Friday, March 11, 2011

వినాయకుడు మూర్ఛపోయాడు


ఎక్కడనుంచో అదివో అల్లదివో పాట లీలగా వినబడుతుంటే వినాయకుడికి మెలకువ వచ్చింది. ఎవడబ్బా ఈ దుర్వాసనా భరిత కాసార సాగర మధ్యమున వేంకటేశ్వరుని భజిస్తున్నది అంటూ సగం కరిగి, సగం విరిగిన చేతిని సర్దుకుంటూ మెల్లగా తల తిప్పి చూసాడు. నడుం విరిగినా నారాయణ కీర్తన మానని అన్నమయ్య అంతబాధలోనూ కీర్తన ఆలపిస్తున్నాడని గుర్తించి, అంతలోనే అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? కొంపతీసి వినాయక నిమజ్జనం లానే ఈ హైదరాబాదీలు అన్నమయ్య చవితి చేసి అన్నమయ్య విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తున్నారా అని ఖంగారు పడ్డాడు. కానీ ఒకే విగ్రహం ఉండటం తో కాస్త స్తిమిత పడి "ఏం నాయనా అన్నమయ్యా? ఇలా వచ్చావు?" అని ప్రేమగా అడిగాడు. "రాలేదు స్వామీ తోసేసారు " అన్నాడు అన్నమయ్య ఒక పక్క బాధ భరిస్తూ. "తప్పు నాయన తోసేసారు అనకూడదు, దీనిని నిమజ్జనం అంటారు. నీకు కొత్తేమో కానీ నాకిది మామూలే" అన్నాడు వినాయకుడు. "భక్తితో ముంచితే నిమజ్జనం అంటారు, ద్వేషంతో ముంచితే తోసేసారు అంటారు, అన్నమయ్య వారు వాడిన పదం బాషా పరంగా సరియినదే స్వామీ" అని ఇంకో గొంతు వినగానే వినాయకుడికి చిర్రెత్తుకొచ్చింది. 

