Thursday, December 24, 2009

ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి...

నాకు బాపు గీతన్నా, రమణ రాతన్నా ఎంతిష్టమో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గొంతన్నా అంతే ఇష్టం. భుజాల మీదకు కప్పుకున్న పట్టు చీరతో, నుదుట పెద్ద బొట్టుతో, ముక్కుపుడకతో, కళ్ళల్లో దైవత్వంతో, గొంతులో లాలిత్యంతో నాకు ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవిలా అనిపిస్తుంది. అది భజ గోవిందం అయినా, హనుమాన్ చాలీసా అయినా, అన్నమయ్య కీర్తనైనా, మీరా భజనైనా ఆవిడ గొంతులోంచి వస్తే ఆ ఫీలే వేరు. అది అమ్మ చేతి గోరుముద్దంత కమ్మగా ఉంటుంది. 


ఇక విషయానికి వస్తే...నిన్న సడన్ గా నాకెందుకో ఆవిడ నటించి, పాడిన మీరా (హిందీ సినిమా) లోని "గిరిధర గోపాలా బాలా" పాట గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్శన్ లో (నాకు అప్పుడు ఓ పది పన్నెండు ఏళ్ళు ఉంటాయేమో) ఆ సినిమా వస్తుంటే మా అమ్మగారు ఆ సినిమాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ని చూపించి ఆవిడే మనింట్లో ఉన్న భజగోవిందం క్యాసెట్లో పాడింది అని చెప్పారు. అప్పుడు నాకు ఆవిడ గొప్పతనం తెలియదు గానీ  ఆ పాట పాడుతున్నప్పుడు ఆవిడ మొహం లో కనిపించిన ప్రశాంతత నాకు భలే నచ్చింది. అలా ఆ పాట నా జ్ఞాపకాల్లో ఒక భాగమై మళ్ళీ ఇన్నాళ్ళకు సడన్ గా గుర్తొచ్చింది. సరే నెట్ లో వెతికితే పోలా...అనుకుని యూట్యూబ్ మీద పడ్డా. నా అదృష్టం ఆ పాటతో పాటు ఆ సినిమాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని సరోజినీ నాయుడు ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సీన్ కూడా దొరికింది. నిజానికి ఆ సీన్ లో ఎవరిది అదృష్టం అనాలో తెలీదు. ఎమ్మెస్ లాంటి సంగీత సామ్రాజ్ఞి ని పరిచయం చేసే అవకాశం దక్కిన సరోజినీ నాయుడిదా?  లేక పొతే నైటింగేల్ ఆఫ్ ఇండియా చే పరిచయం చేయించుకోబడ్డ ఎమ్మెస్ సుబ్బలక్ష్మిదా? సర్లెండి ఇద్దరూ ఇద్దరే కదా. అలాంటి వాళ్ళని ఒకేసారి చూసిన మనదీ ఆ అదృష్టం...సరేనా. ఆ రెండు క్లిప్ లు మీకోసం ఇక్కడ ఇస్తున్నాను. డౌన్లోడ్ చేస్కుని అపురూపంగా దాచుకోండి. నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టండి.


బహుశా నెట్ లో పెట్టిన వ్యక్తి కూడా దూరదర్శన్ లో వస్తున్నప్పుడే రికార్డ్ చేసుంటారు, "గిరిధర గోపాలా" పాటలో  'దిస్ పార్ట్ ఆఫ్ ద ఫీచర్ ఫిలిం వాస్ స్పాన్సర్డ్ బై నిర్మా' అని కూడా కనిపిస్తుంది. ఇంకో విషయం ఈ పాటలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పక్కన మహారాజు వేషంలో నిలబడ్డ నటుడెవరో గుర్తుపట్టండి చూద్దాం. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్  టి. సదాశివం (అంటే ఎవరో అనుకునేరు...ఆయన మిస్టర్ సుబ్బలక్ష్మి గారు)