Thursday, February 24, 2011

సెగట్రీ...ఈ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం


దీన్సిగతరగా ఎదవ మృత్యువు...అభిమానులందరూ మాంచి నిద్రలో ఉండగా దొంగచాటుగా వచ్చి రమణని తీసుకుపోతుందా. అయినా దానికి లేకపోతే పోయే ఆ పెద్దాయనకైనా  ఉండద్దూ..."అప్పు" డే నా అని ఇంకో వందేళ్ళు జీవితాన్ని "ఋణం" గా తీసుకోవచ్చుగా దాన్దగ్గర. బాపు గురించి కాస్తయినా ఆలోచించాడా? లేకపోతే సీరామ రాజ్యం కత . డవిలాగులు మా బాగా రాసేసుంటాడు..ఆ రాములోరికి ముచ్చటేసి ఇలాంటోడు మన ఇలాకాలో ఉండాలి గానీ సీపుగా భూలోకం లో ఏంటి అని రాత్రికి రాత్రి "జనతా ఎక్స్ప్రెస్" లాంటి బండోటి పంపించి పిలిపించేసుకున్నడేమో. అసలే మనోడు ఈ మధ్యే "కోతి కొమ్మచ్చి" ఆడి ఆడి ఉన్నాడేమో ఆ "రాంబంటు" కోతి వచ్చి రాములోరు రమ్మంటున్నారు అని చెప్తే  గెంతుకుంటూ బండెక్కేసుంటాడు. సమయానికి బుడుగ్గాడు ఉన్నా బావుణ్ణు బాపు-రమణ ల "స్నేహం" గురించి చెప్పి ఠాట్ వెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డేసేవాడేమో. అయినా ఎక్కడికి పోతాడ్లే...తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే ఉంటాడు. మనమూ అక్కడికి వెళ్ళకపోతామా, అప్పుడు ఏటీ పని అని నిలదీసి ప్రైవేట్ చెప్పెయమూ.

అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, గుండెలో గుండు సూది గుచ్చినట్టు ఎక్కడో ఏదో నొప్పి. అవున్లే సడెన్గా దేవుడు రేపట్నించి భూమీద ఉండడు అంటే భక్తులకామాత్రం బాధ ఉండదేంటి? అసలు ఆయన్ని తీసుకెళ్ళిన ఆ మృత్యువు  అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం