ఒక నాడు తెలంగాణా భవన్ మేడ మీద మందు కొడుతున్న కచరా (తెలంగాణా రాష్ట్ర సమితిని తె.రా.స. అన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కచరా అని ఎందుకు పిలవకూడదు అనిపించి హిందీలో "కచరా" అంటే "చెత్త" అని తెలిసి కూడా :) ఇలా పిలిచా) వద్దకు ఆయన కుమారుడైన కేటిఆర్ వచ్చి తండ్రీ ఏ వ్రతము చేసినంత పది తరముల వరకు తిన్నా తరగని ఆస్తిపాస్తులు, పదవులు సమకూరునని అడుగగా అంతట కెసిఆర్ కుమారుడి దురాశకు మిక్కిలి సంతసించి మందు గ్లాస్ పక్కన పెట్టి, బిడ్డా తరముల పాటు తిన్నా తరగని ఆస్తిపాస్తులు ఆర్జించుటకు "వేర్పాటు వాద వ్రతము" అను వ్రతము కలదు. ఈ వ్రతమును అత్యంత ఓపికగా పది వత్సరాలు ఆచరించిన పదవులు,సంపదలు వెల్లువలా వచ్చి పడునని చెప్పెను. అంతట ఆ వ్రత విధానమును తెలియజేయమని కేటిఆర్ కోరగా కెసిఆర్ ఇట్లు సెలవిచ్చెను. ముందుగా ఈ వ్రతము ఆచరించుటకు మనము ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ నుండి బయటకు వచ్చుటకు ఒక కారణమును వెతుకవలెను ఆపై మనము ఉన్న ప్రాంతము ప్రత్యేక రాష్ట్రముగా కావలెను అన్న నినాదముతో క్రొత్త పార్టీ పెట్టవలెను. మనము బ్రతుకవలేనన్న ఇతర ప్రాంతముల వారిని వెధవలుగా చూపవలెనన్న సూత్రమును పాటించి మనము ఉన్న ప్రాంతము తప్ప మిగిలిన ప్రాంతముల వారు మనను దోచుకోనుచున్నారని, మనము ప్రత్యేక రాష్ట్రం గా విడిపోతే మనకసలు కష్టాలే ఉండవని అరచేతిలో స్వర్గం చూపుతూ, వీర లెవెల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా విచ్చలవిడి బూతులతో ఇతర ప్రాంతాల వారిని, మన ప్రాంతం లో మన ప్రత్యర్ధులను తిడుతూ ఇదే మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయమని నుడవవలెను. ఈ క్రమంలోనే మన ప్రాంతానికి ఒక తల్లిని పుట్టించవలెను.. ఈ విధంగా చెప్పగా చెప్పగా ప్రజలలో క్రమేపీ ప్రత్యేక రాష్ట్ర వాంఛ పెరుగును. ఒక్క సారి ఆ వాంఛ తీవ్ర స్థాయికి చేరిన పిదప వారికి మనము తప్ప వేరెవరూ దిక్కు లేరని నమ్మిస్తూ ప్రత్యేక రాష్ట్రమొచ్చిన అనంతరం పదవ తరగతి అర్హత తోనే కలెక్టర్లను చేయుదమని, పెట్రోలు లీటరు పది పైసలకే ఇస్తామని, ప్రతి ఇంటికి నెలకు వంద కిలోల బియ్యము ఉచితమని, ఉద్యోగులు చచ్చే వరకు పదవీ విరమణ ఉండదని, ఒక్క రూపాయకే ఏడాదికి సరిపడా పప్పులు, ఉప్పులు, కూరగాయలు సరఫరా చేస్తామని, "పన్ను" అన్న మాట మన రాష్ట్రం లో వినబడకుండా నిషేదిస్తామని ఇలా నోటికొచ్చిన వాగ్దానాలు చేయవలెను. ఎన్నికైన మన పార్టీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు (మనం తప్ప) ప్రతి రెండు నెలలకు ఒకసారి రాజీనామా చేసి ఉప ఎన్నికలను తెచ్చునట్లు చూసుకొనవలెను. సదరు పదవులు మన పార్టీ చేజారకుండా ఉప ఎన్నికలలో మనపై పోటీ చేయదలచిన వారిని మన ప్రాంత ద్రోహులుగా ప్రచారము చేయవలెను, తద్వారా సెంటి మంట రగిల్చి చలి కాచుకోవలెను. మనకు నచ్చినప్పుడు బందులు ప్రకటించవలెను. