Friday, March 25, 2011

కాకినాడ కబుర్లు - పార్ట్ 2 - "సినిమా హాల్ స్ట్రీట్"కాకినాడ కబుర్లు మొదటి పార్ట్ లో కాకినాడ కాజా రుచి చూసారుగా. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంకో స్పెషల్ గురించి చెప్తాను. రెడీయా?  స్పెషలంటే అలాంటి ఇలాంటి స్పెషల్ కాదు మరి. సినిమా స్పెషల్. తెలుగోడికి, సినిమాలకి ఉన్న సంబంధం మీకు తెలిసిందే కదా, మా ఊళ్ళో ఇంకో అడుగు ముందుకేసి ఒక వీధి మొత్తం వరుసగా సినిమా హాళ్ళు ఉంటాయన్నమాట. దాని సినిమా హాల్ స్ట్రీట్ అంటారు. అలా అని కేవలం ఆ వీధి లోనే సినిమా హాల్స్ ఉంటాయనుకున్నారు, మెయిన్ రోడ్ మీదా, మిగిలిన ఏరియాలలో కూడా కొన్ని  సినిమా హాల్స్ ఉన్నాయి లెండి. వాటి గురించీ ఇప్పుడే చెప్పెసుకుందాం. ఇంక సినిమా హాల్ స్ట్రీట్ విషయానికొస్తే పండగ రోజుల్లో, శలవుల్లో ఇంటికి ఎవరైనా వస్తే జగన్నాధ పురం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్న సినిమా హాల్స్ లో ఏదో ఒక దాంట్లో టికెట్ దొరక్కపోదు. అదన్నమాట సంగతి. ఇప్పుడు మిమ్మల్ని మా ఊరికి మాత్రమే ప్రత్యేకమయిన సినిమా హాల్ స్ట్రీట్ టూర్ చేయించనున్నానన్నమాట. రెడీయా?

ముందు జగన్నాధపురం వంతెన దగ్గర నుంచి బయల్దేరదాం. వంతెన దాటేసారుగా ఆ ఇప్పుడు కుడి చేతి వైపు తిరగండి. పదండి ఆ రోడ్లోకి. పోలీస్ స్టేషన్, bsnl ఆఫీసు దాటేసి ఎడం చేతి వైపు కనిపించే రోడ్డు మొదట్లో ఆగండి. రోడ్డు కనిపించిందా? అద్గదీ అదే మా ఊరి సినిమా హాల్ స్ట్రీట్ అన్నమాట. ఇంకేంటి చూస్తున్నారు పదండి.
Add caption

అదిగో మొట్టమొదటిగా కుడిచేతి వైపు కనిపిస్తోందే, అదే స్వప్న థియేటర్. పెద్ద గేటు దాటుకు ముందుకి వెళ్తే లోపల గుబురుగా ఉన్న వెదురు పొద దాని చుట్టూ సిమెంట్ బెంచీలు, అక్కడ కూర్చుని బుకింగ్ కౌంటర్ ఎప్పుడు తెరుస్తారా అని చూసే జనాలు కనిపించారా? ఆల్రైట్..కుసింత ముందుకెళ్ళి ఎడం చేతి వైపు చూడండి అక్కడో థియేటర్ ఉంది. ఎక్కడుందీ అని వెతుకుతున్నారా? లోపలెక్కడో ఉంటుంది. బయట నుంచి కనబడే థియేటర్ టైపు కాదిది. బయట అందరికీ సినిమా కెల్తున్నామోచ్ అని చాటుకుని వెళ్ళే థియేటర్ కూడా కాదులెండి. ఆ థియేటర్ పేరు ప్యాలెస్. కేవలం పెద్దలకు మాత్రమే థియేటర్ అది. 

చాల్చాలు. పదండి. అదిగో ఆ కుడిపక్క ఇంకో థియేటర్ ఉంది కదా అదే లక్ష్మి థియేటర్. చూసారా. పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆగండి ఆ కుడిచేతి వైపు పొడుగాటి వీధిలా ఉన్న థియేటర్ కనబడిందా? అది మా కాకినాడ వాళ్ళు గర్వం గా చెప్పుకునే థియేటర్లలో ఒకటైన సత్యగౌరి. మొదట్లో మా చిన్నప్పుడు ఇక్కడ కేవలం ఇంగ్లిష్ సినిమాలే ఆడేవి. రాంబో, ఆర్మార్ ఆఫ్ ది గాడ్ లాంటి సినిమాలు ఇక్కడే చూసాం. తరవాత తెలుగు సినిమాలు కూడా మొదలెట్టాడు. అప్పుడు ఖుషీ, మాస్టర్ లాంటివి చూసామన్నమాట. అన్నట్టు ఇక్కడ బ్లాక్ టికెట్ల గొడవుండదు. ఇంక సౌండ్ సిస్టం అంటారా? కేకో కేక. మా ఊరోళ్ళుఅందరూ ముక్త కంఠం తో చెప్పే మాట "సత్య గౌరీ" వాడు మెయిన్టైన్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు అని. అంత బావుంటుంది ఈ థియేటర్. వీడి దగ్గర క్యాంటీన్ లో సేమ్య ఉప్మా, పూరి భలే ఉంటాయిలెండి. ఇంకా చాలా ఉన్నాయి పదండి పదండి.

