Friday, March 25, 2011

కాకినాడ కబుర్లు - పార్ట్ 2 - "సినిమా హాల్ స్ట్రీట్"



కాకినాడ కబుర్లు మొదటి పార్ట్ లో కాకినాడ కాజా రుచి చూసారుగా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంకో స్పెషల్ గురించి చెప్తాను. రెడీయా?  స్పెషలంటే అలాంటి ఇలాంటి స్పెషల్ కాదు మరి. సినిమా స్పెషల్. తెలుగోడికి, సినిమాలకి ఉన్న సంబంధం మీకు తెలిసిందే కదా, మా ఊళ్ళో ఇంకో అడుగు ముందుకేసి ఒక వీధి మొత్తం వరుసగా సినిమా హాళ్ళు ఉంటాయన్నమాట. దాని సినిమా హాల్ స్ట్రీట్ అంటారు. అలా అని కేవలం ఆ వీధి లోనే సినిమా హాల్స్ ఉంటాయనుకున్నారు, మెయిన్ రోడ్ మీదా, మిగిలిన ఏరియాలలో కూడా కొన్ని  సినిమా హాల్స్ ఉన్నాయి లెండి. వాటి గురించీ ఇప్పుడే చెప్పెసుకుందాం. ఇంక సినిమా హాల్ స్ట్రీట్ విషయానికొస్తే పండగ రోజుల్లో, శలవుల్లో ఇంటికి ఎవరైనా వస్తే జగన్నాధ పురం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్న సినిమా హాల్స్ లో ఏదో ఒక దాంట్లో టికెట్ దొరక్కపోదు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మిమ్మల్ని మా ఊరికి మాత్రమే ప్రత్యేకమయిన సినిమా హాల్ స్ట్రీట్ టూర్ చేయించనున్నానన్నమాట. రెడీయా?

ముందు జగన్నాధపురం వంతెన దగ్గర నుంచి బయల్దేరదాం. వంతెన దాటేసారుగా ఆ ఇప్పుడు కుడి చేతి వైపు తిరగండి. పదండి ఆ రోడ్లోకి. పోలీస్ స్టేషన్, bsnl ఆఫీసు దాటేసి ఎడం చేతి వైపు కనిపించే రోడ్డు మొదట్లో ఆగండి. రోడ్డు కనిపించిందా? అద్గదీ అదే మా ఊరి సినిమా హాల్ స్ట్రీట్ అన్నమాట. ఇంకేంటి చూస్తున్నారు పదండి.
Add caption

అదిగో మొట్టమొదటిగా కుడిచేతి వైపు కనిపిస్తోందే, అదే స్వప్న థియేటర్. పెద్ద గేటు దాటుకు ముందుకి వెళ్తే లోపల గుబురుగా ఉన్న వెదురు పొద దాని చుట్టూ సిమెంట్ బెంచీలు, అక్కడ కూర్చుని బుకింగ్ కౌంటర్ ఎప్పుడు తెరుస్తారా అని చూసే జనాలు కనిపించారా? ఆల్రైట్..కుసింత ముందుకెళ్ళి ఎడం చేతి వైపు చూడండి అక్కడో థియేటర్ ఉంది. ఎక్కడుందీ అని వెతుకుతున్నారా? లోపలెక్కడో ఉంటుంది. బయట నుంచి కనబడే థియేటర్ టైపు కాదిది. బయట అందరికీ సినిమా కెల్తున్నామోచ్ అని చాటుకుని వెళ్ళే థియేటర్ కూడా కాదులెండి. ఆ థియేటర్ పేరు ప్యాలెస్. కేవలం పెద్దలకు మాత్రమే థియేటర్ అది. 

చాల్చాలు. పదండి. అదిగో ఆ కుడిపక్క ఇంకో థియేటర్ ఉంది కదా అదే లక్ష్మి థియేటర్. చూసారా. పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆగండి ఆ కుడిచేతి వైపు పొడుగాటి వీధిలా ఉన్న థియేటర్ కనబడిందా? అది మా కాకినాడ వాళ్ళు గర్వం గా చెప్పుకునే థియేటర్లలో ఒకటైన సత్యగౌరి. మొదట్లో మా చిన్నప్పుడు ఇక్కడ కేవలం ఇంగ్లిష్ సినిమాలే ఆడేవి. రాంబో, ఆర్మార్ ఆఫ్ ది గాడ్ లాంటి సినిమాలు ఇక్కడే చూసాం. తరవాత తెలుగు సినిమాలు కూడా మొదలెట్టాడు. అప్పుడు ఖుషీ, మాస్టర్ లాంటివి చూసామన్నమాట. అన్నట్టు ఇక్కడ బ్లాక్ టికెట్ల గొడవుండదు. ఇంక సౌండ్ సిస్టం అంటారా? కేకో కేక. మా ఊరోళ్ళుఅందరూ ముక్త కంఠం తో చెప్పే మాట "సత్య గౌరీ" వాడు మెయిన్టైన్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు అని. అంత బావుంటుంది ఈ థియేటర్. వీడి దగ్గర క్యాంటీన్ లో సేమ్య ఉప్మా, పూరి భలే ఉంటాయిలెండి. ఇంకా చాలా ఉన్నాయి పదండి పదండి.

