Monday, December 20, 2010

బాపు గారి శ్రీరామ రాజ్యానికి నేను రాసుకున్న టైటిల్ సాంగ్ .....

నిన్న ఏదో మాటల్లో బాపు గారు తీస్తున్న శ్రీరామ రాజ్యం సినిమా గురించి నేను నా శ్రీమతి మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఆ సినిమాకి టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందా అనిపించింది. అంటే రామరాజ్యం గురించి ఏం చెప్తే బావుంటుంది అన్న ఆలోచనతో రాయడం మొదలు పెట్టా. మొత్తం పాట రాయడానికి జస్ట్ ఇరవై నిమిషాలు పట్టింది (అంటే అది నా గొప్ప కాదు లెండి రాములోరిది). చదివి మీ అభిప్రాయం చెప్తే ఆ ధైర్యం తో రమణ గారికి కూడా వినిపించే సాహసం చేస్తా. 

ధర్మం నాలుగు పాదాల నడచిన రాజ్యమిది
దైవం మానుష రూపేణా ఏలిన రాజ్యమిది 

కరకు బోయ కడు రమ్యముగా కీర్తించిన రాజ్యమిది 
భవిష్యత్ బ్రహ్మే బంటుగా ఒదిగిన సిత్రపు రాజ్యమిది 
రామనామమే రాజముద్రగా సాగిన రాజ్యమిది 
ప్రజల క్షేమమే ధర్మసూత్రమై నడచిన రాజ్యమిది  

బడుగు మడేలు మాటకు సైతం విలువిచ్చిన రాజ్యమిది 
ఆలి కన్నా పాలితులే ప్రియమని సెలవిచ్చిన రాజ్యమిది 
పాలనలో ఇల సాటిలేదని కొలచిన రాజ్యమిది 
పాలకులే ప్రజ సేవకులని నేర్పించిన రాజ్యమిది  




ఇదండీ రామరాజ్యం అంటే నాకు తోచినది. ఎలా రాసానో మీరే చెప్పాలిక. 


Wednesday, December 15, 2010

బాపు - రమణ పక్కన్నేనూ మా ఆవిడ.....అన్నట్టిది నా వందో పోస్ట్. సెంచరీ కొట్టేసా......

హమ్మయ్య ఎలాగైతేనేం ఇప్పటికి నా వందో పోస్ట్ రాయడం కుదిరింది. 

గత ఫిబ్రవరిలో నా జీవితం లో తొలిసారిగా నా అభిమాన రచయిత రమణ గారిని, నాకు నచ్చే దర్శకుడు బాపు గారిని కలుసుకున్నప్పటి విశేషాలు రాద్దామని ఎప్పటికప్పుడు ప్రారంభించడం...రాసింది సంతృప్తికరంగా లేక  మరోసారికి వాయిదా వేయడం...ఇలా మొదటి ప్రేమలేఖ రాసేటప్పుడు మనస్థితి ఎలా ఉంటుందో, అలా అనిపించేది. సరే ఈరోజు బాపు గారి బర్త్ డే కదా, ఇప్పటికీ రాయలేకపోతే కాలెండర్ మారిపోతుంది అనిపించి ధైర్యం చేసి పోస్ట్ చేసేస్తున్నా.

ఈ ఏడాది ఫిబ్రవరి  ఇరవై రెండో తేది. 
ఉదయం ఎనిమిది గంటలు

చెన్నై లోని ఓ హోటల్ రూం లో ఉన్న నేను మా ఆవిడ తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నాం. చెన్నై వచ్చి రమణ గారిని కలవకుండా వెళ్ళడం అంటే తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళడం లాంటిదే అని నేను, అంత పెద్దాయన మనల్ని కలుస్తారా? మాట్లాడుతారా అని మా ఆవిడ. సరే ఫోన్ చేసి చూద్దాం అని కోతికొమ్మచ్చి పుస్తకం లో ఉన్న రమణ గారి ఇంటికి కాల్ చేసాం. ఫోన్ లిఫ్ట్ చేసింది అర్ధ రమణ గారు (అంటే రమణ గారి శ్రీమతిగారు) . నేను కూడబలుక్కుని "ర మ ణ గారున్నారాండి? అనగానే ఆవిడ "ఇస్తున్నా" అని ఫోన్ ఆయనకిచ్చారు. ఇహ చూస్కోండి నాకు నోట్లోంచి మాట రాలేనంత ఉద్వేగం. నేను సాక్షాత్తు రమణ గారితో మాట్లాడుతున్నా అనే ఆనందం. ఇంతలో "హలో" అంటూ రమణ గారి గొంతు ఫోన్లో పలకరించింది. గుండె ఆనందం తో పేలిపోతుందేమో అనిపించింది. అప్పుడే మాటలు నేర్చుకుంటున్న వాడిలా తడబడుతూ "సర్ నేను...మేము...చెన్నై...వచ్చాము...మిమ్మల్ని కలుద్దామని...." అంటూంటే ఆయన "వచ్చేయండి"  అన్నారు. ఇంటికి ఎలా రావాలో దారి చెప్పారు. 

