Friday, January 27, 2012

కాకినాడ కబుర్లు పార్ట్ 4 (మొదటి భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్


మొన్నా మధ్య ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం పార్ట్ 3 లో మా ఊరి భానుగుడి సెంటర్ లో మిమ్మలందరినీ అలా అలా షికారు చేయించానా. ఇప్పుడు ఈ సారి మా ఊరి ఇంకో స్పెషల్ గురించి చెప్తానన్న మాట. అదే ప్రతి ఏటా మా ఊరి కుళాయి చెరువు దగ్గర జరిగే ఎగ్జిబిషన్. అసలు కాకినాడలో జనవరి నెలలో ఈ ఎగ్జిబిషన్ చూడని చిన్నా, పెద్దా ఉండరంటే అతిశయోక్తి కాదు. నాలాగ ఊరికి దూరంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా కళ్ళ ముందు సినిమా రీలులా తిరిగే ఆ ఎగ్జిబిషన్ కబుర్లు మీకోసం. ఈ పోస్ట్ కోసం నేను అడగ్గానే మా ఊరి ఎగ్జిబిషన్ కి వెళ్లి ఫోటోలు తీసి పంపించిన నా ఫ్రెండ్ జగన్నాధ రాజుకి బ్లాగ్ముఖతా మరో మారు థాంకులు.

చిన్నప్పుడు జనవరి నెల మొదలయిన దగ్గరనుంచీ హడావుడి మొదలయ్యేది. జనవరి ఒకటి నుంచీ ఫిబ్రవరి పది పదిహేనో తారీకు వరకూ జరిగే ఆ ఎగ్జిబిషన్ వచ్చిన రోజే చూసేయాలనేది మా ఆత్రం. అందుకే జనవరి ఒకటో తారీకునే ఇంట్లో ఎగ్జిబిషన్ కి టెండర్ పెట్టేవాళ్ళం. నాన్నగారండీ సాయంత్రం ఎగ్జిబిషన్ కి వెళ్దామా? అని ఒకటో తారీకు మొదలు ప్రతి రోజూ ఉదయాన్నే అడగడం. ఆయన షరామామూలుగానే ఇంకా ఏమీ పెట్టలేదు. ఏమీ ఉండదు అక్కడ. మెల్లిగా చూద్దాం లే అని వాయిదా వేయడం. ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు తీసుకెళ్తారని తెలుసు. కానీ ఆ ఎప్పుడు అనేది ఎప్పుడు వస్తుందా అనేదే ప్రశ్న. L

దానికి తోడూ ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ ఎగ్జిబిషన్ కి వెళ్లి వచ్చిన వాళ్ళు క్లాసులో దాని గురించి చెప్పే కథలు మరింత ఊరించేవి. ఈ సారి జెయింట్ వీల్ ఎంత పెద్దగా ఉందో తెల్సా. మా నాన్నగారు నన్ను ఎక్కనివ్వలేదు గానీ ఎక్కి చూసిన మా అన్నయ్య చెప్పాడు. పై నుంచి చూస్తె  రాజమండ్రి గోదారి బ్రిడ్జీ కనపడతాదంట అని ఓ కోతలరాయుడు కోస్తే ఆసక్తిగా వింటూండే మేమంతా పిచ్చి వెధవల్లా ఆ మాటలు నమ్మేసే వాళ్ళం. ఏమైనా మీ అన్నయ్యకి ధైర్యం ఎక్కువెహే అని ఆ కోతలరాయుడి అన్నకి ఇంకో ఫ్రెండ్ కితాబు. ఇంకో రోజు ఇంకోడు క్లాస్ కి ఎగ్జిబిషన్ లొ కొన్న రేకు కప్ప (రేకుతో చేస్తారు దీన్ని నొక్కుతూ ఉంటే టిక్కు టిక్కు మని భలే సౌండ్ వస్తుంది) తీసుకొచ్చి ఇంటర్వెల్ లొ అందరికీ గర్వంగా చూపించేవాడు. ఇంకోడైతే వాళ్ళ నాన్నగారు కొన్న సౌండ్, లైట్ వచ్చే గన్ను గురించి చెప్పి చెప్పి ఊరించే వాడు. ఇవన్నీ చూస్తూ, వింటూ అప్పటిదాకా ఎగ్జిబిషన్ కి వెళ్ళని నాలాంటి వాళ్లకి అసహనం ఓ రేంజ్ లొ పెరిగిపోతూ ఉండేది. మొత్తానికి ఎలాగయితేనేం ఆ శుభముహూర్తం రానే వచ్చేది. స్కూలయ్యాక గ్రౌండ్ లొ ఆటలంటూ కూర్చోక ఇంటికి వచ్చేయ్. సాయంత్రం వీలయితే ఎగ్జిబిషన్ కి వెళ్దాం అని ఇంట్లో మా నాన్నగారి హెచ్చరికతో కూడిన ప్రకటన వినబడేది. ఇహ చూస్కోండి! స్కూల్ కి వెళ్ళేటప్పుడు దార్లో కనిపించిన ఫ్రెండ్స్ తో సహా (వేరే సెక్షన్ వాళ్ళు), స్కూల్ కి వెళ్ళాక మా క్లాసులో ప్రతి ఒక్కరికీ ఒరేయ్ ఈ రోజు మేం ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం తెలుసా? అని అదేదో ఆరోజు నాకు విజయనగర సామ్రాజ్య అధినేతగా పట్టాభిషేకం చేస్తున్న రేంజ్ లొ చెప్పి ఊదరగొట్టేసే వాడిని. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఓస్ ఇంతేనా అన్నట్టు చూస్తుంటే ఆ చూపులు పట్టించుకోకుండా, ఇంకా ఎగ్జిబిషన్ చూడని వాళ్ళు అసూయతో చూసే చూపుల్ని మాత్రం తెగ ఎంజాయ్ చేసేవాడిని. (వెధవ శాడిజం అనుకుంటున్నారా. ఆ ఏజ్ లో అదే థ్రిల్ మరి J ).

