Wednesday, June 9, 2010

అసలు కన్నా కొసరు ముద్దు - ఇంతకీ మీ ముద్దు పేరు?

అదేంటో ఈ మధ్య బ్లాగ్లోకంలో పేర్ల గురించి విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. భయపడకండి నేను నా పేరు, దాని పుట్టు పూర్వోత్తరాలు, జనాలు దాన్ని ఖూనీ చేసిన విధానాలు గురించి చెప్పబోవట్లేదు. నేను చెప్పదలచుకున్నది నాని, బుజ్జి, చిన్న, చిట్టి, కన్నా ల గురించి. అదేనండీ ముద్దు పేర్ల గురించి. అసలీ ముద్దు పేర్లు ఎవరు కనిపెట్టారో గానీ ఒక్కోసారి అసలు పేర్ల కన్నా వీటితోనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. పిల్లలు పుట్టగానే ముద్దుగా వాళ్ళకి ఏదో ఒక ముద్దు పేరు తగిలించేస్తారు బుజ్జిగాడు, చిట్టి కన్నా ఎక్సెట్రా..ఎక్సెట్రా. ఇంట్లో వాళ్ళతో పాటు క్రమంగా పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అలా అలా ఆ పేరు అసలు పేరు కన్నా పాపులరయి కూర్చుంటుంది. ఇక పెద్దరికపు పిలుపులు కొన్నుంటాయి. వీటిని ముద్దు పేర్లు అనలేం కానీ ఇవీ అలాంటివే. పాపా, అమ్మాయీ టైపు అన్నమాట. కొన్నాళ్ళకి వాళ్ళ అసలు పేరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ మర్చిపోయినా హాశ్చర్యం లేదు.  అంతెందుకు నా క్లోజ్ ఫ్రెండ్ నాని గాడి పేరు లక్ష్మీ నారాయణ అని నాకు చాన్నాళ్ళ దాకా తెలియదు. అసలు వాడి పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడూ కలగలేదు. 

కొంతమంది క్లోజు సర్కిల్లో ముద్దు పేరు కంటిన్యూ చేస్తూనే బయట ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ అసలు పేరుతో చలామణీ అయిపోతూ ఉంటారు. వీళ్ళతో మరీ కష్టం.దగ్గర వాళ్లకి  అసలు పేరు గుర్తుండదు, అవతల వాళ్లకి ముద్దు పేరు తెలియదు. వాళ్ళ కోసం వాళ్ళ ఆఫీసుకి వెళ్లి ఫలానా బుజ్జిగాడు కావాలండీ అని అడిగామనుకోండి. వాళ్ళు తెలియదు అంటారు. మళ్ళీ అక్కడ నుంచి వాడి పేరు తప్ప అన్ని గుర్తులూ చెప్పాల్సిందే. పొడుగ్గా ఉంటాడు, ఫుల్ హాండ్స్ చొక్కాలే వేస్తాడు, వాళ్ళది కాకినాడ, వాడికి హీరో హోండా బండుంది ఇలా దిక్కుమాలిన వివరాలన్నీ చెప్పాలి. అదే అసలు పేరు తో ఈ ప్రాబ్లెమ్స్ ఉండవు కదా. 

కొంత మందికి వారి హోదా, ఉంటున్న ప్రదేశం తదితర వివరాలతో ముద్దు పేర్లు వచ్చేస్తాయి. ఉదాహరణకి రైల్వే లో పనిచేసే మామయ్య రైల్వే మామయ్య అయిపోతాడు. చుట్టాల్లో ఎవరో ఒకరు ఆ పిలుపు మొదలెడతారు ఇంక ఆయన బంధు మిత్ర సపరివారంగా అందరికీ  రైల్వే మామయ్యే. ఇక రామచంద్రపురం పిన్ని, మద్రాస్ అత్తయ్య ఇలాంటివి కూడా మనకి తెలిసినవే. 

సాధారణంగా ఈ ముద్దు పేర్లు ఇంట్లో మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు (అన్నయ్యలు, అక్కలు) ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంట్లో వాళ్ళు, ఆ తరవాత అలా అలా...... అన్నమాట. ఉదాహరణకి మా అమ్మగారు పుట్టినప్పుడు మా పెద్ద మామయ్య పాప పాప అని తిరుగుతుంటే మా అమ్మమ్మ పాప కాదురా చెల్లి అనాలి అందట. మా మామయ్య మహా మేధావి మరి...పాపకు ముందు చెల్లి జోడించి చెల్లిపాప అని పిలవడం మొదలు పెట్టాడు. ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో కానీ చుట్టపక్కాల్లో అదే పేరు ఫేమస్ అయిపోయింది. అన్నట్టు మా పెద్ద మామయ్య ముద్దు పేరు బాబ్జీ. చిన్నమామయ్య ముద్దు పేరు బాబు. ఇక మా బేబి పిన్ని ముద్దు పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేం చిత్రమో మా ఇంట్లో  మా జనరేషన్లో ఒక్కరికీ ముద్దు పేరు లేదు (చిన్నప్పుడు అంత ముద్దుగా లేమేమో :) ). 

నాకు తెలిసిన కొన్ని ముద్దు పేర్లు : నాని, చిన్ని, కన్నా, బుజ్జి, చిట్టి, బంగారం, బాబు, బేబి, పాప, బాబ్జీ ఎక్సెట్రా ఎక్సెట్రా... మీకూ ఏదయినా ముద్దు పేరుంటే చెప్పండి మరి.. 

Saturday, June 5, 2010

ఇరవై ఏళ్ల తరువాత దొరికిన నేను వెతుకుతున్న నవల

కొన్ని పుస్తకాలు చదువుతూండగానే ఎప్పుడయిపోతుందా అనిపిస్తాయి. ఇంకొన్ని చదివినప్పుడు బావుంటాయి కానీ తరవాత గుర్తుండి చావవు. కొన్ని మాత్రం చదివి సంవత్సరాలు గడుస్తున్నా వాటి తాలూకా హ్యంగోవర్ నుంచి బయటపడలేము. గుర్తొచ్చినప్పుడల్లా మనసుని తడుముతూనే ఉంటాయి. ఈ భారమైన ఉపోద్ఘాతం అంతా దేనికంటే సుమారు ఇన్నేళ్ళు గడిచినా నా మనసులోంచి మాసిపోని, ఇరవై ఏళ్ళక్రితం నేను చదివిన ఒక నవల గురించి మీతో పంచుకోవాలని నా ప్రయత్నం. ఖంగారు పడకండి నేనేమి సమీక్షలు రాయబోవటం లేదు. ఒక మంచి నవల (పోనీ నేను అలా అనుకుంటున్నా. సరేనా..) గురించి మీతో పంచుకుంటే నాకు అదో తుత్తి!

అప్పుడు నాకు ఒక పది పన్నెండేళ్ళు ఉంటాయేమో. అప్పట్లో ఆంధ్ర భూమి లో వచ్చే సీరియల్స్ పేజీలు  చింపి వాటిని బైండింగ్ చేయించే అలవాటు మా అమ్మగారికి ఉండేది. ఇంట్లో ఉన్న పుస్తకాల నుంచీ ఇడ్లీ పోట్లానికి కట్టిన పేపర్ దాకా చదివేసే భయంకరమైన వ్యసనం నాకు ఉండేది (ఉండేది ఏంటి నా బొంద ఇప్పటికీ ఉండేడ్చింది...అలా అని క్లాసు పుస్తకాలు కూడా అలానే చదువుతాననుకుంటున్నారేమో...వాటికి మినహాయింపు). అలా నా కంటపడిందీ నవల. "సిగ్గు సిగ్గు" -  పేరు చూసి ఇదేదో ప్యూర్ పెద్దలకు మాత్రమే పుస్తకమని, అది చదవడం ఇంట్లో వాళ్ళు చూస్తే వీపు విమానం మోత మ్రోగడం ఖాయమని నాకు నేనే డిసైడ్ అయిపోయి దాన్ని క్షమించి వదిలేసా. ఆ తరువాత కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్ళు లేని ఒక శుభ ముహూర్తం లో చదవడానికి ఏది దొరక్క తాత్కాలికంగా నన్ను నేనే పెద్దల్లో కలిపేసుకుని (తప్పర్ధం వస్తుందేమో..."పెద్దవాడిగా నిర్ణయించేసుకుని" అని చదువుకోండి) దాని అంతు చూద్దామని డిసైడ్ అయిపోయా. 