పెద్దవాళ్ళ దగ్గరకి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా పళ్ళో, దండలో తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్దాం? అంది మా ఆవిడ. నేను తాపీగా "ఒక కిలో జీడిపప్పు" అన్నా. నాకేసి వింతగా చూసింది. అవును మరి నేను రమణ గారి అభిమానిని...ఆయన వయసెంతని? బుడుగు కన్నా కాస్త పెద్దవాడేమో అంతే. సరే జీడిపప్పు ప్యాకెట్ పట్టుకుని ఆయన చెప్పిన ఇంటిముందు ఆటో దిగాం. గేటు దగ్గర వాచ్ మెన్ ని "రమణ గారు" అంటూండగానే అతను "పైన, రెండో ఫ్లోరు" అన్నాడు. మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా పెద్ద హాలు, ఆ వెనుక ఒక బాల్కనిలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తెల్ల బనీను, లుంగీ లో  రమణ గారు.ఆయన్ని చూడగానే ఒక్కసారి అన్నమయ్య సినిమాలొ నాగార్జున చెప్పిన పట్టరాని అలసిపోయెంత ఆనందం అంటే  ఎలా ఉంటుందో నాకు అనుభవం లోకి వచ్చింది. మేము నమస్కారం చెయ్యగానే ఆయన కూర్చోండి వస్తున్నా అన్నట్టు సైగ చేసారు. 

                                                                 రమణ గారు వారి శ్రీమతి 

                                                                          వాళ్ళిద్దరితో మేమిద్దరం 

ఫోన్ ముగించుకుని వచ్చిన రమణ గారు "ఆ చెప్పండి" అన్నారు. నాకు చూస్తే ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు. అర్ధం కావటం ఏంటి నా బొంద..అసలు మాటే పెగలటం లేదు. గుండె గొంతుకలోన కొట్టాడుతున్డాది అని నండూరి వారు అన్నమాటకు అర్ధం అప్పుడు అనుభవం లోకి వచ్చింది. ఇంతలో పాపం మా ఆవిడే కలుగజేసుకుని "ఈయన మీకు పెద్ద ఫ్యానండి" అంది. ఆయన నవ్వుతూ తల ఊపారు. ఏం చెయ్యాలో తోచని నేను చటుక్కున తెచ్చిన జీడిపప్పు ప్యాకెట్ ఆయన చేతికిచ్చి "సర్ మీ కోసం..." అన్నా. రమణ గారు నవ్వుతూ "భలే. జీడిపప్పు తెచ్చారు. అన్నట్టు బాపుగారు  దీనిమీద ఒక కార్టూను కూడా వేసినట్టు గుర్తు. ఈ సన్మానాలు వాటిలో దండలూ అవీ వేసి వేస్ట్ చేసే బదులు ఎంచక్కా ఓ కిలో జీడిపప్పు ఇవ్వరాదూ, పంటికిందకయినా పనికొస్తుంది.. అంటూ ఏదో ఉండాలి." అన్నారు. 

ఆయన ఆమాట అంటూండగానే నేను "సర్ బాపూ గారూ?" అన్నా. ఆయన "కిందే. ఉండండి పిలుస్తా' అని ఇంటర్ కాం నొక్కి "ఒకసారి పైకి రా" అని పిలిచారు. అరనిముషంలో గుమ్మం ముందు లుంగీ, జుబ్బా వేసుకుని కదిలే కుంచెలా బాపు గారు ప్రత్యక్షం. "బాపురే...ఇద్దర్నీ ఒకేసారి చూడటం...ఇది చాలు నా జన్మకి " అనిపించింది. చిరునవ్వుతో లోపలి వచ్చిన బాపు గారికి నన్ను రమణ గారు పరిచయం చేసారు.ఆయన నవ్వుతూ అంతలో అక్కడున్న జీడిపప్పు ప్యాకెట్ కేసి, రమణ గారి కేసి చూసి ఒక చిలిపి నవ్వు నవ్వారు (అంతా నీకేనా అన్నట్టు). రమణ గారు "ఇప్పుడే సన్మానాలలో జీడిపప్పు ఇవ్వచ్చంటూ నువ్వేసిన ఆ కార్టూను గురించి చెప్తున్నా" అంటూ "వీళ్ళకి నీ స్టూడియో చూపించు" అన్నారు. ఉత్సాహంగా బాపు గారు "రండి" అంటూ మమ్మల్ని ఆయన స్టూడియో కి తీసుకెళ్ళారు.

