Tuesday, June 1, 2010

పరమ బూతు పదం: "పాత్రికేయ విలువలు"

"పాత్రికేయ విలువలు" దీనంత బూతు పదం నాకు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. తాజాగా ఎన్ టివి కి ఎబియన్ ఆంద్రజ్యోతి ఛానెల్స్ మధ్య "స్వరూపానంద" విషయంలో జరుగుతున్న మీడియా పోరు చూస్తే అసహ్యం వేస్తోంది. ఒక్క ఈ రెండు ఛానెల్స్ అనే కాదు ఒకరు అవునంటే ఇంకొకరు కాదనాలి అనే సంస్కృతి ఈ మధ్య మీడియా లో వెర్రితలలు వేస్తోంది. వీధి కుక్కల కన్నా హీనంగా కొట్టుకుంటున్నారు (వీధి కుక్కలు నన్ను క్షమించాలి). అసలు ఏది వార్త, ఏది వార్త కాదు అనే కనీస అవగాహన కూడా మీడియా మర్చిపోతోందేమో అనిపిస్తోంది. దానికి తోడూ మేమే ముందు చెప్పాం అనిపించుకోవాలనే తాపత్రయం లో అడ్డమయిన విషయాల్ని వార్తలుగా చేసి పారేస్తున్నారు. ఇక మొన్న శ్రీకాళహస్తి రాజ గోపురం కూలిన ఘటనలో "ముందుగా హెచ్చరించింది మా ఛానలే" అని దాదాపు అన్ని న్యూస్ చానల్స్ డబ్బాలు కొట్టుకోవడం మరీ వింతగా ఉంది. "ముందుగా" అనేది అందరికీ ఎలా సాధ్యమో నాకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. 

ఇక "చర్చలు" అన్న పదం ఎంత కామెడీ గా మారిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చానెల్ కి  కొంత మంది స్టాండర్డ్ విశ్లేషకులు ఉంటారు, వీళ్ళు ఆవకాయ నుండి అణుశక్తి విధానం దాకా అన్నిటినీ విశ్లేషించేస్తారు పాపం!. పోనీ మిగతా వాళ్ళయినా సబ్జెక్ట్ తో సంబంధం ఉన్నవాళ్ళని పెడతారా అంటే అదీ లేదు. ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్రద్దలైన విషయం మీద అంబటి రాంబాబు ని చర్చకు పిలిచే టైపు వీళ్ళు.   

ఇకపోతే ఇంకో రకం సంస్కృతి ఈ మధ్య కనిపిస్తోంది. ఎవరయినా ఆడపిల్ల భర్త మీదో, లవర్ మీదో అతను అన్యాయం చేసాడని స్టూడియో కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే చాలు అసలు నిజానిజాలేంటో తెలుసుకోకుండా   వీళ్ళకి నచ్చిన హెడ్ లైన్స్ వీళ్ళు పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ప్రోగ్రాం గా మలిచేసుకుంటున్నారు. అసలు అలాంటి అన్యాయాలు జరగటం లేదు అని నేను అనట్లేదు అయితే నిజానిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఎంత వరకు న్యాయం? అనేదే నా ప్రశ్న. 

ముట్నూరి కృష్ణారావు గారిలాంటి పాత్రికేయులు ఇప్పుడు లేకపోవడం వాళ్ళ అదృష్టం. ఉంటే ఈ పరిణామాలకి గుండె పగిలి చనిపోయేవారేమో.