Saturday, June 25, 2011

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం


(ఏదో ఒక సారి రెండు సార్లు ధరలు పెంచితే స్పందించి పోస్ట్ రాస్తాం కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంటే ఎన్ని పోస్టులని మాత్రం రాస్తాం చెప్పండి? ఇప్పుడు గ్యాస్, డీజిల్ ధరలు పెంచి 'జనాలు భరించగలరు' అన్న మంత్రిగారి ఉవాచ చూసి ఈ మాట ఎక్కడో విన్నానే అని పాత పోస్టులు తిరగేస్తే ఇదిగో ఈ పోస్ట్ కనిపించింది. చిత్రంగా ఈ పోస్ట్ గత ఏడాది ఇదే రోజు రాసినది. అప్పటికీ ఇప్పటికీ పెట్రోలియం శాఖా మంత్రి మారారు గానీ వాళ్ళు చెప్పే మాట మారకపోవడం విచిత్రం. అవును మరి మన మంత్రులంతా ఒకే మాట మీద ఉండటం మన ప్రజాస్వామ్యానికి గౌరవం కాదూ. వాళ్ళే మాట మార్చనప్పుడు నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే. )

"ప్రజలు భరించగలిగే స్థాయిలోనే పెట్రో ధరలు పెంచాం" - కేంద్రం 

టివి లో ఈ స్టేట్మెంట్ చూసి బోల్డంత హాశ్చర్యం వేసేసింది. అసలు ప్రజలు ఎంతవరకూ భరించగలరో వీళ్ళకి ఎలా తెలుసా అని? తరవాత గుర్తొచ్చింది మన దేశం లో ఏ విషయాన్నయినా, ఎంతవరకయినా భరించడమే తప్ప అదేంటని ప్రశ్నించడం మనకెప్పుడూ అలవాటు లేదని. నిజమే స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం. మనం ఎన్నుకున్న నాయకులు తాము చేసిన వాగ్దానాలు మరచి సొంత లాభం కోసం అడ్డమయిన గడ్డీ కరుస్తుంటే మౌనంగా భరిస్తాం. మన ఖర్మ అని సరిపెట్టుకుంటాం. అవును మరి అందరూ దొంగలే అయినప్పుడు వాడికన్నా వీడు కాస్త మంచి దొంగ అని సరిపెట్టుకోవాల్సిందే కదా! 

సరే ఇంక పెట్రోలు విషయానికి వస్తే...చమురు ధరలపై నియంత్రణ ఎత్తేశాం అని కేంద్రం ఘనంగా ప్రకటించింది, అక్కడికేదో ఇప్పుడు అన్నిటి మీదా నియంత్రణ ఉన్నట్టు. జనం జేబుకు చిల్లు పడ్డా పర్లేదు కానీ చమురు కంపెనీలు మాత్రం చల్లగుండాలి ఇదీ మన కేంద్ర విధానం. పైగా నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోలు రేట్లు పెరగచ్చు కనక కానీ రేట్లు తగ్గితే పెట్రోలు రేట్లు మంచినీళ్ళ కన్నా చీప్ అయిపోతాయి( మన ఖర్మ చివరికి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది), ఎక్కువమంది పెట్టుబడి దారులు ఈ రంగం లోకి వచ్చి పోటీ పెరిగి ధరలు తగ్గిపోతాయి అని ఒక వింత వాదన. అందుకు టెలికం రంగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు  అమ్మగారి అడుగులకు మడుగులోత్తే అమాయక నేతలు. సాంకేతికత తో ముడిపడ్డ రంగానికి, సహజ వనరులతో ముడిపడ్డ రంగానికి సామ్యం తేవడం వీరికే చెల్లింది. అసలు చమురు కంపెనీల మీద వడ్డిస్తున్న పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా చమురు ధరలూ తగ్గుతాయిగా...అమ్మమ్మ ఎంత మాట? అలాంటి వాటిమీద పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే అసలు అనకూడని, వినకూడని మాట. అయినా ఎంత పెంచినా అన్నీ మూస్కుని భరించడానికి జనం ఉండగా పన్నులు తగ్గించి మన ఖజానా బరువెందుకు తగ్గించుకోవాలని పాపం వాళ్ళ ఆలోచన. అదీ నిజమే లెండి భరించడం మన జన్మ హక్కు మరి. అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే  మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో :) 

ఇక మొదలవుతుంది అసలు కధ, ఒక్క పెట్రోలు, డీజిల్ రేట్లతోనే ఈ కధ ఆగుతుందా? నిత్యావసరాల దగ్గర నుంచీ ప్రతీ వస్తువు ధారా ఈ సాకుతో అమాంతం పెరిగిపోతుంది. అయినా మనం చిరునవ్వులు చిందిద్దాం. 

