Sunday, May 29, 2011

కాకినాడ కబుర్లు పార్ట్ 3 - భానుగుడి సెంటర్సినిమా హాల్ స్ట్రీట్ లో తెగ తిరిగేసి అలిసిపోయుంటారు గానీ కుసింత మా భానుగుడి సెంటర్ కొచ్చేయండి. చార్మినార్ లో స్పెషల్ బాదం టీ తాగుతూ కాసేపు హస్కేసుకుందాం. ఏటదీ..భానుగుడి సెంటర్ ఎక్కడా అంటారా? అక్కడే మరి నాకు మండుద్ది. నెల్లూరి పెద్దారెడ్డి తెలియకుండా పోలిస్ డిపార్ట్మెంట్ లో చేరినట్టు భానుగుడి సెంటర్ తెలియకుండా మీరు కాకినాడలో ఏం చేస్తున్నారండీ? సర్లెండి తప్పుద్దా మరి... దానిగురించీ చెప్తా. 

భానుగుడి సెంటర్ కి ఆ పేరు రావడానికి కారణం ఆ ఏరియాలో ఉన్న సూర్యుడి గుడి. ఒకప్పుడు ఆ గుడి ప్రముఖం గా కనిపించేది. తరవాత తరవాత ఊరు విస్తరిస్తున్న కొద్దీ షాపింగ్ కాంప్లెక్స్ ల మధ్యలో పడి అక్కడో గుడి ఉంది అని ప్రత్యేకంగా చూస్తే గానీ తెలియని పరిస్థితికి వచ్చేసింది. నిజానికి  మా కాకినాడలో మెయిన్ సెంటర్ హోదా మసీద్ సెంటర్ ది. అయితే భానుగుడిని యూత్ స్పెషల్  సెంటర్ గా చెప్పచ్చు. పివి హయాం లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక ఇండియా పరిస్థితి మారిపోయినట్టు సుభద్ర ఆర్కేడ్ వచ్చాక భానుగుడి సెంటర్ ముఖచిత్రం కూడా మారిపోయింది. అంతకు ముందు జనసంచారం లేని అడవి అని చెప్పాను కానీ పెద్దగా రద్దీ ఉండేది కాదు. భానుగుడి సెంటర్ దాటిన తరువాత వచ్చే SP బంగ్లా, పోలీస్ క్వార్టర్స్, JNTU, రంగరాయ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, సర్పవరం జంక్షన్, APSP క్వార్టర్స్ ఇవన్నీ ఊరికి దూరంగా ఉన్నట్టు ఉండేవి. మా చిన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వెనక స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గరున్న మా అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర సిటీ బస్ దిగి అక్కడనుంచీ నడకే గతి. 

సుభద్ర ఆర్కేడ్ వచ్చిన తరవాత అది మా ఊళ్ళో యూత్ మొత్తానికి డెన్ గా మారిపోయింది. అటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఇటు పివిఆర్ ట్రస్ట్, ఐడియల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంక ఆదిత్య, ప్రగతి లాంటి జూనియర్ కాలేజీ మంద ఇలా అందరికీ అదే మీటింగ్ పాయింట్.  ఆది సినిమాలో "ఈ ఊళ్ళో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత" అన్నట్టు మా ఊర్లో సగానికి పైగా జనానికి మొదట ఇంటర్నెట్ పరిచయం చేసింది ఈ కాంప్లెక్స్, మొదట బిలియర్డ్స్ టేబుల్ , పూల్ గేమ్స్ అలవాటు చేసింది ఈ కాంప్లెక్స్ అన్నమాట. :). ప్రేమికుల రోజు సినిమా చూసి మాకూ సోనాలి బెంద్రే దొరికేస్తుందని వెర్రి వెధవల్లా నమ్మి గంటకి అరవై రూపాయలిచ్చి( అదీ ఇద్దరు కలిపి షేరింగ్...అరగంట ఒకడు, ఇంకో అరగంట ఇంకొకడు చాట్ చేసుకునేలా అంతర్జాతీయ ఒప్పందాలు మరి) చాటింగ్ చేసింది ఇక్కడే.:( 


ఇదే సుభద్ర ఆర్కేడ్. అడగ్గానే నేను అడిగిన విధంగా ఫోటో తీసి పంపించిన నా ఫ్రెండ్ జగన్నాధ రాజు కి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు.


