Tuesday, January 26, 2010

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఇంగ్లీష్ పాట......అద్భుతం, అపురూపం

రిపబ్లిక్ డే షష్టి పూర్తి సందర్భంగా నా బ్లాగ్ లో స్పెషల్ గా ఏం పెట్టాలా అని ఆలోచించినప్పుడు ఐక్య రాజ్య సమితిలో కచేరీ చేసిన సందర్భంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఒక అరుదయిన, అపూర్వమయిన ఇంగ్లిష్ సాంగ్ గుర్తొచ్చింది. అన్నట్టు ఇందులో స్వతంత్ర భారతదేశం లో ఏకైక గవర్నర్ జనరల్ అయిన "రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలచారి)" గొంతు మిమ్మల్ని ముందుగా పలకరిస్తుంది. (అయితే ఈ క్రింద పేరా చదివిన తరువాతే మీరు ఆ లింక్ దగ్గరకి వెళ్ళండి)


అసలైతే ఈ ఆడియో మీతో పంచుకోకూడదు అనుకునేంత కోపం వచ్చేసింది నాకు. ఎందుకంటే "ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి " అంటూ ఆవిడ నటించిన తొలి హిందీ సినిమా "మీరా" పాట వీడియోలతో  నేను డిశంబర్ ఇరవై నాల్గున పోస్ట్ పెడితే  కేవలం మూడంటే మూడే కామెంట్స్ వచ్చాయి (శిశిర గారు, సత్యసాయి కొవ్వలి గారు , సంతోష్ గారు) పోనీ అలా అని ఎవరూ చూడలేదు అనుకుందామా ఇప్పటికి దాదాపు యాభై మంది ఆ క్లిపింగ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఆవిడ పాడిన అన్నమయ్య పాటలతో నేను పెట్టిన పోస్ట్ లకి ఒక్కటంటే ఒక్కే కామెంట్ (మ్యాడీ గారు) కానీ ఒక నలభై మందిదాకా డౌన్లోడ్ చేసుకున్నారు. పోనీ కామెంట్ పెట్టడానికి బద్దకిస్తున్నారులే అని సరిపెట్టుకుందామంటే అదే ఏ కె.సి ఆర్ మీదో, తెలంగాణా మీదో పోస్ట్ పెడితే ఇహ చూస్కోండి తెగ కామెంట్స్..." మాయా బజార్ లో అహ నా పెళ్ళంట" పాట పారడి కి పాతికకు పైగా వచ్చిన కామెంట్స్ అదే "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" పాట అంటే ఎందుకు రావటం లేదు అనేది నాకు అర్ధం కావటం లేదు.
(ఇదేదో మిమ్మల్ని కామెంట్ చేస్తారా చస్తారా అని బెదిరించేందుకు కాదు :) ......నాకు కలుక్కుమంది ...చెప్పానంతే)


సరే ఆ గొడవ వదిలేసి ఈ పాట ఎంజాయ్ చెయ్యండి. ఇది అరవై ఆరు లో  ఐక్య రాజ్య సమితిలో ఎమ్మెస్ కచేరి లైవ్ రికార్డింగ్ ఆడియో....ఇది మీకు నచ్చితే ఆ మొత్తం కచేరి ఆడియో క్లిప్ లు పోస్ట్ చేస్తాను. లింక్ కింద ఇస్తున్నాను


Saturday, January 23, 2010

ఎమ్మెస్ గొంతులో అన్నమయ్య కీర్తన - పసిడి గిన్నెలో పాల బువ్వ - రెండవ భాగం

మెదటి భాగం లో ఎమ్మెస్ పాడిన అన్నమయ్య కీర్తనలలో నాకు ఇష్టమయిన ఏడు కీర్తనలని అందించాను. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను 


ఇక "డోలాయాం" కీర్తన నాకు ఎంత ఇష్టం అంటే దాన్ని ఆవిడే స్వయంగా పాడుతున్న క్లిప్ ఎక్కడయినా దొరుకుతుందేమో అని నెట్ లో వెతుకుతుంటే దూరదర్శన్  ఆర్కైవ్స్ లో ఉన్న ఈ క్లిప్ యూట్యూబ్ లో దొరికింది. ఎప్పటిలానే హై క్వాలిటీ ఎంపి4 గా మార్చి మీకు అందిస్తున్నాను. ఈ వీడియో లో సరిగ్గా ఇరవై ఒకటవ సెకన్ వద్ద "డోలాయాం" అంటున్నప్పుడు ఆవిడ ఇచ్చిన  expression నాకు విపరీతంగా నచ్చేసింది. మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి

Friday, January 22, 2010

బ్లాగ్మిత్రులారా ఏకంకండి....బ్లాగ్గర్స్ జేఏసి పిలుస్తోంది కదలిరండి!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఏంటో అటు కోస్తా, రాయలసీమలలో ...ఇటు తెలంగాణా లో రోజుకొక్క జేఏసి పుట్టుకొస్తోంది. ప్రతి యూనివర్సిటీకొక జేఏసి, లాయర్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, పార్టీకి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వూరికొకటి, చెట్టుకొకటి, పుట్టకొకటి చొప్పున జేఏసి లు..వాటిలో మళ్ళీ వర్గ జేఏసి లు పుట్టుకొస్తున్నపుడు ఇవన్నీ చూసి  ఏం? మన బ్లాగ్గర్స్ ఎందులో తీసిపోయారని అనిపించి బ్లాగ్గర్స్ జేఏసి ప్రారంభిద్దామని డిసైడ్ అయిపోయా. దీని కార్యవర్గం లో ఎవరెవరు ఉండాలో మీరే సలహా ఇవ్వండి.

అలాకాదూ....మళ్ళీ ఇందులో కూడా మహిళా బ్లాగ్గర్లు, పురుష బ్లాగ్గర్లు, బాల బ్లాగ్గర్లు, వృద్ధ బ్లాగ్గర్లు, తెలంగాణా బ్లాగ్గర్లు, ఆంధ్ర బ్లాగ్గర్లు, ఉత్తరాంధ్ర బ్లాగ్గర్లు, రాయలసీమ బ్లాగ్గర్లు, ప్రవాసాంధ్ర బ్లాగ్గర్లు, బ్లాగ్ స్పాట్  బ్లాగ్గర్లు, వర్డ్ ప్రెస్ బ్లాగ్గర్లు ఇంకా నానా రకాల బ్లాగ్గర్ల విడివిడి జేఏసి లు ఉండాలంటారా....మీ గొడవ మీరు పడండి...నేను మాత్రం నా స్వంత జేఏసి ప్రారంభిన్చేసుకుంటా....వద్దామనుకున్నా వాళ్ళు రావచ్చు. 

ఇంతకీ జేఏసి లక్ష్యం ఏంటి అంటారా?.....ఏమో ఇప్పటి దాకా ఉన్న ఏ జేఏసి కి మాత్రం వాళ్ళ లక్ష్యం ఖచ్చితం గా తెలిసి ఏడిసింది కనుక...

(నాకు మొదటి కామెంట్ చేసిన వాళ్లకి నా జేఏసి కన్వీనర్ పదవి ఇచ్చేస్తానోచ్!!!!!! త్వరపడండి)

Tuesday, January 19, 2010

ఆవిడ గొంతులో అన్నమయ్య కీర్తన - పసిడి గిన్నెలో పాల బువ్వ


నాకు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గాత్రమంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడని చూస్తే సామవేదం మనిషి రూపం ధరించిందా అనిపిస్తుంది. ఇంక  అన్నమయ్య కీర్తనన్నా అంతే ఇష్టం . అలాంటి అన్నమయ్య కీర్తన ఆవిడ గొంతులో వింటే నా సామిరంగా! అమ్మ వొళ్ళో పడుకుని ఆదమరచి నిద్రోతున్నంత ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ పాడిన నాకు బాగా ఇష్టమయిన సప్త స్వరాల్లాంటి ఏడు అన్నమయ్య కీర్తనలు మీతో పంచుకుందాం అనిపించింది. ఒక్క సారి కళ్ళు మూసుకుని ఆ గొంతులో అన్నమయ్య కీర్తనలు విని చూడండి.....దేవుడు కూడా పసిపిల్లాడై కేరింతలు కొడుతున్నట్టు మీకు అనిపించక పోతే నన్నడగండి. ఇక మీకూ ఆవిడంటే ఇష్టమయితే " ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి" అన్న నా పోస్ట్ http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_24.html చూడండి (ఇందులో ఆవిడ నటించిన మీరా సినిమాలో నాకిష్టమయిన పాట ఉంది).

