Saturday, January 28, 2012

కాకినాడ కబుర్లు పార్ట్ 4 (రెండవ భాగం): వ్యవసాయ, పారిశ్రామిక, ఫల పుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి ఎగ్జిబిషన్


(మొదటి భాగం చదవని వాళ్ళు ఇక్కడ చదివి ఆ తర్వాత కంటిన్యూ చేయండి.)

ఎంట్రన్స్ గేట్ లోంచి లోపలి వెళ్ళగానే ఎడం చేతివైపు తిరిగి రెండు అడుగులు వేశామో లేదో ప్రతి ఏడాది లాగే ముందుగా నన్ను కట్టి పడేసేది సబ్బు బుడగలమ్మేవాడు. ఒక ట్రేలో వరుసగా పేర్చిన చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, పక్కన ఇంకో చిన్న ప్లాస్టిక్ ప్లేట్ లాంటి దాంట్లో బోలెడు ఊదే గొట్టాలు. వాడి చుట్టూ నాలాగే ఆ సబ్బు బుడగలకి ఆకర్షితులై కొనమంటూ మారాం చేసే పిల్లకాయలు, మనసులోంచి బాల్యం తొంగి చూస్తున్నా పెద్దరికం ముసుగులో దాని నోరు నొక్కేసి ఆ బుడగల నుంచి వాళ్ళ దృష్టిని మళ్ళించాలని విశ్వప్రయత్నం చేసే తల్లిదండ్రులు. వీటన్నిటి మధ్య చిద్విలాసంగా ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఊదే గొట్టం (ఒక స్ట్రా ముక్క చివర్న గుండ్రంగా చుట్టిన వైరుముక్కతో ఉంటుంది) ముంచి అలవోకగా సబ్బు బుడగలు వదిలే ఆ కుర్రాడు నాలాంటి వాళ్ళందరికీ పే...ద్ద హీరోలా కనిపించేవాడు. అలవోకగా చిన్న చిన్న బుడగలు పదుల సంఖ్యలో సృష్టించేస్తూ గాలి బుడగలలాంటి జీవితాల్ని అదే పనిగా సృష్టించే లోకల్ బ్రహ్మదేవుడిలా ఉండేవాడు.  అమ్మా ఒక్కటి కొనుక్కుంటా అడిగే వాడిని. ఎందుకురా సబ్బు నీళ్ళకి డబ్బులు వేస్టూ అనేది. అబ్బే మనం ఆగితేనా. ఇదొక్కటీ...ఇంకో రెండు మూడు ఏమయినా నచ్చితే కొనుక్కుంటా అంతే. అంతకు మించి నాకేం వద్దు. ప్లీజ్...ప్లీజ్....ప్లీజ్ అని అభ్యర్ధనతో కూడిన అధికార ప్రకటన చేసేవాడిని J. ఇహ తప్పదనుకుంటూ ఒకటి కొని నా చేతిలో పడేసేవారు. డబ్బా తీసుకుని వాడిచ్చిన గొట్టంతో సరిపెట్టుకోడానికి నేనేమన్నా గొట్టంగాడినా? అక్కడుండే వాటిలో ఇంకా ఏమేమి కలర్లు ఉన్నాయో చూసుకుని, బ్లూ కలర్ కోసం వెతికి, అది లేకపోతే కనీసం రెడ్ అయినా ఉంటె దాన్ని సెలక్ట్ చేసుకుని మరీ తీసుకునే వాడిని. నాకు ఒక్కడికీ కొంటే సరిపోదుగా, ఆస్తి పంపకాల్లా ప్రతీ దాంట్లోనూ వాటాకివచ్చే మా తమ్ముడికీ ఓ డబ్బా దక్కేది. ఇక అక్కడనుంచీ దాన్ని అపురూపంగా పట్టుకుని మిగిలిన స్టాల్స్ కి బయల్దేరేవాళ్ళం.ఓ రెండడుగులు వేయగానే కుడి వైపు ఏ ప్రెస్టీజ్ వాడిదో, బటర్ ఫ్లై వాడిదో స్టాల్ ఉండేది. ఇంక అంతే.. మాకు ఆ స్టాల్లో బోర్ కొడుతుందని కూడా పట్టించుకోకుండా లాక్కుపోయేవారు. ఇక అక్కడనుంచీ మా పెద్దోళ్ళు, ఆ స్టాల్ వాడూ ఏదో పుష్కరాల్లో తప్పిపోయిన ఆత్మీయులు పాతికేళ్ళ తర్వాత కనబడితే ఎలా మాట్లాడుకుంటారో, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే టీవీలో ఫోన్ ఇన్ ప్రోగ్రాం లలో యాంకర్ , కాలర్ మాట్లాడుకున్నట్టు కాపర్ బాటం గిన్నెలు, ప్రెజర్ ప్యాన్ మూతలు ఇలా నాకు అనవసరమైన సంగతుల గురించి విపరీతంగా మాట్లాడుకునే వారు. ఈ స్టాల్ నాకు పెద్దగా నచ్చదు కానీ పదండి ఇంకో స్టాల్ దగ్గరకి పోదాం.