ఆ సంత చెరువు దగ్గరకి వచ్చేసాం. ఆ నెక్స్ట్ కుడి చేతి వైపు ఒక థియేటర్ కనిపిస్తోంది కదా. ఆ థియేటర్ గురించి మీకు కుసింత చెప్పాల్లెండి. దాని పేరు మెజిస్టిక్ థియేటర్. ఇక్కడ ఒక నాటక సమాజం కూడా ఉండేది.యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని. ఆ నాటక సమాజం నుంచే సినీ పరిశ్రమకు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పరిచయం అయ్యారు. అబ్బే పెద్ద పేరున్న వాళ్ళు కాదు లెండి. ఏదో ఎస్వీ రంగారావు, అంజలీదేవి లాంటి వాళ్ళన్నమాట. పదండి ఆ పక్కనే ఇంకో థియేటర్ కనిపిస్తోంది కదా అది కాస్త కొత్త థియేటర్. "మయూరి" అని. ఇంకాస్త ముందుకేల్తే "పద్మనాభ థియేటర్". రండి ఇంకాస్త ముందుకి వెళ్దాం.


ఆ ఎడం చేతి వైపు ఒక పెద్ద పెట్రోల్ బంక్ కనిపిస్తోందా? దాని ప్లేస్ లో మా చిన్నప్పుడు రెండు థియేటర్ లు ఉండేవి. క్రౌన్, విజయ్ అని. అవి మొదటి తరం థియేటర్ల కోటాలోకి వస్తాయి. అన్నట్టు ఇందాకా చూసిన మెజిస్టిక్ కూడా ఆ బాపతే. ఇంకాస్త ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పెద్ద రోడ్ కనిపిస్తోందా? అది దేవి, శ్రీదేవి కాంప్లెక్స్ ఎంట్రన్స్ అన్నమాట. మొదట్లో ఈ కాంప్లెక్స్ లో దేవి, శ్రీదేవి మాత్రమే ఉండేవి, ఆ తర్వాత రుక్మిణి, పద్మ అని ఇంకో రెండు థియేటర్లు కట్టారు. మొత్తం నాలుగు థియేటర్లు ఓకే కాంప్లెక్స్ లో అన్నమాట. అన్నట్టు బ్లాక్ టికెట్లు ఈ కాంప్లెక్స్ లో దొరికినట్టుగా ఇంకెక్కడా దొరకవు. అంత పేరుంది ఈ థియేటర్లకి. పదండి పదండి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి కాళ్ళు నొప్పెడుతున్నాయా? ఆ ముందు ఉడిపి వీనస్ భవన్ లో ఒక టీ కొట్టి వెళ్దాం లెండి. 

వచ్చేసాం. ఇదే మున్సిపల్ ఆఫీస్ సెంటర్. అదిగో ఆ కుడిచేతి పక్కన కనిపిస్తోంది అదే "కల్పన" థియేటర్. ఇదిగో ఇదే ఉడిపి వీనస్ భవన్. ఏంటి టీ అన్నాను కదా అని గుర్తు చేస్తున్నారా? ఒక్క నిమిషం కొద్దిగా ముందు ఇంకో మూడు థియేటర్లు ఉన్నాయి. దానితో సినిమా హాల్ స్ట్రీట్లో ఉన్న థియేటర్లు అయిపోతాయి. అవి కూడా చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ తాగి తరవాత  మెయిన్ రోడ్ లో ఉన్న సినిమా హాల్స్, మా ఊర్లో ఉన్న మిగిలిన థియేటర్ల ని చూసొద్దాం. ఓ..కే నా. పదండి.

అదిగో ఆ కుడి చేతి వైపు కనబడేదే మున్సిపల్ ఆఫీసు. ఆ రోడ్డు కనబడుతోంది చూసారా? తిన్నగా వెళ్తే సాంబమూర్తి నగర్ మీదుగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. ఇంకోసారెప్పుడైనా తీసుకెళ్తాలెండి. అదిగో ఆ ఎడం చేతి వైపు చూడండి అదే "సూర్య కళా మందిర్ అనబడే సరస్వతీ గాన సభ". ఆంధ్రప్రదేశ్ లో సంగీత విద్వాంసులు, నటులు ఇలా కళాకారులందరూ ఈ వేదిక మీద ఒక్కసారైనా ప్రదర్శన ఇవ్వాలనుకుంటారు. అంత పేరుంది దీనికి. దీని గురించి మళ్ళీ ఒక సెపరేటు పోస్ట్ వేసుకుంటా. ఆ పక్కనే వెంకటేశ్వర థియేటర్ అని ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారిపోయింది అనుకోండి. దాని పక్కనే పెద్ద బిల్డింగ్ కనిపిస్తోందా? అవే చాణక్య, చంద్ర గుప్త థియేటర్లు. అదండీ సినిమా హాల్ స్ట్రీట్. ఇక్కడితో ఈ వీధిలో సినిమా హాళ్ళు అయిపోయాయి. మరి రోడ్డింకా ఉంది కదా అంటారా? తిన్నగా వెళ్తే ఆనందభారతి, కొత్తపేట మార్కెట్ దగ్గర రైల్వే గేటు, RTC కాంప్లేక్స్ వస్తాయన్నమాట. అవి దాటి కొంచం ముందుకి వెళ్లి ఎడం చేతి వైపు తిరిగితే భానుగుడి సెంటర్లో కలుస్తారు. ముందు ఉడిపి వీనస్ భవన్ లో టీ తాగి అక్కడికి వెళ్దాం.