ఏకబిగిన పుస్తకం చదివేసిన తరువాత కొంత సేపటి వరకు ఆ హ్యంగోవర్ నుంచి బయటపడలేకపోయా (అది కొన్నేళ్ళ వరకు అన్న విషయం తరవాత అర్ధం అయింది). ఆ తరువాత కొన్నేళ్ళకి ఆ పుస్తకాన్ని నా కన్నా ఇష్టంగా ఎలకలు చదివి జీర్ణిన్చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆ పుస్తకం మళ్ళీ ఎక్కడయినా దొరుకుతుందేమో అని వెదుకుతూనే ఉన్నాను. ఇంచుమించు ఇరవై ఏళ్ల తరవాత నా అన్వేషణ ఫలించింది. మొన్నామధ్య  నెట్ లో మల్లెపూలు డాట్ కాం అనే సైట్ లో అనుకోకుండా ఈ పుస్తకాన్ని చూడటం (అప్పటికింకా దాన్ని పెయిడ్ సైట్ చెయ్యకపోవడం వలన...అఫ్ కోర్స్ చేసున్నా నేను ఆ పుస్తకం డౌన్ లోడ్ చేసుకునేవాడిని) దాన్ని నేను డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిపోయాయి. ఆరోజు  చిన్నపుడు తిరనాళ్ళలో తప్పిపోయిన తమ్ముడిని పాతికేళ్ళ తరవాత అనుకోకుండా కలుసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది (నీ దిక్కుమాలిన పోలిక తగలెయ్య అని తిట్టుకోకండి ఇంతకు మించి ఎలా పోల్చాలో నాకు తట్టలేదు). 

ఎన్నార్ నంది రాసిన ఆ సైన్సు ఫిక్షన్ (ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, రిప్ వాన్ వింకిల్ టైపు స్టోరి, భారత దేశం లో స్వాతంత్ర్యానంతర పరిస్థితులు కలిపి రాసినది) నవలని ఇష్టమయితే మీరూ చదవండి. లింకులు ఇస్తున్నాను. పీడీయఫ్ ఫార్మాట్ లో ఉన్న ఈ నవల పాస్ వర్డ్  mallepoolu.com



Friday, June 4, 2010

ఈ రోజు మన "బాలు" బర్త్ డే - ఆయన తొలి పాట, కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం......

ఇండియన్ క్రికెట్ లో గవాస్కర్ తరువాత సచిన్ శకం లాగ , తెలుగు సినిమా పాట ప్రస్థానం లో ఘంటసాల తరువాత శకం మన "బాలు" ది (పద్మశ్రీ. డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనేకంటే "మన బాలు" అనుకుంటేనే ఆత్మీయంగా అనిపిస్తుంది కనుక టైటిల్ లో అలా సంబోధించా...అయినా గవాస్కర్ కి, ఘంటసాలకి పోలికేంట్రా కుంకా...అని తిట్టుకుంటున్నారా? ఏమో నాకలా అన్పించింది అంతే! ). 

ఎన్టీఆర్ కి పాడినా, ఏయన్నార్ కి పాడినా, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి...ఇలా ఎవరికీ పాడినా వాళ్ళ గొంతుల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే తన గాత్ర ధర్మాన్ని తప్పకపోవడం బాలు ప్రత్యేకత. కళ్ళు మూసుకుని వింటే బాలు గొంతు "కనిపించేలా", ఇది "బాలు పాట" అని చెప్పే స్థాయిలో తనదైన ముద్ర వేసిన ఈ నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్...  నిర్మాతగా కూడా అభిరుచిని చాటుకున్నాడు. నేడు ఆ 'బాలు'డి బర్త్  డే సందర్భంగా ఆయన తొలిపాట, తొలినాటి ఫోటోలతో పాటు అంతటి గాయకుడిని మనకు పరిచయం చేసిన శ్రీ ఎస్.పి కోదండపాణి గారి ఫోటో కూడా జత చేస్తున్నాను. మన బ్లాగ్మిత్రులందరి తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. 