(అదిగో ఆ ఎడం చేతి వైపు రంగు రంగుల బొమ్మలు, గన్నులు, కార్లు డిస్ ప్లేలో పెట్టాడే ఆ స్టాల్ వాడ్ని చూడండి. వెధవకి బొమ్మలిచ్చే అక్షయపాత్ర ఏమన్నా ఉందేమో. అన్ని బొమ్మలా? పదండి అక్కడికి వెళ్దాం.)ఆ స్టాల్ దగ్గరికి ఒక్కో అడుగూ వేస్తూంటే చూసిన ప్రతీదీ కొనమనకూడదు, నాన్నగారు వద్దంటే పేచీ పెట్టకూడదు, ఆల్రెడీ నీ కోటాలో ఒకటి కోనేసుకున్నావ్ ఇలా అమ్మ హెచ్చరికలు చెవిలో పడుతూ ఉండేవి. అధిష్టానం హెచ్చరికల్ని పట్టించుకోని తిరుగుబాటు ఎమ్మెల్యే టైపులో నేనూ వాటిని పట్టించుకునేవాడిని కాదులెండి. తీరా స్టాల్ దగ్గరికి వెళ్ళాక నా పరిస్థితి చూసి అటు చూస్తే ఆట తుపాకీ, ఇటు చూస్తే రైలు బొమ్మ ఎంచుకునే సమస్య కలిగిందొక పిల్లాడికి అంటూ శ్రీశ్రీ ఆత్మ ఎక్కడినుంచో నిట్టూర్చేది J. మా క్లాస్ లో వాసు గాడు కొనుక్కున్న సౌండ్, లైట్ వచ్చే గన్ను కనిపించేది. కానీ కొనుక్కుంటే వాడి తర్వాత కొనుక్కున్న వాడికిందే మిగిలిపోతాగా. పోనీ బ్యాటరీ కారు కొనుక్కుందామంటే వాడు చెప్తున్న రేటు నాన్నగారు సరే అనేలా లేదు. అయినా ఈ పెద్దోల్లున్నారే తొక్కలో కుక్కర్లకీ, గిన్నేలకీ, ఇంట్లో సామాన్లకీ వందల వందలు తగలేస్తారు. ముచ్చట పది ఓ పాతిక రూపాయల కారు కొనమంటే ఎందుకురా డబ్బులు దండగ. వారం కూడా సరిగా ఉండదు అది అని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొర్రీలు పెట్టినట్టు ప్రతి కోరికకీ కొర్రీలు పెడతారు. పోనీ ఆ పక్కనున్న రైలు బొమ్మ కొనుక్కుంటే? ఇలాంటి తర్జన భర్జనల తర్వాత అప్పటికే ఆలశ్యానికి మా పెద్దోల్ల మోహంలో కనిపిస్తున్న విసుగుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ స్కూల్లో క్లాస్ మేట్ల ముందు పరువు పోకుండా ఉండేలా ఓ బొమ్మ సెలక్ట్ చేసుకునే వాడిని. నా షాపింగ్ అయ్యాక మా తమ్ముడి వంతు. వాడు నిర్ణయం తీసుకునే లోపల నేను ఆ బొమ్మలన్నిటినీ కళ్ళతో ఆడేసుకునే వాడిని.

ఇక అక్కడనుంచి ఓ రెండడుగులు ముందుకేస్తే మొత్తం ఎగ్జిబిషన్ మీద నాకు అత్యంత బోరు కొట్టే స్టాల్ కనిపించేది. గాజులు, స్టికర్లు, బొట్టుబిళ్ళలు, తొక్క, తోటకూర ఇలాంటి సామాన్లతో కూడిన పరమ బోరింగు స్టాలన్న మాట. అప్పట్లో ఎంత బోరు కొట్టినా అమ్మ షాపింగ్ అయ్యేదాకా చచ్చినట్టు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడిది నా బ్లాగేగా పదండి ఇక్కడ్నించి తొందరగా వెళ్ళిపోదాం. J
ఆ ఎడం పక్క స్టాల్లో రౌండ్ గా తిరిగే స్టేజ్ మీద స్టాండ్ వేసిన లూనాయో, టీవీఎస్ ఫిఫ్టీనో డిస్ ప్లే కి పెట్టె మా ఊరి ఆటో మొబైల్ షాపుల వాళ్ళు, ఆ పక్కనే ఓ ఎల్.ఐ.సి వాడి స్టాల్ , వాడి పక్కన అటూ ఇటూ ఆరెంజ్, పసుపు  రంగుల్లో జంతికలు తిప్పే ప్లాస్టిక్ గోట్టాలమ్మే వాడు డెమో ఇస్తూ ఓ స్టాల్, వాడికి సరిగ్గా ఎదురుగా కీ చైన్లు అమ్మే షాపు వాడు (వీడు అప్పటికప్పుడే కీ చైన్ మీద మన పేరు చెక్కేసి ఇవ్వడం అప్పట్లో పెద్ద వింత నాకు).

కాస్త ముందుకు వెళ్తే  ఎయిర్ గన్ తో బుడగలు కొట్టే స్టాల్ ఉండేది. రెగ్యులర్ గా కాదుగానీ ఓ సారి ట్రై చేస్తా అన్న నా చూపుకి మా నాన్నారు సరే అనడంతో ఉత్సాహంగా నాలో ఉన్న జస్పాల్ రాణాని, అభినవ్ బింద్రాని ప్రపంచానికి చూపించే చాన్స్ వచ్చింది కదా అని ఎగిరి గంతేసి (అప్పట్లో వాళ్ళ పేర్లు నాకు తెలీవులెండి) గన్ను చేతిలో తీసుకున్నా. పది రౌండ్లకి రెండు రూపాయలు. ఐదు బుడగలు పేలిస్తే ఇంకో రెండు రౌండ్లు ఫ్రీ. పదీ పేలిస్తే ఇలాంటి షూటర్ ని ఇంత వరకూ చూడలేదని వాడు తబ్బిబ్బైపోయి ఓ స్టీలు గ్లాసో, ప్లాస్టిక్ మగ్గో బహుకరిస్తాడన్న మాట. రెండ్రూపాయలు వాడి చేతిలో పెట్టగానే అక్కడున్న గన్ను మీద నాకు అధికారం వచ్చినట్టు ఫీలయి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి తూలి పడబోయి తమాయించుకుని వాడి కేసి చూడగానే వాడు అది పెద్ద వాళ్లకి. నువ్వు మోయలేవు. ఇంద దీంతో పేల్చు. అని చిన్న సైజ్ రివాల్వర్ లా ఉండే ఎయిర్ గన్ మొదటి రౌండ్ లోడ్ చేసి నా చేతిలో పెట్టాడు . సర్లే ఏదైతే ఏం లే అనుకుని మోసగాళ్ళకి మోసగాడులో కృష్ణ కళ్ళముందు కనిపిస్తూ ఉండగా కుసింత బిల్డప్ ఇచ్చి, కృష్ణలా ఒక పక్క కాస్త స్టైల్ గావంగి పేలిస్తే మనకి తిరుగుండదు అనుకుని ట్రిగర్ నొక్కితే అది కాస్తా నేను గురిపెట్టిన సర్కిల్ లో ఉన్న బుడగలకి కాక దాని పక్కన ఉన్న గోడకి తగిలేది. మనం సూపర్ స్టార్ కాదని గ్రహించి ఒళ్ళు దగ్గరపెట్టుకుని మొత్తం మీద పది లో ఐదో, ఆరో బెలూన్లు పేల్చానంతే. L

