Sunday, January 30, 2011

మహాత్మా గాంధి రచనకు ఇళయరాజా స్వరకల్పన చేయగా పండిట్ భీమ్ సేన్ జోషి పాడిన పాట మరోసారి మీకోసం


నిజానికి ఇది గత సంవత్సరం జూన్ రెండవ తేదీన ఇళయరాజా పుట్టిన రోజు సందర్భం గా పెట్టిన పోస్ట్. అయితే ఈ మధ్యే దివంగతులైన పండిట్ భీమ్ సేన్ జోషి కి , మహాత్ముని వర్ధంతి సందర్భంగా వారిరువురికీ నివాళిగా మరోసారి పోస్ట్ చేస్తున్నా. అప్పట్లో బ్లాగ్ లో వీడియో ఎలా పెట్టాలో తెలియనందున కేవలం లింక్స్ మాత్రమే ఇచ్చా. ఇప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నా. 

దేశంలోని అతి కొద్ది మంది సంగీత మేధావులలో ఒకరైన ఇళయరాజా స్వరపరచిన మహాత్మాగాంధీ గీతం (రాసినది అచ్చంగా మహాత్ముడే) "నమ్రతా కే సాగర్" గీతాన్ని మీకోసం అందిస్తున్నాను. ఇది ఒక అరుదయిన కాంబినేషన్, మన ఆల్ ఇండియా రేడియో స్టైల్ లో చెప్పాలంటే 
రచన: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
సంగీతం: ఇళయరాజా
గానం: పండిట్ భీమ్ సేన్ జోషి 
వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్



ఈ పాటను డౌన్ లోడ్ చేసుకోడానికి ఈ లింక్ లను క్లిక్ చేయండి 




Thursday, January 27, 2011

నెట్ లో దొరికిన ఈ వీడియో చూసి మనసు చెమ్మగిల్లింది - నిజంగా ఈ ఐడియాకి హేట్సాఫ్

నెట్ లో దొరికిన ఈ వీడియో చూసి మనసు చెమ్మగిల్లింది. నిజంగా ఈ ఐడియా కి హేట్సాఫ్. దీన్ని వెంటనే మీ అందరితో పంచుకోవాలనిపించి పోస్ట్ చేసేస్తున్నా. 


బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉండి ఈ వీడియో చూడలేని కొందరు బ్లాగ్మిత్రుల కోరిక మేరకు ఈ వీడియో ర్యాపిడ్ షేర్ లో అప్ లోడ్ చేసి ఆ లింక్ జత చేస్తున్నా. 
http://rapidshare.com/files/444925201/The_Silent_Indian_National_Anthem.mp4

Tuesday, January 25, 2011

ఏం చూసి ఇస్తారు "పద్మ" అవార్డులు ?....నాకసలు నచ్చలేదంతే



"పద్మ శ్రీ", "పద్మ భూషణ్" , "పద్మ విభూషణ్" అసలు ఈ అవార్డులకు కొలమానం ఏంటి? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనర్హులు అని నా అభిప్రాయం కాదు. అయితే ఎప్పుడో రావలసిన అర్హులకు ఇప్పటికీ రాలేదనేదే నా బాధ. నేను చెప్పేది ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే "బాపు- రమణ"ల గురించి. ఏం ఒక కార్టూనిస్ట్ గా, దర్శకునిగా బాపు, ఒక రచయితగా రమణ కున్న ఖ్యాతి తక్కువదా? ఏం వాళ్ళు వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు కారా? 

మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు దిగ్గజాలకి ఏ మాత్రం గౌరవం ఇస్తోందో దీన్ని బట్టే అర్ధమవుతోంది. ఏది ఏమయినా బాపు రమణ లకి "పద్మ" అవార్డులు రాకపోవడం నాకు అస్సలు నచ్చలేదు. 

Friday, January 14, 2011

నవ్వించినందుకు థాంక్స్ మాస్టారూ!!!! - నేడు జంధ్యాల జయంతి


ఈ రోజు జంధ్యాల జయంతి. తెలుగు సినిమాలో నెలవంక, ఆనంద భైరవి, ముద్ద మందారం లాంటి సినిమాలు తీసినప్పటికీ జంధ్యాల సినిమా అంటే మనకి చటుక్కున గుర్తొచ్చేవి మాత్రం అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు,బావా బావా పన్నీరు, హై హై నాయకా  లాంటివే. ఆ సినిమాలలో చిత్ర విచిత్రమైన తిట్లతో, అశ్లీలం లేని స్వచ్చమైన హాస్యంతో తెలుగువాళ్ళని  మనసారా నవ్వించిన ఆ మహా దర్శకునికి నివాళి.