ఎవడ్రా నాకే బాషా సూత్రాలు నేర్పిస్తున్నాడు. అంత గొప్ప పండితుడా? అనుకుంటూ తలతిప్పి చూస్తే విరిగిన ఘంటపు ముక్క వెతుక్కుంటూ ఒళ్ళంతా శిధిలమయిన ఎర్రాప్రగడ కనిపించాడు. వార్నీ నువ్వు కూడానా? "ఏమిది సాహితీ సరస్వతీ మూర్తులన్నీ ఇలా కట్టకట్టుకుని సాగరాన వచ్చి పడ్డాయి? ఇక్కడ చూస్తే నాకే దిక్కు లేదు, పోనీ నేనేమయినా మహారాజునా? చక్రవర్తినా వీళ్ళని పోషించడానికి, మొదటికే మా తండ్రి ఆదిభిక్షువు ఇంకా వీళ్ళకి నేనేం చేయగలను" అని పక్కనున్న ఎలకతో అనగానే అది కిసుక్కున నవ్వి ఆ సంగతి వీళ్ళని తోసిన వాళ్లకి తెలియదా స్వామీ, తెలుగు భాషకి ఇంత ఉన్నతిని కల్పించిన వీరందరినీ దగ్గరుండి చూసుకోడానికి అదిగో ఆంధ్ర భోజుడిని కూడా అమాంతం ఎత్తి ఇక్కడ పడేసారు. అటు చూడండి అని చూపించగానే అక్కడ రెండు కాళ్ళు విరిగి ఒక పక్క కూలబడ్డ కృష్ణ దేవరాయలు మీసం దువ్వుకుంటూ కనిపించాడు.  వినాయకుడిని చూసి నీరసంగానే నమస్కరించాడు. భళిరా నరోత్తమా నీవేల ఇటకు వచ్చితివి, ఇదేమీ హంపీ సరోవరం కాదే, ఈ మురుగు నీటిలో జలకాలాడవలేనన్న కోరిక నీకెలా కలిగినదయ్యా?" అన్న వినాయకుడి ప్రశ్నకి రాయలు జవాబిచ్చేనంతలోనే వినాయకుడి ఎలక "ప్రభూ బాగా ఆకలిగా ఉంది కాస్త ఏదైనా తిని మాట్లాడుకుందాం" అనగానే వినాయకుడు "అయితే ఆ పక్కకెళ్ళి తినేసోచ్చేయి. మేము ఈ లోగా ఇక్కడ ఏదో కతికామనిపిస్తాం"  అన్నాడు. "వీల్లేదు ఎలకైనా, ఏనుగైనా, ప్రభువైనా, బంటయినా అంతా ఒకే చోట కూర్చుని చాపకూడు తినాలి. ఈ ప్రపంచం లో అంతా సమానమే.  ఏం అన్నమయ్య స్వామీ "బ్రహ్మమొక్కడే" అన్న మీరయినా చెప్పరేమి?"  అని వినబడగానే విరిగిన తొండం సర్దుకుని వినాయకుడు ఆ మాటలు వచ్చిన వైపు తలతిప్పి చూసాడు" అక్కడ ఆజానుబాహుడిలా నిలబడి శరీరం చిద్రమయినా  మీసం మెలేస్తూ కనిపించిన వ్యక్తిని చూసి "ఎవరు నాయనా నీవు? సమానత్వం గురించి అంత ఆవేశ పడుతున్నావు?" అన్న వినాయకుడి ప్రశ్నకి "నన్ను బ్రహ్మనాయుడంటారు, మాది పలనాటి సీమ" అని జవాబిచ్చాడు బ్రహ్మనాయుడు. "నీవేమి ఇటుల వచ్చితివి విహారయాత్రకా?" అన్న వినాయకుడి ప్రశ్నకి అంత సేపూ ఓపిగ్గా వింటున్న ఎలక ఇంక ఆగలేక "స్వామీ మీకు ఈ మురికి మూసీ జల ప్రభావముతో మతి తప్పినట్టు ఉంది, తోసేసారు బాబో అని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ అదే ప్రశ్న. ఒక పక్క ఆకలితో చస్తుంటే" అని విసుక్కుంది. "మూషికా మూర్ఖంగా మాట్లాడకు వీరందరూ మహనీయులే కదా, ఈ తెలుగు జాతికి  ప్రాతః స్మరణీయులే కదా మరి ఆ మాత్రపు ఇంగితము, మర్యాద లేకుండా వీరిని ఈ సాగరమున పడేసే దుర్మదాంధులేవరుంటారు?  అంతటి ఉన్మత్తులు, ఉన్మాదులు ఈ ప్రాంతమున కలరా? " అనగానే  అప్పటిదాకా వీళ్ళ గోలంతా వింటున్న బుద్ధుడు నీళ్ళలోకి తొంగి చూసి "పిచ్చి వినాయకా ఈ ప్రాంతం లో అంతటా ఉన్మత్తులు, ఉన్మాదులే కలరు, లోపలుండి నీకు తెలియట్లేదు కానీ రోజూ  నేను చూడలేక చూడలేక చూస్తున్నా ఈ ముదిరిన ప్రాంతీయ వాదాన్ని, ఇప్పుడు వీళ్ళని ఈ మురికి కూపం లో పడేసింది కూడా వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళనే కారణం తోనే. కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతావు, ఇంకా కాలూ, చెయ్యీ కూడదీసుకోడానికి కొంచం సమయం పడుతుంది. మనకంటే అలవాటు అయిపోయింది కానీ ఈ కంపు వాళ్లకి కొత్త." అన్నాడు. 

బుద్ధుడి మాటలు అర్ధం కాని శ్రీకృష్ణ దేవరాయలు అయోమయంగా తన పక్కనే ఉన్న ఎలకతో "బుద్ధదేవుడికి కూడా బుద్ధి నశించిందా? వాళ్ళంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సరే, మాది కన్నడ సీమ. విజయనగర సామ్రాజ్య తేజో విరాజులం మమ్మల్ని పట్టుకుని ఆంధ్రుడు అంటాడేమిటి? అయినా నా రాజ్యం లో ఆంధ్ర ప్రాంతం కూడా ఉందనుకో కానీ నన్ను కన్నడ వాడిగానే జనాలు గుర్తిస్తారు. హంపీ కన్నడ దేశం లో ఉందని ఆయనకి తెలియదా? " అనగానే ఎలక్కి చిర్రెతుకోచ్చింది "కాస్త మూసుకుంటారా? అయితే మీకు ఆంధ్ర అను పదము తో సంబంధము లేదంటారు? తమ బిరుదేమి మహాశయా?" అని వ్యంగం గా ప్రశ్నించింది. పాపం ఆ వ్యంగం అర్ధం చేసుకునే స్థితిలో లేని రాయలు మీసం దువ్వుకుంటూ "ఆంధ్ర భోజులంటారు మమ్మల్ని" అన్నాడు. "ఆ ముక్కొక్కటి చాలు వాళ్లకి మిమ్మల్ని మూసీలో ముంచడానికి. తొక్కలో అనుమానాలు మీరూను, "తెలుగు వల్లభుండ" అని మీసాలు మేలేస్కోడం కాదు "తెలంగాణా బాధితుండ" అని ఏడవాలి తమరు" అని కసిరింది. 