ఇక కాస్త ముందుకి వెళ్తే మాయా దర్పణం అనో మ్యాజిక్ మిర్రర్ అనో పేరు సరిగా గుర్తులేదు గానీ ఓ టెంట్ ఉండేది. దాని ముందు ఒకడు గాడ్రెజ్ కుర్చీలో కూర్చుని ముందు ప్లాస్టిక్ స్టూల్ మీద ఓ చిన్న అల్యూమినియం స్కూల్ బాక్స్ లో టికెట్లు, చిల్లర పెట్టుకుని కూర్చునే వాడు. టికెట్ రూపాయి. లోపల వరసగా పదో పదిహేనో మిర్రర్లు ఉండేవి. ఒక్కో దాంట్లో మన ప్రతిబింబం ఒక్కోలా కనిపించేది. ఒక చోట లావుగా, ఒక చోట పొట్టిగా ఇలా అన్నమాట.

దాని పక్కన ఓ వెంట్రిలాక్విజం షో గానీ, మ్యాజిక్ షో గానీ జరిగే టెంట్ ఉండేది. ఇక్కడా టికెట్లమ్మే వాడిది సేమ్ సెట్టింగ్. పైగా ఇక్కడ టికెట్టు ఐదు రూపాయలు. అదీ లోపల కుర్చీలు అన్నీ నిండితే కానీ షో మొదలు పెట్టేవాడు కాదు. కాకపోతే ఎగ్జిబిషన్ మొత్తానికి వినబడేటట్టు వాడి షో గురించి పబ్లిసిటీ మాత్రం ఊదరగొట్టేసేవాడు. ఈ రెండు టెంట్ల మధ్య ఒక పీచు మిఠాయి వాడి స్టాల్. ఎటు చూసినా పాలిథిన్ ప్యాకింగ్ లో వేలాడదీసిన గులాబీ రంగులోని పీచు మిఠాయి బంతుల మధ్యలో గిర్రున తిరిగే వెట్ గ్రైండర్ లా కనిపించే దాంట్లో వెదురు పుల్లతో నేర్పుగా చేయి తిప్పుతూ క్షణాల్లో దాని చుట్టూ పీచు మిఠాయి చుట్టేసేవాడు. ప్రతి సారి తప్పకుండా పీచు మిఠాయి కొనిపించుకునే కార్యక్రమం మాత్రం ఉండేది.చేతిలో వెదురు పుల్ల, దాని పైన పే......ద్ద పీచుమిఠాయి ఉండ. కొరికేలోగానే సగం ముక్కూ, మూతి అంతా అయిపోయేది. అలా దానితో తంటాలు పడుతూ నాలుగడుగులు వేయగానే కళ్ళముందు జెయింట్ వీల్ టికెట్ కౌంటర్ ఎదురయ్యేది.
తల ఎత్తి చూస్తే ఈ ప్రపంచంలో చాలా విషయాల ముందు నువ్వు చాలా అల్పుడివిరా అని గుర్తు చేసేట్టు అంతెత్తున జెయింట్ వీల్. ఈ సకల చరాచర ఎగ్జిబిషన్ ఆకర్షణ అంతా నాయందే ఉన్నది చూడు అని చెప్తున్నట్టు ఉండేది. మొత్తం నిండిన తరువాత తిరగడం మొదలు పెట్టి మెల్లి మెల్లిగా స్పీడు పెంచూంటే అందులో ఎక్కిన వాళ్ళ అరుపులు, కేకలు, కేరింతలు ఒక్కసారైనా జెయింట్ వీల్ ఎక్కాలనే నా కోరికని మరింత పెంచేవి. నాన్నగారండీ ప్లీజ్ ఒక్క సారి ఎక్కుతాఅనేవాడ్ని. వద్దు కళ్ళు తిరుగుతాయి, భయపడతావు. కావాలంటే పక్కనున్న రంగుల రాట్నం ఎక్కు అనేవారు. ఛీ...అదా? అది కావాలంటే చొల్లంగి తీర్థంలో అయినా ఎక్కచ్చు. నేను ఇదే ఎక్కుతా అని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కానీ అలా చెప్తే ఆ తర్వాత ఆయన పెట్టే చీవాట్లకి జెయింట్ వీల్ ఎక్కకుండానే కళ్ళు తిరుగుతాయని తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయేవాడిని. అసలు నాకు కళ్ళు తిరుగుతాయని ఈ పెద్దోళ్ళు ఎలా డిసైడ్ చేసేస్తారో ఏంటో. ఉత్తప్పుడు వీధి చివర షాప్ కి వెళ్లి ఏమన్నా సరుకులు తీసుకురమ్మన్నప్పుడు రోడ్డు మీద కుక్కలున్నాయని భయపడి వెనక్కి వస్తే ఇంత పిరికి వెధవ్వెంట్రా అంటారు. ఇలాంటప్పుడు ధైర్యంగా జెయింట్ వీల్ ఎక్కుతానంటే భయపడతావు అని మనసులో ఎక్కించి వెనక్కి లాగేస్తారు. అసలు ఈ పెద్దోల్లున్నారే...
ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ అడుగుతానేమో అని వాళ్ళు బయల్దేరగానే వెనకాలే నేను కూడా నిరాశ నిండిన మనసుతో రెండు సెకన్లకోసారి ఆరాధనగా తలతిప్పి జెయింట్ వీల్ కేసి చూస్తూ వాళ్ళ వెనకే నడిచేవాడిని. 