(మిగిలినది రెండో భాగం లో) 

రెండేళ్ళు పూర్తి చేసుకున్న బాపు గారికి (ఈ మాట రమణ గారిదే) జన్మదిన శుభాకాంక్షలు.
ఇదే రోజు మా పిన్ని కూతురు వినీత బర్త్ డే కూడా. తనకీ బ్లాగ్ముఖతా హ్యాపీ బర్త్ డే.

Saturday, August 7, 2010

మనసును తడిమే గోరువెచ్చని పాటలు - మీరూ ఆ భావాల జడిలో పరవశించండి : రెండవ భాగం (అన్నట్టు ఇది నా తొంభై తొమ్మిదో పోస్టు :) )

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి గొంతులో ఎంకి పాటల మొదటి భాగం బాగా ఎంజాయ్ చేసారా?. ఇదిగో ఈ సారి ఆయనతో పాటు శ్రీరంగం గోపాలరత్నం గారు  ఎంకిగా గొంతు కలిపిన పాటల లింకుల్ని  ఇస్తున్నా. క్లిక్ అండ్ ఎంజాయ్. 















ఈ సందర్భంగా ఈ పాటల్ని నెట్ లో ఉంచిన వారందరికీ బ్లాగ్ముఖతా నా ధన్యవాదాలు 

(ఇంకొక్క పోస్ట్ తో సెంచరీ కొట్టేస్తున్నా. నా వందో పోస్ట్ రాయడానికి గత ఫిబ్రవరి నుంచి చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అది నా జీవితం లో నేను మరచిపోలేని ఒక అపురూప ఘట్టం గురించి. ఈ అదృష్టం చాలీ జన్మకి అనిపించిన ఒక సంఘటన గురించి.)  

Wednesday, August 4, 2010

మనసును తడిమే గోరువెచ్చని పాటలు - మీరూ ఆ భావాల జడిలో పరవశించండి

ఎంకి, నాయుడు బావ తెలియని, కనీసం ఎప్పుడూ వాళ్ళ పేర్లయినా వినని తెలుగోడు ఉంటాడా? జానుతెలుగు జానపద జంట వాళ్ళు. ఒకరి కోసం ఒకరు. అసలు నన్నడిగితే పెళ్ళయిన కొత్తలో ప్రతి వాడికి భార్య ఎంకి లాగే కనిపిస్తుంది (పాతబడితే? అని అడగకండి...నాకు ఇంకా ఆ స్టేజి రాలేదు..బహుశా "ఎంకి" కాస్తా "పెంకి" గా కనిపిస్తుందేమో! :) ). 

నండూరి సుబ్బారావు గారి "ఎంకి పాటలు" పున్నమి రాత్రి పెరట్లో జాజిపందిరి కింద వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో వింటూంటే నా సామిరంగా...అదీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం లాంటి వాళ్ళ గొంతులో ఎంకి, నాయుడు బావల ఊసులు వింటుంటే మనసుకు మంచిగంధం పూసినంత చల్లగా ఉంటుంది. (అసలు ఈ పాటలు పాడి వాళ్ళు ధన్యులయ్యారో...వాళ్ళ గొంతులో వినబడి ఆ పాటలు పుణ్యం చేసుకున్నాయో....చెప్పడం కష్టం) నెట్లో వెతికితే ఓ పాతిక ముప్ఫై పాటల దాకా దొరికాయి. రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నా. (పెద్ద గ్యాప్ ఏమీ ఇవ్వనులెండి ఈవేళ....రేపు అంతే ). తనివి తీరా వినండి. క్రింద లింక్ లు ఇస్తున్నా క్లిక్ అండ్ ఎంజాయ్ :)

















(ఇవన్నీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడినవే. రేపు ఇద్దరి గొంతులూ "విందు"రుగాని...)

Sunday, July 11, 2010

రిపోర్టర్లు కావలెను - బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల ఫలితాలు, చిలకజోస్యం వగైరాలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