ఆ... టీ తాగడం అయిపోయిందా? పదండి పదండి. ఇందాక చెప్పిన రూట్లో భానుగుడి సెంటర్ కి వెళ్ళిపోదాం. 

హమ్మయ్య, ఇదే భానుగుడి సెంటర్. ఈ కుడి చేతి వైపు చూసారుగా. ఇదే పద్మప్రియ, శ్రీప్రియ థియేటర్ల కాంప్లెక్స్. బాబూ ఆ కిందున్న "యతి" కేసి చూడకండి. అక్కడి కెళ్తే ఓ పట్టాన బయటకి రారు. పోన్లెండి ఎవరికయినా ఆకలేస్తే వెళ్లి ఓ పిజ్జాయో ఏదో తినేసి తొందరగా వచ్చేయండి. ఇందాక టీ తాగని వాళ్లెవరైనా ఉంటే ఆ ఎదురుగా సిగ్నల్స్ దగ్గర కనిపిస్తోందే అదే "చార్మినార్ టీ సెంటర్" అక్కడికెళ్ళి టీ తాగేసి వచ్చేయండి. అన్నట్టు వాడి దగ్గర స్పెషల్ బాదం టీ ఉంటుంది ట్రై చేయండి. ఆ సెంటర్ మొత్తం చూసేయకండి. అక్కడికి మళ్ళీ ఇంకో పోస్ట్ లో తీసుకెళ్తా. తొందరగా రావాలండీ. జిడ్డు చేయకూడదు.
పద్మప్రియ కాంప్లెక్స్ 

రెడీయా? అందరూ వచ్చేశారా? పదండి ఇక్కడనుంచీ మనం టూ టౌన్ వంతెన మీదుగా మెయిన్ రోడ్ కి వెళ్తాం అన్నమాట. 

అదిగో ఆ ఎడం చేతి వైపు కనిపిస్తోంది కదా అదే ఆనంద్ కాంప్లెక్స్. కాకినాడలో ముప్పాతిక మంది కాలేజి స్టూడెంట్స్ ఆస్థాన థియేటర్ కాంప్లెక్స్ ఇది. లోపల ఆనంద్, అంజని, గీత్, సంగీత్ అని నాల్గు థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఆలూ బోండా సైజు పకోడీ,  ఐస్ క్రీం తింటే నాసామి రంగా. ఆ టేస్టే వేరు. ఇక్కడనుంచీ అదిగో ఆ ఓవర్ బ్రిడ్జి కనబడుతోంది కదా దాని మీదుగా వెళ్తే టూ టౌన్ సెంటర్ కి వెళ్ళిపోతాం. పదండి.

ఆనంద్ కాంప్లెక్స్ (బయట నుంచి)

ఆనంద్ కాంప్లెక్స్ (ఆనంద్ థియేటర్ ఎంట్రన్సు)గీత సంగీత్ థియేటర్లు   


మెయిన్ రోడ్ కి వచ్చేసాం. అదిగో అది విజయలక్ష్మి హాస్పిటల్. కొంచం ముందుకి వెళ్తే ఆ ఎడం చేతి వైపు కనిపించేదే టౌన్ హాల్ దాన్ని దాటేస్తే నెక్స్ట్ సెంటర్లో హెడ్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ ఓ సారి ఆగి అల్లదిగో ఆ కుడిచేతి వైపు చూడండి అది తిరుమల థియేటర్. ఈ పోస్ట్ ఆఫీస్ పక్క వీధిలో వెళ్ళిపోతే మళ్ళీ దేవి శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి పోతారన్నమాట. అవండీ మెయిన్ థియేటర్లు. 

ఇవి కాక జగన్నాధపురం లో చంద్రిక, తూరంగి సూర్య మహల్ (ఇప్పుడు రాఘవేంద్ర అని పేరు మార్చినట్టు ఉన్నారు), విద్యుత్ నగర్ కమల్ - వీర్ (ఇవి రెండు థియేటర్లు), వాకలపూడి సూర్య మహల్ ఇవీ ఉన్నాయి. 

కమల్ వీర్  థియేటర్ అదండీ. మొత్తం మీద మా కాకినాడలో సినిమా హాల్స్ అన్నీ చూసేసారు కదా. నెక్స్ట్ టైం మా ఊరొస్తే  ఏ సినిమా హాల్ ఎక్కడుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఎవరినీ అడగక్కర్లేకుండా వెళ్లి పోవచ్చన్నమాట. 

(NEXT : భానుగుడి సెంటర్)


16 comments:

Bolloju Baba said...

మెజస్టిక్, పద్మనాభ, క్రౌన్, కల్పన,మయూరి వెంకటేశ్వరా థియేటర్లు మూతపడిపోయాయి, కొన్ని కల్యాణ మండపాలుగా మరికొన్ని షాపింగ్ కాంప్లెక్శ్ లు గా మారిపోయాయి. ప్రస్తుతానికి సినిమా రోడ్డులో సినిమాహాలంటే దేవి మల్టి ప్లెక్స్ దే హవా. (చిన్ననిర్మాతలందరూ విమర్శించే ఆ నలుగురు పెద్దలలో ఒకరిది ఇది ప్రస్తుతం) మిగిలినవన్నీ సి గ్రేడు సినిమాలు/సెకండ్ రిలీజుల్నీ ఆడించుకొంటున్నాయి.
సత్యగౌరి సౌండ్ సిస్టం ఇప్పటికీ కేకే.

