తెలుగు సాహిత్యం లో నాకిష్టమైన ప్రక్రియలు చాటు కవిత్వం, పేరడీలూనూ. చాటువులంటే శ్రీనాధుడు గుర్తొచ్చినట్టే పేరడీలంటే జరుక్ శాస్త్రి గా సుప్రసిద్దుడైన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారు గుర్తురాక మానరు. చిత్రమేమిటంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో పేరడీ ప్రక్రియకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జరుక్ కేవలం పేరడీకే పరిమితం కాలేదని తనదైన శైలిలో కథలు, వ్యాసాలూ రాసారని చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే మన తెలుగోళ్ళు తెనాలి రామలింగడ్ని కూడా కామెడీ కవిగానే చూస్తారు తప్ప పాండురంగ మహత్యం గురించి కన్వీనియంట్ గా మర్చిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ముద్ర వేసేస్తాం మనం. దాన్ని దాటి బయటకి చూడటానికి ఎందుకో ఇష్టపడం. ఉదాహరణకి బుడుగుని చూపించి ముళ్ళపూడి వారికి హాస్య రచయిత అనే ముద్ర వేసేస్తాం. అదే టైం లో ఆయన "కానుక" గురించి మర్చిపోతాం. విశ్వనాధ గారంటే చిన్న తలగడ సైజులో ఉన్న వేయిపడగలే గుర్తొస్తుంది కానీ విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు మన ఆలోచనల్లోకే రాదు.
ఆ మాటకొస్తే మరి జలసూత్రం వారూ తక్కువ తినలేదులెండి . ఒరిజినల్ లోని లోపాలని ఎత్తిపోడవటంలో ఆయనకు ఆయనే సాటి. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఏకిపారేశారు. వెక్కిరింపుల్లో తెనాలి రామలింగడి సాటిగా తన తరం కవులను గౌరవిస్తూనే మొట్టికాయలేశారు. అయితే ఆ మహానుభావులు కూడా ఈ మొట్టికాయలని సద్విమర్శగా తీసుకున్నారులెండి. విద్వత్తు, తుంటరితనం కలబోసిన జరుక్ తన సమకాలీకులలో దాదాపు అందరినీ ఆటపట్టించారు.
"అసలు శ్రావణ మాస మధ్యమ్మునందు
కురిసి తీరాలి వర్షాలు కొంచె కొంచెం
మేని రాలాలి తుంపరలేని, కానీ
ఉక్కమత్ర మేమాత్రమూ ఉండరాదు"
అని కృష్ణ శాస్త్రి తన "శ్రావణం" లో అంటే జరుక్ తిన్నగా ఉండకుండా
"అసలు సిగరెట్లు కాల్చుట భ్యాసమై ఫ
దేడులవుతోంది ఎన్ని వూదేశినానొ
నేడు సిగరెట్లు కాల్చను పాడను ఇంక
కరువు రోజులు అరువులివ్వరులె మనకు" అని సరదాగా వెక్కిరించారు.
పోనీ తన స్నేహితుడు శ్రీశ్రీనయినా వదిలారా అంటే అదీ లేదు.
"నేను సైతం కిళ్ళీకొట్లో
పాతబాకీలెగురగొట్టాను
నేను సైతం జనాభాలో
సంఖ్యనొక్కటి వృద్ధి చేశాను" అంటూ పేరడీ అస్త్రం సంధించారు. ఇది దేనికి పేరడీయో ప్రత్యేకంగా చెప్పాలా? :))
ఒక్కరా ఇద్దరా ఆనాటి ఉద్దండులందర్నీ దాదాపు ఆడేసుకున్నారు. ఇక కవిరాజు విశ్వనాధ వారి విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. కఠినంగా ఉండే పదాలు, సమాసాలతో పద్యాలను ఎత్తుకునే విశ్వనాధ వారి శైలిని ఆటపట్టిస్తూ కాస్త విసుగ్గా
"కించిత్తిక్త కాషాయ షాడబ రసక్షేఫాతిరేకాతివా
క్సంచార ప్రచయావకాశాములలో కవ్యుద్ఘః గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా
పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాక ప్రభూ" అన్నారు. అర్ధమయిందా :))
అయితే ఇంత అల్లరి చేసినా విశ్వనాధ వారి పట్ల కుసింత భయభక్తులతోనే మసలుకునేవారు. విశ్వనాధ గారి గురించి జరుక్ రాసిన వ్యాసం చూస్తే ఆయన పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది. ఆ వ్యాసం ఇక్కడ చూడచ్చు. ఇంత అపురూపమైన వ్యాసాన్ని అంతే అపురూపం గా మనకందించిన వంశీమోహన్ గారికి బోలెడన్ని థాంకులు.
కేవలం ఇలా కవిత్వానికి, పద్యాలకే తన అల్లరిని పరిమితం చేయలేదు జరుక్ గారు. " అసలు సత్యాశ్రయ కందశిలా శాసనం" లో చరిత్ర పరిశోధకుల మీద తనదైన శైలిలో చురకలేశారు. విశ్వనాధ వారి నర్తన శాలని పేరడీ చేసి "కీచక వధ" నాటికగా వదిలారు. ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచికలో జరుక్ శాస్త్రి గారు రాసిన "వైదీకుల పరిభాషలు" అనే వ్యాసం చూసి తీరాల్సిందే. ఉద్యోగ కారణాల వలన చాలా వరకు మారు పేర్లతో రాయడం వల్ల ఈయన రచనలు అంతగా దొరకట్లేదు. జరుక్ శాస్త్రి రాసిన కధలను నవోదయ వారు "శరత్ పూర్ణిమ" పేరుతో ప్రచురించారు.
జరుక్ గారి గొంతు వింటారా? అయితే ఇదిగో వినండి మరి
("కొన్ని అపురూపమైన గొంతుకలు" పేరుతో ఈమాట లో పరుచూరి శ్రీనివాస్ గారు అందించిన స్వరాల మాలలో ఉన్న జరుక్ గారి గొంతు మీకోసం. ఇంత అరుదైన స్వరం మనకు అందించినందుకు శ్రీనివాస్ గారికి మరోసారి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు.)
ఇక అబ్బూరి వారు, ఆరుద్ర, శ్రీశ్రీ లతో జరుక్ స్నేహం సుప్రసిద్ధం. వీళ్ళు జరుక్ శాస్త్రి పై ఏకంగా రుక్కుటేశ్వర శతకం కూడా రాశారు :) (వందా కాదు లెండి). రుక్కాయి, జరూ అని ముద్దుగా పిల్చుకుంటూ అబ్బూరి వారు మొదలెట్టిన ఈ శతకాన్ని శ్రీ శ్రీ, ఆరుద్ర కలిసి రాశారు. ముందు అబ్బూరి వారు ఏమన్నారో చూద్దాం.
"ద్విగుణీకృత కర్తరికా
సిగరెట్ పొగరీకృతుండు, జిహ్వాగ్ర నటత్
భుగ భుగ భుగాయితోజ్జ్వల
రిగసా సగరీ గరీసరిగ సారుండున్ " అంటూ అబ్బూరి వరదరాజేశ్వర రావు గారు మొదలెడితే ఇక శ్రీ శ్రీ , ఆరుద్ర కలిసి
"అవధరింపుము ఋగ్దేవా!
వచియించే "వరద" లోగడ
రచియింతునని రుక్కుటేశ్వర శతకమును మే
మచలిత ధైర్యమ్మున నా
మా చౌర్యమొనరించినాము మన్నించు జరూ!" అంటూ మొదలెట్టి కొనసాగించారు. ఇందులో మచ్చుకి ఒక రెండు పద్యాలు మీకోసం
"గోల్డ్ వ్యామోహం చెడ్డది
మైల్డ్ వ్యాయామం శరీరమాద్యం ఖలుడా,
చైల్డ్ వ్యాపారం కూడదు
ఓల్డ్ వ్యూలను హోల్డు చేయకుండుముర, జరూ !"
"దోచేసే వాళ్ళను ఏ
దో చేస్తుందని శివాశతో చూస్తుంటే
దోచేస్తోంది కదా కం
చే చేనుమేసినట్టు లీ ప్రభుత జరూ!"
కొసమెరుపు: ఏ కవీ ఖూనీ చేయడానికి కూడా సాహసించని "సరస్వతీ నమస్తుభ్యం" ను జరుక్ ఏం చేశారో చూడండి. ఇదీ జరుక్ మార్క్ ఝలక్ అంటే! :)))
"ఛోటాహజ్రీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
కాఫీ పానం కరిష్యామి
సిద్ధిర్భవతుమేసదా"
ఆధునిక తెలుగు సాహిత్యంలో పేరడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకి మనందరి తరపునా నివాళులు అర్పిస్తున్నాను.
అలాగే ఒక రెండేళ్ళ క్రితం జరుక్ స్ఫూర్తితో అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేను చేసిన ఈ చిన్ని ప్రయోగాన్ని ఓ సారి చూడండి "మహా కవుల తెలంగానం"
9 comments:
ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి....చాలా బాగ రాసారు.కాకినాడ తర్వాయి భాగంమీద కూడా కనికరం చూపండి...
చాలా comprehensive గా రాశారు శంకర్ గారూ! అప్పుడప్పుడూ ఇలా చక్కని బ్లాగులు రాసేట్టుగా మిమ్మల్ని చరుస్తూ ఉండాలేమో!
ధైర్యంగా, విశ్వాసంతో కామెంటా!
చాలా బాగుంది శంకర్ గారూ.
జరుక్ శాస్త్రి గారి రచనలు నేను ఆట్టే చదవ లేదు కానీ వారి మీద శ్రీశ్రీ వ్యంగం ఎక్కడో చదివినది గుర్తుకు వచ్చింది.
రుక్కునకు, ఆగ్రహము గల
ముక్కునకు, వినూత్న భావముఖరిత వాణీ
భాక్కునకున్, తెగ వాగెడు
డొక్కునకున్, సాటిలేని డుబుడుక్కునకున్
జరుక్ శాస్త్రి గారి మీద మీ పరిచయం బాగుంది. తీరుబడిగా మళ్ళీ వచ్చి అన్నీ చదవాలి.
నాకూ 'నేను సైతం'పారడీ బాగా నచ్చింది. మీరు రాసిన పారడీ ఇదివరకు విన్నాను :)
పేరడీ పద్యాలలోనే (ఎక్కువగా) తెలిసిన జరుక్ శాస్త్రిగారిగురించి చాలా విషయాలు వివరణాత్మకంగా చెప్పారండీ. టపాలో ఇచ్చిన మిగతా లింకులు కూడా చదువుతున్నాను.
తమ్ముడూ నువ్వు తప్పిపోయావని అక్కడ ప్రకటన ఇచ్చా, ఇక్కడ దొరికావు , థ్యాంక్ గాడ్...
ఇంతకీ చోటా హజ్రీ అంటే????!!!!
ఒక గొప్ప వ్యక్తిని గుర్తుచేశారు. సంతోషం. శరత్ పూర్ణిమలో పూర్తిగా ఇంకో జరుక్ కనిపిస్తాడు.
జరుక్ గురించి నేను విన్న ఓ రెందు పిట్టకథలు.
రుక్మిణీనాథుడంటే కృష్ణుడేకదా - అందుకని కృష్ణశాస్త్రీ నేనూ వొకటే - అనే వాడుట. అవి కృష్ణశాస్త్రి లిటరరీ సూపర్ స్టారుగా వెలుగుతున్న రోజులు మరి.
తమ ఇంటిపేరుని గురించి, ఏవటండీ ఈ పేరు తమాషాగా ఉన్నది అంటే నీటికి H2O అనే ఫార్ములా కనిపెట్టింది మా పూర్వికులే అని నమ్మబలికే వాడుట.
Post a Comment