ఆ సంత చెరువు దగ్గరకి వచ్చేసాం. ఆ నెక్స్ట్ కుడి చేతి వైపు ఒక థియేటర్ కనిపిస్తోంది కదా. ఆ థియేటర్ గురించి మీకు కుసింత చెప్పాల్లెండి. దాని పేరు మెజిస్టిక్ థియేటర్. ఇక్కడ ఒక నాటక సమాజం కూడా ఉండేది.యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని. ఆ నాటక సమాజం నుంచే సినీ పరిశ్రమకు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. అబ్బే పెద్ద పేరున్న వాళ్ళు కాదు లెండి. ఏదో ఎస్వీ రంగారావు, అంజలీదేవి లాంటి వాళ్ళన్నమాట. పదండి ఆ పక్కనే ఇంకో థియేటర్ కనిపిస్తోంది కదా అది కాస్త కొత్త థియేటర్. "మయూరి" అని. ఇంకాస్త ముందుకేల్తే "పద్మనాభ థియేటర్". రండి ఇంకాస్త ముందుకి వెళ్దాం.


















ఆ ఎడం చేతి వైపు ఒక పెద్ద పెట్రోల్ బంక్ కనిపిస్తోందా? దాని ప్లేస్ లో మా చిన్నప్పుడు రెండు థియేటర్ లు ఉండేవి. క్రౌన్, విజయ్ అని. అవి మొదటి తరం థియేటర్ల కోటాలోకి వస్తాయి. అన్నట్టు ఇందాకా చూసిన మెజిస్టిక్ కూడా ఆ బాపతే. ఇంకాస్త ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పెద్ద రోడ్ కనిపిస్తోందా? అది దేవి, శ్రీదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్ అన్నమాట. మొదట్లో ఈ కాంప్లెక్స్ లో దేవి, శ్రీదేవి మాత్రమే ఉండేవి, ఆ తర్వాత రుక్మిణి, పద్మ అని ఇంకో రెండు థియేటర్లు కట్టారు. మొత్తం నాలుగు థియేటర్లు ఓకే కాంప్లెక్స్ లో అన్నమాట. అన్నట్టు బ్లాక్ టికెట్లు ఈ కాంప్లెక్స్ లో దొరికినట్టుగా ఇంకెక్కడా దొరకవు. అంత పేరుంది ఈ థియేటర్లకి. పదండి పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి కాళ్ళు నొప్పెడుతున్నాయా? ఆ ముందు ఉడిపి వీనస్ భవన్ లో ఒక టీ కొట్టి వెళ్దాం లెండి. 

వచ్చేసాం. ఇదే మున్సిపల్ ఆఫీస్ సెంటర్. అదిగో ఆ కుడిచేతి పక్కన కనిపిస్తోంది అదే "కల్పన" థియేటర్. ఇదిగో ఇదే ఉడిపి వీనస్ భవన్. ఏంటి టీ అన్నాను కదా అని గుర్తు చేస్తున్నారా? ఒక్క నిమిషం కొద్దిగా ముందు ఇంకో మూడు థియేటర్లు ఉన్నాయి. దానితో సినిమా హాల్ స్ట్రీట్లో ఉన్న థియేటర్లు అయిపోతాయి. అవి కూడా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ తాగి తరవాత  మెయిన్ రోడ్ లో ఉన్న సినిమా హాల్స్, మా ఊర్లో ఉన్న మిగిలిన థియేటర్ల ని చూసొద్దాం. ఓ..కే నా. పదండి.

అదిగో ఆ కుడి చేతి వైపు కనబడేదే మున్సిపల్ ఆఫీసు. ఆ రోడ్డు కనబడుతోంది చూసారా? తిన్నగా వెళ్తే సాంబమూర్తి నగర్ మీదుగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. ఇంకోసారెప్పుడైనా తీసుకెళ్తాలెండి. అదిగో ఆ ఎడం చేతి వైపు చూడండి అదే "సూర్య కళా మందిర్ అనబడే సరస్వతీ గాన సభ". ఆంధ్రప్రదేశ్ లో సంగీత విద్వాంసులు, నటులు ఇలా కళాకారులందరూ ఈ వేదిక మీద ఒక్కసారైనా ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత పేరుంది దీనికి. దీని గురించి మళ్ళీ ఒక సెపరేటు పోస్ట్ వేసుకుంటా. ఆ పక్కనే వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారిపోయింది అనుకోండి. దాని పక్కనే పెద్ద బిల్డింగ్ కనిపిస్తోందా? అవే చాణక్య, చంద్ర గుప్త థియేటర్లు. అదండీ సినిమా హాల్ స్ట్రీట్. ఇక్కడితో ఈ వీధిలో సినిమా హాళ్ళు అయిపోయాయి. మరి రోడ్డింకా ఉంది కదా అంటారా? తిన్నగా వెళ్తే ఆనందభారతి, కొత్తపేట మార్కెట్ దగ్గర రైల్వే గేటు, RTC కాంప్లేక్స్ వస్తాయన్నమాట. అవి దాటి కొంచం ముందుకి వెళ్లి ఎడం చేతి వైపు తిరిగితే భానుగుడి సెంటర్లో కలుస్తారు. ముందు ఉడిపి వీనస్ భవన్ లో టీ తాగి అక్కడికి వెళ్దాం.


