అప్పట్లో బ్లాక్ టికట్లు .. అవునవును

పది రూపాయిలు జేబులో వేసుకొని (యానాం నుంచి) పాతిక కిలో మీటర్లు సైకిలు తొక్కుకుంటూ, మూడు రిలీజ్ సినిమాలు చూసి సుష్టుగా రెండో మూడో సేమ్యా ఉప్మాలు తినేసి, ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకొనే (ఓసారయితే ఇంట్లో "జజ్జనకరి జనారే" ఆడించుకొన్న) రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

గూడ్ పోస్ట్

బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి said...

ఊరు ఏదైనా అందరూ తలో చోటా ఉండి, ఇక్కడ ఒక వేదిక మీద కల్సి ఇలా పాత రోజుల అనుభవాలను పంచుకుంటూ ఉంటే ఆ ఊరు మనది కాకపోయినా బాగుంటుంది. మీ జ్ఞాపకాలు(ఇంతకు ముందు టపా కూడా చదివా) చాలా బాగున్నాయి శంకర్ గారూ!

జ్ఞాపకాలు తలపోసి కలబోసు కోడం ఎప్పుడూ బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఆల్బమ్ చూస్తున్నట్లు!

తృష్ణ said...

5-2-54 లో కాకినాడ లోని సరస్వతీ గానసభ వజ్రోత్సవాల(గోల్డెన్ జూబిలీ) సందర్భంగా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చేసిన ప్రసంగంలోని కొంత భాగం నా బ్లాగ్ లో పెట్టాను. వీలైతే వినండి. ఆ ప్రసంగంలో ఎన్ని విషయాలు చెప్పారో దేవులపల్లివారు.
http://trishnaventa.blogspot.com/2010/08/blog-post_13.html

మీరు రాసిన వీధుల్లో సగందాకా తెలుసు నాకు. మిగిలినవి అన్నయ్య చెప్పాల్సిందే. రెండు పేద్ద సినిమాలు "ఫస్ట్ డే ఫస్ట్ షో" కాకినాడలో నే చూసానండీ నేను. విజయలక్ష్మీ హాస్పటల్, అందులో డాక్టర్ కూడా తెలుసు...:)

బాగున్నాయండి మీ జ్ఞాపకాలు. ఒకట్రెండు ఫోటోలు పెట్టే ప్రయత్నం చెయ్యలేకపోయారా? నెక్స్ట్ పోస్ట్ లకైనా ప్రయత్నించండి. మీ టపా చదువుతూంటే మొన్న ప్రయాణమప్పుడు విజయవాడ వీధుల్లోంచి వెళ్తూంటే కలిగిన ఆనందం గుర్తొస్తోంది. టపా రాయాలి నేనూ..

SHANKAR.S said...

బొల్లోజు బాబా గారు ధన్యవాదాలు.
సుజాత గారూ సొంత ఊరు ఎవరికయినా అంతే కదండీ. ధన్యవాదాలు
తృష్ణ గారూ ఫోటోలు పెట్టానండీ. మీ బ్లాగులో కృష్ణ శాస్త్రి గారి ప్రసంగం చాలా కాలం క్రితమే చూసాను. సూర్య కళా మందిర్ గురించి ప్రత్యేక పోస్టులో రాసేటప్పుడు మీ పోస్ట్ గురించి quote చేద్దామనుకున్నాను.

తృష్ణ said...

ఓహ్ పెట్టేసారా. చూసారా ఇప్పుడెంత బావుందో ! ఫోటోలతో టపా నిండుగా ఉంది. very nice.

వంగూరి చిట్టెన్ రాజు said...