ఇక సాయంత్రం ఇంటికి రాగానే అరుగు మీదే కూర్చుని మా నాన్నగారి కోసం వెయిటింగ్ మొదలు. వెధవ ఆఫీసులు ఐదింటి దాకా పెట్టకపోతే ఏ నాలుగింటికో మూసేయకూడదూ అని తిట్టుకుంటూ ఆయన ఎప్పుడు వస్తారా అని నేను, మా తమ్ముడు అరుగు మీదే కూర్చుని ఆశగా ఎదురుచూసేవాళ్ళం. వీధి మలుపులో ఆయన వస్తూ కనిపించగానే అమ్మా! నాన్నగారు వచ్చేస్తున్నారు. నేనెళ్ళి రిక్షా తీసుకొచ్చేయనా? అని ఇంట్లోకెళ్ళి మా అమ్మగారిని అడగడం. తనేమో ఉండరా ఇంకా అప్పుడే? అనడం. ఈ లోపు ఇంట్లోకి వచ్చిన మా నాన్నగారు మొహం కడుక్కుని బయటకి రాగానే అక్కడే టవల్ పట్టుకుని నిలబడి నాన్నగారండీ రిక్షా తెచ్చేయనా? అని ఒక సారి, ఆయన కాస్త రిలాక్సయి అమ్మ ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకోగానే మళ్ళీ ఇంకోసారి అదే ప్రశ్న రిపీట్ చేయడం. ఇలా ఆయన ఇహ తప్పదు అనుకునే దాకా అడిగీ అడిగీ చివరికి ఆయనకి విసుగొచ్చి సరే తగలడు అనేవారు. ఆమాట అనడం ఆలశ్యం వీధి మొగలో రిక్షా స్టాండ్ దగ్గరకి ఒకటే పరుగు.

అప్పట్లో మేముండే జగన్నాధపురంలో రిక్షా ఎక్కి కుళాయి చెరువు దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి పట్టే ఆ అరగంటా మనసులో ఎన్నో ఆలోచనలు, బోలెడన్ని లెక్కలు. అప్పటి వరకూ స్కూల్లో ఎవరెవరు ఎగ్జిబిషన్లో ఏమేం కొనుక్కున్నారు, వాటి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఫోజు కొట్టారు, ఈ సారైనా నాన్నగారు నేను జెయింట్ వీల్ ఎక్కడానికి ఒప్పుకుంటారా?, ఒక వేళ ఒప్పుకుంటే నేను గోదావరి బ్రిడ్జి సరిగా చూడగలనా? ఇలాంటి తీవ్రమైన జీవన్మరణ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండగానే అల్లంత దూరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణుడి విశ్వరూపంలా అంతెత్తున జెయింట్ వీల్ కనిపించేది. దాన్ని తన్మయత్వంతో చూస్తూండగా ఎగ్జిబిషన్లో అటూ ఇటూ వెళ్లిపోవద్దని, అది కొనమని, ఇది కొనమని పేచీలు పెట్టద్దని వగైరా వగైరా సూచనలతో కొనసాగే మా నాన్నగారి ఉపన్యాసం నా చెవులకి చేరకముందే గాల్లో కలిసిపోయేది J

ఇక ఎగ్జిబిషన్ ముఖద్వారం వద్దకి రాగానే వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అన్న బోర్డుని అపురూపంగా చూసుకుని లోపలి అడుగుపెట్టేవాడిని. లోపలి వెళ్తూనే ఎదురుగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వాళ్ళ స్టాల్ ఉండేది. ఎంట్రన్స్ గేట్ నుంచీ ఎడం చేతి వైపు స్టాల్స్ తో మొదలు పెట్టి ప్రదక్షిణ చేసినట్టు ఎగ్జిబిషన్ మొత్తం చుట్టేసి అవుట్ గేట్ దగ్గరకి రావాలన్న మాట.

(పదండి ఒక్కో స్టాల్ ని నా కళ్ళతో పరిచయం చేస్తాను. నాకు బోరుకొట్టే స్టాల్స్ దగ్గర పెద్దగా ఆగను. ముందే చెప్తున్నా.)