ఆ... టీ తాగడం అయిపోయిందా? పదండి పదండి. ఇందాక చెప్పిన రూట్లో భానుగుడి సెంటర్ కి వెళ్ళిపోదాం. 

హమ్మయ్య, ఇదే భానుగుడి సెంటర్. ఈ కుడి చేతి వైపు చూసారుగా. ఇదే పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్ల కాంప్లెక్స్. బాబూ ఆ కిందున్న "యతి" కేసి చూడకండి. అక్కడి కెళ్తే ఓ పట్టాన బయటకి రారు. పోన్లెండి ఎవరికయినా ఆకలేస్తే వెళ్లి ఓ పిజ్జాయో ఏదో తినేసి తొందరగా వచ్చేయండి. ఇందాక టీ తాగని వాళ్లెవరైనా ఉంటే ఆ ఎదురుగా సిగ్నల్స్ దగ్గర కనిపిస్తోందే అదే "చార్మినార్ టీ సెంటర్" అక్కడికెళ్ళి టీ తాగేసి వచ్చేయండి. అన్నట్టు వాడి దగ్గర స్పెషల్ బాదం టీ ఉంటుంది ట్రై చేయండి. ఆ సెంటర్ మొత్తం చూసేయకండి. అక్కడికి మళ్ళీ ఇంకో పోస్ట్ లో తీసుకెళ్తా. తొందరగా రావాలండీ. జిడ్డు చేయకూడదు.
పద్మప్రియ కాంప్లెక్స్ 

















రెడీయా? అందరూ వచ్చేశారా? పదండి ఇక్కడనుంచీ మనం టూ టౌన్ వంతెన మీదుగా మెయిన్ రోడ్ కి వెళ్తాం అన్నమాట. 

అదిగో ఆ ఎడం చేతి వైపు కనిపిస్తోంది కదా అదే ఆనంద్ కాంప్లెక్స్. కాకినాడలో ముప్పాతిక మంది కాలేజి స్టూడెంట్స్ ఆస్థాన థియేటర్ కాంప్లెక్స్ ఇది. లోపల ఆనంద్, అంజని, గీత్, సంగీత్ అని నాల్గు థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలూ బోండా సైజు పకోడీ,  ఐస్ క్రీం తింటే నాసామి రంగా. ఆ టేస్టే వేరు. ఇక్కడనుంచీ అదిగో ఆ ఓవర్ బ్రిడ్జి కనబడుతోంది కదా దాని మీదుగా వెళ్తే టూ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం. పదండి.

ఆనంద్ కాంప్లెక్స్ (బయట నుంచి)

















ఆనంద్ కాంప్లెక్స్ (ఆనంద్ థియేటర్ ఎంట్రన్సు)















గీత సంగీత్ థియేటర్లు   






















మెయిన్ రోడ్ కి వచ్చేసాం. అదిగో అది విజయలక్ష్మి హాస్పిటల్. కొంచం ముందుకి వెళ్తే ఆ ఎడం చేతి వైపు కనిపించేదే టౌన్ హాల్ దాన్ని దాటేస్తే నెక్స్ట్ సెంటర్లో హెడ్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ ఓ సారి ఆగి అల్లదిగో ఆ కుడిచేతి వైపు చూడండి అది తిరుమల థియేటర్. ఈ పోస్ట్ ఆఫీస్ పక్క వీధిలో వెళ్ళిపోతే మళ్ళీ దేవి శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి పోతారన్నమాట. అవండీ మెయిన్ థియేటర్లు. 

ఇవి కాక జగన్నాధపురం లో చంద్రిక, తూరంగి సూర్య మహల్ (ఇప్పుడు రాఘవేంద్ర అని పేరు మార్చినట్టు ఉన్నారు), విద్యుత్ నగర్ కమల్ - వీర్ (ఇవి రెండు థియేటర్లు), వాకలపూడి సూర్య మహల్ ఇవీ ఉన్నాయి. 

కమల్ వీర్  థియేటర్ 



















అదండీ. మొత్తం మీద మా కాకినాడలో సినిమా హాల్స్ అన్నీ చూసేసారు కదా. నెక్స్ట్ టైం మా ఊరొస్తే  ఏ సినిమా హాల్ ఎక్కడుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఎవరినీ అడగక్కర్లేకుండా వెళ్లి పోవచ్చన్నమాట. 

(NEXT : భానుగుడి సెంటర్)