అమ్మోయ్, బాభోయ్...
అసలు కాకినాడ పేరు వింటేనే నేను మహానందపడిపోయి, ఎగిరి గెంతేసి, కింద పడిపోయి, మళ్ళీ లేచి...మళ్ళీ ఎగిరి గెంతేసి.....విషయం అర్ధం అయిందిగా....అలాంటిది మీ సినిమా స్ట్రీట్ వ్యాసంతో నన్ను యాభై, అరవై సంవత్సరాలు వెనక్కి తీసికెళ్ళిపోయారు. మీరు ప్రస్తావించిన సినిమా హాల్స్ లో పాతవన్నీ నాకు తెలిసినవే. కానీ మీరు ప్రస్తావించనిది జగన్నాధపురం వంతెన దిగి, కుడి వేపు తిరిగి, మళ్ళీ సినిమా వీధిలోకి ఎడం వేపు తిరగానే మా చిన్నప్పుడు ఉండే పేలస్ టాకీస్. అదే కాకినాడలో, ఆ మాట కొస్తే మొత్తం ఆంధ్రాలోనే కట్టిన మొదటి తరం సినిమా హాలు మా ఆత్మీయులు, స్వర్గీయ గొలగాబత్తుల రాఘవులు గారు కట్టారు. ఆయనే తరవాత క్రౌన్ టాకీసి, ఇంకా మరికొన్ని, ఆయన అల్లుడు స్వర్గీయ నారాయణ రావు గారే, క్రౌన్ టాకీసు నుంచి కల్పనా టాకీసు కట్టారు. ఆ పేలస్ టాకీస్ లో మాత్రమే మా చిన్నప్పుడు హిందీ సినిమాలు ఆడేవి. ఎవరికీ హిందీ రాదు కాబట్టి ఒక మూల ఒకతను మైకు పట్టుకుని ప్రతీ డైలాగూ చాలా తమాషాగా, హాస్యంగా తెలుగు లోకి అనువాదం చేసే వాడు. ఉదాహరణకి "ఇప్పుడు ఆ దిలీప్ కుమార్ గుర్రం మీద వైజయంతీ మాల ప్రేమ కోసం ప్రాణ్ ని ఎలా తరుముతున్నాడో " అని సొంత పైత్యం జోడించి చెప్పేవాడు.
అలాగే పడక్కుర్చీలు, వాటిల్లో నల్లులూ ఉన్నా, హాలీవుడ్ సినిమాలు అక్షరం ముక్క అర్ధం అవకపోయినా కేవలం ప్రెస్టీజ్ కోసం, హీరోయిన్, హీరోలు ముద్దెట్టుకోడం లాంటి ప్రగాఢమైన కారణాలకీ సత్యగౌరిలోకి వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా హాళ్ళ యజమానులందరూ గాంధీ నగరంలో మా ఇంటికి , పార్కుకీ అటూ, ఇటూ ఉండేవాళ్ళం కాబట్టి, ఇంచుమించు ప్రతీ రోజూ ఇంటర్వెల్ దాకా పైన ప్రొజెక్షన్ రూములో కూచుని చూశేవాళ్ళం. ఆ కటింగులు ఇంటికి తెచ్చుకుని దాచుకునే వాళ్ళం. ఇక మినర్వా టాకీసు శ్రీనివాసరావు గారు సినిమాల్లో వేషాలు వేశేవారు. అలనాటి హీరో హరనాథ్ రోజూ వచ్చేవాడు. అలాగే యస్వీ రంగారావూ, రేలంగీ కాకినాడ వచ్చినప్పుడల్లా అక్కడ కనపడేవారు.
అంతెందుకూ, నేను అమెరికా వచ్చాక, ఒక సారి ఇండియా వెళ్ళి, అర్జంటుగా నా పెళ్ళి కుదరగానే, నా పెళ్ళికి శలవు కావాలని మా బాస్ ని అడగడానికి మా ఇంట్లో పోన్ లేదు కాబట్టి, క్రౌన్ టాకీసు నుంఛే అమెరికా కాల్ బుక్ చేసి, మేటనీ నుంచి సెకండ్ షో దాకా ఆరు గంటలు ఒక చెత్త సినిమా చూశాను. ఆ డైలాగులు ఇప్పుడు కూడా చెప్పగలను.
మీ రచనా శైలి చాలా బావుంది....రాస్తూనే ఉండండి....చదువుతూనే ఉంటాను...

---వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్, టెక్సస్

SHANKAR.S said...

చిట్టెన్ రాజు గారు,
గురువుగారూ మీఅంతటి వారు నా బ్లాగు చూడటం, కామెంటడం, నా శైలిని ప్రోత్సహించడం చూస్తే నాకు గాంధీ నగర్ పార్క్ గేటు దగ్గర పి.కే.పి లో నిమ్మకాయ పిండుకుని ఆ రుచిని ఆస్వాదిస్తూ తిన్నట్టుంది. ధన్యవాదాలు.

పేలస్ గురించి ప్రస్తావించానండీ. అక్కడ హిందీ సినిమాలు ఆడాయన్న విషయం నాకు తెలియదు. మా తరం వచ్చేసరికి అది "పెద్దలకు మాత్రమే" థియేటర్ గా మారిపోయింది. ఒకసారెప్పుడో బాలల చిత్రోత్సవం జరిగినప్పుడు అక్కడ "పాపం పసివాడు" సినిమా వేస్తే మా స్కూల్ తరపున తీసికెళ్లారు. ఇకపోతే మీ కామెంట్ లో మినర్వా టాకీస్ అన్నారు. అంటే మెజిస్టిక్ థియేటర్ దగ్గర ఉండేదా? లేక క్రౌన్ దగ్గరా? పేరు లీలగా విన్నట్టు ఉంది కానీ గుర్తు రావటం లేదు.

మీదీ గాంధీ నగరేనా? కెవ్వు కేక. మా ఇల్లు గాంధీ బొమ్మ దగ్గర.

మంచు said...

అద్గదీ... ఎక్కడ వీర్ కమల్ ని మర్చిపొతారొ..నా చేతిలొ అయిపొయారు అని చూస్తున్నా.... :డ్:డ్

నేను అల్మొస్ట్ అన్నిటిలొ సినిమాలు చూసాను. అప్పట్లొ నాకు కమల్ వీర్, సత్యగౌరి, ఆనంద్ బాగా ఇస్టం. మీరు చెప్పినట్టు సత్యగౌరి సౌండ్ సిస్టం మాత్రం కేక... బ్లాక్ టికెట్స్ లేకుండా చెయ్యడం, థియేటర్ మైంటెనన్స్ అన్ని సూపరే...

