Friday, February 12, 2010

బాదామి గుహలలో నటరాజుకు పద్దెనిమిది చేతులు - ఇదిగో చూడండి




అసలు ఈ పోస్ట్ నేను త్వరలో పెట్టబోయే హంపి టూరు విశేషాలలో పెడదామనుకున్నా. సర్లే ఎలాగూ శివరాత్రి కదా మీకు ఈ అద్భుతమైన నటరాజు విగ్రహం చూపిస్తే కుసింత వెరయిటీగా ఉంటుందేమో అనిపించి ఇప్పుడే ఇచ్చేస్తున్నా.

ఇక విషయానికొస్తే హంపి కి దగ్గరలో ఉన్న (మరీ అంత దగ్గరేం కాదు లెండి ఓ నాల్గు గంటలు ఉంటుంది జర్నీ) బాదామి గుహలలో చాళుక్యుల కాలం నాటి గుహాలయాలు ఉన్నాయి. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయాలలో ప్రతి అణువూ ఒక శిల్ప కళా అద్భుతమే. గుహను గదిలా తొలుస్తూ అందులోనే స్తంభాలు (అచ్చు గుద్దినట్టు అన్నీ ఒకే కొలతలు, ఆ శిల్పుల  పర్ఫెక్షన్ కి కనిపిస్తే కాళ్ళ మీద పడిపోదాం అనిపించింది), గుహ పై కప్పును కూడా వదలకుండా ప్రతి అంగుళం ఒక అద్భుతం అనిపించేలా చెక్కారు. మొదటి మూడు అంతస్తులూ హిందూ మత శైలి కనిపించింది నాల్గవ దాని టైం కి ఆ రాజ్యం లో జైన మత ప్రభావం ఉందనుకుంటా అక్కడన్నీ జైన గురువుల శిల్పాలు. ప్రతి చోటా నిజంగా ఆ దేవుళ్ళే ఈ శిల్పాలకి మోడల్స్ గా పనిచేశారా అనిపిస్తుంది (చెప్పొద్దూ.. అదంతా చూసి ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా? అనిపించింది) 

ఇక బాదామి గుహల మొదటి అంతస్తులోనే మనల్ని పలకరించేదే నేను చెప్పిన నటరాజు విగ్రహం. భరత నాట్యం లో ఉండే ఎనభై ఒక్క ముద్రలని కళ్ళ ముందు ఉంచేలా పద్దెనిమిది చేతులతో నటరాజు విగ్రహాన్ని చెక్కారు. ఏ రెండు చేతులని కలిపి చూసినా ఒక ముద్ర వస్తుందన్న మాట. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు (ట). అసలు అలాంటి శిల్పాన్ని చేక్కించాలన్న ఐడియా ఎవరికీ వచ్చిందో గానీ నిజంగా తెగ నచ్చేసింది ఆ శిల్పం. ఇదిగో మీరూ చూడండి.
(మనలో మనమాట దీన్ని బాపు బొమ్మగా గీస్తే చూడాలనిపించింది నాకు.....ఎవరయినా ఆయనకీ విషయం చెప్తే బాగుండును! :))