ఇక ఆయన స్ఫూర్తి తో ఆఫీసుల్లో బాసుల్ని, క్లైంట్లని, ఇరుగు పొరుగులలో మనకి నచ్చని వాళ్ళని తిట్టుకోడానికి కొన్ని తింగరి తిట్లు. నచ్చితే మీ వాటాగా మీరూ జత చేయండి వీటికి.  (ఈ పోస్టులో ఏ  ఒక్క తిట్టుతోనూ నన్ను మాత్రం తిట్టకూడదనేది మాత్రం పరమ స్ట్రిక్ట్ రూల్)

౧. కోడిగుడ్డు కి హెయిర్ వీవింగ్ చేయించే వాడి మొహంలా ఆ మొహం చూడు 
౨. ఊర కుక్కకి పళ్ళు తోమే వాడిలా ఆ చూపెంట్రా?
౩. దిష్టి తీసిన నిమ్మకాయలేరుకుని లెమన్ టీ చేసుకు తాగే పింజారీ కుంకా 
౪. ఆర్టీసీ బస్సు వాడిని లిఫ్ట్ అడిగేవాడి మొహం 
౫. బంగాళా ఖాతం లో పూడిక తీసేవాడి మొహం 
౬ మూగ కుక్కలా పిచ్చి చూపులు చూస్తావేరా తిక్క వెధవా
౭. అప్పడం నానబెట్టుకు తినే అంట్ల వెధవా
౮. ఫోటో స్టూడియో వాడికి ఎక్స్ రే ఇచ్చి డెవలప్ చేయమని అడిగే దిక్కుమాలిన వెధవా
౯.  మంగలి షాప్ లో బొచ్చు కొట్టేసే వాడిలా ఆ మొహం చూడు 
౧౦. జలుబు చేసిందని ఐస్ క్రీం వేడి చేసుకుని తినే తింగరి వెధవా 
౧౧.  టీవీలో యాంకర్ ని చూసి కన్ను కొట్టి సిగ్గుపడే పిచ్చి నా పుత్రా
౧౨.   ముళ్ళపొదల్లో గాలిపటాలు ఎగరేసే వాడిలా ఆ చూపెంట్రా చింపాంజీ సుతా
౧౩.  తెగిపోయిన బల్లి తోక మొహం నువ్వూనూ
౧౪. ఎడ్ల బండికి పంక్చర్లు వేసేవాడిలా ఆ మొహం చూడు 
౧౫.  పానీ పూరి లో కొబ్బరి నీళ్ళు పోసుకుని తినేవాడి మొహం నువ్వూను  

పరమ వీర చక్ర మొదటి రెండు రోజుల కలెక్షన్ - అన్ బిలీవబుల్ అసలు - కేకో కేక

పరమ వీర చక్ర మొదటి రెండు రోజుల కలెక్షన్  - అన్ బిలీవబుల్ అసలు - కేకో కేక 

ఈ రోజు ఉదయాన్నే నాకొచ్చిన ఒక sms  యధాతధం గా మీకోసం. 

"1st 2 days Collections of ‘Parama Veera Chakra’ 
Yashoda- 19 Lkhs
NIMS- 23 Lkhs
KIMS- 23.4 Lkhs
7 Hills- 25 Lkhs
APOLLO- 56 Lkhs
Care- 58 Lkhs
Lazarus- 62 Lakhs
Rajiv Arogya Sri- Nrly 3 Cr."

Tuesday, January 11, 2011

గుత్తావకాయ కూర



"ఇల్లు నీట్ గా ఉంచండి. తమ్ముడు-నువ్వు కొట్టుకోకండి, టైం కి భోజనం చేయండి, కుక్కర్ మూడు విజిల్స్ వస్తే కట్టేయి..టీవీ చూస్తూనో..ఏదో పుస్తకం చదువుతూనో పరధ్యానం తో మర్చిపోకు, రోజు రాత్రి గ్యాస్ కట్టేసి ఉందో లేదో చూసి మరీ పడుకో,  డబ్బులు నాన్నగారు ఫ్రిజ్ కింద కవర్ లో పెట్టారు..అన్ని కూరలూ ఒకే సారి తేవద్దు, రెండ్రోజుల కొకసారి తెచ్చుకోండి, తెచ్చిన వెంటనే  ఫ్రిజ్ లో పెట్టు, సంచీలో వదిలేస్తే పాడయిపోతాయి" ఇలా మా అమ్మ చెప్తూ పోతోంది. అప్పటికి నేను సెవెంత్ క్లాస్, అంత పెద్దాడిని అయిపోయాక కూడా ఊరెళ్ళే ముందు ఇన్ని జాగ్రత్తలు చెప్తూంటే విసుగొచ్చేసింది. ఫస్ట్ టైం మా పేరెంట్స్ వారం రోజులు మమ్మల్ని వదిలేసి ఊరు వెళ్తున్నారు మరి, ఈ వారం మా ఇంటి సామ్రాజ్యం నా ఆధీనం లో ఉండబోతోంది. నా మహామంత్రి (అదే నా తమ్ముడు) చచ్చినట్టు నా మాట విని తీరాల్సిందే, నేను ఏం వండితే అది వంకలు పెట్టకుండా నోర్మూసుకు తినాల్సిందే. 