రాత్రి పన్నెండూ ఆ టైం కి....భానుగుడి సెంటర్ లొ అరటిపళ్ళు బండివాళ్ళు మిగిలిపొయిన సరుకంతా తక్కువరేట్ కి అమ్మేస్తూ ఉంటారు...ఆనంద్ లొ సెకండ్ షొ చూసి ఇంటికెళ్తూ ... అక్కడ ఆగి సింపిల్‌గా ఒక్కొడు ఒక అరడజను అరటిపళ్ళు తినివెళ్ళడం అలవాటు మాకు :-)))

Anonymous said...

బాగుందండీ.
నేను కూడా కాకినాడలో చాలా సినిమాలు చూసాను.
కాని కొన్నాళ్ళకి మీ సినిమా రోడ్డు కాస్తా కళ్యాణమంటపాల రోడ్డుగా మారిపోతుందేమో?

ఆ.సౌమ్య said...

అమ్మో ఈసారి చాలా పెద్ద పోస్ట్ రాసేసినట్టున్నారే....అంతా తీరికగా చదివి కామెంటు రాస్తానేం :)

Unknown said...

గురుగారు వీర కమల్ లో జరిగిన మర్డర్ గురించి రాయలేదెం .. :)
మేము కాలేజి ఎగ్గొట్టి వీర కమల్ లో ఏడు రూపాయల టిక్కెట్టు పెట్టి ఎన్ని సినిమాలు చూసే వాళ్ళమో :)
తిరుమల ని లాస్ట్ రాసారు .. :( నాకు అది చాలా ఇష్టం .. మా ఇల్లు చాణక్య చంద్రగుప్త దగ్గరే ..
ఆనంద్ కాంప్లెక్స్ అయితే ఎంత పాత బడినా దాని క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు మరి ..
స్వప్న మొదట్లో చాల హిట్ సినిమాలు ఆడేవి .. ఇప్పుడు ఏంటో బాగా డల్ అయిపొయింది ..
కాని ఇలా మీరు ఫోటోలు తో సహా పెట్టేస్తే ఎలా మాస్టారు .. : ( నాకు చాల బెంగ వచ్చేస్తోంది .. మా అమ్మ గుర్తోచ్చేస్తోంది .. మీ వల్లే అంతా .. :(

వంగూరి చిట్టెన్ రాజు said...

శంకరూ,
నా స్పందనకి నీ ప్రతిస్పందనలో కొన్ని తమాషా విషయాలు ఉన్నాయి. మొదటిదేమో "మీ అంతటి వారు" అన్న డైలాగు తప్పు. ఎందుకంటే నేను కేవలం ఐదు అడుగుల ఐదు అంగులాళ ఎత్తు, నూట నలభై పౌండ్ల బరువు ఉన్న సాధారణ కాకినాడ పౌరుణ్ణి.
ఇక రెండోది...." మీదీ గాంధీ నగరేనా?" అన్న నీ ఆఖరి డైలాగు.. ఎందుకంటే అసలు ఆ గాంధీ నగర్ మాదే! నువ్వు గాంధీ బొమ్మ దగ్గర బయలు దేరి పార్కు కేసి వంద గజాలు నడిస్తే, కుడి వేపు వంగూరి హౌస్ అనీ, వసుధా నర్సింగ్ హోం అనీ ఒక ఎకరం స్థలంలో మూడు ఇళ్ళు కనపడతాయి. ఆ స్థలంలొనే ఒక బంగిన పల్లి మామిడి చెట్టూ, అటూ, ఇటూ ఖాళీ స్థలమూ ఉంటాయి. నేను పుట్టిన ఇల్లు ఆ మామిడి చెట్టు పక్కనే ఉండేది. 1923 లో మా తాత గారు కట్టిన ఇల్లు ఓలు మొత్తం గాంధీ నగరంలో రెండో ఇల్లు. ఆ ఇంట్లోనే నేనూ, మా కుటుంబంలో వంద మంది పైగా పుట్టాం, ఆ మామిడి చెట్టు కిందనే పెరిగాం. మూడేళ్ళ క్రితం ఆ ఇల్లు అదోలా అయిపోతే దాని ఫొటోలు తీసుకుని, స్వర్గానికి పంపించేశాం. ఆ మామిడి చెట్టు వయసు కేవలం ఎనభై ఏళ్ళ పైనే! మా అన్నయ్యలు ఇద్దరూ అక్కడే ఉంటారు. నేను ఇండియా రాగానే ముందు కాకినాడ, గాంధీ నగరంలో మా ఇంటికి వెళ్ళి మా మా మామిడి చెట్టుని కావలించుకుంటాను.. నువ్వు ఇప్పుడు వెళ్తే మా పెద్దన్నయ్యనీ, మా మూడో అన్నయ్య డా. సుబ్రమణ్యాన్నీ పలకరించవచ్చు.
మా ఇంటికి అనుకుని, గాంధీ బొమ్మని చూస్తూ ఉన్న కార్నర్ ఇల్లు....వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి ఇల్లు.
గాంధీ నగర్ లో కట్టిన మొట్ట మొదటి ఇల్లు "శంభల" వారి ఇల్లు. అది మా ఇంటికి ఎదురుగా ఉన్న "గిడ్డీ సందు" లో ఉండేది. ఆ ఇల్లూ, ఆ పక్కనే స్థలం కల్పనా టాకీసు యజమానులు కొనుక్కున్నారు. ఆ ఇంట్లోనే ..ఆ వోలేటి పార్వతీశం గారి రెండో కొడుకు, చిన్న వయసులోనే చనిపోయిన సుప్రసిధ్ధ కవి "శశాంక" ఉండేవాడు.
అన్నట్టు, గాంధీ బొమ్మ దగ్గరే ఉన్న బస్ స్టాంద్ మీద "గొలగాబత్తుల రాఘవయ్య" గారి పేరు ఉంటుంది. ఆయనే పేలస్ టాకీస్, క్రౌన్ టాకీస్ లాంటి సినిమా హాళ్ళు కట్టారు. అలనాటి విజయా వారి చిత్రాలకి ఏకైక డిస్ట్రిబూటర్.
అన్నటు, నీ వ్యాసంలో నువ్వు ప్యాలెస్ టాకీస్ గురించి ప్రస్తావించావు కానీ, ఎందుకో నా బుర్రలో పడ లేదు. మన్నించు. ఇక, మినర్వా టాకీసు మెజెస్టిక్ పక్కనే ఉండేది.
ఇవన్ని రాస్తుంటే అర్జంటుగా కాకినాడ వచ్చేద్దామని ఉంది. చూద్దాం...
---వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్, టెక్సస్