రెండో భాగం కోసం మళ్ళీ రేపు ఇదే టైం కి ఇక్కడికి వచ్చేయండి. అన్నట్టు కామెంట్లు పెట్టడం మర్చిపోకూడదు మరి.

12 comments:

తృష్ణ said...

హమ్మయ్య ఇన్నాళ్ళకి...
photos ఏవి? ఒక్కటీ లేవు? రేపటిదాకా ఆగాలా?

తృష్ణ said...

“వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన" ఈ పేరు విని ఎన్నాళ్ళయ్యిందో..... మేం కూడా ఎప్పుడు మిస్సయ్యేవాళ్లం కాదు. మా అమావయ్య,అన్నయ్య, నేను,తమ్ముడూ ఎప్పుడూ వెళ్ళేవాళ్ళం..good old days..

రాజ్ కుమార్ said...

కేవ్వ్... కాకినాడ లో ఈ ప్రదర్శన జరుగుతాదని ఇప్పటి వరకూ తెలీదు సుమండీ.. ;(

నేను మాత్రమ్ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళొచ్చాను.

౧. రేకు కప్ప : అసలు తీర్తాల్లోనూ, ఎగ్జిబిషన్ లలోనూ టిక్ టిక్ టిక్ టిక్ మనే రేకుకప్పలూ, డిషూ డిషూమనే ఆపిల్ బుడగలూ లేకుంటే ఎలా?

౨. శ్రీకృష్ణుడి విశ్వరూపంలా అంతెత్తున జెయింట్ వీల్ : Exactly ;) మొట్ట మొదటి సారి జైంట్ వీల్ చూసి మా పితృదేవుల్ని "జెయింట్ వీల్ నానా... జెయింట్ వీలెక్కుతా నానా." అని ఓ లెక్కలో విసిగించాను. ఎక్కిమ్చాక మొదటి రౌండ్ లోనే

"ఆపండ్రోఓఓఓఓఓఓఓఓ... ఆపండ్రోఓఓఓఓఓ" అని గోల గోల చేశా..

ఫోటో లేవి శంకర్ గారూ..? నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ...

మధురవాణి said...

ఇదన్యాయం కదూ.. మీ నాన్నగారు మిమ్మల్ని ఎక్జిబిషన్ కి తీసుకెళ్ళే రోజు కోసం మీరెంతలా ఎదురు చూశారో మేము కూడా అంత ఎదురు చూడాలా ఇప్పడు.. :))
రేపొచ్చేప్పుడు కొత్త పోస్టు, ఫోటోలతో పాటుగా అదే చేత్తో కాకినాడకి టిక్కెట్లు కొని పట్టుకురండి మరి.. :D

Bolloju Baba said...

:-)

సుజాత వేల్పూరి said...

అబ్బ, మీకో బ్లాగుందని మీకు భలే గుర్తుందండీ! తమాషాగా లేదూ? ఆ పాత పోస్టు డేట్ చూసుకున్నారా? సెప్టెంబర్ 21! మళ్ళా ఏవన్నా అంటే .....ఊ వద్దులే!

మీ రిక్షా, మీ కప్ప,మీ ఎగ్జిబిషనూ,మీ కాకినాడా అన్నీ బాగున్నాయి. ఎంతైనా మీ వూరు మీ వూరే! వ్యవసాయ,పారిశ్రామిక,ఫల పుష్ప ప్రదర్శన...కెవ్!

ఆ.సౌమ్య said...

డిటో డిటో డిటో సుజాత గారి కామెంటు...హమ్మయ్య ఆవిడ నాకు శ్రమ తగ్గించారు :D

Subrahmanya Sarma said...

కాకినాడ కలం చాలా కాలానికి మళ్ళీ కదిలింది...!

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> అన్నట్టు కామెంట్లు పెట్టడం మర్చిపోకూడదు మరి.

కామెంటు బాక్స్ పైన కండిషన్స్ తీసేశారు కదా. ఇప్పుడు నిరభ్యంతరంగా పెడతాము.

అదియునుం గాక జెయింట్ వీల్ ఎక్కిన తరువాత, కామెంటు పెట్టిన వాళ్ళు అందరూ గలివర్ల లాగా పెట్టని వాళ్ళు లిల్లీపుట్ ల లాగా కనిపించారు అంటారేమో నని భయం కూడా.

రెండవ భాగం కొరకు నిరీక్షిస్తున్నాము.

Sravya V said...

వస్తామండి వస్తాం తప్పకుండా వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన చూడటానికి :))

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

చాల రొజుల
తరువాత కాకినాద ఖబుర్లు
.కుళాయి చెరువు దాటి
సూర్యరావు పేట మీదుగ త్రిపురసుందరి గుడీ దాటి మధ్య లొ

పిందాల చెరువు. ముప్పయి యెళ్ళ క్రితం మాట,మళ్ళి ఒక్కసారి
చిన్నతనము అంతా గురుతుకొచ్హింది. మళ్ళి కొసము ఎదురుచూపు

Siva Maganti said...

Wov, phala pushpa pradarshana.. boat ride, musical nite and dowry death case dead bodies on display.. great time.