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి శత్రువులను, మిత్రులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ..మనను ప్రశ్చించిన వారిని ద్రోహులుగా ముద్ర వేస్తూ ఉద్యమమును ఉధృతంగా నడుపవలెను. మన ప్రాంతం లో సినిమా షూటింగ్ నుండి పరిశ్రమ స్థాపన వరకు, గృహప్రవేశం నుండీ బడ్డీకొట్టు ప్రారంభం వరకూ మనకు మామూళ్ళు ఇచ్చిన తరువాతే జరిగే విధంగా చూడమని మన కార్యకర్తలకు చెప్పవలెను. ఇక అసెంబ్లీ లో తోటి సభ్యులను దూషిస్తూ, సందు దొరికితే వారిపై చేయి చేసుకోవలెను, వారిని తెలంగాణా ద్రోహిగా చిత్రించి మన చర్యను సమర్ధించుకోవలెను. ఇక మరొక ముఖ్యమైన విషయమేమన్న పొరపాటున కూడా మనంతట మనం పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనేత్తరాదు. అటుల ఈ ప్రత్యేక వాదమును నిరంతర రావణ కాష్టం వలె రగిలిస్తూ మన పబ్బం గడుపుకోవలెను.ఈ విధంగా కఠోర వేర్పాటు వాద వ్రతము సలుపు క్రమంలో చందాలు, వసూళ్లు, ముడుపులు, టికెట్ల అమ్మకాలు, కేంద్రం నుంచి వచ్చే తాయిలాల రూపంలో వద్దంటే డబ్బు మరియు కోరిన పదవులు వరించగలవు అని తెలియజేసెను. పూర్వము ఆంధ్ర రాష్ట్రములో ఈ వ్రతమును చెన్నారెడ్డి చేసి ముఖ్యమంత్రి పదవిని, ప్రస్తుతం నేను చేయుచూ కోట్లాది ఆస్తి మరియు కేంద్ర పదవులను పొందాము. ఇదే వ్రతమును పంజాబులో ఖలిస్తాన్ పేరిట జరిగి విఫలమయిన చరిత్ర కలదు. వేర్పాటు వాద వ్రతములో పాటించవలసిన ముఖ్య నియమం ఎట్టి పరిస్థితిలోనూ మన వాదన ఫలించి ప్రత్యేక రాష్ట్రం రానీయరాదు. అటుల తెచ్చుకున్న జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ లలో ఏ మేరకు అభివృద్ధి జరిగినదో జనులెల్లరకూ విదితమే. ప్రజలకు వాస్తవం కళ్ళముందుకు వచ్చే ప్రమాదమున్నందున అట్టి పొరపాటు మనం చేయరాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా పేరుతో మనవలే ప్రత్యేక వాదము వినిపించి అధికారము చేజిక్కించుకున్న శిబు సోరెన్ అను వ్యక్తీ ఏ విధముగా అధః పాతాళమునకేగెనో గుర్తించి అత్యంత జాగరూకులై ఉద్యమము విజయవంతము కాకుండా చూడవలెను.
అంతట కేటిఆర్ "తండ్రీ ఒక వేళ మన గ్రహచారం బాలేక ప్రత్యేక వాదం ఫలించి తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అప్పుడేమి చేయవలె?" అని ప్రశ్నించగా చిద్విలాసముతో కెసిఆర్ "కుమారా అపుడు ఒక సంవత్సరం వేచి ఆపై ప్రత్యేక ఉత్తర తెలంగాణా లేదా దక్షిణ తెలంగాణా వాదము అందుకున్న చాలు" అని నుడివెను.
తండ్రి సమాధానమునకు మిక్కిలి సంతుష్టుడైన కేటిఆర్ ఆ విధం గా తండ్రి బాటను నడువసాగెను.
ఫలశ్రుతి: ఈ వ్రత కధను బ్లాగులో చదివిన వారు, కామెంటిన వారికి జీవితమున వేరుపడు బాధలుండవు అని ఈ బ్లాగ్రచయిత శంకర ఉవాచ.