తరువాత మజిలీ పే...ద్ద అప్పడాల స్టాల్. ఇది ఎగ్జిబిషన్లో ఇంకో ప్రధాన ఆకర్షణ అన్నమాట. మామూలుగా ఇంట్లో చూసే రెగ్యులర్ అప్పడాలు కాదు. న్యూస్ పేపర్లో సగం సైజ్ లో ఉండేవి. వాటిని చూస్తే పోర్టబుల్ టీవీలో సినిమాలు చూసుకునే వాడు మొదటి సారి ఐమాక్స్ స్క్రీన్ చూస్తే ఎలా ఫీలవుతాడో అంత అబ్బురంగా ఉండేది. ఆ స్టాల్ లోనే మిర్చి బజ్జీలు కూడా వేసేవాడు. నాకు మా తమ్ముడికి చెరో పెద్ద అప్పడం చేతిలో పెట్టి వాళ్ళిద్దరూ మిర్చి బజ్జీలు తీసుకునే వాళ్ళు. అవి తింటూ కుళాయి చెరువు గట్టు మీదకి ఎక్కగానే అక్కడ బఠానీ స్టాల్ ఉండేది. ఒక పెద్ద పళ్ళెంలో ఉడుకుతున్న బఠానీ దాని చుట్టూ కలర్ ఫుల్ గా డెకరేట్ చేసిన కేరట్, బీట్రూట్, ఉడికిన ఆలూ ముక్కలు, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు, ఓ పక్కన ప్లేట్లో నిమ్మకాయ ముక్కలు. ఆ స్టాల్ కి అటూ ఇటూ పదో పదిహేనో ప్లాస్టిక్ కుర్చీలు. స్టాల్ దగ్గర ఇచ్చిన ఆర్డర్ చేతికందేదాకా వెయిట్ చేస్తూ ముప్ఫై నలభై మంది జనాలు. టోకెన్లు తీసుకుని స్టాల్ వాడికి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసే లోగా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపించడం, వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి రెండు నిమిషాలకీ ఆర్డర్ ఏమయిందో కనుక్కురమ్మని నన్ను, మా తమ్ముడిని పంపించడం. మొత్తానికి ఎలాగైతేనేం వాడిచ్చిన ప్లేట్లు చేత్తో పట్టుకుని నేను, మా తమ్ముడు రాగానే నలుగురం కలిసి ఖాళీ ఉంటె కుర్చీలు, లేకపోతే అక్కడే గట్టు మీద పచ్చికలో కూర్చుని ఎదురుగా చెరువులో బోటింగ్ చూస్తూ ప్లేట్లు ఖాళీ చేసేవాళ్ళం.
అక్కడ నుంచి బయల్దేరి గట్టు మీదే మెల్లిగా నడుచుకుంటూ చివరికి రాగానే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగే వేదిక కనిపించేది. ఏ మిమిక్రీయో, గంగాధరం మ్యూజికల్ పార్టీ ఆర్కెస్ట్రాయో అయితే ఓ రెండు నిమిషాలు ఆగి చూడటం, మైక్ సెట్ వాడూ, ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళూ తప్ప జనాలు ఎవరూ లేని ప్రోగ్రాం అయితే అసలు ఆ వైపే చూడనట్టు ముందుకు నడవడం జరిగేది. J. ఇక ఆ వరసంతా ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఉండేవి. అదేంటో మిగిలిన స్టాళ్ళ వాళ్ళు రమ్మని పిలిచినట్టు వీళ్ళు పిలిచే వారు కాదు. అసలామాట కొస్తే లోపల మొక్కుబడిగా పెట్టే ఫోటోలు తప్ప జనాలూ ఉండేవారు కాదనుకోండి. జస్ట్ బయటకన్నా స్టాల్లో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ లోంచి వెళ్లి ఏదో చూడక తప్పదు అన్నట్టు ఆ ఫోటోల కేసి చూస్తూ ఎగ్జిట్ లోంచి బయటకి వచ్చేసేవాళ్ళం.
ఇవన్నీ దాటాక వ్యవసాయ శాఖ వాళ్ళ ఫలపుష్ప ప్రదర్శన స్టాల్. రెండు మూడు స్టాల్స్ పొడుగు ఉండే దాంట్లో నాకు తెలిసి నేను వెళ్ళిన ప్రతి సారీ అవే ఐటమ్స్ ఉంచేవారు. ఓ పెద్ద పనసపండు, అంతకన్నా పెద్దగా ఉండే గుమ్మడి కాయ, నిండుగా కాసిన అరటి గెల ఇలా ఎప్పుడు చూసినా, ఎన్నేళ్ళయినా టెలిస్కూల్ లో పిల్లల్లా అవే స్టాండర్డ్ గా ఉండేవి. కనీసం ఆర్డర్ కూడా మార్చేవారు కాదు. J. తెలిసినవే అయినా టికెట్ కొన్నాం కాబట్టి మరో సారి మొహమాటంగా ఆశ్చర్యపడిపోయి బయటకి వచ్చేవాళ్ళం.

స్టాల్ లోంచి బయటకి రాగానే ఎదురుగా కడియం నర్సరీ వాళ్ళు, ఉద్యాన వన శాఖ వాళ్ళు దాదాపు నాలుగు స్టాళ్లు పట్టే ఖాళీ ప్లేస్ లో చుట్టూ దడి కట్టి బోలెడు పూల మొక్కలు ఉంచేవారు. ఆ మొక్కలతో పాటూ ఖాకీ డ్రస్ వేసుకుని ఓ ముసలి కాపలాదారు కూడా ఉండేవాడు. ఎవరైనా ఆ దడి దగ్గరకి వస్తే చాలు కీ ఇచ్చినట్టు ఏయ్..దూరం దూరం. పూలు కోయకూడదు...మొక్కలు ముట్టుకోకూడదు అని అరిచేవాడు. బహుశా ఇప్పుడు కాపలావాడు మారి ఉంటాడు కానీ కేకలు మాత్రం అవే ఉండుంటాయి.

దాన్ని దాటి రాగానే బ్రహ్మకుమారీ వాళ్ళ స్టాల్. దాని పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వాళ్ళ స్టాల్. ఆ స్టాల్ కి వెళ్లి నాన్నగారిచ్చిన పది పైసలో, పావలాయో అక్కడున్న హుండీలో వేసేసి వచ్చే ఏడాదైనా క్లాసులో అందరికన్నా ముందు ఎగ్జిబిషన్ చూసేలా చేయమని దండం పెట్టుకునే వాడిని. ఏంటో ఆ దేవుడు విన్నపం ఎప్పటికీ పట్టించుకోలేదు L


ఇంక లాస్ట్ లో ఎగ్జిట్ గేట్ దగ్గర హెలికాప్టర్ లు ( లోపల స్ప్రింగ్ తో గుండ్రని బాక్స్ లా ఉండి పైన బొడిపె ఉంటుంది. ఒక ప్లాస్టిక్ చక్రాన్ని దాని మీద పెట్టి స్ప్రింగ్ కి ఆపోజిట్ డైరక్షన్ లో తిప్పి బటన్ నొక్కితే ఆ చక్రం జుయ్య్య్య్ మని తిరుగుతూ గాల్లోకి ఎగురుతుంది), రేకు కప్పలు అమ్మేవాడు మాటేసేవాడు నా కోటాలో ఇంకా రెండు మిగిలే ఉన్నాయన్న విషయం అమ్మకి గుర్తు చేసి ఆ రెండూ కొనిపించుకుని తృప్తిగా బయటకి నడిచే వాళ్ళం.

