(ఏదో ఒక సారి రెండు సార్లు ధరలు పెంచితే స్పందించి పోస్ట్ రాస్తాం కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంటే ఎన్ని పోస్టులని మాత్రం రాస్తాం చెప్పండి? ఇప్పుడు గ్యాస్, డీజిల్ ధరలు పెంచి 'జనాలు భరించగలరు' అన్న మంత్రిగారి ఉవాచ చూసి ఈ మాట ఎక్కడో విన్నానే అని పాత పోస్టులు తిరగేస్తే ఇదిగో ఈ పోస్ట్ కనిపించింది. చిత్రంగా ఈ పోస్ట్ గత ఏడాది ఇదే రోజు రాసినది. అప్పటికీ ఇప్పటికీ పెట్రోలియం శాఖా మంత్రి మారారు గానీ వాళ్ళు చెప్పే మాట మారకపోవడం విచిత్రం. అవును మరి మన మంత్రులంతా ఒకే మాట మీద ఉండటం మన ప్రజాస్వామ్యానికి గౌరవం కాదూ. వాళ్ళే మాట మార్చనప్పుడు నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే. )
"ప్రజలు భరించగలిగే స్థాయిలోనే పెట్రో ధరలు పెంచాం" - కేంద్రం
టివి లో ఈ స్టేట్మెంట్ చూసి బోల్డంత హాశ్చర్యం వేసేసింది. అసలు ప్రజలు ఎంతవరకూ భరించగలరో వీళ్ళకి ఎలా తెలుసా అని? తరవాత గుర్తొచ్చింది మన దేశం లో ఏ విషయాన్నయినా, ఎంతవరకయినా భరించడమే తప్ప అదేంటని ప్రశ్నించడం మనకెప్పుడూ అలవాటు లేదని. నిజమే స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం. మనం ఎన్నుకున్న నాయకులు తాము చేసిన వాగ్దానాలు మరచి సొంత లాభం కోసం అడ్డమయిన గడ్డీ కరుస్తుంటే మౌనంగా భరిస్తాం. మన ఖర్మ అని సరిపెట్టుకుంటాం. అవును మరి అందరూ దొంగలే అయినప్పుడు వాడికన్నా వీడు కాస్త మంచి దొంగ అని సరిపెట్టుకోవాల్సిందే కదా!
సరే ఇంక పెట్రోలు విషయానికి వస్తే...చమురు ధరలపై నియంత్రణ ఎత్తేశాం అని కేంద్రం ఘనంగా ప్రకటించింది, అక్కడికేదో ఇప్పుడు అన్నిటి మీదా నియంత్రణ ఉన్నట్టు. జనం జేబుకు చిల్లు పడ్డా పర్లేదు కానీ చమురు కంపెనీలు మాత్రం చల్లగుండాలి ఇదీ మన కేంద్ర విధానం. పైగా నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోలు రేట్లు పెరగచ్చు కనక కానీ రేట్లు తగ్గితే పెట్రోలు రేట్లు మంచినీళ్ళ కన్నా చీప్ అయిపోతాయి( మన ఖర్మ చివరికి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది), ఎక్కువమంది పెట్టుబడి దారులు ఈ రంగం లోకి వచ్చి పోటీ పెరిగి ధరలు తగ్గిపోతాయి అని ఒక వింత వాదన. అందుకు టెలికం రంగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు అమ్మగారి అడుగులకు మడుగులోత్తే అమాయక నేతలు. సాంకేతికత తో ముడిపడ్డ రంగానికి, సహజ వనరులతో ముడిపడ్డ రంగానికి సామ్యం తేవడం వీరికే చెల్లింది. అసలు చమురు కంపెనీల మీద వడ్డిస్తున్న పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా చమురు ధరలూ తగ్గుతాయిగా...అమ్మమ్మ ఎంత మాట? అలాంటి వాటిమీద పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే అసలు అనకూడని, వినకూడని మాట. అయినా ఎంత పెంచినా అన్నీ మూస్కుని భరించడానికి జనం ఉండగా పన్నులు తగ్గించి మన ఖజానా బరువెందుకు తగ్గించుకోవాలని పాపం వాళ్ళ ఆలోచన. అదీ నిజమే లెండి భరించడం మన జన్మ హక్కు మరి. అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో :)
ఇక మొదలవుతుంది అసలు కధ, ఒక్క పెట్రోలు, డీజిల్ రేట్లతోనే ఈ కధ ఆగుతుందా? నిత్యావసరాల దగ్గర నుంచీ ప్రతీ వస్తువు ధారా ఈ సాకుతో అమాంతం పెరిగిపోతుంది. అయినా మనం చిరునవ్వులు చిందిద్దాం.
పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం
7 comments:
బాగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వమేమో ప్రజల దగ్గర డబ్బు మూలుగుతోంది, అందుకే విరివిగా మద్యం కొంటున్నారు అంటోంది. ఇక మద్యమే కొనాలో, పెట్రోలే కొనాలో, మద్యాన్నే కార్లలో బైకుల్లో వాడాలో, లేక పెట్రోల్ని మద్యంలా తాగాలో - ఇంక ప్రజలకి ఎన్ని ఛాయిస్‌లో!
చాలా బాగా చెప్పారు. ఇక జనానికి మునగడమే మిగిలింది. చూద్దాం భరిస్తారో, తరిస్తారో!
ఇంతవరకూ బానే ఉంది. పెంచారు తగ్గించారు!! కానీ, అవసరం లేకుండా ఉత్తిపుణ్యానికి పెట్రోలు వాడకం తగ్గిందాం అనిమాత్రం ఎవ్వరికీ లేదు. సిగరెట్టు తాగటానికి బండిమీద వెళ్ళి పెట్రోలు తగలేసి, దమ్ముకొట్టి ఇలా డబుల్ ధమాకా పొగలు వాతావరణంలో కలుపుతున్నారు నేటి సత్-జనులు. పెట్రోలు మరి పెరక్క ఏమౌతుందీ?
ధరలు – వ్యధలు (వార్తావ్యాఖ్య – భండారు శ్రీనివాసరావు) ti
పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.
ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.
ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.
ఇదంతా ఎందుకు జరుగుతోంది ?
మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.
వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ – సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప. (25-06-2010)
LPG సిలెండరు ధర ఎంత ఉన్నా రౌండు ఫిగరుగా ఎక్కువ మొత్తం ఇచ్చి ఆ పైన చిల్లర వదిలేసుకోక తప్పదు .
లేదు కచ్చితంగా ఇస్తే ఇక మరుసటి నెల నుండి సరైన సమయానికి సిలండరు అందదు - లోపలికి / మేడ పైకి తెచ్చి పెట్టనంటాడు డెలివరీ అతను ...
be happy at least fuel consumption reduces(I always get 100Rs Petrol in my byke
@ gpvprasad : not sure if we get the correct measurement of Petrol / Diesel for the exact amount we pay at the bunks :(
Post a Comment