Thursday, February 17, 2011

ఛీ...వెధవ బ్రతుకు..చెప్పుకోడానికి ఒక్కళ్ళూ లేరు


ఒక్క నాయకుడు, జనం గురించి ఆలోచించే ఒక్క నాయకుడూ కనబడట్లేదు. ఎవరికి వాళ్ళే ప్రజల కోసం పేరుతో తమ పొట్టలు నింపుకుంటున్నారు. ఎవరి గురించని చెప్పాలి? ఎవరిని ఆదర్శంగా రేపటి తరానికి చూపించాలి? లేకపోతే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ పేర్లనే ఇంకో పది తరాల వరకు వాడుకుందామా? నేటి తరం నాయకులలో ఎవరి గురించి చెప్పుకోవాలి?

సోనియా గాంధీనా? - ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువుతూ, వేరెవరో చెప్పే మాటల ఆధారంగా సర్వం సహా ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఈవిడని చూస్తే మన దేశ ఖర్మను తలచుకుని బాధేస్తుంది. ఇక అమ్మే దైవమంటూ భట్రాజుల్లా వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్ నాయకులనా?. పే....ద్ద  త్యాగశీలి అంటారు, ఏమిటి ఈవిడ చేసిన త్యాగం? ప్రధాని పదవా? ప్రధాని పదవిలో ఉంటే అధికారం తో పాటు బాధ్యతలు, సవాలక్ష తలనొప్పులు ఉంటాయి...త్యాగం పేరుతో ఆ తలనొప్పులను వదిలించుకున్న ఈవిడ అవధుల్లేని అధికారం మాత్రం ఆనందంగా అనుభవిస్తోంది. ఈవిడ త్యాగశీలి ఏంటండీ? కామెడీగా లేదూ?

ఇక భారత దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత సమర్ధవంతమైన ఆర్ధిక మంత్రిగా పేరు తెచ్చుకున్న మన ప్రధానిని చూస్తే నాకు మనీ సినిమాలో "అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి" అనే చారి కేరక్టర్ గుర్తొస్తుంది. వ్యక్తిగతంగా ఆయన సచ్చీలుడే కావచ్చు. అయితే తప్పు జరుగుతుంటే కళ్ళు మూసుకున్నవాడు కూడా తప్పు చేసినట్టే కదా. మేడం ఏం చెప్తే అలా ఆడే కీలుబొమ్మలా తయారయి తన ప్రతిష్టని దిగజార్చుకుంటున్న ఈ ఆర్ధిక మేధావి సమకాలీన రాజకీయాలలో అత్యంత అసమర్దునిగా మాత్రం బోల్డంత అప్రతిష్ట మూటకట్టుకున్నారు.  

ఇక చిదంబరం, ప్రణబ్ వగైరాల వంటి తొట్టి గ్యాంగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళకి మేడం చెప్పిందే వేదం. ఆవిడ మెప్పుకోసం రాహుల్ ప్రధాని కావాలనే నినాదం ఎప్పుడూ భుజాన వేసుకుని తిరుగుతూనే ఉంటారు. అవును మరి మనకి నెహ్రూ కుటుంబం తప్ప వేరే దిక్కులేదు కదా. ఛీ మన జీవితం...!. 

ప్రతిపక్ష నేత అద్వానీ -  ఈయనకి రాముడి మీద ఉన్న భక్తీ, శ్రద్ధ రామరాజ్యం మీద లేదు. రాముడొక్కడే దేవుడు అని నమ్మే ఈ అతివాద ఆరెస్సెస్ నాయకుడు ఆ రాముడందించిన పాలనలో ఒక్క శాతం...ఒక్కటంటే ఒక్క శాతం తమ అజందాలో చేర్చినా ఇంకో అర్ధ శతాబ్దం వరకూ ఈయనకు పగ్గాలు గ్యారంటీ. కానీ పాపం అయోధ్యలో మందిరమే తప్ప రాముడి అసలు ఆదర్శాలు పట్టని ఈయనకి ఆ విషయం ఎప్పటికీ తలపుకు రాదు.  

లాలూ, మమత, శరద్ పవార్ లాంటివాళ్ళు పొరపాటున కేంద్రమంత్రి పదవులోచ్చిన మున్సిపల్ కౌన్సిలర్లలా అనిపిస్తారు నాకు. ఇంకా జయలలిత, కరుణానిధి లాంటి చాలా మంది నేతల పేర్ల గురించి మీరు ఈ పోస్ట్ లో వెతుకుతుంటే సారీ. వాళ్ళ పేర్లు కూడా గుర్తుకురాలేదంటే దేశం మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉందొ మీరే ఆలోచించుకోండి. 

కాస్తో కూస్తో  నిబద్ధత ఉన్న ఆంటోని, నితీష్ కుమార్, మోడీ లాంటి వాళ్ళు ఇప్పట్లో స్వయం ప్రకాశం ఉండే జాతీయ స్థాయి నాయకులు కాబోరు. (ముఖ్య గమనిక: వీళ్ళు పూర్తీ నీతివంతులు, సచ్చీ లురు అని నేను అనటం లేదు. మిగిలిన వాళ్ళ కంటే కాస్త బెటరని నా ఫీలింగ్ అంతే.)  

ఇంక ఎవరి గురించి చెప్పాలి రేపటి తరానికి? 

(ఇంకా అయిపోలేదు. మన రాష్ట్రం లో రాజకీయ వెధవల గురించి ......సారీ సారీ రాజకీయ మేధావుల గురించి తరువాతి భాగం లో బ్లాగుతా)