కాలేజ్ కి వచ్చాక చాలా సార్లు ఎగ్జిబిషన్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళినా చిన్నప్పుడు వెళ్ళిన జ్ఞాపకాలే ఇంకా పదిలంగా మనసులో ఉన్నాయి. బహుశా ఎవరికైనా అంతేనేమో! అదండీ మా ఊరి ఎగ్జిబిషన్ సంగతి. ఇంత వరకూ వచ్చారుగా కామెంట్ కూడా పెట్టే వెళ్ళండి. నేనేం అనుకోను J
NEXT : గాంధీ నగర్ పార్క్ 

30 comments:

Subrahmanya Sarma said...

స్కూల్లో ఉన్నపుడు మాకైతే, స్కూల్‌ కి వచ్చి కూపన్లు పంచిపెట్టేవారు (సగం రేటుకి అమ్మడం కూడా ఉండేది అప్పుడప్పుడూ) ఈ ఎగ్జిబిషన్‌ వాళ్ళు. ఒకసారి హెలీకాఫ్టరు, ఒకసారి జెయింట్‌ వీలు, ఒకసారి అదేదో ఉంది పేరు గుర్తులేదు (సర్కస్‌లో లాగే స్కూటర్లు, కార్లతో గుండ్రంగా తిరుగుతూ ఉంటారు... మైకులో "ప్రాణాలకి తెగించి" అని చెబుతూ..!), ఒక్క కోక్‌.... ఇది ఒక పాకేజ్‌ అన్నమాట..! టూరిస్ట్‌ పాకేజ్‌ మల్లేనే..! ఇప్పటికీ ఇలా స్కూళ్లకి వస్తున్నారని విన్నాను మరి..!
కుళాయి చెరువుని, కొంతమంది రాజా టాంక్‌ అని కూడా అంటారు. (ఎందుకో..?) ఇప్పుడైతే "లలిత కళా ప్రాంగణం" అని నామకరణం చేసింది నగర పరిషత్తు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే "బొమ్మరిల్లు" సినిమాలో రెండు-మూడు సీన్లు ఇక్కడ షూటింగ్‌ తీసారు.(అఫ్‌ కోర్స్‌, "లాలూ దర్వాజ్‌ కాడ" పాట మొత్తం సామర్లకోట గుళ్ళోనేగా..!) కాకినాడ ధియేటర్లలో ఆ సినిమా ఆడినపుడు ఈ సీన్లకి చేసిన గోల అంతా ఇంతా కాదు..!

శంకర్‌ గారూ..! దీని తర్వాత ఏంటండి..?

రాజ్ కుమార్ said...

అబ్బ్బబ్బా... శంకర్ గారూ.. ఎగ్జిబిషన్ అంతా తిప్పి చూపించేసారండీ..

మా ఏటికొప్పాక లో ప్రతీ సంవత్సరం బండితల్లి జాతర జరుగుతుంది.. సేం టూ సేం.. బింగో బింగో.. (ఐదేళ్లయ్యింది వెళ్ళి)

ఆ బుడగలు ఊదే రెడ్ లిక్విడ్, మోసగాళ్లకి మోసగాడు టైప్ లో గన్ షూటింగ్, బొమ్మలూ, రంగుల రాట్నం, జెయింట్ వీల్... కెవ్వో..కెవ్వు...

నైట్ మ్యూజిక్ షో, బుఱ కధలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్స్ లు.. సూపరో సూపరు...

మొత్తం అన్నీ తిరిగేసొచ్చానండీ.. సూఊఊఊఒపర్ పోస్ట్ అండీ...

Jagannadharaju said...

విపులంగా విపుల లోని పేద్ద కధ చదివినట్టుగా వుంది... గుడ్ గుడ్...

తృష్ణ said...

" గాజులు, స్టికర్లు, బొట్టుబిళ్ళలు, తొక్క, తోటకూర ఇలాంటి సామాన్లతో కూడిన పరమ బోరింగు స్టాలన్న మాట"
ఇప్పుడు కూడానా...???

" నేను ఆ బొమ్మలన్నిటినీ కళ్ళతో ఆడేసుకునే వాడిని.."
చిన్నప్పుడు అందరం అంతేనేమో..

బబుల్స్ డబ్బాలు కొనేవాళ్ళం..ఇల్లంతా సబ్బునీళ్ళు పోస్తున్నారు అని పెద్దలంతా తిట్టేవారు..:)

బుడగలు మేమూ కొట్టేవాళ్ళం..

ఫలపుష్ప ప్రదర్శన స్టాల్ మాత్రం చాలా అసక్తిగా ఉండేది నాకు.రకరకాల పువ్వులు,మొక్కలు, పెద్ద పెద్ద కూరగాయలు,పళ్ళు చాలా బాగా పెట్టేవారు.

అమ్మో ఇలా ఒక్కో వాక్యం గురించీ రాస్తే నా వ్యాఖ్యే పెద్ద టపా అయిపొతుంది..:)

ఫోతోలతో సహా..సూపర్ టపా..!! పంపిన మీ ఫ్రెండ్ కి మా థాంక్స్ కూడా చెప్పండి..!

వేణూశ్రీకాంత్ said...

అబ్బ చాలాబాగా రాశారండీ.. ఫోటోలు కూడా ఎంత బాగున్నాయో.. నిజమే పెద్దయ్యాక ఎన్ని థీం పార్క్స్ కి వెళ్ళినా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళినంత సంతోషాన్ని ఇవ్వలేవు.

శశి కళ said...

baabooooooooooy...yenta pedda post...maa tiranaala antaa tirigochchaanu...mee punyamaa ani...yemi konaledu nenu....thanks shankar gaaru

సిరి శ్రీనివాస్ said...

భలే ఉంది. నన్ను మీతో పాటే ఎగ్జిబిషన్ అంతా బొంగరంలా తిప్పేసారు. ఫొటోస్ కూడా బాగా ఉన్నాయి. :) :)

Kottapali said...