కొన్ని అరుదైన ఫోటోలు 


1  (బాలిక కాదు..."బాలు"డే)


















2 కాలేజి ఏజీలో..టీనేజి మోజులో 



౩. నా పాట పంచామృతం 



















4 . పాటకు పద్మశ్రీ 















5. ఆబాలగోపాలం మెచ్చిన ఈ"బాలు"ని మనకు పరిచయం చేసిన శ్రీ ఎస్.పి. కోదండపాణి  

















6. శ్రీ ఎస్.పి. కోదండపాణి గారితో ఎస్పీబీ


















(మనలో మన మాట ఈ ఫోటోలు ఆయన అఫీషియల్ సైట్  http://www.spbindia.com/ లోంచి మీతో పంచుకుందామని కొట్టేసినవే :).....ఈ పోస్ట్ మీద మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోకండి)

Thursday, June 3, 2010

పాటల భాయి రవి

మీలో ఎవరికయినా ఈ సినిమా పేరు తెలుసా? ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? సరే జరిగిందేంటో చెప్తా వినండి...సారీ చదవండి!!

వృత్తి రీత్యా నేనొక కాపీ రైటర్ ని (అంటే కాపీ కొట్టి రాసే వాడు అని మాత్రం అనుకోవద్దని మనవి...అడ్వర్టైజింగ్ లో కాపీ రైటర్ అన్నమాట). మొన్నామధ్య నా ఖర్మ కాలి ఊళ్ళో లేని సందర్భంలో మా క్లైంట్ అయిన vodafone  క్రొత్త కాలర్ ట్యూన్ లకి ఒక పోస్టర్ చేయవలసి వచ్చింది. ఎలాగూ సినిమాల పేర్లు, పాటల పేర్లు వాళ్ళే ఇస్తారు కాబట్టి నేను చేసేదేమీ ఉండదు అందులో. దాన్ని తెలుగులోకి కూడా ట్రాన్సిలేషన్ చేసుకుని డిజైనర్ కి ఇచ్చేస్తే చాలు. నేను ఊళ్ళో లేకపోవడంతో మా డేటా ఎంట్రీ ఆపరేటరే ట్రాన్సిలేషన్ ట్రై చేద్దామని ప్రయత్నం చేసాడు. ఎలాగూ ఫోనెటిక్ లో కొట్టేస్తే పదాలు వచ్చెస్తాయి కదా అని మా వాడి సరదా. క్లైంట్ పంపించిన ఫైల్ లో ఉన్న టెక్స్ట్ స్పేస్ లతో సహా ఫోనెటిక్ లో కొట్టేసాడు. ప్రూఫ్ చెక్ కోసం నాకు పాటలు, సినిమాల లిస్టు విడి విడి ఫైల్స్ గా  మెయిల్ చేసాడు. సరే ఒక్కొక్కటీ చెక్ చేసుకుంటూ వస్తున్ననాకు ఒక సినిమా మాత్రం అర్ధం కాలేదు అదే "పాటల భాయి రవి". నాకు తెలిసి అలాంటి సినిమా ఏది లేదు, పోనీ ఏదయినా ప్రైవేటు ఆల్బం అనుకుందామా అంటే ఆ పేరు ఎప్పుడూ వినలేదు. పోనీ చింతకాయల రవి సినిమా కి వచ్చిన తిప్పలా అనుకుందామంటే మరీ ఇంత డిఫరెన్సు ఉండదాయే....

ఇంక ఇలాకాదని పాటల లిస్టు, సినిమాల లిస్టు పక్క పక్కన పెట్టుకుని పాటని బట్టి గుర్తు పట్టచ్చేమో ట్రై చేద్దాం అని ప్రయత్నించా. లిస్టు లో సంబంధిత నంబర్ దగ్గర పాట చూసాక నాకు అదేం సినిమాయో అర్ధం అయింది. క్లైంట్ టెక్స్ట్ justify చేసి పంపించడం వలన ఆ సినిమా పేరులో స్పేస్ లు రావడం వలన, అది పట్టించుకోకుండా మావాడు గుడ్డిగా టైపు చేసేయడం వలన జరిగిన పొరపాటు అని అర్ధం అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకెవరికయినా తట్టిందా? ఇదిగో అక్కడ ఇలా ఉంది.....
"PATALA  BHAI  RAVI"

....ఆ పాట " ప్రేమ కోసమై" 

అలా "పాతాళ భైరవి" కాస్తా మావాడి చేతిలో పడి 'పాటల భాయి రవి'  అయింది. 