ఇక ఆ ఏడు పాటల లింకులు కింద ఇస్తున్నాను, విని మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి. .
Saturday, January 16, 2010

సూర్యుడు నెలవంకయిన వేళ....నా ఫ్రెండ్ తీసిన ఫోటో

ఇది స్వతహాగా ప్రతీదాన్నీ కెమెరా కన్నుతో చూసే నా ఫ్రెండు జగన్నాధరాజు వాడి కెమెరా కంటితో గ్రహణాన్ని బంధించినప్పటి ఫోటో. కరెక్టుగా మబ్బులు కూడా కుదరడం వలన అది నిజంగా నెలవంకేమో అనిపించక మానదు. తన  ఫేస్ బుక్ లో పెట్టిన ఈ ఫోటో నాకు విపరీతం గా నచ్చేసి మీ అందరితో పంచుకోవాలనిపించి కనీసం వాడికి చెప్పనుకూడా చెప్పకుండా బ్లాగ్ లో పెట్టేసా. మీ అభినందనలన్నీ వాడికే చెందుతాయి.


Tuesday, January 12, 2010

మాయాబజార్ లో తెలంగాణా మాయా శశిరేఖ.......అహనా పెళ్ళంట....తెలం"గానం"

తెలంగాణా వాదం ఇప్పుడు పాపం కళలని కూడా వదలట్లేదు. అదుర్స్ ని అడ్డుకుంటాం అంటూ ఒక పక్క తెలంగాణా జేఏసిలు, కెసిఆర్ కూతురు కవిత వీరంగాలేస్తుంటే...మరోపక్క తెలంగాణా కవి (అదేం బిరుదో???) అని తనకి తానే చెప్పేసుకునే దేశపతి శ్రీనివాస్ ఆంధ్ర వాళ్ళ సినిమాలొద్దు...అమితాబ్..షారుఖ్ సినిమాలు చూదాం అని అల్టిమేటం జారీచేసినట్టు ఎక్కడో చదివా. ఇవన్నీ చూసి రేపు రంగుల్లో మళ్లీ మనముందుకు రాబోతున్న అపురూపమయిన మాయాబజార్ ని అందులో ఒక్క పాత్ర తెలంగాణా యాసలో మాట్లాడలేదు కాబట్టి..ఆ సినిమాని అడ్డుకుంటాం అనయినా అనేస్తారు అనిపిస్తోంది. అందుకే సరదాగా ఆ సినిమాలో "అహనా పెళ్ళంట " పాటని తెలంగాణా యాసలో పెడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో చేసిన పేరడీ ఇది. ఇది పూర్తిగా తెలంగాణా యాసో కాదో నాకు తెలియదు. తప్పులుంటే సరిదిద్దండి. మాయ బజార్ ని కించపరిచే ఆలోచన, సాహసం నాకు ఏ కోశానా లేవని, ఇది కేవలం వెర్రితలలేస్తున్న ప్రాంతీయోన్మాదం మీద నా నిరసన ప్రయత్నంగానే  గ్రహించి మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీకోసం ఆ సినిమాలో అసలు పాట లింక్ కూడా ఇస్తున్నాను. ఆ ట్యూన్ వింటూ ఇది చదవండి.

అసలు "అహనా పెళ్ళంట పాట"
అహనా పెళ్ళంట...అసలు పాట లింక్ ...ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ పాటను మీ మిత్రులకి మెయిల్ లోకూడా పంపించుకునేందుకు వీలుగా ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది .పాట కాస్త పెద్దది కాబట్టి రెండు పేజీలు పట్టింది..పండుగ చేసుకోండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే పన్లోపనిగా నా పాత పోస్టుల్లోని "రింగా రింగా", "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాటలకు ఇలాంటి పేరడీలు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ పోస్టుల లింకులు రింగా రింగా  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_333.html , నిదురించే తోటలోకి  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html )

Friday, January 8, 2010

స్వేచ్చ అంటే విశృంఖలతా?