Friday, March 11, 2011

వినాయకుడు మూర్ఛపోయాడు


ఎక్కడనుంచో అదివో అల్లదివో పాట లీలగా వినబడుతుంటే వినాయకుడికి మెలకువ వచ్చింది. ఎవడబ్బా ఈ దుర్వాసనా భరిత కాసార సాగర మధ్యమున వేంకటేశ్వరుని భజిస్తున్నది అంటూ సగం కరిగి, సగం విరిగిన చేతిని సర్దుకుంటూ మెల్లగా తల తిప్పి చూసాడు. నడుం విరిగినా నారాయణ కీర్తన మానని అన్నమయ్య అంతబాధలోనూ కీర్తన ఆలపిస్తున్నాడని గుర్తించి, అంతలోనే అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? కొంపతీసి వినాయక నిమజ్జనం లానే ఈ హైదరాబాదీలు అన్నమయ్య చవితి చేసి అన్నమయ్య విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తున్నారా అని ఖంగారు పడ్డాడు. కానీ ఒకే విగ్రహం ఉండటం తో కాస్త స్తిమిత పడి "ఏం నాయనా అన్నమయ్యా? ఇలా వచ్చావు?" అని ప్రేమగా అడిగాడు. "రాలేదు స్వామీ తోసేసారు " అన్నాడు అన్నమయ్య ఒక పక్క బాధ భరిస్తూ. "తప్పు నాయన తోసేసారు అనకూడదు, దీనిని నిమజ్జనం అంటారు. నీకు కొత్తేమో కానీ నాకిది మామూలే" అన్నాడు వినాయకుడు. "భక్తితో ముంచితే నిమజ్జనం అంటారు, ద్వేషంతో ముంచితే తోసేసారు అంటారు, అన్నమయ్య వారు వాడిన పదం బాషా పరంగా సరియినదే స్వామీ" అని ఇంకో గొంతు వినగానే వినాయకుడికి చిర్రెత్తుకొచ్చింది. 

ఎవడ్రా నాకే బాషా సూత్రాలు నేర్పిస్తున్నాడు. అంత గొప్ప పండితుడా? అనుకుంటూ తలతిప్పి చూస్తే విరిగిన ఘంటపు ముక్క వెతుక్కుంటూ ఒళ్ళంతా శిధిలమయిన ఎర్రాప్రగడ కనిపించాడు. వార్నీ నువ్వు కూడానా? "ఏమిది సాహితీ సరస్వతీ మూర్తులన్నీ ఇలా కట్టకట్టుకుని సాగరాన వచ్చి పడ్డాయి? ఇక్కడ చూస్తే నాకే దిక్కు లేదు, పోనీ నేనేమయినా మహారాజునా? చక్రవర్తినా వీళ్ళని పోషించడానికి, మొదటికే మా తండ్రి ఆదిభిక్షువు ఇంకా వీళ్ళకి నేనేం చేయగలను" అని పక్కనున్న ఎలకతో అనగానే అది కిసుక్కున నవ్వి ఆ సంగతి వీళ్ళని తోసిన వాళ్లకి తెలియదా స్వామీ, తెలుగు భాషకి ఇంత ఉన్నతిని కల్పించిన వీరందరినీ దగ్గరుండి చూసుకోడానికి అదిగో ఆంధ్ర భోజుడిని కూడా అమాంతం ఎత్తి ఇక్కడ పడేసారు. అటు చూడండి అని చూపించగానే అక్కడ రెండు కాళ్ళు విరిగి ఒక పక్క కూలబడ్డ కృష్ణ దేవరాయలు మీసం దువ్వుకుంటూ కనిపించాడు.  వినాయకుడిని చూసి నీరసంగానే నమస్కరించాడు. భళిరా నరోత్తమా నీవేల ఇటకు వచ్చితివి, ఇదేమీ హంపీ సరోవరం కాదే, ఈ మురుగు నీటిలో జలకాలాడవలేనన్న కోరిక నీకెలా కలిగినదయ్యా?" అన్న వినాయకుడి ప్రశ్నకి రాయలు జవాబిచ్చేనంతలోనే వినాయకుడి ఎలక "ప్రభూ బాగా ఆకలిగా ఉంది కాస్త ఏదైనా తిని మాట్లాడుకుందాం" అనగానే వినాయకుడు "అయితే ఆ పక్కకెళ్ళి తినేసోచ్చేయి. మేము ఈ లోగా ఇక్కడ ఏదో కతికామనిపిస్తాం"  అన్నాడు. "వీల్లేదు ఎలకైనా, ఏనుగైనా, ప్రభువైనా, బంటయినా అంతా ఒకే చోట కూర్చుని చాపకూడు తినాలి. ఈ ప్రపంచం లో అంతా సమానమే.  ఏం అన్నమయ్య స్వామీ "బ్రహ్మమొక్కడే" అన్న మీరయినా చెప్పరేమి?"  అని వినబడగానే విరిగిన తొండం సర్దుకుని వినాయకుడు ఆ మాటలు వచ్చిన వైపు తలతిప్పి చూసాడు" అక్కడ ఆజానుబాహుడిలా నిలబడి శరీరం చిద్రమయినా  మీసం మెలేస్తూ కనిపించిన వ్యక్తిని చూసి "ఎవరు నాయనా నీవు? సమానత్వం గురించి అంత ఆవేశ పడుతున్నావు?" అన్న వినాయకుడి ప్రశ్నకి "నన్ను బ్రహ్మనాయుడంటారు, మాది పలనాటి సీమ" అని జవాబిచ్చాడు బ్రహ్మనాయుడు. "నీవేమి ఇటుల వచ్చితివి విహారయాత్రకా?" అన్న వినాయకుడి ప్రశ్నకి అంత సేపూ ఓపిగ్గా వింటున్న ఎలక ఇంక ఆగలేక "స్వామీ మీకు ఈ మురికి మూసీ జల ప్రభావముతో మతి తప్పినట్టు ఉంది, తోసేసారు బాబో అని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ అదే ప్రశ్న. ఒక పక్క ఆకలితో చస్తుంటే" అని విసుక్కుంది. "మూషికా మూర్ఖంగా మాట్లాడకు వీరందరూ మహనీయులే కదా, ఈ తెలుగు జాతికి  ప్రాతః స్మరణీయులే కదా మరి ఆ మాత్రపు ఇంగితము, మర్యాద లేకుండా వీరిని ఈ సాగరమున పడేసే దుర్మదాంధులేవరుంటారు?  అంతటి ఉన్మత్తులు, ఉన్మాదులు ఈ ప్రాంతమున కలరా? " అనగానే  అప్పటిదాకా వీళ్ళ గోలంతా వింటున్న బుద్ధుడు నీళ్ళలోకి తొంగి చూసి "పిచ్చి వినాయకా ఈ ప్రాంతం లో అంతటా ఉన్మత్తులు, ఉన్మాదులే కలరు, లోపలుండి నీకు తెలియట్లేదు కానీ రోజూ  నేను చూడలేక చూడలేక చూస్తున్నా ఈ ముదిరిన ప్రాంతీయ వాదాన్ని, ఇప్పుడు వీళ్ళని ఈ మురికి కూపం లో పడేసింది కూడా వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళనే కారణం తోనే. కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతావు, ఇంకా కాలూ, చెయ్యీ కూడదీసుకోడానికి కొంచం సమయం పడుతుంది. మనకంటే అలవాటు అయిపోయింది కానీ ఈ కంపు వాళ్లకి కొత్త." అన్నాడు. 