ఇదంతా చూసిన వినాయకుడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. లయకారుడైన తండ్రిని తలచుకున్నాడు. "తండ్రీ లింగాకారుడవే!  నీ పేరుతో ఏర్పడిన ఈ త్రిలింగ దేశం లో ఆవేశ కావేశాలను అణచలేవా? " అని ఆవేదనతో ప్రార్ధించాడు. ఇంతలో  డుబుంగ్ అని శబ్దం వినిపించింది. అంతా తలతిప్పి సాగర గర్భం లో లింగడు అవతరించాడు అనుకుని అటువైపు చూసారు. కొట్టుకుపోయిన మోకాళ్ళు కూడదీసుకుని పంచె సర్దుకుంటూ ఒకాయన కనిపించాడు. ఆయన వీళ్ళకేసి తిరిగి, అందరినీ గుర్తుపట్టి వినయంగా నమస్కరించాడు. "అయ్యా నన్ను వీరేశ లింగం అంటారు" అన్నాడు. ఆ మాట వినగానే వినాయకుడు మూర్చపోయాడు.

(ఇంకా ఉంది)


ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది. 
నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు దీనిని చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను.

(అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని 
మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా. )





ఇంతకు మించి ఏమీ చెప్పలేను :(

ఈ రోజు ట్యాంక్ బండ్ పై జరిగిన సంఘటన చూసిన వెంటనే ఆవేశం, ఆక్రోశం కలగలిసి రాసిన పోస్ట్ ఈ క్రింది బ్లాగర్ కూడా అదే ఆలోచనతో అప్పటికే పోస్ట్ పెట్టడంతో అందులో తోలి కామెంట్ గా పోస్ట్ చేశా. http://manogatam.blogspot.com/2011/03/blog-post.html . ఆ స్పందన మీకోసం మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తున్నాను.

తలకెక్కిన ఉన్మాదం - ఇదా గాంధేయవాదం?

మిలియన్ మార్చ్ పేరుతో ట్యాంక్ బండ్ పై విధ్వంసం.
చేతులు కట్టుకుని చూస్తోంది చేవ లేని ప్రభుత్వం
ఏ పార్టీ వాడని ఎర్రాప్రగడని కూల్చారు?
ఏ ప్రాంతం వాడని క్రిష్ణదేవరాయుని నీట ముంచారు?
మాట్లాడితే మా సంస్కృతీ మా సంస్కృతి అనే కే.సి,యారూ
ఈ ఉన్మాదమే మీ సంస్కృతా చెప్పండి సారూ?
ఇదేనా మీరు చెప్పే గాంధేయ వాదం
కాదు కాదు ఇది అచ్చమైన కేసియారీయం
స్వచ్చమైన తెలుగులో చెప్తే స్వార్ధ రాజకీయం

(ట్యాంక్ బండ్ మీద తెలంగాణా వాదుల చేతిలో ఘోర పరాభవానికి గురయిన తెలుగు జాతి మహనీయులకు క్షమార్పణలు చెబుతూ)

గమనిక: ఇప్పటి వరకు నేను నా బ్లాగులో "తెలబాన్లు" అనే పదాన్ని ఖండించాను. సాటి తెలుగు వారిని తాలిబాన్లతో పోల్చడం మూర్ఖత్వం అని వాదించాను. కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ధ్వంసమైన విగ్రహాలలో నాకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాలు కనిపిస్తున్నాయి.కానీ ఉన్మాదంలో వీరు వారినే మించి పోయి తమ తెలుగు జాతి మహనీయుల విగ్రహాలనే కూల్చారంటే వీళ్ళని అలాగే అనాలనిపిస్తోంది. ఆ పదం కూడా తక్కువనిపిస్తోంది. 

ప్రస్తుతం చానెళ్ళలో చూపిస్తున్న విరిగిన విగ్రహాలు, తగలబడుతున్న పోలీసు జీపులు, అద్దాలు పగిలిన బిల్డింగులు చూస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది.