Tuesday, June 1, 2010

పరమ బూతు పదం: "పాత్రికేయ విలువలు"

"పాత్రికేయ విలువలు" దీనంత బూతు పదం నాకు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. తాజాగా ఎన్ టివి కి ఎబియన్ ఆంద్రజ్యోతి ఛానెల్స్ మధ్య "స్వరూపానంద" విషయంలో జరుగుతున్న మీడియా పోరు చూస్తే అసహ్యం వేస్తోంది. ఒక్క ఈ రెండు ఛానెల్స్ అనే కాదు ఒకరు అవునంటే ఇంకొకరు కాదనాలి అనే సంస్కృతి ఈ మధ్య మీడియా లో వెర్రితలలు వేస్తోంది. వీధి కుక్కల కన్నా హీనంగా కొట్టుకుంటున్నారు (వీధి కుక్కలు నన్ను క్షమించాలి). అసలు ఏది వార్త, ఏది వార్త కాదు అనే కనీస అవగాహన కూడా మీడియా మర్చిపోతోందేమో అనిపిస్తోంది. దానికి తోడూ మేమే ముందు చెప్పాం అనిపించుకోవాలనే తాపత్రయం లో అడ్డమయిన విషయాల్ని వార్తలుగా చేసి పారేస్తున్నారు. ఇక మొన్న శ్రీకాళహస్తి రాజ గోపురం కూలిన ఘటనలో "ముందుగా హెచ్చరించింది మా ఛానలే" అని దాదాపు అన్ని న్యూస్ చానల్స్ డబ్బాలు కొట్టుకోవడం మరీ వింతగా ఉంది. "ముందుగా" అనేది అందరికీ ఎలా సాధ్యమో నాకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. 

ఇక "చర్చలు" అన్న పదం ఎంత కామెడీ గా మారిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చానెల్ కి  కొంత మంది స్టాండర్డ్ విశ్లేషకులు ఉంటారు, వీళ్ళు ఆవకాయ నుండి అణుశక్తి విధానం దాకా అన్నిటినీ విశ్లేషించేస్తారు పాపం!. పోనీ మిగతా వాళ్ళయినా సబ్జెక్ట్ తో సంబంధం ఉన్నవాళ్ళని పెడతారా అంటే అదీ లేదు. ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్రద్దలైన విషయం మీద అంబటి రాంబాబు ని చర్చకు పిలిచే టైపు వీళ్ళు.   

ఇకపోతే ఇంకో రకం సంస్కృతి ఈ మధ్య కనిపిస్తోంది. ఎవరయినా ఆడపిల్ల భర్త మీదో, లవర్ మీదో అతను అన్యాయం చేసాడని స్టూడియో కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే చాలు అసలు నిజానిజాలేంటో తెలుసుకోకుండా   వీళ్ళకి నచ్చిన హెడ్ లైన్స్ వీళ్ళు పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ప్రోగ్రాం గా మలిచేసుకుంటున్నారు. అసలు అలాంటి అన్యాయాలు జరగటం లేదు అని నేను అనట్లేదు అయితే నిజానిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఎంత వరకు న్యాయం? అనేదే నా ప్రశ్న. 

ముట్నూరి కృష్ణారావు గారిలాంటి పాత్రికేయులు ఇప్పుడు లేకపోవడం వాళ్ళ అదృష్టం. ఉంటే ఈ పరిణామాలకి గుండె పగిలి చనిపోయేవారేమో. 

Saturday, May 29, 2010

వీణ మీద వెస్ట్రన్ రాగం - డా. ఈమని శంకర శాస్త్రి వీణా విన్యాసం

వీణ మీద ఆమని కోయిల గానాలను సైతం అలవోకగా పలికించగలిగిన అద్భుత వైణికుడు డా. ఈమని శంకర శాస్త్రి గారి రెండు అపూర్వ సంగీత ప్రయోగాలను మీకు అందిస్తున్నా. వీణ మీద వెస్ట్రన్ మ్యూజిక్ పలికించినది ఒకటైతే, "ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బీ" పేరుతో భ్రమర విన్యాసాన్ని వీణ మీద పలికించిన చిత్రం మరొకటి (ఇందులో మీరు ఆయన గొంతు కూడా వినవచ్చు). ఈ రెండు మీకు నచ్చితే ఆయన మీటిన, నాకు చాలా ఇష్టమయిన అయిదు కీర్తనలని తరువాత పోస్ట్ లో అందిస్తాను. 



మీ అభిప్రాయాలని చెప్పడం మరచిపోకండి!

Thursday, March 25, 2010

మాయా బజార్ లో ఇంగ్లిష్ పాట ట్యూన్ ....పంటి కింద రాయి లాంటి నిజం


ఈ మధ్యే తెలిసిందీ విషయం. 1957 లో వచ్చిన మాయా బజార్ లో నట యశస్వి మన యస్వీ రంగారావు ప్రాణం పోసిన "వివాహ భోజనంబు' పాటకు స్ఫూర్తి (ఎందుకంటే కాపీ అనుకోడానికి మనసొప్పదు) 1922 లో వచ్చిన "ద లాఫింగ్ పోలీస్ మేన్ ' అనే ఇంగ్లిష్ పాటట. ఈపాట అప్పట్లో బిబిసి లో మారుమ్రోగేదట. పాట విన్నాక ఏమో కావచ్చేమో అనిపించింది. ఒక సారి మీరూ విని చూడండి. మీకోసం ఆ రెండు పాటల లింకులూ క్రింద ఇస్తున్నాను. 



(ఈ పోస్ట్ మీకు నచ్చితే ఓ కామెంట్ వేస్కోండి :) )



Wednesday, March 3, 2010

స్వర్గం నేలకు దింపి...కట్టించారేమో హంపి


ఫిబ్రవరి 16 , 2009 - మా మొదటి పెళ్లిరోజు సందర్భంగా (ఇక్కడ మొదటి అనేది పెళ్లి రోజుకే కానీ పెళ్లికి కాదని మనవి :)  ఎక్కడికి వెళ్దామా అని యమ సీరియస్ గా ఆలోచిస్తూ నేను, మా ఆవిడా మొత్తం భారతదేశంలోని దర్శనీయ స్థలాలన్నిటినీ కాచి వడబోసి చివరాఖరికి హంపిని ఫైనల్ చేసాం. ఫిబ్రవరి పద్నాలుగున కాచిగూడ నుంచి బయల్దేరి హోస్పేట చేరుకున్నాం. అక్కడనుంచి హంపి ఆరు కి.మీ. ముందే కర్ణాటక టూరిజం వాళ్ళ మయూర భువనేశ్వరి లో రూం బుక్ చేసుకుని ఉన్నందువలన డైరెక్ట్ గా ఆటో లో అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయి ఊరి మీద పడ్డాం. మొత్తం మూడు రోజుల మా ట్రిప్ లో మొదటి రోజు గైడ్ ని మాట్లాడుకుని అతను ఎవరో తరుముతున్నట్టు అన్నీ హడావుడిగా చూపించడం తో నచ్చక రెండవ రోజు మేమే బైక్ అద్దెకు తీసుకుని హంపి ని నచ్చిన చోట ఆగుతూ తెగ తిరిగేసాం. హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం (నిజానికి ఇది లక్ష్మీ నరసింహ శిల్పం...కానీ విజయనగర సామ్రాజ్య లక్ష్మి లాగే ఈ విగ్రహం లో లక్ష్మి ని కూడా బహమనీలు నాశనం చేశారట..ఒక్క ఈ శిల్పం అనేముంది లెండి చాలామటుకు గుళ్ళను, శిల్పాలను ఆరు నెలల పాటు హంపి లో ఉండి చేసినంత వరకు నాశనం చేసి ఇక ఓపిక నశించో ఏమో గర్భగుడులలో విగ్రహాలను నాశనం చేసి ఆ గుళ్ళను నిరుపయోగం చేసారట...వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి), ఏకశిలా రధం (నిజానికి ఇది ఏడు శిలలతో చెక్కింది కానీ ఎందుకో మనవాళ్ళు అలా అనేస్తారు), సంగీతం పలికే స్తంభాలు, హజార రామాలయం, దసరా దిబ్బ (ఇక్కడే దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవట), అష్ట లక్ష్మి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు (ఆలయం పోయి కోనేరు మిగిలింది...ఇది మాత్రం చూసి తీరవలసిన రీతిలో కట్టారు లెండి), ఇలా ఒక్క విరూపాక్ష దేవాలయం తప్ప అన్నీ చూసేసాం (అది మాత్రం చివరి రోజు ప్రశాంతం గా చూద్దాం అని ఆగాము...అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతాయి). అన్నట్టు హంపి ప్రాంతం రామాయణం టైం లో కిష్కిందగా పిలవబడేదట (అంటే వానర రాజ్యం లో వివాహ వార్షికోత్సవం అన్నమాట ) మూడో రోజు కాబ్ మాట్లాడుకుని ఉదయాన్నే బాదామి గుహలు చూసేందుకు బయల్దేరాం. దారిలో చాళుక్యుల కులదైవం అయిన  బనశంకరి దేవత గుడిని దర్శించి పదిన్నర అయ్యేటప్పటికి బాదామి గుహలకు చేరుకున్నాం. కారు దిగి తలెత్తి చూసేసరికి నాల్గంతస్తులుగా మలచిన గుహలు సరిలేరు మాకేవ్వరు అన్నట్టు స్వాగతం పలుకుతూ కనిపించాయి.
(మిగిలిన సంగతులు ఇంకో సారి  చెప్తా...అందాకా ఈ ఫొటోస్ చూసేయండి...హంపిలో అణువణువూ అద్భుతమే కాబట్టి వాటిలో మరీ అద్భుతమైనవి అని నాకు అనిపించినవి మాత్రమె ఇక్కడ అందిస్తున్నాను..)

ససివేకలు (ఆవాలని అర్ధమాట) వినాయకుడిగా పిలవబడే ఈ ఎనిమిది అడుగుల విగ్రహం ముందు నుంచి చూస్తే వినాయకుడిలా వెనుక నుంచి చూస్తే స్త్రీమూర్తి కూర్చుని ఉన్న భంగిమలో కనిపిస్తుంది)














ఇక ఈ విగ్రహానికి కాస్త దూరం లో ఉన్న కడలెకలు వినాయకుడిగా పిలవబడే పదిహేను అడుగుల వినాయక విగ్రహం ఇంకా విచిత్రం. ముందు నుంచి వినాయకుడిగా, వెనుక నుంచి స్త్రీమూర్తి కూర్చి ఉన్నట్టుగా, ఎడమ పక్క ఒక యాంగిల్ నుంచి చూస్తే వరాహావతారం లా (యద్భావం తద్భవతి లా) అనిపిస్తుంది. అయితే గుడి లోపలంతా పూర్తి చీకటిగా ఉంటుంది కాబట్టి టార్చ్ తీసుకెళ్తే మంచిది) బయటకొచ్చి ఎడమ వైపు చూస్తే కనిపించే  విరూపాక్షాలయం గోపురం చూడటానికి భలే ఉంటుంది.



ఇక ఇదిగో హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం. 
ఇక హంపి లోని శ్రీ కృష్ణాలయం ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన కొంత మంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ పెయింటింగ్ వేస్తుండగా తీసిన ఫోటోలివి .
















































(మరి కొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో.... ఇవి ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి :)


Friday, February 12, 2010

బాదామి గుహలలో నటరాజుకు పద్దెనిమిది చేతులు - ఇదిగో చూడండి




అసలు ఈ పోస్ట్ నేను త్వరలో పెట్టబోయే హంపి టూరు విశేషాలలో పెడదామనుకున్నా. సర్లే ఎలాగూ శివరాత్రి కదా మీకు ఈ అద్భుతమైన నటరాజు విగ్రహం చూపిస్తే కుసింత వెరయిటీగా ఉంటుందేమో అనిపించి ఇప్పుడే ఇచ్చేస్తున్నా.

ఇక విషయానికొస్తే హంపి కి దగ్గరలో ఉన్న (మరీ అంత దగ్గరేం కాదు లెండి ఓ నాల్గు గంటలు ఉంటుంది జర్నీ) బాదామి గుహలలో చాళుక్యుల కాలం నాటి గుహాలయాలు ఉన్నాయి. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయాలలో ప్రతి అణువూ ఒక శిల్ప కళా అద్భుతమే. గుహను గదిలా తొలుస్తూ అందులోనే స్తంభాలు (అచ్చు గుద్దినట్టు అన్నీ ఒకే కొలతలు, ఆ శిల్పుల  పర్ఫెక్షన్ కి కనిపిస్తే కాళ్ళ మీద పడిపోదాం అనిపించింది), గుహ పై కప్పును కూడా వదలకుండా ప్రతి అంగుళం ఒక అద్భుతం అనిపించేలా చెక్కారు. మొదటి మూడు అంతస్తులూ హిందూ మత శైలి కనిపించింది నాల్గవ దాని టైం కి ఆ రాజ్యం లో జైన మత ప్రభావం ఉందనుకుంటా అక్కడన్నీ జైన గురువుల శిల్పాలు. ప్రతి చోటా నిజంగా ఆ దేవుళ్ళే ఈ శిల్పాలకి మోడల్స్ గా పనిచేశారా అనిపిస్తుంది (చెప్పొద్దూ.. అదంతా చూసి ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా? అనిపించింది) 