నిన్న టివి నైన్ లో జగన్ కొత్త పార్టి పెడతాడా లేదా అని చిలక జోస్యం తో డిసైడ్ చెయ్యడం చూసి నాకు భలే చిరాకేసింది. అసలు ఈ మధ్య న్యూస్ చానెల్స్ మరీ న్యూమరాలజిస్ట్ లు , వాస్తు శాస్త్ర నిపుణులు, చివరాఖరికి రోడ్డుపక్క చిలక జోస్యం చెప్పేవాడిని కూడా స్టూడియో కి తీసుకొచ్చి క్రీడల దగ్గరనుంచి రాజకీయాలవరకు విశ్లేషిస్తుంటే ఛీ... మన జీవితం అనిపిస్తోంది. ఇక ఆ సోకాల్డ్ నిపుణులు చెప్పేవి కూడా భలే వెరైటీగా ఉంటాయిలెండి సైనా నెహ్వాల్ ఇన్ని టోర్నమెంట్లు వరుసగా గెలవడానికి కారణం ఆమె హార్డ్ వర్క్ కాక వాళ్ళింటి ఈశాన్యం వైపు గోడ కాస్త ఎత్తు పెంచినందుకు అని చెప్తారు, అసలు సచిన్ ఇంత మంచి ప్లేయర్ అవడానికి కారణం అతని పేరులో "టి" అనే అక్షరం ఉండడం వలెనే అని (వీళ్ళ మొహం టెండూల్కర్ అనేది వాళ్ళ ఇంటిపేరు అని వీళ్ళకి తెలిసినట్టు ఉండదు), సోనియా జాతకం లో ప్రధాని పదవి లేదని అందుకు కారణం ఆమె పేరులో "ఆర్" అనే అక్షరం లేదని (అందుకు సాక్ష్యంగా ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరి పేర్లలో "ఆర్" ఉందని ఉదాహరణలు చూపిస్తారు ...మన్మోహన్ సింగ్ విషయం లో ఇది ఎందుకు పనిచేయలేదో...ఏమో బహుశా డాక్టర్ లో "ఆర్" ఉంది కదా అంటారేమో) ఇలా తిక్క తిక్క వాదనలు, దానికోసం గంటలు గంటలు చర్చలు.  ఇవన్నీ  చూసాక ఇకనుంచి న్యూస్ చానల్స్ లో సోది చెప్పుకునేవాళ్ళు, చిలకజోస్యం వాళ్ళు, బల్లిశాస్త్రం తెలిసినవాళ్ళు, పుట్టుమచ్చలు-వాటి ఫలితాలు  చెప్పేవారు , న్యూమరాలజిస్ట్ లు ఇలాంటి వాళ్ళే ఫుల్ టైం  రిపోర్టర్లుగా, విశ్లేషకులుగా వచ్చేసినా ఆశ్చర్యం లేదు. 

Wednesday, July 7, 2010

శిలలపై శిల్పాలు చెక్కినారు....పేరడీ - లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో

ఈ వేళ చిలమకూరి విజయమోహన్ గారి లీలా మోహనం బ్లాగులో ఈ పాటకు ఆయన రాసిన పేరడీ చదివాను. సరే ఆయన భావాలకే నాదయిన టచ్ ఇద్దామనిపించింది అందుకే పతనమవుతున్న విలువలపై నా బ్లాగులో మరొక పేరడీ. పాట మీకు తెలిసినా ఇక్కడ లింక్ ఇస్తున్నాను మరొక సారి వింటూ ఆ ట్యూన్ తో పాటు ఈ పదాలు చదువుకోండి. మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి.


అహో ఆంధ్ర/ రాయలసీమ/ తెలంగాణా భోజా*
శ్రీ కృష్ణ దేవరాయా
తెలుగుజాతి ఘనకీర్తి నిర్మాణ తేజో విరాజా
ఈ రాష్ట్ర దుస్థితికి సాక్ష్యంగ నిలిచావయా

విలువలే తుంగలో తొక్కినారు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

అవినీతి ఎరుగని వారికైనా
అవినీతి ఎరుగని వారికైనా
వలవేసి ఊబిలో లాగేటి రీతిగా 
విలువలే తుంగలో తొక్కినారు

ఒకవైపు   రాష్ట్రాన్ని దోచుకొను ఘనులు
ఒక ప్రక్క విసిగించు వేర్పాటు జోరు
ఒక చెంప పదవికై  వర్గ భేదాలు 
నరకమే అనిపించు రాష్ట్రానికొచ్చాము

ప్రగతి లేదని నీవు కలతపడవలదు 
ప్రగతి లేదని నీవు కలతపడవలదు 
ఈ స్థితిని ప్రగతిగా తలచుకొని ఏడు 

విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

ఏడు కొండలపైన వెంకన్న గుడిలోన
చోరచేష్టల తోటి పరువంత పోగా
రాతి దేవుళ్లకే చేతనత్వము కలిగి 
హరిహరీ ఖర్మంటు తలపట్టుకేడ్వగా

అమ్మజపమందుకుని చెత్త నాయకులు 
అమ్మజపమందుకుని చెత్త నాయకులు 
పదవి దక్కాలని మొక్కుకున్నారని 

విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

పదవులే పోయినా
అధికారమూడినా
కాలాలు మారినా
కాలమ్ము మూడినా
నేతలే దనుజులై మట్టిపాల్జేసినా 

చెదరని కదలని శిల్పాల వలెనె 
మనము  ఈ రాష్ట్రాన కష్టాల, నష్టాల బ్రతుకుతున్నాం బ్రదర్!!
నిజమురా సోదరా 

లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో 

*(ఎందుకొచ్చిన గొడవ! ఒట్టి "ఆంధ్ర భోజా" అనే అన్నానంటే ఏ వేర్పాటు వాదయినా నా బ్లాగు బ్లాక్ చెయ్యమన్నా అనగలరు. ఎవరి ఏరియాను బట్టి వాళ్ళు చదువుకోండి.)