Yes, it used to be an important annual ritual in a kid's life.
ఇందుమూలముగా బ్లాగర్లందర్నీ తమ చిన్నప్పటి ఎగ్జిబిషను అనుభవాలు గుర్తు చేసుకోని మాతో పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను.
@SHANKAR.S, గబగబా చదివేశాను. మరో రెందు సార్లైనా ఆస్వాదిస్తూ చదువుతా

సుజాత వేల్పూరి said...

అల్లదిగో, ఆ బూరలు(అదేనయ్యా బాబూ బెలూన్లు) పేల్చే సీన్లో నాకు బోల్డు డబ్బులు వదిలేవి. ఒకసారి సబ్బు పెట్టె బహుమతిగా కూడా వచ్చింది. అది నేను ప్రైవేట్ గా వాడదామంటే మా అమ్మ దాంట్లో రిన్ సబ్బు కట్ చేసి పడేసి బావి గట్టు దగ్గర పారేసింది

సౌమ్యా, ఇలా రా! ఈ బజ్జీల స్టాలు భలే ఉంది చూడు!

చాణక్య said...

సూపరు.. నిజంగా ఎగ్జిబిషన్‌లో తిరిగినట్టే అనిపిస్తోంది మీరు రాసింది చదువుతుంటే. అన్నిటికన్నా నాకు మిర్చిబజ్జీలు, అప్పడాల స్టాల్ నచ్చింది. నా చెక్కు నాకు పంపించేస్తే అప్పడాలు కొనుక్కోవాలి. :)))

SHANKAR.S said...

@వామన గీత గారు
"(సర్కస్‌లో లాగే స్కూటర్లు, కార్లతో గుండ్రంగా తిరుగుతూ ఉంటారు... మైకులో "ప్రాణాలకి తెగించి" అని చెబుతూ..!)"

అవునండీ అలాంటిది ఒకటి రెండు సార్లే పెట్టారు. మైకులో చెప్పడం మాత్రం ఇప్పటి "లక్ష్మీ గణపతి ఫిలిమ్స్...." అంటూ ఊదరగొట్టే యాడ్స్ కి ఏమాత్రం తగ్గేది కాదు. గుర్తుంది :)

రాజా ట్యాంక్ అని ఎందుకు అంటారో నాకూ తెలియదండీ. చూద్దాం ఈ పోస్ట్ చూసిన ఎవరైనా చెప్తారేమో. లేకపోతె నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కామెంటినందుకు ధన్యవాదాలు.

@రాజ్
మీ ఊరి జాతర విశేషాలతో నీ స్టైల్ లో పోస్ట్ ఆశిస్తున్నా రాజ్. అల్లరిని అక్షరీకరించడంలో నిన్ను కొట్టేదెవరు? :)

@జగన్నాధరాజు
:). ఫోటోలు ఇచ్చినందుకు మరో మారు థాంక్స్ రా. ఈ పోస్ట్ లో సగం క్రెడిట్ నీదే

@తృష్ణ గారు

"ఇప్పుడు కూడానా...???"
ఇప్పుడు కూడానా అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువండీ. అప్పుడంటే బిల్లు నాకు పడదుకదా. ఇప్పుడు బిల్లు నాకు థ్రిల్లు స్వాతికి :((((((((

@వేణు గారు
నిజమే బాల్యం ఇచ్చే కిక్కే వేరండీ.

@శశి మిస్
మా ఊరి ఎగ్జిబిషన్ లో వయోలెన్లు అమ్మరండీ :))

@సిరి శ్రీనివాస్ గారు
కామెంటినందుకు ధన్యవాదాలండీ

@కొత్తపాళీ గారు
మీరు ఇంకో రెండు రౌండ్లు వేసి మా ఊరి ఎగ్జిబిషన్ కి మార్కులేయాలని మనవి :)

@సుజాత గారు
ఎన్ని డబ్బులు వదిలాయి అన్నది కాదు సబ్బు పెట్టి వచ్చిందా లేదా అనేదే ముఖ్యం.

ఇదిగో మీరు ఇలా బజ్జీల బండి ఆశ చూపించి మా పేద చెల్లిని పిలవకండి బాబూ. నా పేద చెల్లెళ్ళు ఇద్దరూ (సౌమ్య, మధుర) కలిసారంటే ఇంక నాకు ఎగ్జిబిషన్ లో ఏమన్నా కొనుక్కోడానికి డబ్బులు కూడా మిగల్చరు :(

@చాణక్య
తమ్మీ నీ అకౌంట్ లో డబ్బులేశా. ఓసారి నీ పాన్ కార్డ్ దుమ్ము దులిపి వరల్డ్ బ్యాంక్ ఎ.టి.ఎం. లో పెట్టి డబ్బులు తీస్కో :)))

బులుసు సుబ్రహ్మణ్యం said...

మా చిన్నప్పుడు ఇలాంటి ప్రదర్శన లు చూసిన గుర్తు లేదు. శివరాత్రికి తీర్ధం జరిగేది. రంగులరాట్నం ఎక్కేవాళ్లం. పీచు మిఠాయి,జీళ్ళు, కీ ఇస్తే పరిగెత్తే బొమ్మలు మేం ఇష్టం గా కొనుక్కునే వాళ్ళం.

మొత్తం మీద ఎగ్జిబిషన్ అంతా తిప్పేశారు మమ్మలని. మా కాలాని కి మీ కాలాని కి పిల్లల అభిరుచి లో పెద్దగా తేడా లేదు. కానీ ఈ కాలం పిల్లల అభిరుచిలు మారిపోయాయనిపిస్తుంది.

ఫోటోలు బాగున్నాయి. మీ మిత్రుడికి థాంక్స్.

Anonymous said...

శంకరార్యా,
'అహో ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవ రాయ...విజయనగర సామ్రాజ్య తేజోవిరాజా... ఈ కాకినాడలో చిరజీవి వైనావయా...' అని ఎలుగెత్తి పంచమ శృతిలో ఎత్తుకోవాలనిపిస్తోంది.

ఇంతకీ... ఇంత గొప్ప నరానికి అంత అపశకున కాకి-నాడా/బొందు అని పేరు బెట్టిన కర్కశుడెవ్వడు? స్థల పురాణంబెయ్యెది? విశదముగా చెప్పుమా...