ఇక బాదామి గుహల మొదటి అంతస్తులోనే మనల్ని పలకరించేదే నేను చెప్పిన నటరాజు విగ్రహం. భరత నాట్యం లో ఉండే ఎనభై ఒక్క ముద్రలని కళ్ళ ముందు ఉంచేలా పద్దెనిమిది చేతులతో నటరాజు విగ్రహాన్ని చెక్కారు. ఏ రెండు చేతులని కలిపి చూసినా ఒక ముద్ర వస్తుందన్న మాట. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు (ట). అసలు అలాంటి శిల్పాన్ని చేక్కించాలన్న ఐడియా ఎవరికీ వచ్చిందో గానీ నిజంగా తెగ నచ్చేసింది ఆ శిల్పం. ఇదిగో మీరూ చూడండి.
(మనలో మనమాట దీన్ని బాపు బొమ్మగా గీస్తే చూడాలనిపించింది నాకు.....ఎవరయినా ఆయనకీ విషయం చెప్తే బాగుండును! :)) 







































































Monday, February 8, 2010

జాటర్ ఢమాల్ ......వీడే బుడుగు...చిచ్చుల పిడుగు

చా.................లా..లా .లా రోజులయిపోయింది నేను పోస్టు పెట్టి. అసలు ఈ వారం విపరీతంగా బిజీ అయిపోయి బ్లాగడానికి కుదరలేదు. ఇదిగో కాస్త తీరిక దొరికింది, బ్లాగుదాం అని ప్రారంభించి ఏం రాద్దామా అని ఆలోచిస్తున్నా...ఇంతలో ఒరేయ్ గారూ అంటూ బుడుగు ముందుకొచ్చి..."అహ నాకు తెలియకడుగుతున్నా అసలు నువ్వు బాపు, రమణలకు ఫ్యానువేనా? పైగా నీ ప్రొఫైల్ లో రమణ రచనలంటే అదేదో ఇది అని వెధవ కబుర్లొకటి, హన్నా! . కాబట్టి నువ్వర్జన్టుగా మన రమణ గాడు(రు) చేసిన గోప్పెష్టు క్రియేషన్ ఏదయినా నీ బ్లాగ్ ఫ్రెండులకి ఇచ్చెయ్యి. అఫ్కోర్స్ నువ్వు ఇంతవరకు నా గురించి నీ బ్లాగులో పెట్టలేదనుకో.. నేను ఆ విషయం అడక్కపోయినా ఇప్పుడు చచ్చినట్టు పెట్టి తీరతావనుకో....లేక పోతే నీకు ప్రైవేటు తప్పదని నీకు తెలుసనుకో..." అంటూ ఎడా పెడా వాయించేసాడు. ఇక అలాంటి రిక్వెస్టింగ్ ఆర్డర్ వేశాక తప్పుతుందా. 

అయినా బుడుగు గురించి మీకు పరిచయం చెయ్యడం అంటే ఆవకాయ గురించి తెలుగోడికి పరిచయం చేసినట్టే కాబట్టి ఆ బాపుబొమ్మ.కాం లో దొరికిన ఆ  బుడుగు  ఈ- బుక్ ని మీకు లింకుగా ఇస్తున్నా. ఆల్రెడీ చదివేశాం అంటారా. మళ్ళీ చదవండి...ఏం.. మాయా బజార్ మళ్ళీ వస్తే చూడట్లేదూ...ఇదీ అంతే! 