పన్లోపని నా పాత పోస్టుల్లోని పేరడీ పాటలపై కూడా ఓ లుక్కేయండి.  
రింగారింగా పాటకు  పేరడీ           http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_333.html
నిదురించే తోటలోకి పాటకు పేరడీ  http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html
మాయా బజార్ లో తెలంగాణా మాయా శశి రేఖ  - అహ నా పెళ్ళంట పాట పేరడీ 
http://blogavadgeetha.blogspot.com/2010/01/blog-post_12.html
మహాకవుల తెలంగాణం - ఒక పేరడీ ప్రయత్నం 
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_9543.html

Saturday, June 26, 2010

పక్క పక్క పట్టాలపై రైలు, లారీ.....వారెవ్వా! మన రైల్వే స్టైలే వేరు

త్రివేండ్రం వెళ్తుంటే కొచ్చిన్ దాటిన తరువాత అనుకోకుండా కనిపించిన దృశ్యమిది. డోర్ దగ్గర నిలబడి ఉన్న నాకు లోపలి వెళ్లి కెమెరా తీసుకొచ్చే టైం లేకపోవడం వలన మొబైల్ లోనే క్లిక్ అనిపించా. ఇలాంటిది నేను ముందెప్పుడూ చూడలేదు కాబట్టి వెరైటీ గా అనిపించి మీతో పంచుకుందామని పోస్ట్ చేస్తున్నా. ఎలా ఉందో కుసింత చెప్పండి. 






















Friday, June 25, 2010

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం

(ఏదో ఒక సారి రెండు సార్లు ధరలు పెంచితే స్పందించి పోస్ట్ రాస్తాం కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంటే ఎన్ని పోస్టులని మాత్రం రాస్తాం చెప్పండి? ఇప్పుడు గ్యాస్, డీజిల్ ధరలు పెంచి 'జనాలు భరించగలరు' అన్న మంత్రిగారి ఉవాచ చూసి ఈ మాట ఎక్కడో విన్నానే అని పాత పోస్టులు తిరగేస్తే ఇదిగో ఈ పోస్ట్ కనిపించింది. చిత్రంగా ఈ పోస్ట్ గత ఏడాది ఇదే రోజు రాసినది. అప్పటికీ ఇప్పటికీ పెట్రోలియం శాఖా మంత్రి మారారు గానీ వాళ్ళు చెప్పే మాట మారకపోవడం విచిత్రం. అవును మరి మన మంత్రులంతా ఒకే మాట మీద ఉండటం మన ప్రజాస్వామ్యానికి గౌరవం కాదూ. వాళ్ళే మాట మార్చనప్పుడు నేను మాత్రం కొత్త పోస్ట్ ఎందుకు రాయాలని అదే పోస్ట్ మళ్ళీ మీకోసం రీపోస్ట్ చేస్తున్నా:)))). ఈ సారి ఈ పోస్ట్ లో పెట్రోల్ బదులు గ్యాస్ అని మార్చి చదువుకోండి అంతే. )


"ప్రజలు భరించగలిగే స్థాయిలోనే పెట్రో ధరలు పెంచాం" - కేంద్రం 


టివి లో ఈ స్టేట్మెంట్ చూసి బోల్డంత హాశ్చర్యం వేసేసింది. అసలు ప్రజలు ఎంతవరకూ భరించగలరో వీళ్ళకి ఎలా తెలుసా అని? తరవాత గుర్తొచ్చింది మన దేశం లో ఏ విషయాన్నయినా, ఎంతవరకయినా భరించడమే తప్ప అదేంటని ప్రశ్నించడం మనకెప్పుడూ అలవాటు లేదని. నిజమే స్వాతంత్రం వచ్చినదగ్గరనుంచీ చాలా నేర్చుకున్న మనం ఒక్క ప్రశ్నించడాన్నే మర్చిపోయాం. మనం ఎన్నుకున్న నాయకులు తాము చేసిన వాగ్దానాలు మరచి సొంత లాభం కోసం అడ్డమయిన గడ్డీ కరుస్తుంటే మౌనంగా భరిస్తాం. మన ఖర్మ అని సరిపెట్టుకుంటాం. అవును మరి అందరూ దొంగలే అయినప్పుడు వాడికన్నా వీడు కాస్త మంచి దొంగ అని సరిపెట్టుకోవాల్సిందే కదా! 