బుద్ధుడి మాటలు అర్ధం కాని శ్రీకృష్ణ దేవరాయలు అయోమయంగా తన పక్కనే ఉన్న ఎలకతో "బుద్ధదేవుడికి కూడా బుద్ధి నశించిందా? వాళ్ళంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సరే, మాది కన్నడ సీమ. విజయనగర సామ్రాజ్య తేజో విరాజులం మమ్మల్ని పట్టుకుని ఆంధ్రుడు అంటాడేమిటి? అయినా నా రాజ్యం లో ఆంధ్ర ప్రాంతం కూడా ఉందనుకో కానీ నన్ను కన్నడ వాడిగానే జనాలు గుర్తిస్తారు. హంపీ కన్నడ దేశం లో ఉందని ఆయనకి తెలియదా? " అనగానే ఎలక్కి చిర్రెతుకోచ్చింది "కాస్త మూసుకుంటారా? అయితే మీకు ఆంధ్ర అను పదము తో సంబంధము లేదంటారు? తమ బిరుదేమి మహాశయా?" అని వ్యంగం గా ప్రశ్నించింది. పాపం ఆ వ్యంగం అర్ధం చేసుకునే స్థితిలో లేని రాయలు మీసం దువ్వుకుంటూ "ఆంధ్ర భోజులంటారు మమ్మల్ని" అన్నాడు. "ఆ ముక్కొక్కటి చాలు వాళ్లకి మిమ్మల్ని మూసీలో ముంచడానికి. తొక్కలో అనుమానాలు మీరూను, "తెలుగు వల్లభుండ" అని మీసాలు మేలేస్కోడం కాదు "తెలంగాణా బాధితుండ" అని ఏడవాలి తమరు" అని కసిరింది. 

ఇదంతా చూసిన వినాయకుడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. లయకారుడైన తండ్రిని తలచుకున్నాడు. "తండ్రీ లింగాకారుడవే!  నీ పేరుతో ఏర్పడిన ఈ త్రిలింగ దేశం లో ఆవేశ కావేశాలను అణచలేవా? " అని ఆవేదనతో ప్రార్ధించాడు. ఇంతలో  డుబుంగ్ అని శబ్దం వినిపించింది. అంతా తలతిప్పి సాగర గర్భం లో లింగడు అవతరించాడు అనుకుని అటువైపు చూసారు. కొట్టుకుపోయిన మోకాళ్ళు కూడదీసుకుని పంచె సర్దుకుంటూ ఒకాయన కనిపించాడు. ఆయన వీళ్ళకేసి తిరిగి, అందరినీ గుర్తుపట్టి వినయంగా నమస్కరించాడు. "అయ్యా నన్ను వీరేశ లింగం అంటారు" అన్నాడు. ఆ మాట వినగానే వినాయకుడు మూర్చపోయాడు.

(ఇంకా ఉంది)


ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది. 
నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు దీనిని చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను.

(అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని 
మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా. )





ఇంతకు మించి ఏమీ చెప్పలేను :(

ఈ రోజు ట్యాంక్ బండ్ పై జరిగిన సంఘటన చూసిన వెంటనే ఆవేశం, ఆక్రోశం కలగలిసి రాసిన పోస్ట్ ఈ క్రింది బ్లాగర్ కూడా అదే ఆలోచనతో అప్పటికే పోస్ట్ పెట్టడంతో అందులో తోలి కామెంట్ గా పోస్ట్ చేశా. http://manogatam.blogspot.com/2011/03/blog-post.html . ఆ స్పందన మీకోసం మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తున్నాను.

తలకెక్కిన ఉన్మాదం - ఇదా గాంధేయవాదం?