(పోస్టు బావుందని చచ్చినట్టు ఒప్పుకోకపోతే మీ పని  జాటర్ ఢమాలే! అని కూడా చెప్పమన్నాడు )

Tuesday, January 26, 2010

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఇంగ్లీష్ పాట......అద్భుతం, అపురూపం

రిపబ్లిక్ డే షష్టి పూర్తి సందర్భంగా నా బ్లాగ్ లో స్పెషల్ గా ఏం పెట్టాలా అని ఆలోచించినప్పుడు ఐక్య రాజ్య సమితిలో కచేరీ చేసిన సందర్భంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఒక అరుదయిన, అపూర్వమయిన ఇంగ్లిష్ సాంగ్ గుర్తొచ్చింది. అన్నట్టు ఇందులో స్వతంత్ర భారతదేశం లో ఏకైక గవర్నర్ జనరల్ అయిన "రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలచారి)" గొంతు మిమ్మల్ని ముందుగా పలకరిస్తుంది. (అయితే ఈ క్రింద పేరా చదివిన తరువాతే మీరు ఆ లింక్ దగ్గరకి వెళ్ళండి)


అసలైతే ఈ ఆడియో మీతో పంచుకోకూడదు అనుకునేంత కోపం వచ్చేసింది నాకు. ఎందుకంటే "ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి " అంటూ ఆవిడ నటించిన తొలి హిందీ సినిమా "మీరా" పాట వీడియోలతో  నేను డిశంబర్ ఇరవై నాల్గున పోస్ట్ పెడితే  కేవలం మూడంటే మూడే కామెంట్స్ వచ్చాయి (శిశిర గారు, సత్యసాయి కొవ్వలి గారు , సంతోష్ గారు) పోనీ అలా అని ఎవరూ చూడలేదు అనుకుందామా ఇప్పటికి దాదాపు యాభై మంది ఆ క్లిపింగ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఆవిడ పాడిన అన్నమయ్య పాటలతో నేను పెట్టిన పోస్ట్ లకి ఒక్కటంటే ఒక్కే కామెంట్ (మ్యాడీ గారు) కానీ ఒక నలభై మందిదాకా డౌన్లోడ్ చేసుకున్నారు. పోనీ కామెంట్ పెట్టడానికి బద్దకిస్తున్నారులే అని సరిపెట్టుకుందామంటే అదే ఏ కె.సి ఆర్ మీదో, తెలంగాణా మీదో పోస్ట్ పెడితే ఇహ చూస్కోండి తెగ కామెంట్స్..." మాయా బజార్ లో అహ నా పెళ్ళంట" పాట పారడి కి పాతికకు పైగా వచ్చిన కామెంట్స్ అదే "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" పాట అంటే ఎందుకు రావటం లేదు అనేది నాకు అర్ధం కావటం లేదు.
(ఇదేదో మిమ్మల్ని కామెంట్ చేస్తారా చస్తారా అని బెదిరించేందుకు కాదు :) ......నాకు కలుక్కుమంది ...చెప్పానంతే)


సరే ఆ గొడవ వదిలేసి ఈ పాట ఎంజాయ్ చెయ్యండి. ఇది అరవై ఆరు లో  ఐక్య రాజ్య సమితిలో ఎమ్మెస్ కచేరి లైవ్ రికార్డింగ్ ఆడియో....ఇది మీకు నచ్చితే ఆ మొత్తం కచేరి ఆడియో క్లిప్ లు పోస్ట్ చేస్తాను. లింక్ కింద ఇస్తున్నాను


Saturday, January 23, 2010

ఎమ్మెస్ గొంతులో అన్నమయ్య కీర్తన - పసిడి గిన్నెలో పాల బువ్వ - రెండవ భాగం

మెదటి భాగం లో ఎమ్మెస్ పాడిన అన్నమయ్య కీర్తనలలో నాకు ఇష్టమయిన ఏడు కీర్తనలని అందించాను. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను 


ఇక "డోలాయాం" కీర్తన నాకు ఎంత ఇష్టం అంటే దాన్ని ఆవిడే స్వయంగా పాడుతున్న క్లిప్ ఎక్కడయినా దొరుకుతుందేమో అని నెట్ లో వెతుకుతుంటే దూరదర్శన్  ఆర్కైవ్స్ లో ఉన్న ఈ క్లిప్ యూట్యూబ్ లో దొరికింది. ఎప్పటిలానే హై క్వాలిటీ ఎంపి4 గా మార్చి మీకు అందిస్తున్నాను. ఈ వీడియో లో సరిగ్గా ఇరవై ఒకటవ సెకన్ వద్ద "డోలాయాం" అంటున్నప్పుడు ఆవిడ ఇచ్చిన  expression నాకు విపరీతంగా నచ్చేసింది. 



మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి

Friday, January 22, 2010

బ్లాగ్మిత్రులారా ఏకంకండి....బ్లాగ్గర్స్ జేఏసి పిలుస్తోంది కదలిరండి!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఏంటో అటు కోస్తా, రాయలసీమలలో ...ఇటు తెలంగాణా లో రోజుకొక్క జేఏసి పుట్టుకొస్తోంది. ప్రతి యూనివర్సిటీకొక జేఏసి, లాయర్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, పార్టీకి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వూరికొకటి, చెట్టుకొకటి, పుట్టకొకటి చొప్పున జేఏసి లు..వాటిలో మళ్ళీ వర్గ జేఏసి లు పుట్టుకొస్తున్నపుడు ఇవన్నీ చూసి  ఏం? మన బ్లాగ్గర్స్ ఎందులో తీసిపోయారని అనిపించి బ్లాగ్గర్స్ జేఏసి ప్రారంభిద్దామని డిసైడ్ అయిపోయా. దీని కార్యవర్గం లో ఎవరెవరు ఉండాలో మీరే సలహా ఇవ్వండి.

అలాకాదూ....మళ్ళీ ఇందులో కూడా మహిళా బ్లాగ్గర్లు, పురుష బ్లాగ్గర్లు, బాల బ్లాగ్గర్లు, వృద్ధ బ్లాగ్గర్లు, తెలంగాణా బ్లాగ్గర్లు, ఆంధ్ర బ్లాగ్గర్లు, ఉత్తరాంధ్ర బ్లాగ్గర్లు, రాయలసీమ బ్లాగ్గర్లు, ప్రవాసాంధ్ర బ్లాగ్గర్లు, బ్లాగ్ స్పాట్  బ్లాగ్గర్లు, వర్డ్ ప్రెస్ బ్లాగ్గర్లు ఇంకా నానా రకాల బ్లాగ్గర్ల విడివిడి జేఏసి లు ఉండాలంటారా....మీ గొడవ మీరు పడండి...నేను మాత్రం నా స్వంత జేఏసి ప్రారంభిన్చేసుకుంటా....వద్దామనుకున్నా వాళ్ళు రావచ్చు. 

ఇంతకీ జేఏసి లక్ష్యం ఏంటి అంటారా?.....ఏమో ఇప్పటి దాకా ఉన్న ఏ జేఏసి కి మాత్రం వాళ్ళ లక్ష్యం ఖచ్చితం గా తెలిసి ఏడిసింది కనుక...

(నాకు మొదటి కామెంట్ చేసిన వాళ్లకి నా జేఏసి కన్వీనర్ పదవి ఇచ్చేస్తానోచ్!!!!!! త్వరపడండి)

Tuesday, January 19, 2010

ఆవిడ గొంతులో అన్నమయ్య కీర్తన - పసిడి గిన్నెలో పాల బువ్వ


నాకు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గాత్రమంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడని చూస్తే సామవేదం మనిషి రూపం ధరించిందా అనిపిస్తుంది. ఇంక  అన్నమయ్య కీర్తనన్నా అంతే ఇష్టం . అలాంటి అన్నమయ్య కీర్తన ఆవిడ గొంతులో వింటే నా సామిరంగా! అమ్మ వొళ్ళో పడుకుని ఆదమరచి నిద్రోతున్నంత ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ పాడిన నాకు బాగా ఇష్టమయిన సప్త స్వరాల్లాంటి ఏడు అన్నమయ్య కీర్తనలు మీతో పంచుకుందాం అనిపించింది. ఒక్క సారి కళ్ళు మూసుకుని ఆ గొంతులో అన్నమయ్య కీర్తనలు విని చూడండి.....దేవుడు కూడా పసిపిల్లాడై కేరింతలు కొడుతున్నట్టు మీకు అనిపించక పోతే నన్నడగండి. ఇక మీకూ ఆవిడంటే ఇష్టమయితే " ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి" అన్న నా పోస్ట్ http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_24.html చూడండి (ఇందులో ఆవిడ నటించిన మీరా సినిమాలో నాకిష్టమయిన పాట ఉంది).

ఇక ఆ ఏడు పాటల లింకులు కింద ఇస్తున్నాను, విని మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి. .