారు మరి, ఈ వారం మా ఇంటి సామ్రాజ్యం నా ఆధీనం లో ఉండబోతోంది. నా మహామంత్రి (అదే నా తమ్ముడు) చచ్చినట్టు నా మాట విని తీరాల్సిందే, నేను ఏం వండితే అది వంకలు పెట్టకుండా నోర్మూసుకు తినాల్సిందే. 

"అబ్బ చాలమ్మా ఇప్పటికే లక్ష సార్లు చెప్పావు. నేను చూసుకుంటా కదా. అన్నీ నాకే చెప్తావేం,వాడికి కూడా చెప్పు (మా తమ్ముడికి) నేను చెప్పినట్టు వినమని" విసుక్కున్నాను. ఇంతలో మా నాన్నగారు రిక్షా తీసుకు రావడం తో మా అమ్మ క్లాస్ ముగించక తప్పలేదు. మా నాన్నగారు పిలిచి ఫ్రిజ్ కింద కవర్లో ఉంచిన డబ్బుల గురించి ఇంకోసారి చెప్పి ఎందుకైనా మంచిది ఈ చిల్లర కూడా ఉంచు అంటూ రెండు పది నోట్లు నా చేతికిచ్చారు. (దాన్ని ఇల్లు మెయింటెయిన్ చేయబోతున్నందుకు నా ఫీజుగా మనసులోనే జమేసేసాలెండి). వాళ్ళ రిక్షా అలా బయల్దేరడమేంటి పక్కనే నిలబడ్డ మా తమ్ముడి కేసి గర్వంగా "ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నేను చెప్పినట్టు వినాల్సిందే తెలిసిందా"  అన్నట్టు చూశా. 

పొద్దున్న వెళ్ళేటప్పుడు మా అమ్మ వంట చేసేసి వెళ్ళడం వలన ఆ పూటకి వంట చేయాల్సిన అవసరం రాలేదు. అప్పట్లో నాకు కుక్కర్ పెట్టడం వచ్చు, బంగాళాదుంప , అరటికాయ వేపుళ్ళు మార్చి మార్చి ఎన్నేళ్ళయినా చేసేయగలనులెండి. రాత్రి వంట చేయడం మొదలుపెడుతూ ప్రజాభిప్రాయం అడిగే మహారాజులా మా తమ్ముడ్ని అరటికాయ చేయమంటావా? బంగాళా దుంప చేయమంటావా? (పెద్ద చాయిస్ మరి) అనడిగా. వాడి సమాధానంతో ఆలూ ఫ్రై కానిచ్చేసా. ఆ మర్నాడు పొద్దున్న ఆటోమేటిక్ గా అరటికాయ, రాత్రి బంగాళాదుంప ఇలా ఆల్టర్నేటివ్ గా ఒక మూడురోజులయ్యాయి. 