సరే ఇంక పెట్రోలు విషయానికి వస్తే...చమురు ధరలపై నియంత్రణ ఎత్తేశాం అని కేంద్రం ఘనంగా ప్రకటించింది, అక్కడికేదో ఇప్పుడు అన్నిటి మీదా నియంత్రణ ఉన్నట్టు. జనం జేబుకు చిల్లు పడ్డా పర్లేదు కానీ చమురు కంపెనీలు మాత్రం చల్లగుండాలి ఇదీ మన కేంద్ర విధానం. పైగా నియంత్రణ ఎత్తేస్తే అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు పెట్రోలు రేట్లు పెరగచ్చు కనక కానీ రేట్లు తగ్గితే పెట్రోలు రేట్లు మంచినీళ్ళ కన్నా చీప్ అయిపోతాయి( మన ఖర్మ చివరికి నీళ్ళు కూడా కొనుక్కోవలసి వస్తోంది), ఎక్కువమంది పెట్టుబడి దారులు ఈ రంగం లోకి వచ్చి పోటీ పెరిగి ధరలు తగ్గిపోతాయి అని ఒక వింత వాదన. అందుకు టెలికం రంగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు  అమ్మగారి అడుగులకు మడుగులోత్తే అమాయక నేతలు. సాంకేతికత తో ముడిపడ్డ రంగానికి, సహజ వనరులతో ముడిపడ్డ రంగానికి సామ్యం తేవడం వీరికే చెల్లింది. అసలు చమురు కంపెనీల మీద వడ్డిస్తున్న పన్నులను తగ్గిస్తే ఆటోమేటిక్ గా చమురు ధరలూ తగ్గుతాయిగా...అమ్మమ్మ ఎంత మాట? అలాంటి వాటిమీద పన్నులు పెంచడమే తప్ప తగ్గించడం అనేదే అసలు అనకూడని, వినకూడని మాట. అయినా ఎంత పెంచినా అన్నీ మూస్కుని భరించడానికి జనం ఉండగా పన్నులు తగ్గించి మన ఖజానా బరువెందుకు తగ్గించుకోవాలని పాపం వాళ్ళ ఆలోచన. అదీ నిజమే లెండి భరించడం మన జన్మ హక్కు మరి. అసలు నేతలు ఏం చేసినా జనాలు భరిస్తారు కాబట్టే  మన దేశాన్ని భరత ఖండం అన్నారేమో :) 

ఇక మొదలవుతుంది అసలు కధ, ఒక్క పెట్రోలు, డీజిల్ రేట్లతోనే ఈ కధ ఆగుతుందా? నిత్యావసరాల దగ్గర నుంచీ ప్రతీ వస్తువు ధారా ఈ సాకుతో అమాంతం పెరిగిపోతుంది. అయినా మనం చిరునవ్వులు చిందిద్దాం. 

పెంచుతారు...భరిద్దాం: ముంచుతారు...తరిద్దాం 

Tuesday, June 22, 2010

నాతో పాటు అదే రోజు పుట్టిన వాళ్ళు .......ఉంటే స్పందించండి

ఈ పోస్ట్ నేను గత సంవత్సరం పోస్ట్ చేశా. నిరాశే మిగిలింది. సరే ఈ ఏడాదిలో ఎంతో మంది కొత్త బ్లాగర్లు వచ్చి ఉంటారు. వాళ్ళలో ఒక్కరైనా ఉండకపోరా అన్న చిన్న ఆశతో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. 

నేను 1977 మార్చి 14  న కాకినాడలో పుట్టాను. నాకో చిన్న కోరిక ..... నాలాగే అదేసంవత్సరం, అదే  రోజు పుట్టినవాళ్ళని (అంటే బర్త్ డే మేట్స్ అన్నమాట) ఎప్పటికయినా  కలుసుకోవాలని.  ఖచ్చితం గా అదే రోజు చాలా మంది ..అందులో కొంతమందయినా  తెలుగు వాళ్ళు పుట్టి ఉంటారు...అందులో మావూరి వాళ్ళు ఉన్నాలేకపోయినా ..కనీసం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు కొంతమందయినా ఉంటారు. వాళ్ళలో ఒక్కరికయినా బ్లాగింగ్ అలవాటు ఉండదా అన్న ఆశతో ఈ పోస్ట్ చేస్తున్నా. ఉంటే కనుక రిప్లై ఇవ్వండి. మనందరం కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుందాం :). ఎంత కాదనుకున్నా ఒకే రోజు ఈ భూమ్మీదకొచ్చాం కదా! 



Saturday, June 12, 2010

"సాయంత్రం సినిమాకెళ్దాం"

మొన్న వేదం సినిమాకి ప్రసాద్స్ లో టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేస్తుంటే నాకెందుకో చిన్నప్పుడు సినిమా అంటే ఇంట్లో జరిగే తంతు గుర్తొచ్చింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అన్నమాట........ 

"సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం, నాన్నగారు ఆఫీస్ నుంచి, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికే మీ హోం వర్క్ లు పూర్తి చేసేసుకుని ఉండండి" పొద్దున్నే మా అమ్మగారి ఆర్డర్ లాంటి ఇన్ఫర్మేషన్ తో మాలో ఎక్సైట్మెంట్ మొదలయ్యేది. స్కూల్లో అడిగిన వాడికి, అడగని వాడికి అందరికీ "మేము ఈ వేళ సినిమాకి వెళ్తున్నామోచ్" అని సగర్వంగా చాటింపు వేసుకుని, స్కూల్ అవగానే ఇంటికోస్తూ దార్లో గోడల మీద ఉన్న వాల్ పోస్టర్ల లోంచి కృష్ణ, ఎన్టీఆర్ ల సినిమా పోస్టర్లను ఆప్యాయంగా చూస్తూ వీటిలో ఏదో ఒకదానికి మేము ఈ వేళ వెళ్లబోతున్నాము అని గర్వంగా పక్కన నడిచే ఫ్రెండ్ గాడికి చెప్తూ వాడి  అసూయతో కూడిన చూపును ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చి గబా గబా హోమ్ వర్క్ చేసేసుకునేవాళ్ళం. ఇంతలో మా అమ్మగారు కూడా స్కూల్ నుంచి రావడంతో మా చాయిస్ ల పర్వం మొదలయ్యేది. "అమ్మా కృష్ణ/ ఎన్టీఆర్ సినిమాకి వెళ్దాము...ప్లీజ్ ...అని గారంగా మారం చేసేవాళ్ళం" (అవును మరి అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్ లకే ఫైటింగ్ లు అవీ వచ్చు, శోభన్ బాబు కాస్త పరవాలేదు, నాగేశ్వరరావు మాత్రం వేస్ట్ ఫెలో ..అస్సలు ఫైటింగ్ లు రావు...ఇదీ మా గాఢమైన అభిప్రాయం). ఇంట్లో మా పేరెంట్స్ తొక్కలో ఏ నాగేశ్వరరావు స్టొరీ సినిమాకో ఓటు వేసేవారు (అప్పుడు మాత్రం చెప్పొద్దూ...ఉదయకిరణ్ స్టైల్ లో "ఈ పెద్దోల్లున్నారే వీళ్ళకసలు టేస్టే లేదు..ఫైటింగ్ లు లేని సినిమాలు చూస్తామంటారేంటో అని మా చెడ్డ ఖోపం వచ్చేసేది). ఇహ చూస్కోండి ఎప్పుడూ అధికార, విపక్షాల్లా కొట్టుకునే నేను, మా తమ్ముడు ఈ ఒక్క విషయం లో మాత్రం  ఏకాభిప్రాయానికి వచ్చేసి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తపరిచేవాళ్ళం. మొత్తం మీద మా బాధ పడలేక మా సెలక్షన్ కే ఒప్పుకునేవాళ్ళు. వెళ్లి రిక్షాని పిలుచుకు రమ్మనే వారు. 

ఇక రిక్షాకి  టాప్ తీయిన్చేసి ఎలక్షన్ లో భారీ మెజార్టీ తో గెలిచిన ఎమ్మెల్యే ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగినట్టు నిలబడి రోడ్డు మీద మా ఫ్రెండ్స్ ఎవరయినా కనిపిస్తే ఊరంతా వినిపించేటట్టు ..."ఒరేయ్ మేం సినిమాకి వెళ్తున్నాం"..అంటూ అరవడం, ఆ వెనుకే కూర్చుని ఉన్న మా నాన్నగారు నా రెక్కపట్టి అరచింది చాలు పడతావు కూర్చో అంటూ మా అమ్మగారి వాళ్ళో నన్ను కూలేయడం జరిగేవి. రిక్షా జగన్నాధపురం వంతెన దాటి సినిమాహాల్ స్ట్రీట్ లో ప్రవేశించింది మొదలు (సినిమాహాల్ స్ట్రీట్  అంటే మా కాకినాడ వాళ్లకి అర్ధమై పోతుంది...మిగిలిన వాళ్ళ కోసం మా ఊళ్ళో సినిమా హాల్స్ అన్నీ ఒకే స్ట్రీట్ లో ఉంటాయి..దాన్ని సినిమాహాల్ స్ట్రీట్ అంటారు). అటూ ఇటూ ఉన్న థియేటర్స్ లో ఉన్న సినిమా పోస్టర్లు చూసుకుంటూ (అవన్నీ ఎప్పుడు చూస్తానో అని మనసులో అనుకుంటూ) మొత్తం మీద హాలు కి చేరేవాళ్ళం. అక్కడ లైన్ ని బట్టి మా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లి టికెట్స్ తీసుకునే వాళ్ళు. లోపలి వెళ్తే ఇంకా డోర్ తీయడు కాబట్టి బయటే కాసేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. అక్కడున్న కూల్ డ్రింకులు, పాప్ కార్న్ చూడగానే నాకు, మా తమ్ముడికి ఒక్కసారిగా దాహం, ఆకలి గుర్తొచ్చేవి. "అమ్మా దాహం వేస్తోంది...కూల్ డ్రింక్ తాగుతా" రిక్వెస్ట్ లాంటి కన్ఫర్మేషన్. "ఇప్పుడు తాగితే మళ్ళీ ఇంటర్వెల్ లో ఉండదు మరి" మా అమ్మగారి చిన్న బెదిరింపు. అప్పుడు సంగతి అప్పుడు చూస్కుందాం లే అని ఓ.కే. అనేవాళ్ళం.  కూల్ డ్రింక్ తీసుకుని రెండు సిప్ లు తాగుతామో లేదో హాల్ లోపలికి రావచ్చంటూ బెల్లు మోగేది. ఆదరాబాదరాగా ఆ డ్రింక్ సీసాను పట్టుకుని స్వాగతం స్లైడ్ నుంచీ ఎక్కడ మిస్సయిపోతామో అని లోపలి వెళ్ళిపోదామని గోల మొదలు పెట్టేవాళ్ళం. 

