Saturday, June 25, 2011

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం


(ఏదో ఒక సారి రెండు సార్లు ధరలు పెంచితే స్పందించి పోస్ట్ రాస్తాం కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంటే ఎన్ని పోస్టులని మాత్రం రాస్తాం చెప్పండి? ఇప్పుడు గ్యాస్, డీజిల్ ధరలు పెంచి 'జనాలు భరించగలరు' అన్న మంత్రిగారి ఉవాచ చూసి ఈ మాట ఎక్కడో విన్నానే అని పాత పోస్టులు తిరగేస్తే ఇదిగో ఈ పోస్ట్ కనిపించింది. చిత్రంగా ఈ పోస్ట్ గత ఏడాది ఇదే రోజు రాసినది. అప్పటికీ ఇప్పటికీ పెట్రోలియం శాఖా మంత్రి మారారు గానీ వాళ్ళు చెప్పే మాట మారకపోవడం విచిత్రం. అవును మరి మన మంత్రులంతా ఒకే మాట మీద ఉండటం మన ప్రజాస్వామ్యానికి గౌరవం కాదూ. వాళ్ళే మాట మార్చనప్పుడు నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే. )

"ప్రజలు భరించగలిగే స్థాయిలోనే పెట్రో ధరలు పెంచాం" - కేంద్రం 

టివి లో ఈ స్టేట్మెంట్ చూసి బోల్డంత హాశ్చర్యం వేసేసింది. అసలు ప్రజలు ఎంతవరకూ భరించగలరో వీళ్ళకి ఎలా తెలుసా అని? తరవాత గుర్తొచ్చింది మన దేశం లో ఏ విషయాన్నయినా, ఎంతవరకయినా భరించడమే తప్ప అదేంటని ప్రశ్నించడం మనకెప్పుడూ అలవాటు లేదని. నిజమే స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం. మనం ఎన్నుకున్న నాయకులు తాము చేసిన వాగ్దానాలు మరచి సొంత లాభం కోసం అడ్డమయిన గడ్డీ కరుస్తుంటే మౌనంగా భరిస్తాం. మన ఖర్మ అని సరిపెట్టుకుంటాం. అవును మరి అందరూ దొంగలే అయినప్పుడు వాడికన్నా వీడు కాస్త మంచి దొంగ అని సరిపెట్టుకోవాల్సిందే కదా! 

సరే ఇంక పెట్రోలు విషయానికి వస్తే...చమురు ధరలపై నియంత్రణ ఎత్తేశాం అని కేంద్రం ఘనంగా ప్రకటించింది, అక్కడికేదో ఇప్పుడు అన్నిటి మీదా నియంత్రణ ఉన్నట్టు. జనం జేబుకు చిల్లు పడ్డా పర్లేదు కానీ చమురు కంపెనీలు మాత్రం చల్లగుండాలి ఇదీ మన కేంద్ర విధానం. పైగా నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోలు రేట్లు పెరగచ్చు కనక కానీ రేట్లు తగ్గితే పెట్రోలు రేట్లు మంచినీళ్ళ కన్నా చీప్ అయిపోతాయి( మన ఖర్మ చివరికి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది), ఎక్కువమంది పెట్టుబడి దారులు ఈ రంగం లోకి వచ్చి పోటీ పెరిగి ధరలు తగ్గిపోతాయి అని ఒక వింత వాదన. అందుకు టెలికం రంగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు  అమ్మగారి అడుగులకు మడుగులోత్తే అమాయక నేతలు. సాంకేతికత తో ముడిపడ్డ రంగానికి, సహజ వనరులతో ముడిపడ్డ రంగానికి సామ్యం తేవడం వీరికే చెల్లింది. అసలు చమురు కంపెనీల మీద వడ్డిస్తున్న పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా చమురు ధరలూ తగ్గుతాయిగా...అమ్మమ్మ ఎంత మాట? అలాంటి వాటిమీద పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే అసలు అనకూడని, వినకూడని మాట. అయినా ఎంత పెంచినా అన్నీ మూస్కుని భరించడానికి జనం ఉండగా పన్నులు తగ్గించి మన ఖజానా బరువెందుకు తగ్గించుకోవాలని పాపం వాళ్ళ ఆలోచన. అదీ నిజమే లెండి భరించడం మన జన్మ హక్కు మరి. అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే  మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో :) 

ఇక మొదలవుతుంది అసలు కధ, ఒక్క పెట్రోలు, డీజిల్ రేట్లతోనే ఈ కధ ఆగుతుందా? నిత్యావసరాల దగ్గర నుంచీ ప్రతీ వస్తువు ధారా ఈ సాకుతో అమాంతం పెరిగిపోతుంది. అయినా మనం చిరునవ్వులు చిందిద్దాం. 

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం 

7 comments:

Anonymous said...

ఏడాదికి 3-5రూపాయలు అంతే కదా, ఎక్కువేం కాదు. భరించగలరు. ఎట్టాగూ సబ్సిడీలున్నాయి, మీలాంటి సంపాదించేవోళ్ళు ఇస్తేనే కదా మాలాంటి సోమరిపోతులు తినితొంగోనేది.

తృష్ణ said...

"స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం."

..true.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ ఉద్దేశ్యం ఏమిటి అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి అని అడుగుతున్నాను. 18 రూపాయలు ఉండే బియ్యం 6 నెలల్లో 34 అంటే నోరు మూసుకున్నారా, 5 ఉండే బం. దుం. 14 కెళ్ళితే చోద్యం చూసారా. కూరగాయల రేట్లు గగన విహారం చేస్తుంటే కోటా శ్రీనివాస రావు లా లొట్టలేశారా లేదా. అంత పెద్ద సిలిండర్ కి ఒక ఏభై రూపాయలు పెంచితే ఇంత గొడవ చెయ్యాలా. గంటకి వెధవది 50 పైసలు పెంచితే ఇంత రాద్ధాతం చెయ్యాలా. (AV. 120 గంటలు వస్తుందట సిలిండర్, ఎవరో లేఖ్ఖ కట్టి చెప్పారు)

I object your honour :))

Indian Minerva said...

"నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే."
liked this very much.

" అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో"
అన్నా... రెచ్చిపోయినవే. మీ విశ్లేషణకూడా బాగుంది సహజవనరులు-సాంకేతికత విషయంలో.

@బులుసు సుబ్రహ్మణ్యం గారు: Why is that you are opposing his honour? (a confused smiley here plz).

Indian Minerva said...

A comment about your comment box thingy....

ఈ రోజు నేను అస్సలు బయటకి అడుగే పెట్టకూడదని డిసైడైపోయాను. So I have more than a moral right to comment here.

bharadwaj said...

లేని వాడికి వండుకోడానికి ఎమీ ఉండదు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. ఉన్నవాడికి ఎంత పెంచినా బాదలేదు. మద్యతరగతి వాళ్ళు దానికి తగ్గట్టు బడ్జెట్ ఎడ్జస్ట్ చేసుకుంటారు.

bharadwaj said...

లేని వాడికి వండుకోడానికి ఎమీ ఉండదు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు. ఉన్నవాడికి ఎంత పెంచినా బాదలేదు. మద్యతరగతి వాళ్ళు దానికి తగ్గట్టు బడ్జెట్ ఎడ్జస్ట్ చేసుకుంటారు.