Wednesday, June 2, 2010

రచన: మహాత్మా గాంధీ ; సంగీతం: ఇళయరాజా ; గానం: పండిట్ భీమ్ సేన్ జోషి - ఇళయరాజా హ్యాపీ బర్త్ డే స్పెషల్ :)

స్వరజ్ఞాని ఇళయరాజా పుట్టినరోజు ఈవేళ. దేశంలోని అతి కొద్ది మంది సంగీత మేధావులలో ఒకరైన ఇళయరాజా స్వరపరచిన మహాత్మాగాంధీ గీతం (రాసినది అచ్చంగా మహాత్ముడే) "నమ్రతా కే సాగర్" గీతాన్ని మీకోసం అందిస్తున్నాను. ఇది ఒక అరుదయిన కాంబినేషన్, మన ఆల్ ఇండియా రేడియో స్టైల్ లో చెప్పాలంటే 
రచన: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
సంగీతం: ఇళయరాజా
గానం: పండిట్ భీమ్ సేన్ జోషి 
వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్

ఆ సంగీత సామ్రాట్ కి జన్మదిన శుభాకాంక్షలతో ......



(ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా బావుంది. కాకపోతే ఫైల్ సైజు కాస్త ఎక్కువ (20 mb ) . పరవాలేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఆడియోతో సరిపెట్టుకోండి. అన్నట్టు మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోకండి :) )  

Tuesday, June 1, 2010

పరమ బూతు పదం: "పాత్రికేయ విలువలు"

"పాత్రికేయ విలువలు" దీనంత బూతు పదం నాకు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. తాజాగా ఎన్ టివి కి ఎబియన్ ఆంద్రజ్యోతి ఛానెల్స్ మధ్య "స్వరూపానంద" విషయంలో జరుగుతున్న మీడియా పోరు చూస్తే అసహ్యం వేస్తోంది. ఒక్క ఈ రెండు ఛానెల్స్ అనే కాదు ఒకరు అవునంటే ఇంకొకరు కాదనాలి అనే సంస్కృతి ఈ మధ్య మీడియా లో వెర్రితలలు వేస్తోంది. వీధి కుక్కల కన్నా హీనంగా కొట్టుకుంటున్నారు (వీధి కుక్కలు నన్ను క్షమించాలి). అసలు ఏది వార్త, ఏది వార్త కాదు అనే కనీస అవగాహన కూడా మీడియా మర్చిపోతోందేమో అనిపిస్తోంది. దానికి తోడూ మేమే ముందు చెప్పాం అనిపించుకోవాలనే తాపత్రయం లో అడ్డమయిన విషయాల్ని వార్తలుగా చేసి పారేస్తున్నారు. ఇక మొన్న శ్రీకాళహస్తి రాజ గోపురం కూలిన ఘటనలో "ముందుగా హెచ్చరించింది మా ఛానలే" అని దాదాపు అన్ని న్యూస్ చానల్స్ డబ్బాలు కొట్టుకోవడం మరీ వింతగా ఉంది. "ముందుగా" అనేది అందరికీ ఎలా సాధ్యమో నాకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలేదు. 

ఇక "చర్చలు" అన్న పదం ఎంత కామెడీ గా మారిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చానెల్ కి  కొంత మంది స్టాండర్డ్ విశ్లేషకులు ఉంటారు, వీళ్ళు ఆవకాయ నుండి అణుశక్తి విధానం దాకా అన్నిటినీ విశ్లేషించేస్తారు పాపం!. పోనీ మిగతా వాళ్ళయినా సబ్జెక్ట్ తో సంబంధం ఉన్నవాళ్ళని పెడతారా అంటే అదీ లేదు. ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్రద్దలైన విషయం మీద అంబటి రాంబాబు ని చర్చకు పిలిచే టైపు వీళ్ళు.   