నాల్గో రోజు పొద్దున్న యాజిటీజ్గా అరటికాయలు కోద్దామని రెడీ అవుతూంటే అప్పటికే అవంటే విసుగెత్తిన మా తమ్ముడు "ఛీ..మళ్ళీ అరటికాయేనా" అనడంతో జాలేసి "పోన్లేరా ఆలూ చేస్తా" అని పెద్ద వరం ఇచ్చినవాడిలా చెప్పా. "అదీ వద్దు...మూడ్రోజుల నించి అవే మార్చి మార్చి చేస్తున్నావ్, నాకు ఇంకో కూరేదైనా చేయి" అంటూ నా గుండెల్లో రాయి పడేశాడు. నాకా ఆ రెండూ తప్ప ఇంకోటి రాదు. వీడు చూస్తే ఎట్టి పరిస్థితులలోనూ అవి తినేలా కనిపించడం లేదు. ఇక తప్పక సంచి తీసుకుని, సైకిల్ వేసుకుని మార్కెట్ కి వెళ్ళా. ఏం కొనాలి? కళ్ళు మూసుకుని అమ్మ చేసే వంటలన్నిటినీ రీలు తిప్పా. ఫ్రేం గుత్తొంకాయ కూర ముందు ఆగింది. వంకాయ పూర్తిగా నాలుగు ముక్కలుగా తెగిపోకుండా జాగ్రత్తగా కోయడం గుర్తొచ్చింది. పక్కనే ఉండి చూడటం వలన ఎలా కోయాలో తెలుసు కాబట్టి అదే చేద్దామని ఫిక్సయిపోయా. ఒక పావు కేజీ వంకాయలు కొనుక్కుని ఇంటికి వచ్చి స్టైల్ గా మా తమ్ముడితో "వెధవ ఏడుపూ నువ్వూను, చూడు నీ కోసం ఈ వేళ గుత్తొంకాయ కూర చేస్తా" అనగానే వాడు నాకేసి బాలకృష్ణ సినిమా వందో రోజు పోస్టర్ కేసి చూసినట్టు ఆశ్చ్యర్యం గా చూసి "గుత్తొంకాయ కూరా?" అని వాడి సంభ్రమాశ్చర్యానందాల్ని ప్రకటించేసాడు. అంతలోనే "నీకు చేయడం రాదు కదా" అనడంతో నా ఇగో దెబ్బతింది. "ఎవరు చెప్పారు నాకు రాదనీ, అమ్మ చేసేటప్పుడు బోల్డన్ని సార్లు దగ్గరుండి చూసా, గుత్తొంకాయ కూర చేయడం కూడా ఒక పనేనా" అని నల్లేరు మీద బండి నడక అన్న రేలంగి స్టైల్ లో ఓ డైలాగ్ విసిరేశా. ఇంతలో వాడి అంతరాత్మ లోపల్నించే ఓ మొట్టికాయ వేసి "వాడు ఎవర్రా? "అన్నయ్య", ఈ ప్రపంచంలో అన్నయ్యలకు తెలియని, వాళ్ళు చేయలేని పనులు ఉండవు, ఉండడానికి వీల్లేదంతే" అని చెప్పినట్టుంది, వాడు ఎప్పుడూ లేనిది "నేనేమయినా హెల్ప్ చేయనా?" అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు తమ్ముడి పట్ల నా బాధ్యత, వాడి మీద నాకున్న ప్రేమ విపరీతంగా పొంగిపోయి ఈ రోజు వీడికేలాగయినా అమ్మ కూడా చేయలేనంత బాగా గుత్తొంకాయ కూర చేసి పెట్టాల్సిందే అని డిసైడ్ అయిపోయా. "అక్కర్లేదు, నువ్వు అలా కూర్చొని హోమ్ వర్క్ కంప్లీట్  చేసుకుంటూ ఉండు, కుక్కర్ మూడో విజిల్ వేసే లోపలా కూర చేసేస్తా" అన్నా అదేదో సినిమాలో చిరంజీవి ఫైటింగ్ లో విలన్లని సవాల్ చేయడం గుర్తొచ్చి. 

అంతా రెడీ. వంకాయలు కోయడం మొదలు పెట్టా. ఎగ్జాక్ట్ గా అమ్మ ఎలా కోసేదో మైండ్ లో రివైండ్ చేసుకుని చూసుకుంటూ అలా కోసేయడంతో మా తమ్ముడికి నా మీద నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది. మెంటల్ గా గుత్తొంకాయ కూర తినడానికి ప్రిపేర్ అయిపోయిన ఆనందం వాడి కళ్ళలో  కనిపించింది. "ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేయాలి" అన్నా. వాడి కళ్ళలో "వావ్" ఫీలింగ్. ఇంతలో నాకో చిన్న ధర్మ సందేహం వచ్చింది, "అవునూ.. అమ్మ ఇందులో ఏదో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ దట్టిస్తుంది కదా? అదేమయ్యుంటుంది? ఛ..ఛ..ఎప్పుడూ అమ్మ గుత్తొంకాయ కూర చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించకపోవడం వలన ఎంత పొరపాటు జరిగిపోయింది." అని పద్మవ్యూహం లోంచి బయటకి రావడం వినని అభిమన్యుడిలా తెగ ఫీలయిపోయాను. సరే వాడికేమయినా తెలుసేమో అని మా తమ్ముడిని అడిగితే వాడు ఒక్క సారిగా ఉలిక్కిపడి ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తరువాత ఇప్పడు ఎలా నడపాలి అని పైలట్ అడిగితే ఆ పాసింజర్ ఎలా చూస్తాడో అలా భయం భయం గా నాకేసి చూసి "నీకు తెలియదా? మరి పెద్ద తెలిసున్నట్టు మొదలెట్టావు?" అన్నాడు. అప్పటికే వాడి కళ్ళలో కలలు చెదిరిపోతున్న సూచనలు. పోనీ ఫోన్ చేసి అడగడానికి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, రెసిపీ చూడడానికి ఇంటర్నెట్ ఇంకా అప్పటికి రాలేదు మరి. పక్కింటి అత్తయ్యగారిని అడుగుదామంటే మా తమ్ముడి ముందు ఇమేజ్ చెడిపోతుందన్న భయం . నాకు ఉక్రోషం వచ్చేసింది. అందులోంచే ఆటోమేటిక్ గా తెగింపూ వచ్చేసింది. "నోర్మూసుకు కూర్చో, అసలు నువ్విక్కడ ఉండకు, నీ వాళ్ళ నా కాన్సంట్రేషన్ దెబ్బ తింటుంది, వెళ్లి టీవీ చూస్కో, ఈవేళ  నీకు గుత్తొంకాయ కూర చేసి తీరతానంతే" అని శపథం చేశా.  

శపధమైతే చేశా కానీ ఇంతకీ నా సమస్యకి పరిష్కారం మాత్రం దొరకలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక బ్రహ్మాండమయిన, అద్భుతమైన ఆలోచన వచ్చింది. అసలు అంత అద్భుతమయిన ఆలోచన వచ్చినందుకు నా భుజం నేనే తట్టుకుని వెంటనే అమలు చేద్దామని డిసైడయిపోయా. ఆవకాయ జాడీ మూత తీసి రెండు గరిటల ఆవకాయ చిన్న బౌల్ లోకి తీసుకున్నా. ఒక్కొక్క వంకాయలోకి ఆ ఆవకాయ కూర్చి మొత్తం మీద గుత్తొంకాయలు సిద్ధం చేశా. ఆ తరవాత ప్రొసీజర్ మనకి తెలిసిందే కదా. చక చకా వాటిని అప్పటికే విపరీతంగా మరుగుతున్న మూకుడులోని నూనెలో వేసేసి మూతపెట్టి యుద్ధం లో విజయం సాధించిన మహారాజులా హాల్లోకి వచ్చి మా తమ్ముడితో "రెడీగా ఉండు కాసేపట్లో గుత్తొంకాయ కూర తయారయిపోతుంది" అనగానే వాడు "గ్రైండర్ వేయలేదు? ఎలా చేసావ్?" అని వెధవ ప్రశ్నొకటి. అసలు సీక్రెట్ చెప్పకుండా "నోర్ముయ్, చెవిటి వెధవా, అంత సౌండ్ వచ్చింది... నీకు వినిపించాలేదా? అందుకే టీవీ అంత పెద్ద సౌండ్ తో చూడకూడదు" అని కసిరేసి కవర్ చేసేశా. 

కాసేపటికి (అంటే ఒక ఇరవై...ముప్ఫై నిమిషాల తర్వాత) వెళ్లి చూడగానే మూకుట్లో రెడ్, వైలెట్ కలిసి బ్లాక్ గా మారబోతున్న కలర్ లో ఒక పదార్ధం కనిపించింది. వంకాయలని గుర్తుపట్టి కూర రెడీ అయిపోయిందని డిసైడ్ అయిపోయా. అన్నీ రెడీ చేసి మా తమ్ముడిని పిలిచా. వాడు మొదట ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు జడ్జి తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఖైదీలా ఆత్రం గా చూసా. "ఎలా ఉంది?" అన్న నా ప్రశ్నకు ఒకట్రెండు చిత్ర విచిత్రమైన అర్ధం కాని ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి చివరికి "ఏమో... తెలియట్లేదు, తినేయచ్చులే" అన్నాడు.  

ఆ తర్వాత రెండ్రోజులకి ఇంటికి వచ్చిన మా అమ్మతో అన్నయ్య గుత్తొంకాయ కూర కూడా చేయగలడు తెల్సా...అని వాడు చెప్పడంతో అసలు నాకు రానే రాని రెసిపీని ఎలా చేసానో తెలుసుకుందామని నన్ను పిలిచి అడగడం తో అసలు రహస్యం చెప్పక తప్పలేదు. ఆ తర్వాత ఆ విషయాన్ని మా అమ్మ పక్కింటి అత్తయ్యగారికి, వాళ్ళ స్కూల్లో టీచర్లకి చివరాఖరికి ఇంటికి ఏ చుట్టాలోచ్చినా చెప్పడం, వాళ్ళు పడీపడీ నవ్వడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదంటే నచ్చలేదు. తెగ ఖోపం వచ్చేసేది. 

అదండీ నా వీర, భీభత్స గుత్తావకాయ రెసిపీ. మీరూ ఇంట్లో ట్రై చేసి చూడండి. అయితే దీని మీద పూర్తి పేటెంట్ హక్కులు కేవలం నాకు మాత్రమే ఉన్నాయన్నమాట.