లోపలకి వెళ్లినప్పటినుంచీ  "అమ్మ ఇంకా సినిమా రావట్లేదేంటి? ఎప్పుడు వేస్తారు? ఇంకా ఎంత టైం పడుతుంది? కృష్ణ ఆ తెల్లగోడ (స్క్రీన్) వెనక్కాల రెడీ అవుతున్నాడా? ఇలాంటి యక్ష ప్రశ్నలతో మా నాన్నగారు నోర్మూసుకుని కూర్చోండి అని మమ్మల్ని గట్టిగా కసిరే దాకా అడిగే వాళ్ళం. ఇంతలో స్క్రీన్ మీద "స్వాగతం" అన్న స్లైడ్ పడగానే ఒక్కసారిగా నోర్మూసుకుని స్క్రీన్ కి అంకితం అయిపోయేవాళ్ళం. సినిమా మొదలు.

ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్స్ తీసుకొస్తానని బయటి కొచ్చే మా నాన్నగారితో పాటు నేను వస్తానని నేను, నేను కూడా అంటూ మా తమ్ముడు నడిచేవాళ్ళం. బయట సమోసాలు, పాప్ కార్న్, పకోడీలు (ఇవి ఆలూ బొండాల సైజు లో ఉండేవి...భలే టేస్టీగా ఉండేవి లెండి), ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ ఇలా అన్నిటినీ చూస్తూ  వివాహ భోజనంబు పాటలో ఎస్వీఆర్ లా ఫీలయిపోయి చివరికి ఐస్ క్రీం, పాప్ కార్న్ కొనిపించుకుని  లోపలికి వచ్చేవాళ్ళం. తీరా చూస్తే ఇంకా "ముందు సీట్ల పై కాళ్ళు పెట్టరాదు" స్లైడ్ కూడా పడేది కాదు. సినిమా స్టార్ట్ అయితేనే ఐస్ క్రీం తినడం స్టార్ట్ చెయ్యాలన్నది మా ఆలోచన. ఒక పక్క ఐస్ క్రీం కరిగిపోతూ ఉంటుంది...అవతల సినిమా ఇంకా స్టార్ట్ చెయ్యడు..(దేవుడా బాలకృష్ణ కి కూడా ఇన్ని కష్టాలు రాకూడదు). ఎలాగైతేనేం సినిమా స్టార్ట్ అవడం పాపం ముందు ఐస్ క్రీం తినేసి ఆ తరువాత పాప్ కార్న్ అవగొట్టి, ఫైటింగ్ సీన్లలో కృష్ణ కొట్టలేక పోతే మేం వెళ్లి హెల్ప్ చేద్దాం అన్నంత ఉత్సాహంతో కుర్చీ సీట్  కి కొద్దిగా ఉన్న చిరుగులోంచి స్పాంజ్ లాగుతూ సినిమా లో లీనమయ్యే వాళ్ళం. పెద్ద ఫైటింగ్ అయిపోయాక పోలీసులు కనిపించగానే ఇంక సినిమా అయిపోబోతోందన్న విషయం "శుభం" కార్డు పడకుండానే అందరికీ అర్ధమై పోయి ఎలా నిలబడ్డారబ్బా అని బోల్డంత హాశ్చర్యపోయి బయటకి వచ్చేవాళ్ళం.

ఇంటికి వచ్చి భోజనం చేసాక నిద్ర పోయే టైం లో సినిమాని మళ్ళీ మనసులో ఒకసారి "నెమరేసి", రేపు స్కూల్లో చెప్పాలి అనుకుంటూ చాలా హ్యాపీ గా నిద్రపోయేవాళ్ళం. 

అదండీ ఫ్లాష్ బ్యాక్...ఇప్పుడు అదేం లేదు. టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని పావుగంట ముందు థియేటర్ కి వెళ్లి, ఏ క్లైంట్ ఎప్పుడు ఫోన్ చేస్తాడో, అనుకుంటూ సగం మనసు మొబైల్ మీద ఉంచి, ఏదో వచ్చామా, చూసామా అనే తప్ప మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసి ఎన్నేళ్ళయిందో....:(