SHANKAR.S said...

@ చిట్టెన్ రాజు గారు
గురువుగారూ "మీ అంతటి వారు" అన్నందుకు నాకు భలే మొట్టికాయలు వేశారు. :). మీ లెక్కలో అయినా నేను ఎప్పటికీ మీ అంతటి వాడిని కాలేను. (ఏం చేస్తాం నేను ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు మరి )

అయితే మీ ఇల్లు నాకు తెలుసండీ. ఆ మామిడి చెట్టు కూడా తెలుసు. మా ఆపార్ట్మెంట్ నుంచి చూస్తే మొత్తం పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. (మాది మమత నర్సింగ్ హోం ఎదురుగా). బాల్కనీ లో కూర్చుని గాంధీ బొమ్మ సెంటర్ ని చూస్తుంటే చుట్టూ ఐదు రోడ్లతో స్టార్ ఫిష్ లా అనిపిస్తుంది నాకు. పాత గాంధీనగర్ ఎలా ఉండేదో నాకు తెలియదు. సినిమా హాల్ స్ట్రీట్ మాత్రం మొన్నా మధ్య టివిలో ఏ సినిమా లోదో తెలియదు గానీ రాజబాబు, రమాప్రభ గార్ల "కాకినాడ రేవులోన ఓడెక్కి" పాటలో మెజిస్టిక్, సంత చెరువు వగైరా ఏరియాలు చూసి వార్నీ అప్పట్లో ఇలా ఉండేదా అనుకున్నాను. (అదే సినిమానో తెలిస్తే కాస్త చెబ్దురూ)

మినర్వా టాకీసు తరవాత మయూరి గా మార్చారండీ. ఇప్పుడు అది కూడా ఫంక్షన్ హాల్ చేసారని ఎవరో బ్లాగ్ మిత్రులు చెప్పారు.

@ కావ్య గారు
"వీర కమల్ లో జరిగిన మర్డర్ గురించి రాయలేదెం"
SSSHHHHH....అలాటివి పబ్లిక్ గా మాట్లాడేసుకోకూడదు. అది మన కాకినాడ వాళ్లకి ఆల్రెడీ తెల్సు, బయటి వాళ్లకి తెలియాల్సిన అవసరం లేదు కదా.

"తిరుమల ని లాస్ట్ రాసారు .. :"
నేను జగన్నాధపురం వంతెన నుంచి మొదలెట్టి సినిమా హాల్ స్ట్రీట్ మీదుగా భానుగుడికి వెళ్లి అక్కడనుంచి తిరిగి మెయిన్రోడ్ కి వచ్చా కదా అంచేత తిరుమల చివరకి వెళ్ళిపోయింది.

"కాని ఇలా మీరు ఫోటోలు తో సహా పెట్టేస్తే ఎలా మాస్టారు"

మొదట్లో నేనూ ఫోటోలు పెట్టలేదు. కానీ బ్లాగర్ తృష్ణ గారు ఫోటోలు ఉంటే బావుంటుందని సలహా ఇచ్చారు. మీకేంటి ఫోటోలు చూస్తుంటే నాకూ బెంగ వచ్చేస్తోంది. వా :( ........ఇంటికెళ్ళిపోతా :( :( :(

@ అ.సౌమ్య గారు

అవునండీ కాకినాడ సినిమా హాల్ స్ట్రీట్ కూడా పెద్దదే మరి. అందుకే ఈ పోస్ట్ ఇంత పెద్దగా వచ్చింది. :)
త్వరగా చదివేసి కామెంట్ పెట్టేయండి

@ బోనగిరి గారు
పోన్లెండి, అలా అయితే ఫంక్షన్ హాళ్ళు వరుసగా ఉన్న స్ట్రీట్ గా అయినా ప్రత్యేకత ఉంటుందిగా :)
మీరు కాకినాడలో చదివారా? (అన్ని సినిమాలు చూసానంటే అడిగా)

@ మంచు గారు
డిగ్రీ లో ఉన్నప్పుడు రోజూ తప్పనిసరిగా కనిపించే హాలండీ అది. (గాంధీనగర్ - విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్). దాన్ని ఎలా మరచిపోతా?