SHANKAR.S said...

@బులుసు సుబ్రహ్మణ్యం గారు
గురూజీ మా కాకినాడ చొల్లంగి తీర్థం గురించి కూడా ఓ పోస్ట్ వేసుకుంటానండీ. రంగుల రాట్నం, జీళ్ళు, రంగు కళ్ళజోడు అబ్బో మీరు ఓ రేంజ్ లో కెలికి వదల్లేదు. మీకు మాకు ఒక తరమే తేడా గురూజీ. నిజమే ఇప్పటి జనరేషన్ ఇలాంటివి కోల్పోతున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళూ మన గురించి ఇలానే అనుకుంటారనుకోండి :)

@ SNKR గారు

పంచమ శ్రుతిలో మీరు కుమ్మేయండి చెప్తాను.

నన్ను ఏమన్నా పర్లేదు మాస్టారూ.నా ఊరితో కామెడీ చేసి మీ మర్యాద పోగొట్టుకోవద్దు. ఏటంటారు?. అయినా శంకర్ కి తిక్క లేస్తే ఏం చేస్తాడో అదే పేరున్న మీకు నేను చెప్పాలా? :)

Anonymous said...

కాకి-నాడ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికి నా మర్యాద బలిపెట్టాడానికి నే సిద్ధం. ఈ మధ్య మర్యాద లాక్కుంటా అనే బెదిరింపులు ఎక్కువైపోయాయి, ఏమిటో వీళ్ళిచ్చే మర్యాద! పోతే పోయింది, ఎదవలిచ్చే చీదితే వూడిపోయే ముక్కు లాంటి బోడి మర్యాద. :) మీరు ప్రాశస్త్యము వివరించండి. ప్రతి సారి మీ కాకినాడ పొగడ్తలు వినడమే కాని, బెజవాడ, విశాఖ, రాజమహేంద్రి, హైదరాబాదులకు లేని ప్రత్యేకత ఏమీటో మీరు వివరిస్తే నేనుకూడా మీవెంట యధావిధి కాకినాడ గుణగానము సైతున్...:))

SHANKAR.S said...

@SNKR

SNKR గారూ మా ఊరి చరిత్ర తెలుసుకోడానికి మీ మర్యాదని పణంగా పెట్టినందుకు ధన్యవాదాలు. ఈ కింద లింక్ చూడండి. మీరడిగిన ప్రతి ప్రశ్నకి జవాబులు ఉన్నాయి. ఇక పొతే నేను మర్యాద లాక్కుండా అనలేదు. పోగొట్టుకోవద్దు అన్నా.పాపం మీకు తేడా తెలిసినట్టు లేదు. ఎనీవే మీరన్నది నిజమే ఈ మధ్య సంస్కారం లేని వెధవలు కామెంట్లు పెడుతుంటే జవాబిచ్చేవాళ్ళు కూడా అదే రేంజ్ లో సమాధానం చెప్పాల్సివస్తోంది.

http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1

కాకినాడ గురించిన మీ ప్రశ్నలకి సమాధానం దొరికింది కాబట్టి ఇహ మీ మాట ప్రకారం నావెంట యధావిధి కాకినాడ గుణగానము చేస్తారని ఆశిస్తున్నాను. ఏంటి రెడీయా?

Anonymous said...

ఆయ్ బాబోయ్! మీరు భలే మాట్లాడేత్తున్నారండి.
కాకమ్మ కథలు చెప్పే వారు ఎక్కువగా వుంటారని నా JNTUలో చదివిన ఓ భీమవరం ఎక్స్ కొలీగ్ చెప్పేవాడు, అది నిజం అయివుండదంటారు, అంతేనా? ఈ కెనడా కనెక్షన్ కథ బాగుంది. ఆ యాపారుల కాలానికి కాకినాడలో కూడా కెనడాలో లాగా చల్లగా మంచు కురిసేదని తెలుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మధ్యాగిపోయుంటాది లేండి. :)) తేడాలు తెలియడానికి నాది కాకి నాడ కాదుగ! చమించేయండి. కాకినాడాని కోకిలనాడాగా పేరు మారిస్తేగాని పంచమ స్వరంలో గుణగానం కుదరదు.

SHANKAR.S said...

ఆయ్(...మరి మాటాడరేటండి? మీ భీమవరం ఎక్స్ కొలీగు అలా అన్నారా? అయినా బుర్ర లేపోడం కాపోతే కాకినాడ గురించి భీమవరం వాళ్ళని అడిగితే ఏం చెప్తారండీ?

అన్నట్టు కెనడాలో మీకు మంచు ఒక్కటే కనిపించినట్టుంది. పాపం ఆ వ్యాపారులకి మరి కాకినాడకి కెనడాకి ఏం పోలిక కనిపించిందో ఓ సారి వాళ్ళ దగ్గరకి వెళ్లి మీరే అడగరాదూ.

నిజమే తేడాలు తెలియడానికి మీది కాకినాడ కాదుగా. మీది కాకినాడ అయితే ఇలా తేడాగా మాట్లాడరుగా!

ఏటి కాకినాడని కోకిలనాడాగా మార్చాలా? అప్పుడు గుణగానం చేస్తారా? ఆ ముక్క మరి మీ ముందటి కామెంట్లో చెప్పాల. అయినా ప్రతి అడ్డమైన వెధవ కోసం అమ్మ పేరు మార్చలేం కదండీ.

చివరగా ఒక్క మాట SNKR గారూ మనిషన్నవాడికి ఎవరికైనా తన మాతృభూమి మీద మమకారం ఉండటం సహజం. దాన్ని ఎగతాళి చేయాలనుకోవడం కుసంస్కారం. మీకు అర్ధమయిందనే అనుకుంటున్నాను.

కొత్తావకాయ said...

అయితే మీరూ జస్పాల్ రాణా, సూపర్ స్టార్ కృష్ణా కాదన్నమాట. :) కానీ ఆ తుపాకీ చేతపట్టిన రెండు నిముషాలు ప్రపంచ విజేతలమైపోయినంత ఆనందం, గర్వం కలిగేదండీ. అప్పడాలు హెందుకు గుర్తు చేస్తారు సార్! :(

Nice post!! :)

మధురవాణి said...

