మీలో ఎవరికయినా ఈ సినిమా పేరు తెలుసా? ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? సరే జరిగిందేంటో చెప్తా వినండి...సారీ చదవండి!!
వృత్తి రీత్యా నేనొక కాపీ రైటర్ ని (అంటే కాపీ కొట్టి రాసే వాడు అని మాత్రం అనుకోవద్దని మనవి...అడ్వర్టైజింగ్ లో కాపీ రైటర్ అన్నమాట). మొన్నామధ్య నా ఖర్మ కాలి ఊళ్ళో లేని సందర్భంలో మా క్లైంట్ అయిన vodafone క్రొత్త కాలర్ ట్యూన్ లకి ఒక పోస్టర్ చేయవలసి వచ్చింది. ఎలాగూ సినిమాల పేర్లు, పాటల పేర్లు వాళ్ళే ఇస్తారు కాబట్టి నేను చేసేదేమీ ఉండదు అందులో. దాన్ని తెలుగులోకి కూడా ట్రాన్సిలేషన్ చేసుకుని డిజైనర్ కి ఇచ్చేస్తే చాలు. నేను ఊళ్ళో లేకపోవడంతో మా డేటా ఎంట్రీ ఆపరేటరే ట్రాన్సిలేషన్ ట్రై చేద్దామని ప్రయత్నం చేసాడు. ఎలాగూ ఫోనెటిక్ లో కొట్టేస్తే పదాలు వచ్చెస్తాయి కదా అని మా వాడి సరదా. క్లైంట్ పంపించిన ఫైల్ లో ఉన్న టెక్స్ట్ స్పేస్ లతో సహా ఫోనెటిక్ లో కొట్టేసాడు. ప్రూఫ్ చెక్ కోసం నాకు పాటలు, సినిమాల లిస్టు విడి విడి ఫైల్స్ గా మెయిల్ చేసాడు. సరే ఒక్కొక్కటీ చెక్ చేసుకుంటూ వస్తున్ననాకు ఒక సినిమా మాత్రం అర్ధం కాలేదు అదే "పాటల భాయి రవి". నాకు తెలిసి అలాంటి సినిమా ఏది లేదు, పోనీ ఏదయినా ప్రైవేటు ఆల్బం అనుకుందామా అంటే ఆ పేరు ఎప్పుడూ వినలేదు. పోనీ చింతకాయల రవి సినిమా కి వచ్చిన తిప్పలా అనుకుందామంటే మరీ ఇంత డిఫరెన్సు ఉండదాయే....
ఇంక ఇలాకాదని పాటల లిస్టు, సినిమాల లిస్టు పక్క పక్కన పెట్టుకుని పాటని బట్టి గుర్తు పట్టచ్చేమో ట్రై చేద్దాం అని ప్రయత్నించా. లిస్టు లో సంబంధిత నంబర్ దగ్గర పాట చూసాక నాకు అదేం సినిమాయో అర్ధం అయింది. క్లైంట్ టెక్స్ట్ justify చేసి పంపించడం వలన ఆ సినిమా పేరులో స్పేస్ లు రావడం వలన, అది పట్టించుకోకుండా మావాడు గుడ్డిగా టైపు చేసేయడం వలన జరిగిన పొరపాటు అని అర్ధం అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకెవరికయినా తట్టిందా? ఇదిగో అక్కడ ఇలా ఉంది.....
"PATALA BHAI RAVI"
....ఆ పాట " ప్రేమ కోసమై"
అలా "పాతాళ భైరవి" కాస్తా మావాడి చేతిలో పడి 'పాటల భాయి రవి' అయింది.
4 comments:
ayyo enni kashTalu vachayamDi
meedi sense of humar maki nachhindi
హ హ హ ...నవ్వి నవ్వి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. రాముని తోక పివరుండూ జోక్ గుర్తు వచ్చింది..
ha ha ha
;-)
Post a Comment