ఆనంద్...సెకండ్ షో...సగం మూసిన చార్మినార్ షట్టర్లు...అరటిపళ్ళ బళ్ళు ఇవన్నీ నాకూ జ్ఞాపకాలేనండీ.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

శంకర్ గారికి శ్రీ ఖర నామ సం ఉగాది శుభాకాంక్షలు. ఆలాగే
వంగూరి చిట్టెనరాజు గారికి
నేను అమెరికా కి వెళ్ళిన నప్పుడు
Huston ki velladam kudaraledu
Atlanta velli vachhisamu . valla freinds dwara valla activities telisikonnamu
All the Best Raju garu . also i read some your amerikakama kabhurulu

సరే కాకినాడ గురుంచి చాల మంచి ఖబుర్లు చెప్పారు. నేను కూడా ఒక విషయం చెబుతాను మేము చాల చిన్నతనం లో ఉండేవాళ్ళము
అంతకంటే మరో ముఖ్యమైన విషయం మా తాతగారు పెరి సూర్యనారాయణ మూర్తి(హిందీ మాస్టర్) కొంతమంది ప్రతిభలు చరిత్రలోకి ఎక్కవు అంటే రికార్డు కాబడవు అలాగే మా తాతగారు.తెలుగు సినిమాలు ఇంకా తీయని రోజులలో మూడుగంటలు లేదా నాలుగు గంటలు నించొని
ఆలం ఆర,సత్య హరిశంద్ర లాంటి hindi సినిమాలకి తెలుగు translate చేసివారు. ఆయన అప్పట్లో follower of రాజారామ్మోహన్ రాయ్.
సో అలా మొదలైంది. కాకినాడ కధ. నాకు ఆయన దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారికి హిందీ చెప్పిన గురువు.,గాంధీ గారు తో మాట్లాడడానికి,ఆవిడ స్వతంత్ర ఉద్యమోలో హిందీలో మాటలాడడానికి మాతాతగారు ఆవిడకి చెప్పేవారు.. మా దురద్రష్టం ఆయన
మానాన్నగారి కే చిన్నతనం లో నే పోయారు.కొన్ని రోజుల వరకు ఆయన ఫోటో కాకినాడ town hall లో వుండేది ట. మాకు అసలు తెలియదు.
ఎనీ వే కాకినాడ మూలం గ మా తాతగారరిని మళ్ళి గుర్తు చేసుకున్నాము.కాకినాడ ,గాంధీనగర్ ,రెడ్క్రోస్స్ (red cross)స్ట్రీట్ దగ్గర
అప్పుడు తెలీదు కానిఇప్పుడు తెలిసింది మాకు మా ఇంటిపక్కనే వున్న ఆకెళ్ళ సీతారాం, మన సిరివెన్నెల సీతారామశాస్త్రి అని. మా అన్నయ్యకి సీనియర్ పి ర్ కాలేజీ లో ani.
ఆ రాజబాబు ,రమాప్రభ పాట "" రాధమ్మ పెళ్లి" లోనిది ఊర్వసి శారద(tripple role) Nata Sekher krishna lead roles.

Next time maa Rajamandri
gurunchi matladukundamu.

గోదావరి

గోదావరి ! నిండుగోదావరి
ఎప్పుడు చూసినా కొత్తగానే వుంటుంది!
మంద్రంగా ప్రవహిస్తూ శాంతమూర్తి లా నిండుగా వుంటుంది
ఒక ఒద్దిక అయిన ఇల్లాలు పెద్దసంసారాన్ని ఒడుపుగా మోస్తున్నట్లు వుంటుంది
వరదలు అనే ఒడిదుడుకులను తను అస్సలు చూడనట్లే గంభీరం గ వుంటుంది
దగ్గరకు వెళ్ళగానే వచ్చావా అమ్మా అనే కన్నతల్లి స్పర్శను మరిపిస్తుంది
తన చల్లని ఆత్మీయత ని చూపిస్తూ సేదదిరుస్తుంది
నిద్రపో కన్నా ఆని తనదగ్గర్నువుండే పిల్లతెమ్మేరాలను పంపిస్తుంది
ఎవరు వచ్చి తమ కష్టాలు,భాధలు చెప్పుకున్న యిట్టె పోగేట్టేస్తుంది
ఎందరోరెందరో ఆ తల్లి దగ్గరికి(వొడ్డుకి) వెళ్లి తమ సంతోషాలని,దుఃఖాన్ని కూడా పంచుకుంటారు
అందరివి తనలో దాచుకొని వారిని' చల్లగా వుండాలని దీవిస్తుంది"
ఎందరెందరో మహానుభావులు ఆ గోదావరి తల్లి ప్రేమను అనుభవించి గొప్పవాళ్ళు అయ్యారు.
ఆ అఖండ గోదావరి ఆ కన్నతల్లి ప్రేమ ఎప్పటికి మనమీద ప్రసరించాలని!
ఆ తల్లి వాత్సల్యంలో మనం పునీతం ఆవుదాం!!!

sruthi said...

hi shankhar garu,

na childhood antha kakinada lo ne gadichindi ma ammamma valla inti lo..memu palace theatre backside undevallamu..ippudu ammamma ledu kevalam gnapakalu matrame unnayi..
really luved this post, na balyam motham gurthu chesaru.
Luved this post.

Anonymous said...

Hope everything is okay with you. No new columns from your blog since long. You have lot of matter related to Jagan's never ended vodarpu and Lokayukta bill. Looking forword to see new things in your blog.