బ్రహ్మాండం... చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా మీ ఊరి ఎక్జిబిషన్ అంతా తిప్పారుగా మమ్మలనందరినీ.
నేను మొదటిసారి ఎక్జిబిషన్ చూసింది ఇంటర్లో. గుంటూరు ఎక్జిబిషన్ అన్నమాట. తర్వాత డిగ్రీలో..
అన్నట్టు, ఆ బుడగలు పేల్చేదాని పక్కనే, ఇంకోటి ఉంటుంది కదా.. రింగులు వేసేది.. సబ్బులూ, పౌడర్ డబ్బాలూ లాంటి వస్తువులుంటాయి. ఐదు రూపాయలకి మూడు రింగులు ఇస్తాడనుకుంటా. నా మొహం సబ్బు కాదు కదా కనీసం చిన్న చాక్లెట్టు మీద పడేవి కాదు నేను వేసిన రింగులు.. :(

ఇంక అసలు విషయానికొస్తే ఎంతైనా మా పేదన్నయ్యని మేమే కష్టపెడితే బాగోదు కదా పాపం. అందుకని నా కోటాలో ఒక బ్లూ కలర్ సబ్బు బుడగల డబ్బా, ఇంకా ఒక పెద్ద అప్పడం కొనివ్వండి. ఈసారికి సర్దుకుంటాను. :)
నాలుగు రోజులయ్యాక మళ్ళీ వెళ్ళినప్పుడు వేరేవి కొనిద్దురు గానీలే.. ;) :D

మనసు పలికే said...

శంకర్ గారూఊఊఊఊ...
ముందు నాకు ఆ అప్పడం కావాలి:) ఎంత బాగుందో పెద్దగా... ఎగ్జిబిషన్ అంతా తిప్పి చూపించేశారు, నన్ను నా చిన్న తనానికి పంపించేశారు:) మళ్లీ రావాలని లేదు. టపా మాత్రం కేక అంతే.

ఆ.సౌమ్య said...

భలే, అలా చిన్నతనంలోకి లాక్కుపోయారండీ. ఎగ్జిబిషన్ అంటే బుడగలు, సబ్బు నురగని ఊది ఊది బుడగలు తెప్పించడం, చిరుతిళ్ళు, మిమిక్రీ, వెంట్రికాల్క్విజం షోలు బొమ్మలు ఎక్కువగా అడిగేదాన్ని కాదుగానీ బంతులు కొనుక్కునేదాన్ని. నాకు చినప్పుడు బోల్డు బంతుల పిచ్చి ఉండేది. ఏ బంతి పెడిటే ఆ బంతి కొనమని అడిగేదాన్ని.

మీకు గులాబీ రంగు పీచు మిఠాయి గుర్తుందా? చిన్న పుల్లకి కట్టి ఇస్తాడు. తియ్యగా భలే ఉంటుంది. ఆ గులాబీ రంగు నోటికంతా అంటుకుని భలే ఉండేది.

అలాగే బబుల్ గం లా సాగుతూ ఉండే ఒక తియ్యటి పదార్థం ఉంటుంది. అది చేతికి వాచిల్లాగ, ఉంగరాల్లాగ కడతాడు. వాటిని నాక్కుంటూ, చీక్కుంటూ తినేవాళ్ళం. సైకిల్ మీద వస్తాడు. ఒక తంబురా ఆకారంలో ఉండే కర్రకి తీగలు తీగలు గా ఈ బబుల్ గం లాంటి పదార్థం కట్టేసి ఉంచుతాడు. పదిపైసలిస్తే వాచీ చుట్టేవాడు.

ఆ గులాబీ రంగు పీచు మిఠాయికి అడ్డు చెప్పేవారుకాదుగానీ ఈ బబుల్ లాంటి దానికి అడ్డుచెప్పేవారు నాన్నారు...అలాంటివి తినకూడదని గట్టిగా ప్రైవేటు చెప్పేసేవారు. నాకేమో అది చేతికి చుట్టించుకోవాలని కోరిక. నాన్నారిని బతిమాలి బామాలి ఓ 2-3 సార్లు వాచీ కట్టించుకున్నా.

నాకు ఆ జైంట్ విల్ అవీ అంటే చచ్చేంత భయం...రంగుల రట్నానికే కళ్ళు మూసుకుని బిగపట్టుకు కూర్చునేదాన్ని. అంచాత వాటివైపు వెళ్ళేదాన్ని కాదు.

ఓహ్ ఎన్ని అపురూపమైన అనుభవాలో....అన్నిటినీ ఫొటోలు పెట్టి మరీ చక్కగా కళ్ళ ముందుంచారండీ thank you!

ఆ.సౌమ్య said...

సుజాత గారూ
ఆ వచ్చే వచ్చే
బజ్జీలు...అప్పడాలు కూడా భలే బావున్నాయండీ...నోరూరుతున్నాది :D

Ennela said...

tammuduu...aa bommala dukaanam tega nachchindi..oka bomma konipettavaa....abbaa alaa tirugutoo akkade undipovaalanundi..kaakinaada teesukellamante nuvvemo time ledu anesaavu...next time teesukellaali sarenaa?

హనుమంత రావు said...

లోపల్నుంచి మాధుర్యం ఒలికించే కోటయ్య కాజాలా మీ ఎగ్జిబిషన్ దర్శనం చాలా బాగుంది. మీ చిన్నతనం మా చిన్నతనాన్ని పలికింది. గుడ్.

హనుమంత రావు said...

లోపల్నుంచి మాధుర్యం ఒలికించే కోటయ్య కాజాలా మీ ఎగ్జిబిషన్ దర్శనం చాలా బాగుంది. మీ చిన్నతనం మా చిన్నతనాన్ని పలికింది. గుడ్.

Videhi said...

Hello Readers,

This is with deep regret to inform you that the author of this blog, Uma Shanker has passed away yesterday in Hyderabad.

I happen to be his cousin and wanted to share this really sad and disturbing news with his blog's followers.

I hope his wife, swathi stands strong in such a painful moment.

RIP Uma!

-Vishali

Anonymous said...

Heard that you are died, is it true..
hope its false news.

bharadwaj said...

Bad news for all blog friends of Shankar. Shankar has met with an accident and expired on 28-06-12.Let us all pray his soul rest in peace.

భాస్కర్ కె said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,