ఇంక సుభద్ర ఆర్కేడ్ ని దాటి కాస్త బయటకి వస్తే ఆ పక్కనే చార్మినార్ టీ సెంటర్. ఆనంద్ థియేటర్ లో సినిమాకి టికెట్లు తీసుకుని ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా చార్మినార్ కి వచ్చి కలవమనే కుర్రాళ్ళు, సుభద్ర ఆర్కేడ్ లోకి ప్రవేశించే ముందు ఇక్కడ కాస్త ఆగి ఓ టీ కొట్టి రిలాక్సయ్యే యూత్ బ్యాచ్ లు, ఎండలో నిలబడీ నిలబడీ కాళ్ళు లాగేసి బుర్ర మీద టోపీ తీసి తల గోక్కుంటూ ఓసీ టీ తాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇక్కడ మీకు కనిపిస్తారు. ఇప్పటికీ ఈ టీ సెంటర్ బయట ప్లాట్ ఫారం మీద స్టాండ్ వేసిన బైక్ ల మీద కూర్చుని తీవ్రం గా చర్చించేసుకునే కుర్రాళ్ళని చూస్తే కప్పుల కొద్దీ టీ తాగుతూ, గంటలు గంటలు హస్కేస్తూ BSRB ప్రిపరేషన్ టెక్నిక్స్ నుంచీ, కొత్త నోటిఫికేషన్లు, కొత్త సినిమాలు, మా మా ఏరియాలో అమ్మాయిల ఆటో బయోగ్రఫీల వరకు అలుపు లేకుండా చర్చలు చేసుకుంటూ గడిపేసిన ఆకలిరాజ్యం రోజులు గుర్తొస్తాయి. :)
చార్మినార్ సెంటర్ దగ్గర శ్రీరాం నగర్ కెళ్ళే దారిలో బోలెడన్ని తోపుడు బళ్ళు పెట్టుకుని పళ్ళు అమ్ముతూ ఉంటారు. దాదాపు అర్ధరాత్రి దాకా వీళ్ళ సందడితో ఈ ఏరియా బిజీగానే ఉంటుంది. ఇక అక్కడినుంచి కాస్త ముందుకొచ్చి A-Z ఎంపోరియం, రాజు మెస్, మంగీలాల్ స్వీట్ షాప్ దాటుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకొస్తే లెఫ్ట్ సైడ్ పద్మప్రియ కాంప్లెక్స్. ఇక్కడ "యతి" అని పార్లర్ కం పిజ్జా కార్నర్ ఉంది లెండి. దాని ముందు నిలబడి బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదని విసుక్కునే అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఆ టైం లో అక్కడున్న అమ్మాయిలకి రేటింగ్ ఇచ్చే అబ్బాయిలు, నెయిల్ పాలిష్ కొనుక్కున్నా పార్టీ ఇచ్చేసుకునే అమాయకపు ఆడపిల్లల బ్యాచ్ లు గుంపులు గుంపులుగా దర్శనమిస్తారు. 

ఇక కాస్త ముందుకెళ్తే ఆనంద్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ గురించి ఆల్రెడీ సినిమా హాల్ స్ట్రీట్ గురించి చెప్పినప్పుడు చెప్పేశాను. ఇక ఈ కాంప్లెక్స్ దాటితే టూ టౌన్ బ్రిడ్జి. అదండీ మా ఊరి భానుగుడి సెంటర్. కాకినాడ కబుర్లు మొదటి రెండు భాగాలు ఇక్కడ చూడండి.


NEXT : ఫలపుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి కుళాయి చెరువు ఎగ్జిబిషన్

Sunday, May 1, 2011

కామెడీగా మన మంత్రులు, నాయకులు చెప్పే కొన్ని కామన్ స్టేట్మెంట్స్


కామెడీగా మన మంత్రులు, నాయకులు చెప్పే కొన్ని కామన్ స్టేట్మెంట్స్. ఇంకో పదేళ్ళ తర్వాత కూడా ఈ స్టేట్మెంట్స్  ఇలాగే ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను :)

౧. నిందితులు ఎంతటి వారైనా కఠినం గా శిక్షిస్తాం
౨. పూర్తీ వివరాలు అందిన తర్వాత స్పందిస్తాం 
౩. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది 
౪. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం 
౫. ఇది కేంద్ర స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయం
౬. పరిస్థితి అదుపులో ఉంది
౭. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
౮. దేశం ఒక మహా నేతని కోల్పోయింది or  ఆయన/ ఆమె మరణం ..................కు తీరని లోటు (ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళయితే ఆ రంగం పేరు ఖాళీలో నింపుకోవలెను)
౯.  మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది 
౧౦. నా మీద వచ్చిన ఆరోపణల మీద దమ్ముంటే ఎంక్వయిరీ కమిటీ వేయించమనండి