నిన్న నిరాధారంగా గాలి వార్తా పట్టుకుని సంచలనం రేపి విధ్వంసానికి కారణం అయిన టివి ఛానల్ ఆ వార్తను ప్రసారం చేస్తున్నప్పుడు ఇది పాత్రికేయ విలువలను తుంగలో తొక్కేదిగా ఉంది అని ఖండించని మన ఘనత వహించిన పాత్రికేయులంతా ఈ రోజు అదే చానెల్ సిబ్బంది అరెస్ట్ చేయంగానే రోడ్ల మీద కెక్కి ధర్నాలు మొదలెట్టారు. పైగా ఇది మీడియా స్వేచ్చను అడ్డుకోవడం అని నినాదాలు కూడాను. సిగ్గు లేకపోతె సరి. ఏది మీడియా స్వేచ్చ? చేతిలో మైకు, ఎదురుగా కెమెరా ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడటమే స్వేచ్చా? ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి సరిపోయింది అదే ప్రాణ నష్టం జరిగుంటే సమాధానం ఎవడు చెప్తాడు? లేదా ఎప్పటిలాగానే మేం వార్తా చూపించాం కానీ చావమని చెప్పామా? అని తొక్కలో వాదనొకటి మొదలెడతారా? మీ వరస చూస్తుంటే మీడియా అన్న ముసుగేసుకుంటే ఎవడైనా? ఎలాగైనా? ఏదయినా మాట్లాడచ్చు అనేటట్టున్నారు.

అత్యున్నతమైన న్యాయ వ్యవస్థనే తప్పు చేస్తే నిలదీసే దేశం మనది. మీరేమైనా దిగోచ్చామనుకుంటున్నారా?  నిజానిజాలు తెలుసుకోకుండా గాలివార్తలు పట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా కధనాలు ప్రసారం చేయడం ముమ్మాటికీ పాత్రికేయ నైతిక విలువలకు విరుద్ధమే. మాకు విలువలు లేవంటారా.....చానెల్ మూసేసి వేరే అనైతిక మార్గాలు చూసుకోండి.

నాకు అస్సలు నచ్చలేదు ......ఈ మీడియా వ్యవహారం

ఫ్లాష్....... ఫ్లాష్.............మహాత్మా గాంధీ హత్య లో బ్రిట్నీ స్పియర్స్ హస్తం ......


ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కి   మన జాతి పిత మహాత్మా గాంధీని హత్యలో భాగం ఉందా? అవుననే అంటోంది ఉగాండా కి చెందిన ఓ కరపత్రం. దీనిపై మా విలేఖరి గాలివార్తల గన్నారావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.
గన్నారావు: "ఆమె ఒక పాప్ సంచలనం....పెదవి విప్పి పాడినా...కాలు కదిపి ఆడినా కనక వర్షం. అలాంటి ఆమె మన జాతి పిత మహాత్మా గాంధీ ని ఎందుకు చంపించింది?(వీడు దాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తాడు). ఉగాండా లో దొరికిన ఓ చిత్తు కాగితం ఈ నిజాన్ని బయట పెట్టింది. 1932  లో భారతదేశం లోని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న రియాల్టీ షో లో పాల్గొనేందుకు తనకు  మహాత్మా గాంధీ అనుమతి నిరాకరించినందుకే ఆమె ఈ కుట్రకు పాల్పడ్డట్టు ఆ కరపత్రం లో ఉన్న అంశం. (ఆ చిత్తు కాగితాన్ని వంద సార్లు బ్లర్ చేసి..... జూమ్ లో  మరీ చూపించడం జరుగుతుంది)....

(బ్యాక్ టు న్యూస్)
ఈ విషయమై చర్చించేందుకు మన స్టూడియో లో ఉన్నారు ప్రముఖ తాగుబోతులు శ్రీ పిచ్చి పుల్లయ్య గారు, శ్రీ వెర్రి వెంగలప్ప గారు  (పాపం ఆ సమయానికి కాస్త ఖాళీగా వాళ్ళే దొరికుంటారు)......

ఇంక ఆ తరువాత చర్చ మొదలవుతుంది.......దీన్ని అందుకున్న మరొక పది చానెల్స్ ...వాళ్ళ స్టైల్ లో మరింత మసాల జోడిస్తాయి. ఇది నమ్మిన జనం కోపానికి మరొక యాభయ్ బస్సులు, వందలాది  మ్యూజిక్ స్టోర్లు నాశనం అయిపోతుంటే దాన్ని మళ్లీ లైవ్ లో కవరేజి. ఆ తరువాత ఇంకో పిచ్చి నా  పార్టీ దీనికి నిరసనగా ఉగాండా, భారత్ లలో వారం రోజుల బందుకు పిలుపు.......