మిలియన్ మార్చ్ పేరుతో ట్యాంక్ బండ్ పై విధ్వంసం.
చేతులు కట్టుకుని చూస్తోంది చేవ లేని ప్రభుత్వం
ఏ పార్టీ వాడని ఎర్రాప్రగడని కూల్చారు?
ఏ ప్రాంతం వాడని క్రిష్ణదేవరాయుని నీట ముంచారు?
మాట్లాడితే మా సంస్కృతీ మా సంస్కృతి అనే కే.సి,యారూ
ఈ ఉన్మాదమే మీ సంస్కృతా చెప్పండి సారూ?
ఇదేనా మీరు చెప్పే గాంధేయ వాదం
కాదు కాదు ఇది అచ్చమైన కేసియారీయం
స్వచ్చమైన తెలుగులో చెప్తే స్వార్ధ రాజకీయం

(ట్యాంక్ బండ్ మీద తెలంగాణా వాదుల చేతిలో ఘోర పరాభవానికి గురయిన తెలుగు జాతి మహనీయులకు క్షమార్పణలు చెబుతూ)

గమనిక: ఇప్పటి వరకు నేను నా బ్లాగులో "తెలబాన్లు" అనే పదాన్ని ఖండించాను. సాటి తెలుగు వారిని తాలిబాన్లతో పోల్చడం మూర్ఖత్వం అని వాదించాను. కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ధ్వంసమైన విగ్రహాలలో నాకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాలు కనిపిస్తున్నాయి.కానీ ఉన్మాదంలో వీరు వారినే మించి పోయి తమ తెలుగు జాతి మహనీయుల విగ్రహాలనే కూల్చారంటే వీళ్ళని అలాగే అనాలనిపిస్తోంది. ఆ పదం కూడా తక్కువనిపిస్తోంది. 

ప్రస్తుతం చానెళ్ళలో చూపిస్తున్న విరిగిన విగ్రహాలు, తగలబడుతున్న పోలీసు జీపులు, అద్దాలు పగిలిన బిల్డింగులు చూస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది.  




Monday, March 7, 2011

కాకినాడ కబుర్లు - కాకినాడంటే ముందుగా గుర్తొచ్చేది.



ఆలో ఆలో ఆలో .....వచ్చేసారా? అద్గదీ సెబాసు. అబ్బే ఏం లేదండీ జస్ట్ నిన్న mhsgreamspet స్కూల్ పిల్లల (స్కూల్ జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోడానికి పూర్వ విద్యార్ధులు ప్రారంభించుకున్న బ్లాగ్ ఇది. భలే ఇన్స్పైరింగ్ ఉందిలెండి ఆ ఆలోచన) బ్లాగులో " సుబ్బయ్య హోటల్ @ కాకినాడ… “రుచులు” చూడ తరమా?" అన్నపోస్ట్ చూడగానే మనసు విపరీతం గా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకా? అదేం ప్రశ్నండీ.......? సొంతూరి సంగతులింటే మీకు మాత్రం ఆ మాత్రం ఫీలింగ్ ఉండదా ఏంటి? కాకినాడ లో పుట్టి పెరిగిన నాకు ఒక్క సారి ఆ పోస్ట్ చూడగానే ట్రియ్యుం ట్రియ్యుం అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి మనసులోనే మొత్తం కాకినాడంతా తెగ తిరిగేసి వచ్చాను. ఎప్పటినుంచో కాకినాడ మీద పోస్ట్ రాద్దాం అనుకుంటూ బద్ధకిస్తున్ననేను (ఈ ఆలోచనకు కారణం మన సాటి బ్లాగర్ తృష్ణ గారి అన్నయ్య . కాబట్టి ఈ సీరియల్ కబుర్లలో మొదటి పోస్ట్ ఆయనకే అంకితం.) ఇంక లాభం లేదు మనూరి విశేషాలు మొత్తం బ్లాగ్ప్రపంచం అంతా డప్పు కొట్టి చెప్పెయాల్సిందే అని తీవ్ర నిర్ణయం తీసేసుకున్నా. అంచేత మా ఊళ్ళో ఏరియాలు, ప్రత్యేకతలు, చూడదగ్గ ప్రదేశాలు ఓ సారి నా కళ్ళతో మీకు చూపించేద్దామని డిసైడ్ అయిపోయా. రెడీయా?

ఇదిగో ఇది చదువుతున్న కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే అమాంతం ఎమోషన్ ఫీలయిపోయి కళ్ళమ్మట నీళ్ళు తెచ్చేసుకుని నా జన్మ భూమి ..భూమి..భూమి (ఈ రెండు భూమి లకి రీసౌండ్ ఎఫెక్ట్ అన్నమాట) అని ఓ సాంగేసుకొని తరించేయండి. ఇంక బయటి వూరి వాళ్ళయితే "మీ జన్మ భూమి....భూమి...భూమి" అని మా కాకినాడ వాళ్ళ గురించి ఓ సాంగేసుకోండి. కాకినాడ అనగానే మీకు వెంటనే గుర్తోచ్చేదేంటి?.....కరేస్టు కాజా అన్నమాట. నిజానికి మీరందరూ దాన్ని కాకినాడ కాజా అంటారు గానీ మా కాకినాడ వాళ్ళం మాత్రం దాన్ని కోటయ్య కాజా అంటామన్నమాట. ఈ కోటయ్య ఎవరంటారా? నూట పదకొండేళ్ళ క్రితం 1900 లొ ఈ కాజా రెసిపీని కనిపెట్టిన పాక శాస్త్రవేత్త. నిజానికి చాలామంది తాపేశ్వరం మడత కాజాకి, కాకినాడ కాజాకి విపరీతం గా కన్ఫ్యూజ్ అయిపోతారు. దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే. రెండిటికీ ఉన్న ఒకే ఒక్క పోలికేంటంటే రెండూ తూగోజీవే. (రెండూ స్వీట్లే కదా అని రెండో పోలిక చెప్పమాకండి...మీకేసి నేను దూరదర్శన్ ని చూసినట్టు చూడాల్సోస్తుంది). 



