Friday, January 8, 2010

స్వేచ్చ అంటే విశృంఖలతా?


నిన్న నిరాధారంగా గాలి వార్తా పట్టుకుని సంచలనం రేపి విధ్వంసానికి కారణం అయిన టివి ఛానల్ ఆ వార్తను ప్రసారం చేస్తున్నప్పుడు ఇది పాత్రికేయ విలువలను తుంగలో తొక్కేదిగా ఉంది అని ఖండించని మన ఘనత వహించిన పాత్రికేయులంతా ఈ రోజు అదే చానెల్ సిబ్బంది అరెస్ట్ చేయంగానే రోడ్ల మీద కెక్కి ధర్నాలు మొదలెట్టారు. పైగా ఇది మీడియా స్వేచ్చను అడ్డుకోవడం అని నినాదాలు కూడాను. సిగ్గు లేకపోతె సరి. ఏది మీడియా స్వేచ్చ? చేతిలో మైకు, ఎదురుగా కెమెరా ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడటమే స్వేచ్చా? ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి సరిపోయింది అదే ప్రాణ నష్టం జరిగుంటే సమాధానం ఎవడు చెప్తాడు? లేదా ఎప్పటిలాగానే మేం వార్తా చూపించాం కానీ చావమని చెప్పామా? అని తొక్కలో వాదనొకటి మొదలెడతారా? మీ వరస చూస్తుంటే మీడియా అన్న ముసుగేసుకుంటే ఎవడైనా? ఎలాగైనా? ఏదయినా మాట్లాడచ్చు అనేటట్టున్నారు.

అత్యున్నతమైన న్యాయ వ్యవస్థనే తప్పు చేస్తే నిలదీసే దేశం మనది. మీరేమైనా దిగోచ్చామనుకుంటున్నారా?  నిజానిజాలు తెలుసుకోకుండా గాలివార్తలు పట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా కధనాలు ప్రసారం చేయడం ముమ్మాటికీ పాత్రికేయ నైతిక విలువలకు విరుద్ధమే. మాకు విలువలు లేవంటారా.....చానెల్ మూసేసి వేరే అనైతిక మార్గాలు చూసుకోండి.

నాకు అస్సలు నచ్చలేదు ......ఈ మీడియా వ్యవహారం

ఫ్లాష్....... ఫ్లాష్.............మహాత్మా గాంధీ హత్య లో బ్రిట్నీ స్పియర్స్ హస్తం ......


ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కి   మన జాతి పిత మహాత్మా గాంధీని హత్యలో భాగం ఉందా? అవుననే అంటోంది ఉగాండా కి చెందిన ఓ కరపత్రం. దీనిపై మా విలేఖరి గాలివార్తల గన్నారావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.
గన్నారావు: "ఆమె ఒక పాప్ సంచలనం....పెదవి విప్పి పాడినా...కాలు కదిపి ఆడినా కనక వర్షం. అలాంటి ఆమె మన జాతి పిత మహాత్మా గాంధీ ని ఎందుకు చంపించింది?(వీడు దాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తాడు). ఉగాండా లో దొరికిన ఓ చిత్తు కాగితం ఈ నిజాన్ని బయట పెట్టింది. 1932  లో భారతదేశం లోని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న రియాల్టీ షో లో పాల్గొనేందుకు తనకు  మహాత్మా గాంధీ అనుమతి నిరాకరించినందుకే ఆమె ఈ కుట్రకు పాల్పడ్డట్టు ఆ కరపత్రం లో ఉన్న అంశం. (ఆ చిత్తు కాగితాన్ని వంద సార్లు బ్లర్ చేసి..... జూమ్ లో  మరీ చూపించడం జరుగుతుంది)....

(బ్యాక్ టు న్యూస్)
ఈ విషయమై చర్చించేందుకు మన స్టూడియో లో ఉన్నారు ప్రముఖ తాగుబోతులు శ్రీ పిచ్చి పుల్లయ్య గారు, శ్రీ వెర్రి వెంగలప్ప గారు  (పాపం ఆ సమయానికి కాస్త ఖాళీగా వాళ్ళే దొరికుంటారు)......

ఇంక ఆ తరువాత చర్చ మొదలవుతుంది.......దీన్ని అందుకున్న మరొక పది చానెల్స్ ...వాళ్ళ స్టైల్ లో మరింత మసాల జోడిస్తాయి. ఇది నమ్మిన జనం కోపానికి మరొక యాభయ్ బస్సులు, వందలాది  మ్యూజిక్ స్టోర్లు నాశనం అయిపోతుంటే దాన్ని మళ్లీ లైవ్ లో కవరేజి. ఆ తరువాత ఇంకో పిచ్చి నా  పార్టీ దీనికి నిరసనగా ఉగాండా, భారత్ లలో వారం రోజుల బందుకు పిలుపు.......

(దీనిపై ఇంటర్ పోల్ దర్యాప్తు లో అది ఒక రెండో క్లాస్ కుర్రాడి రఫ్ నోట్స్ లో కాగితం గా....అందులో కాస్త కనబడేలా ఉన్న  బ్రిట్నీ........గాంధీ అన్న రెండు పేర్ల ఆధారంగా సదరు చానెల్ సృష్టించిన సంచలన వార్తా కధనం గా తేలడం జరిగింది)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
(ఇలాంటి న్యూస్ చానెల్స్ కి కోటి దండాలు....ఇంత చదివిన తరువాత కూడా "అవునా!.... నిజమేనేమో" అనుకునే వాళ్ళకి శత కోటి దండాలు.. సంచలన వార్తలంటూ చానెల్స్ ఎంతకయినా దిగజారగలవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప గాంధీనో ...బ్రిట్నీ స్పియర్స్ నో కించపరచడం నా ఉద్దేశ్యం కాదని మనవి)

దున్నపోతు ఈనిందంటే.....

దున్నపోతు ఈనిందంటే ఆ దూడ అక్రమ సంతానం అని గోల చేసినట్టు ఉంది మన రాష్ట్రం లో ప్రస్తుత పరిస్థితి. (అసలు సామెతను కాస్త మార్చాల్సి వచ్చింది). ఎక్కడో కోన్ కిస్కా వెబ్ సైట్ ఎప్పుడో మూడు నెలల క్రితం ఒక ఊహ జనిత వార్తని పబ్లిష్ చేయడం ఇన్నాళ్ళకి పనిలేని........ లా ఒక ఛానల్ దాన్ని న్యూస్ చేయడం , అది చూసి గుడ్డెద్దు చేలో పడ్డట్టు విధ్వంసాలకు దిగడం చూస్తే ఈ తరహా దాడులు మన ప్రజలకు అలవాటుగా ఇంకా చెప్పాలంటే వ్యసనంగా మారిపోయాయేమో అనిపిస్తోంది. ఇలాంటి వార్తలు ప్రసారం చేసి తమ టి ఆర్ పి లు పెంచుకోవాలనే చానళ్ళకు కోటి దండాలు. మీడియా మీద ఏ కాస్తో మిగిలున్న నమ్మకాన్ని ఇలా చెడగొట్టే కంటే మూస్కుని ఇంట్లో కూర్చోండి. ఇప్పటికే తగలబడుతున్న రాష్ట్రం లో మరింత పెట్రోల్ పోయకండి........