(దీనిపై ఇంటర్ పోల్ దర్యాప్తు లో అది ఒక రెండో క్లాస్ కుర్రాడి రఫ్ నోట్స్ లో కాగితం గా....అందులో కాస్త కనబడేలా ఉన్న  బ్రిట్నీ........గాంధీ అన్న రెండు పేర్ల ఆధారంగా సదరు చానెల్ సృష్టించిన సంచలన వార్తా కధనం గా తేలడం జరిగింది)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
(ఇలాంటి న్యూస్ చానెల్స్ కి కోటి దండాలు....ఇంత చదివిన తరువాత కూడా "అవునా!.... నిజమేనేమో" అనుకునే వాళ్ళకి శత కోటి దండాలు.. సంచలన వార్తలంటూ చానెల్స్ ఎంతకయినా దిగజారగలవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప గాంధీనో ...బ్రిట్నీ స్పియర్స్ నో కించపరచడం నా ఉద్దేశ్యం కాదని మనవి)

దున్నపోతు ఈనిందంటే.....

దున్నపోతు ఈనిందంటే ఆ దూడ అక్రమ సంతానం అని గోల చేసినట్టు ఉంది మన రాష్ట్రం లో ప్రస్తుత పరిస్థితి. (అసలు సామెతను కాస్త మార్చాల్సి వచ్చింది). ఎక్కడో కోన్ కిస్కా వెబ్ సైట్ ఎప్పుడో మూడు నెలల క్రితం ఒక ఊహ జనిత వార్తని పబ్లిష్ చేయడం ఇన్నాళ్ళకి పనిలేని........ లా ఒక ఛానల్ దాన్ని న్యూస్ చేయడం , అది చూసి గుడ్డెద్దు చేలో పడ్డట్టు విధ్వంసాలకు దిగడం చూస్తే ఈ తరహా దాడులు మన ప్రజలకు అలవాటుగా ఇంకా చెప్పాలంటే వ్యసనంగా మారిపోయాయేమో అనిపిస్తోంది. ఇలాంటి వార్తలు ప్రసారం చేసి తమ టి ఆర్ పి లు పెంచుకోవాలనే చానళ్ళకు కోటి దండాలు. మీడియా మీద ఏ కాస్తో మిగిలున్న నమ్మకాన్ని ఇలా చెడగొట్టే కంటే మూస్కుని ఇంట్లో కూర్చోండి. ఇప్పటికే తగలబడుతున్న రాష్ట్రం లో మరింత పెట్రోల్ పోయకండి........

Wednesday, January 6, 2010

R (రాయల సీమ) T (తెలంగాణా) C (కోస్టల్ ఆంధ్ర)

ఇన్నాళ్ళు ఎవడికి నచ్చినట్టు వాడు తనమీద కోపాన్ని చూపుతుంటే మూగగా భరించిన బస్సు ఇప్పుడు తనవంతంటోంది. ఆర్టీసీ అంటే R (రాయల సీమ) T (తెలంగాణా)  C (కోస్టల్ ఆంధ్ర) అన్నట్టు అందరికీ సమానంగా ఇన్నాళ్ళు సేవలందించి, మన కోపాలు, తాపాలు భరించిన ఎర్రబస్సు కళ్ళెర్ర చేసింది. తన కోపమే తన శత్రువు అన్న మాట ఇప్పటికయినా ఆందోళన కారులకు అర్ధం అయితే బస్సుల మీద ప్రతాపం చూపడం ఆపుతారని ఆశిద్దాం. లేదా ఇంకో సారి బస్సు ఛార్జీల వడ్డింపుకు సిద్ధపడదాం. 


నేను ఈ ఛార్జీల పెంపును సమర్ధిస్తున్నాను. (ఎందుకంటే అటు కార్మికుల జీతాలూ పెంచి, ఇటు ఆందోళనకారుల ఆగ్రహాలూ చూసిన ఎర్ర బస్సు బ్రతికి బట్టకట్టాలంటే ఈ పెంపు అవసరం అని నేను భావిస్తున్నాను..) 