ఇకపోతే ఇంకో రకం సంస్కృతి ఈ మధ్య కనిపిస్తోంది. ఎవరయినా ఆడపిల్ల భర్త మీదో, లవర్ మీదో అతను అన్యాయం చేసాడని స్టూడియో కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే చాలు అసలు నిజానిజాలేంటో తెలుసుకోకుండా   వీళ్ళకి నచ్చిన హెడ్ లైన్స్ వీళ్ళు పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ప్రోగ్రాం గా మలిచేసుకుంటున్నారు. అసలు అలాంటి అన్యాయాలు జరగటం లేదు అని నేను అనట్లేదు అయితే నిజానిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఎంత వరకు న్యాయం? అనేదే నా ప్రశ్న. 

ముట్నూరి కృష్ణారావు గారిలాంటి పాత్రికేయులు ఇప్పుడు లేకపోవడం వాళ్ళ అదృష్టం. ఉంటే ఈ పరిణామాలకి గుండె పగిలి చనిపోయేవారేమో. 

Saturday, May 29, 2010

వీణ మీద వెస్ట్రన్ రాగం - డా. ఈమని శంకర శాస్త్రి వీణా విన్యాసం

వీణ మీద ఆమని కోయిల గానాలను సైతం అలవోకగా పలికించగలిగిన అద్భుత వైణికుడు డా. ఈమని శంకర శాస్త్రి గారి రెండు అపూర్వ సంగీత ప్రయోగాలను మీకు అందిస్తున్నా. వీణ మీద వెస్ట్రన్ మ్యూజిక్ పలికించినది ఒకటైతే, "ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బీ" పేరుతో భ్రమర విన్యాసాన్ని వీణ మీద పలికించిన చిత్రం మరొకటి (ఇందులో మీరు ఆయన గొంతు కూడా వినవచ్చు). ఈ రెండు మీకు నచ్చితే ఆయన మీటిన, నాకు చాలా ఇష్టమయిన అయిదు కీర్తనలని తరువాత పోస్ట్ లో అందిస్తాను. 



మీ అభిప్రాయాలని చెప్పడం మరచిపోకండి!

Thursday, March 25, 2010

మాయా బజార్ లో ఇంగ్లిష్ పాట ట్యూన్ ....పంటి కింద రాయి లాంటి నిజం


ఈ మధ్యే తెలిసిందీ విషయం. 1957 లో వచ్చిన మాయా బజార్ లో నట యశస్వి మన యస్వీ రంగారావు ప్రాణం పోసిన "వివాహ భోజనంబు' పాటకు స్ఫూర్తి (ఎందుకంటే కాపీ అనుకోడానికి మనసొప్పదు) 1922 లో వచ్చిన "ద లాఫింగ్ పోలీస్ మేన్ ' అనే ఇంగ్లిష్ పాటట. ఈపాట అప్పట్లో బిబిసి లో మారుమ్రోగేదట. పాట విన్నాక ఏమో కావచ్చేమో అనిపించింది. ఒక సారి మీరూ విని చూడండి. మీకోసం ఆ రెండు పాటల లింకులూ క్రింద ఇస్తున్నాను. 



(ఈ పోస్ట్ మీకు నచ్చితే ఓ కామెంట్ వేస్కోండి :) )



Wednesday, March 3, 2010

స్వర్గం నేలకు దింపి...కట్టించారేమో హంపి


ఫిబ్రవరి 16 , 2009 - మా మొదటి పెళ్లిరోజు సందర్భంగా (ఇక్కడ మొదటి అనేది పెళ్లి రోజుకే కానీ పెళ్లికి కాదని మనవి :)  ఎక్కడికి వెళ్దామా అని యమ సీరియస్ గా ఆలోచిస్తూ నేను, మా ఆవిడా మొత్తం భారతదేశంలోని దర్శనీయ స్థలాలన్నిటినీ కాచి వడబోసి చివరాఖరికి హంపిని ఫైనల్ చేసాం. ఫిబ్రవరి పద్నాలుగున కాచిగూడ నుంచి బయల్దేరి హోస్పేట చేరుకున్నాం. అక్కడనుంచి హంపి ఆరు కి.మీ. ముందే కర్ణాటక టూరిజం వాళ్ళ మయూర భువనేశ్వరి లో రూం బుక్ చేసుకుని ఉన్నందువలన డైరెక్ట్ గా ఆటో లో అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయి ఊరి మీద పడ్డాం. మొత్తం మూడు రోజుల మా ట్రిప్ లో మొదటి రోజు గైడ్ ని మాట్లాడుకుని అతను ఎవరో తరుముతున్నట్టు అన్నీ హడావుడిగా చూపించడం తో నచ్చక రెండవ రోజు మేమే బైక్ అద్దెకు తీసుకుని హంపి ని నచ్చిన చోట ఆగుతూ తెగ తిరిగేసాం. హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం (నిజానికి ఇది లక్ష్మీ నరసింహ శిల్పం...కానీ విజయనగర సామ్రాజ్య లక్ష్మి లాగే ఈ విగ్రహం లో లక్ష్మి ని కూడా బహమనీలు నాశనం చేశారట..ఒక్క ఈ శిల్పం అనేముంది లెండి చాలామటుకు గుళ్ళను, శిల్పాలను ఆరు నెలల పాటు హంపి లో ఉండి చేసినంత వరకు నాశనం చేసి ఇక ఓపిక నశించో ఏమో గర్భగుడులలో విగ్రహాలను నాశనం చేసి ఆ గుళ్ళను నిరుపయోగం చేసారట...వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి), ఏకశిలా రధం (నిజానికి ఇది ఏడు శిలలతో చెక్కింది కానీ ఎందుకో మనవాళ్ళు అలా అనేస్తారు), సంగీతం పలికే స్తంభాలు, హజార రామాలయం, దసరా దిబ్బ (ఇక్కడే దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవట), అష్ట లక్ష్మి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు (ఆలయం పోయి కోనేరు మిగిలింది...ఇది మాత్రం చూసి తీరవలసిన రీతిలో కట్టారు లెండి), ఇలా ఒక్క విరూపాక్ష దేవాలయం తప్ప అన్నీ చూసేసాం (అది మాత్రం చివరి రోజు ప్రశాంతం గా చూద్దాం అని ఆగాము...అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతాయి). అన్నట్టు హంపి ప్రాంతం రామాయణం టైం లో కిష్కిందగా పిలవబడేదట (అంటే వానర రాజ్యం లో వివాహ వార్షికోత్సవం అన్నమాట ) మూడో రోజు కాబ్ మాట్లాడుకుని ఉదయాన్నే బాదామి గుహలు చూసేందుకు బయల్దేరాం. దారిలో చాళుక్యుల కులదైవం అయిన  బనశంకరి దేవత గుడిని దర్శించి పదిన్నర అయ్యేటప్పటికి బాదామి గుహలకు చేరుకున్నాం. కారు దిగి తలెత్తి చూసేసరికి నాల్గంతస్తులుగా మలచిన గుహలు సరిలేరు మాకేవ్వరు అన్నట్టు స్వాగతం పలుకుతూ కనిపించాయి.
(మిగిలిన సంగతులు ఇంకో సారి  చెప్తా...అందాకా ఈ ఫొటోస్ చూసేయండి...హంపిలో అణువణువూ అద్భుతమే కాబట్టి వాటిలో మరీ అద్భుతమైనవి అని నాకు అనిపించినవి మాత్రమె ఇక్కడ అందిస్తున్నాను..)

ససివేకలు (ఆవాలని అర్ధమాట) వినాయకుడిగా పిలవబడే ఈ ఎనిమిది అడుగుల విగ్రహం ముందు నుంచి చూస్తే వినాయకుడిలా వెనుక నుంచి చూస్తే స్త్రీమూర్తి కూర్చుని ఉన్న భంగిమలో కనిపిస్తుంది)