ఇంక విషయానికొస్తే కాకినాడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కాకినాడ కాజా, సుబ్బయ్య హోటల్ భోజనం రుచి (దీని గురించి పైన లింక్ ఇచ్చా చూడండి...ఆ పోస్ట్, అందులో కామెంట్లు చూస్తే మీకు వెంటనే ఆకలేస్తుందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను) చూడలేదంటే వాళ్ళు వచ్చినా రానట్టే. మనం కాజా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని మేటర్కొచ్చేద్దాం. కాకినాడ మెయిన్ రోడ్ లో మసీద్ సెంటర్ దగ్గర ఉంది కోటయ్య స్వీట్ స్టాల్. ఇదే కాకినాడ కాజా బర్త్ ప్లేస్ అన్నమాట. ఆ తర్వాత కోటయ్య గారి వారసులలో కుసింత డిఫరెన్సులు వచ్చి ఈ మధ్యే అదే ఊళ్ళో రెండు మూడు చోట్లకి విస్తరించారు. అయితే టేస్ట్ లో మాత్రం తేడా ఉండదండోయ్. కానీ అలవాటయిపోయిన ప్లేసు కాబట్టి మా ఊరోళ్ళు మాత్రం మేగ్జిమం పాత షాప్ కే వెళ్తాం. ఇక్కడ కాజా ఒక్కటే కాదు పూతరేకులు, బూందీ, చక్కిలాలు, బందరు లడ్డూ (దీన్నే తొక్కుడు లడ్డూ అని కూడా అంటాం) ఇలా బోల్డన్ని ఊరిస్తాయి, అయితే తిరుపతి లో ఎన్ని గుళ్ళున్నా మెయిన్ గుడి గురించే చెప్పుకున్నట్టు ఇక్కడా అంతే. (ఈ పోలికేంట్రా అనుకుంటున్నారా? ఏమో ఇంతకు మించి తట్టలేదు అడ్జస్ట్ అయిపోండి)

 పండగకి సొంతూరోచ్చిన కాకినాడ వాళ్ళయినా, పనిమీద వచ్చిన బయట ఊరి వాళ్ళయినా దీని రుచి చూడకుండా, తమతో పాటూ ఒకటో రెండో కేజీలు తీసుకెళ్ళకుండా ఉండరు. సినేమా స్టార్లయినా, రాజకీయ నాయకులైనా, మహా మహా గోప్పోల్లెవరైనా దీని రుచికి దాసోహమనాల్సిందే. ఎవరైనా కాకినాడ వెళ్తున్నాం అంటే పక్కింటి వాళ్ళో, ఆఫీసులో కోలీగ్సో, ఆఫీసులో బాసాసురుడో " వచ్చేటప్పుడు కాజా తేవడం మర్చిపోకు" అనేది మాత్రం ఖచ్చితం గా అంటారు. ఎవర్నయినా కాకా పట్టాలన్నా కేజీ కాజా మంత్రం జపిస్తే చాలు.

క్యాప్సూల్ లా ఉంది లోపల తీయని పాకంతో ఉండే ఈ కాజా తినడం అంత వీజీ కాదు. టెక్నిక్ తెలియకుండా తింటే బట్టలన్నీ తీయని పాకంతో పునీతమవుతాయి. (అంటే ఈ టెక్నిక్ కాకినాడ వాళ్లకి మాత్రం పుట్టుకతో వచ్చేస్తుంది లెండి :) ). గోళీ సోడా తాగడం లాగే (దీని గురించి అప్పుడెప్పుడో ఓ పోస్టేసుకున్నాలెండి) ఈ కాజా కూడా టెక్నిక్ తెలిస్తే పాకం కారకుండా తినచ్చు. (అదెలాగో చెప్పవా అంటారా? దీనికి క్రాష్ కోర్సులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు ఏమీ లేవు. ఎవరికీ వాళ్ళు అనుభవం మీద తెల్సుకోవాల్సిందే. కాదూ కూడదు చెప్పే తీరాలి అని మొహమాట పెడితే మాత్రం మా కాకినాడ బ్లాగర్ల జెఎసి లో సమావేశమై మీ అభ్యర్ధన పరిశీలించి, తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాక చెప్తాం). మా ఊళ్ళో ఇదొక్కటే కాదండోయ్ బాలాజీ చెరువు టాక్సీ స్టాండ్ దగ్గర, రామారావు పేట మూడు లైట్ల జంక్షన్, గాంధీనగర్ గాంధీ బొమ్మ, పార్క్ ముందు ఉండే బజ్జీల బళ్ళు అక్కడ దొరికే బజ్జీలు, బఠానీ, మిక్చర్, పి.కే.పి ఇలా తలచుకుంటే నోరూరే టేస్ట్ లు బోల్డన్ని ఉన్నాయి. గాంధీ నగర్ అయ్యర్ హోటల్లో వేడి వేడి పెసరట్టు తిని, ఫిల్టర్ కాఫీ తాగితే ఉంటుందీ.....మహాప్రభో అమృతం ఆఫ్ట్రాల్ అనిపించేస్తుందంటే నమ్మండి.