Tuesday, January 5, 2010

అయినను పోయి వచ్చితిరి హస్తినకు.....

తెలుగులో "పుల్లయ్య వేమవరం" అని ఒక నానుడి ఉంది. మన నేతల తీరు తెన్నులు చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపించింది. పొలోమంటూ ఢిల్లీ చేరి చర్చిస్తాం, పొడి చేస్తాం అని వెళ్లి అసలేం జరిగిందో, జరుగుతోందో, జరగబోతోందో ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఆ తంతు కాస్తా ముగించారు. దీన్ని బట్టి "మనవాళ్ళుత్త వెధవలోయ్!" అన్న గిరీశం మాటలు నిజమే అనిపిస్తోంది. పైగా అక్కడికెళ్ళి దేశప్రజలందరి ముందూ మనకు కాస్తో...కూస్తో మిగిలున్న పరువు కూడా అరుపులు, కేకలు, నినాదాలతో తీసిపారేశారు. మీడియా ముందు సీనియర్ నేతలు కూడా పక్కవాడి శాలువా లాగడం, టోపీలతో ఆడుకోవడం చూస్తే అసలు వీళ్ళకి రాష్ట్రాన్ని బాగుచేయలన్న ఆలోచన ఉందని ఏ ఒక్కడైనా అనుకుంటాడా? . మొత్తం మీద అందరూ కలిసి సమస్య పేరుతొ రాజధానికి చేరి పిక్నిక్ చేసుకున్నట్టు ఉంది. మన నేతలిలా ఉన్నంతకాలం మన రాతలూ ఇలానే ఉంటాయి. ఏం చేస్తాం ఓటు హక్కు దుర్వినియోగం చేసిన పాపం ఊరికే పోతుందా!!!!!!

Saturday, January 2, 2010

శ్రీరంగం శ్రీనివాసరావు వందో హ్యాప్పీ బర్త్ డే ...సరదాకో సెవెన్ సిరిసిరిమువ్వలు

మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి వందో హ్యాప్పీ బర్త్ డే (స్కూలు రికార్డుల ప్రకారం...అసలు పుట్టిన రోజు ఏప్రిల్ ౩౦ న అని "అనంతం" చెప్తోంది)  సందర్భంగా  సరదాకో సెవెన్ సిరిసిరిమువ్వలు . ఆయన పెన్నుకి రెండువైపులా పదునే అని నిరూపించిన "సిరి సిరి మువ్వా! " శతకం లోంచి ...... 


కుర్చీలు విరిగి పొతే
కూర్చోడం మాననట్టు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే 
చేర్చదగు నొకింత చెత్త సిరిసిరి మువ్వా! 


ఖగరాట్ కృషి ఫలితంగా 
పొగాకు భూలోకమందు పుట్టెను గానీ 
పొగచుట్టలెన్ని అయినను
సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!


పెసలో,బొబ్బర్లో, వే
రుసేనగలో విక్రయించి రూపాయలు బొ
క్కసమున కెక్కించడమా 
సిసలైన కవిత్వ రచన సిరిసిరి మువ్వా! 


ఎప్పుడు పడితే అప్పుడు 
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్ 
చొప్పడిన ఊర నుండుము 
చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా!


ఉగ్గేల త్రాగుబోతుకు? 
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేలా కృష్ణ శాస్త్రికి ?
సిగ్గేలా భావకవికి సిరిసిరి మువ్వా!


మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు వ్రాయుటిది యెట్లన్నన్ 
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరి మువ్వా! 


మాస్కోకు వెళ్ళగలిగే 
ఆస్కారము లేకపోయినప్పటికైనన్
విస్కీ సేవిస్తూనే 
శ్రీ స్కీనై బ్రతుకగలను సిరిసిరి మువ్వా!
ఈ సందర్భంగా ఆయన కవిత్వం ఆయన నోటివెంటే వింటూ, చూడాలంటే "నేను శ్రీ శ్రీ ని  చూశానోచ్ !!!!" అంటూ ఆయన వీడియోలను సేకరించి మీకోసం అందించిన నా పాత పోస్ట్  ఇదిగో ....ఒక సారి చూసేయండి. 
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_15.html


(నచ్చితే ఆయనకి మనసులో విషెస్...నాకు బ్లాగ్ లో కామెంట్స్ మర్చిపోకండి)