ఇక ఈ విగ్రహానికి కాస్త దూరం లో ఉన్న కడలెకలు వినాయకుడిగా పిలవబడే పదిహేను అడుగుల వినాయక విగ్రహం ఇంకా విచిత్రం. ముందు నుంచి వినాయకుడిగా, వెనుక నుంచి స్త్రీమూర్తి కూర్చి ఉన్నట్టుగా, ఎడమ పక్క ఒక యాంగిల్ నుంచి చూస్తే వరాహావతారం లా (యద్భావం తద్భవతి లా) అనిపిస్తుంది. అయితే గుడి లోపలంతా పూర్తి చీకటిగా ఉంటుంది కాబట్టి టార్చ్ తీసుకెళ్తే మంచిది) బయటకొచ్చి ఎడమ వైపు చూస్తే కనిపించే  విరూపాక్షాలయం గోపురం చూడటానికి భలే ఉంటుంది.



ఇక ఇదిగో హంపి కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి నరసింహ శిల్పం. 
ఇక హంపి లోని శ్రీ కృష్ణాలయం ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన కొంత మంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ పెయింటింగ్ వేస్తుండగా తీసిన ఫోటోలివి .
















































(మరి కొన్ని విశేషాలు తరువాత పోస్ట్ లో.... ఇవి ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి :)


Friday, February 12, 2010

బాదామి గుహలలో నటరాజుకు పద్దెనిమిది చేతులు - ఇదిగో చూడండి




అసలు ఈ పోస్ట్ నేను త్వరలో పెట్టబోయే హంపి టూరు విశేషాలలో పెడదామనుకున్నా. సర్లే ఎలాగూ శివరాత్రి కదా మీకు ఈ అద్భుతమైన నటరాజు విగ్రహం చూపిస్తే కుసింత వెరయిటీగా ఉంటుందేమో అనిపించి ఇప్పుడే ఇచ్చేస్తున్నా.

ఇక విషయానికొస్తే హంపి కి దగ్గరలో ఉన్న (మరీ అంత దగ్గరేం కాదు లెండి ఓ నాల్గు గంటలు ఉంటుంది జర్నీ) బాదామి గుహలలో చాళుక్యుల కాలం నాటి గుహాలయాలు ఉన్నాయి. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయాలలో ప్రతి అణువూ ఒక శిల్ప కళా అద్భుతమే. గుహను గదిలా తొలుస్తూ అందులోనే స్తంభాలు (అచ్చు గుద్దినట్టు అన్నీ ఒకే కొలతలు, ఆ శిల్పుల  పర్ఫెక్షన్ కి కనిపిస్తే కాళ్ళ మీద పడిపోదాం అనిపించింది), గుహ పై కప్పును కూడా వదలకుండా ప్రతి అంగుళం ఒక అద్భుతం అనిపించేలా చెక్కారు. మొదటి మూడు అంతస్తులూ హిందూ మత శైలి కనిపించింది నాల్గవ దాని టైం కి ఆ రాజ్యం లో జైన మత ప్రభావం ఉందనుకుంటా అక్కడన్నీ జైన గురువుల శిల్పాలు. ప్రతి చోటా నిజంగా ఆ దేవుళ్ళే ఈ శిల్పాలకి మోడల్స్ గా పనిచేశారా అనిపిస్తుంది (చెప్పొద్దూ.. అదంతా చూసి ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా? అనిపించింది) 

ఇక బాదామి గుహల మొదటి అంతస్తులోనే మనల్ని పలకరించేదే నేను చెప్పిన నటరాజు విగ్రహం. భరత నాట్యం లో ఉండే ఎనభై ఒక్క ముద్రలని కళ్ళ ముందు ఉంచేలా పద్దెనిమిది చేతులతో నటరాజు విగ్రహాన్ని చెక్కారు. ఏ రెండు చేతులని కలిపి చూసినా ఒక ముద్ర వస్తుందన్న మాట. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు (ట). అసలు అలాంటి శిల్పాన్ని చేక్కించాలన్న ఐడియా ఎవరికీ వచ్చిందో గానీ నిజంగా తెగ నచ్చేసింది ఆ శిల్పం. ఇదిగో మీరూ చూడండి.
(మనలో మనమాట దీన్ని బాపు బొమ్మగా గీస్తే చూడాలనిపించింది నాకు.....ఎవరయినా ఆయనకీ విషయం చెప్తే బాగుండును! :))