అదండీ సంగతి.

(NEXT: కాకినాడ కబుర్లు - సినిమా హాల్ స్ట్రీట్)
నేను బ్లాగాల్సింది చాలా ఉంది. మీరు కామెంటాల్సింది ఇంకా ఉంది.

Wednesday, March 2, 2011

నాతో పాటు అదే రోజు పుట్టిన వాళ్ళు .......ఉంటే స్పందించండి


ఈ పోస్ట్ నేను గత సంవత్సరం పోస్ట్ చేశా. నిరాశే మిగిలింది. సరే ఈ ఏడాదిలో ఎంతో మంది కొత్త బ్లాగర్లు వచ్చి ఉంటారు. వాళ్ళలో ఒక్కరైనా ఉండకపోరా అన్న చిన్న ఆశతో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. 

నేను 1977 మార్చి 14  న కాకినాడలో పుట్టాను. నాకో చిన్న కోరిక ..... నాలాగే అదేసంవత్సరం, అదే  రోజు పుట్టినవాళ్ళని (అంటే బర్త్ డే మేట్స్ అన్నమాట) ఎప్పటికయినా  కలుసుకోవాలని.  ఖచ్చితం గా అదే రోజు చాలా మంది ..అందులో కొంతమందయినా  తెలుగు వాళ్ళు పుట్టి ఉంటారు...అందులో మావూరి వాళ్ళు ఉన్నాలేకపోయినా ..కనీసం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు కొంతమందయినా ఉంటారు. వాళ్ళలో ఒక్కరికయినా బ్లాగింగ్ అలవాటు ఉండదా అన్న ఆశతో ఈ పోస్ట్ చేస్తున్నా. ఉంటే కనుక రిప్లై ఇవ్వండి. మనందరం కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుందాం :). ఎంత కాదనుకున్నా ఒకే రోజు ఈ భూమ్మీదకొచ్చాం కదా! 

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?

ఈ రోజు పేపర్లో శివరాత్రి స్పెషల్ షోలు ఆడే థియేటర్ల లిస్టు ఇచ్చాడు. ఎంత భక్తీ రస చిత్రాలో మగధీర, రోబో, సింహ, అదుర్స్, కిక్, దిల్  తో బచ్చా హై జీ, దబాంగ్, గోల్ మాల్ ఇలా అన్నీ చక్కని భక్తీ రస చిత్రాలే. అసలు ఇలా కష్టపడి సెకండ్ షో తర్వాత వేసే స్పెషల్ షోలలో బలవంతం గా నిద్ర ఆపుకునే ప్రయత్నాలు చేయడమే శివరాత్రి జాగరణా? ఇంకొన్నాళ్ళు పోతే పబ్బుల్లో కూడా శివరాత్రి స్పెషల్ నైట్స్ కూడా స్టార్ట్ చేస్తారేమో. టైం చూసుకుంటూ ఇంకో రెండు మూడు గంటలుంటే తెల్లారిపోతుంది, రేపు ఆఫీసుకు సెలవు పెట్టి హేపీగా నిద్రోవచ్చు అనుకుని శివరాత్రి జాగారం చేయడం అవసరమా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా నిద్ర మానుకుని మేల్కొంటే నిన్ను అనుగ్రహించేస్తాను అని ఆ శివుడు చెప్పాడా?. ఇక శివరాత్రి ఉపవాసాల విషయానికొస్తే సాయంత్రం ఎప్పుడవుతుందా? రాత్రికి ఏమేం చేసుకుని తినాలా? అనుకుంటూ ఉపవాసాలు చేయడం ఎందుకు? చివరికి చిన్నపిల్లల్ని కూడా నోర్మూసుకు కూర్చోండి, ఆకలి అంటే కళ్ళు పోతాయి, శివరాత్రి ఉపవాసం చేస్తే పుణ్యం అని బలవంతం గా పస్తులు ఉంచేస్తారు. మనలో  ఉన్న శివుడి ఆకలి కేకలు వింటూ గుడిలో ఉన్న శివుడ్ని పూజించడం ఏం భక్తో?. ఇలాంటివన్నీ చూసే వేమన చెప్పాడేమో "చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?" అని. అంతగా శివుని మీద నిజంగా భక్తి ఉంటే అర క్షణం పాటు మనసారా "ఈశ్వరా" అనుకున్నా చాలు . నాకు తెలిసి శివుడంత అల్ప సంతోషి లేడు. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. 



నాకిష్టమైన ఎమ్మెస్ గారి గొంతులో శివపంచాక్షరీ సోత్రం 


బాలమురళీ కృష్ణ గారు పాడిన ఈ తత్వమంటే కూడా నాకు చాలా ఇష్టం. అదీ వినండి 
Yemi_Sethura_Linga...