"ఎమ్మెస్" - ఈ పేరు చాలు. అప్రయత్నంగానే మన మనసులో భజగోవిందమో, విష్ణు సహస్రనామ సంకీర్తనో లేక తెల్లవారింది లే స్వామీ అని వేంకటేశ్వరుని మేల్కొలిపే సుప్రభాతమో మారుమ్రోగుతుంది. తస్సదియ్య బ్రహ్మదేవుడు క్షీర సాగర మధనం టైం లో కాస్త అమృతాన్ని ఎవరికీ తెలియకుండా దాచి, ఎమ్మెస్ ను తయారుచేసినప్పుడు ఆ కాస్తా ఈవిడ గొంతులో పోసి భూమ్మీదకి వదిలాడేమో. మనిషిని చూస్తే పెద్ద బొట్టు, తలనిండా పూలు, ధగ ధగ మెరిసే ముక్కుపుడక, కళ్ళలో ప్రశాంతత, పవిత్రతతో పార్వతీదేవిలా కనిపిస్తుంది. స్వరంలో సరస్వతీదేవి గొంతు వినిపిస్తుంది. పేరు చూస్తే లక్ష్మాయే! అసలు ఈవిడ దేవత కాదు మనిషి అంటే ఎట్టా నమ్మేది?
మూడ్ బాలేనప్పుడు ఎమ్మెస్ పాట ఒక్క సారి విని చూడండి. అమ్మ ఒళ్లో తలపెట్టుకు పడుకున్నంత హాయిగా ఉంటుంది. అసలు ఆ గొంతులో ఏ పాటైనా అమృతం జల్లులా మారిపోతుందేమో. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మీరా వీళ్ళంతా ఏ లోకానున్నా తమ భక్తి ఎమ్మెస్ గొంతులోంచి జాలువారుతుంటే పరవశంతో పులకించిపోయి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి సంగీత సరస్వతి ఈ భూమ్మీద అవతరించిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆవిడని స్మరిస్తూ మీకోసం ఒక అపురూపమైన కానుక. ఎమ్మెస్ తొలి హిందీ చిత్రం "మీరా" (1947) గ్రామఫోన్ రికార్డ్ లో అన్ని ట్రాక్ లు అందిస్తున్నాను. ఈ పాటలు నెట్లో ఉంచిన వారెవరో గానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
భారత రత్న పురస్కారం పులకరించిన ఘట్టం |