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం 

Saturday, June 11, 2011

బ్లాగర్స్ సర్వీస్ కమీషన్ పరీక్ష (పేపర్ 1)

బ్లాగర్లలో, బజ్జర్లలో బ్లాగ్లోకం మీద ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు బ్లాగర్స్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఉంటే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ ప్రశ్నా పత్రం రూపొందించబడింది. ఆసక్తి గల అభ్యర్ధులు కామెంట్లు పెట్టి హాజరవవచ్చు. ఈ రోజు జరిగే పేపర్ 1 (50 మార్కులు) మరియు రేపు జరిగే పేపర్ 2 (20 మార్కులు) లలో  ఉత్తీర్ణులయిన వారికి ఇంటర్వ్యూలు (30 మార్కులు) నిర్వహించబడతాయి. 

(ప్రతి  ప్రశ్నకూ 5 మార్కులు) 

ప్రశ్న 1. తెలుగు బ్లాగర్ల పోస్టులలో అజ్ఞాతల పాత్ర సోదాహరణముగా వివరింపుము 

ప్రశ్న 2. మధ్యందిన "మార్తాండునిలా" చెలరేగుతూ  అన్ని బ్లాగులలో అసందర్భ  కామెంట్లు పెట్టు బ్లాగర్ పేరేమి? వారి చిత్ర విచిత్ర చేష్టలను క్లుప్తంగా వివరించుము 

ప్రశ్న 3. తెలుగు  బ్లాగులకు గల ఐదు  సంకలినుల  పేర్లు తెలుపుము 

ప్రశ్న 4. బ్లాగుల్లో "సెగట్రీ" అనగా ఎవరు? వారికి ఆ పేరు ఎట్లు వచ్చినది 

ప్రశ్న 5. తెలుగు బ్లాగులలో మీకు తెలిసిన ఐదుగురు  మధ్య తరగతి (రెండు బ్లాగులు కలవారు), ధనిక (రెండు కన్నా ఎక్కువ బ్లాగులు కలవారు) బ్లాగర్ల మరియు వారి బ్లాగుల పేర్లు చెప్పుము 

ప్రశ్న 6. "నవ్వితే నవ్వండి" బ్లాగరు ఎవరు?  వారి ప్రాశస్త్యం గురించి పది వాక్యాలకు మించకుండా వివరించుడి 

ప్రశ్న 7. ఈ క్రింది బ్లాగులు వాటి యాజమాన బ్లాగర్ల ను జతపరచుడి 

మనసులో మాట                            -                ఫణిబాబు గారు 
మాయా శశిరేఖ                              -                తృష్ణ గారు
బాతాఖానీ లక్ష్మీఫణి కబుర్లు       -           భరద్వాజ్ గారు 
తృష్ణ                              -           ఆ. సౌమ్య గారు 
రౌడీ రాజ్యం                        -           సుజాత గారు 

ప్రశ్న 8. బ్లాగ్లోకం  లో మీరు చూసిన ఐదు ఉత్తమ బ్లాగులు, ఐదు చెత్త బ్లాగులు కారణాలతో సహా వివరించండి 

ప్రశ్న 9 : బజ్జుకు , బ్లాగుకు గల తేడాలను వివరించుము 

ప్రశ్న 10 : బ్లాగర్లలో ప్రవాస తెలుగు బ్లాగర్ల పాత్రను వివరింపుము. మీకు తెలిసిన ఐదుగురు ప్రవాస బ్లాగర్ల పేర్లను తెలుపుము 
(అన్ని ప్రశ్నలకూ జవాబులు చచ్చినట్టు రాసి తీరవలెను. ఇది సరదా పోస్టే కాబట్టి ఎవరూ ఫీలవకూడదని తెలియజేయబడినది)