"అబ్బ చాలమ్మా ఇప్పటికే లక్ష సార్లు చెప్పావు. నేను చూసుకుంటా కదా. అన్నీ నాకే చెప్తావేం,వాడికి కూడా చెప్పు (మా తమ్ముడికి) నేను చెప్పినట్టు వినమని" విసుక్కున్నాను. ఇంతలో మా నాన్నగారు రిక్షా తీసుకు రావడం తో మా అమ్మ క్లాస్ ముగించక తప్పలేదు. మా నాన్నగారు పిలిచి ఫ్రిజ్ కింద కవర్లో ఉంచిన డబ్బుల గురించి ఇంకోసారి చెప్పి ఎందుకైనా మంచిది ఈ చిల్లర కూడా ఉంచు అంటూ రెండు పది నోట్లు నా చేతికిచ్చారు. (దాన్ని ఇల్లు మెయింటెయిన్ చేయబోతున్నందుకు నా ఫీజుగా మనసులోనే జమేసేసాలెండి). వాళ్ళ రిక్షా అలా బయల్దేరడమేంటి పక్కనే నిలబడ్డ మా తమ్ముడి కేసి గర్వంగా "ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నేను చెప్పినట్టు వినాల్సిందే తెలిసిందా"  అన్నట్టు చూశా. 

పొద్దున్న వెళ్ళేటప్పుడు మా అమ్మ వంట చేసేసి వెళ్ళడం వలన ఆ పూటకి వంట చేయాల్సిన అవసరం రాలేదు. అప్పట్లో నాకు కుక్కర్ పెట్టడం వచ్చు, బంగాళాదుంప , అరటికాయ వేపుళ్ళు మార్చి మార్చి ఎన్నేళ్ళయినా చేసేయగలనులెండి. రాత్రి వంట చేయడం మొదలుపెడుతూ ప్రజాభిప్రాయం అడిగే మహారాజులా మా తమ్ముడ్ని అరటికాయ చేయమంటావా? బంగాళా దుంప చేయమంటావా? (పెద్ద చాయిస్ మరి) అనడిగా. వాడి సమాధానంతో ఆలూ ఫ్రై కానిచ్చేసా. ఆ మర్నాడు పొద్దున్న ఆటోమేటిక్ గా అరటికాయ, రాత్రి బంగాళాదుంప ఇలా ఆల్టర్నేటివ్ గా ఒక మూడురోజులయ్యాయి. 

నాల్గో రోజు పొద్దున్న యాజిటీజ్గా అరటికాయలు కోద్దామని రెడీ అవుతూంటే అప్పటికే అవంటే విసుగెత్తిన మా తమ్ముడు "ఛీ..మళ్ళీ అరటికాయేనా" అనడంతో జాలేసి "పోన్లేరా ఆలూ చేస్తా" అని పెద్ద వరం ఇచ్చినవాడిలా చెప్పా. "అదీ వద్దు...మూడ్రోజుల నించి అవే మార్చి మార్చి చేస్తున్నావ్, నాకు ఇంకో కూరేదైనా చేయి" అంటూ నా గుండెల్లో రాయి పడేశాడు. నాకా ఆ రెండూ తప్ప ఇంకోటి రాదు. వీడు చూస్తే ఎట్టి పరిస్థితులలోనూ అవి తినేలా కనిపించడం లేదు. ఇక తప్పక సంచి తీసుకుని, సైకిల్ వేసుకుని మార్కెట్ కి వెళ్ళా. ఏం కొనాలి? కళ్ళు మూసుకుని అమ్మ చేసే వంటలన్నిటినీ రీలు తిప్పా. ఫ్రేం గుత్తొంకాయ కూర ముందు ఆగింది. వంకాయ పూర్తిగా నాలుగు ముక్కలుగా తెగిపోకుండా జాగ్రత్తగా కోయడం గుర్తొచ్చింది. పక్కనే ఉండి చూడటం వలన ఎలా కోయాలో తెలుసు కాబట్టి అదే చేద్దామని ఫిక్సయిపోయా. ఒక పావు కేజీ వంకాయలు కొనుక్కుని ఇంటికి వచ్చి స్టైల్ గా మా తమ్ముడితో "వెధవ ఏడుపూ నువ్వూను, చూడు నీ కోసం ఈ వేళ గుత్తొంకాయ కూర చేస్తా" అనగానే వాడు నాకేసి బాలకృష్ణ సినిమా వందో రోజు పోస్టర్ కేసి చూసినట్టు ఆశ్చ్యర్యం గా చూసి "గుత్తొంకాయ కూరా?" అని వాడి సంభ్రమాశ్చర్యానందాల్ని ప్రకటించేసాడు. అంతలోనే "నీకు చేయడం రాదు కదా" అనడంతో నా ఇగో దెబ్బతింది. "ఎవరు చెప్పారు నాకు రాదనీ, అమ్మ చేసేటప్పుడు బోల్డన్ని సార్లు దగ్గరుండి చూసా, గుత్తొంకాయ కూర చేయడం కూడా ఒక పనేనా" అని నల్లేరు మీద బండి నడక అన్న రేలంగి స్టైల్ లో ఓ డైలాగ్ విసిరేశా. ఇంతలో వాడి అంతరాత్మ లోపల్నించే ఓ మొట్టికాయ వేసి "వాడు ఎవర్రా? "అన్నయ్య", ఈ ప్రపంచంలో అన్నయ్యలకు తెలియని, వాళ్ళు చేయలేని పనులు ఉండవు, ఉండడానికి వీల్లేదంతే" అని చెప్పినట్టుంది, వాడు ఎప్పుడూ లేనిది "నేనేమయినా హెల్ప్ చేయనా?" అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు తమ్ముడి పట్ల నా బాధ్యత, వాడి మీద నాకున్న ప్రేమ విపరీతంగా పొంగిపోయి ఈ రోజు వీడికేలాగయినా అమ్మ కూడా చేయలేనంత బాగా గుత్తొంకాయ కూర చేసి పెట్టాల్సిందే అని డిసైడ్ అయిపోయా. "అక్కర్లేదు, నువ్వు అలా కూర్చొని హోమ్ వర్క్ కంప్లీట్  చేసుకుంటూ ఉండు, కుక్కర్ మూడో విజిల్ వేసే లోపలా కూర చేసేస్తా" అన్నా అదేదో సినిమాలో చిరంజీవి ఫైటింగ్ లో విలన్లని సవాల్ చేయడం గుర్తొచ్చి. 

అంతా రెడీ. వంకాయలు కోయడం మొదలు పెట్టా. ఎగ్జాక్ట్ గా అమ్మ ఎలా కోసేదో మైండ్ లో రివైండ్ చేసుకుని చూసుకుంటూ అలా కోసేయడంతో మా తమ్ముడికి నా మీద నమ్మకం విపరీతంగా పెరిగిపోయింది. మెంటల్ గా గుత్తొంకాయ కూర తినడానికి ప్రిపేర్ అయిపోయిన ఆనందం వాడి కళ్ళలో  కనిపించింది. "ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేయాలి" అన్నా. వాడి కళ్ళలో "వావ్" ఫీలింగ్. ఇంతలో నాకో చిన్న ధర్మ సందేహం వచ్చింది, "అవునూ.. అమ్మ ఇందులో ఏదో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ దట్టిస్తుంది కదా? అదేమయ్యుంటుంది? ఛ..ఛ..ఎప్పుడూ అమ్మ గుత్తొంకాయ కూర చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించకపోవడం వలన ఎంత పొరపాటు జరిగిపోయింది." అని పద్మవ్యూహం లోంచి బయటకి రావడం వినని అభిమన్యుడిలా తెగ ఫీలయిపోయాను. సరే వాడికేమయినా తెలుసేమో అని మా తమ్ముడిని అడిగితే వాడు ఒక్క సారిగా ఉలిక్కిపడి ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తరువాత ఇప్పడు ఎలా నడపాలి అని పైలట్ అడిగితే ఆ పాసింజర్ ఎలా చూస్తాడో అలా భయం భయం గా నాకేసి చూసి "నీకు తెలియదా? మరి పెద్ద తెలిసున్నట్టు మొదలెట్టావు?" అన్నాడు. అప్పటికే వాడి కళ్ళలో కలలు చెదిరిపోతున్న సూచనలు. పోనీ ఫోన్ చేసి అడగడానికి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, రెసిపీ చూడడానికి ఇంటర్నెట్ ఇంకా అప్పటికి రాలేదు మరి. పక్కింటి అత్తయ్యగారిని అడుగుదామంటే మా తమ్ముడి ముందు ఇమేజ్ చెడిపోతుందన్న భయం . నాకు ఉక్రోషం వచ్చేసింది. అందులోంచే ఆటోమేటిక్ గా తెగింపూ వచ్చేసింది. "నోర్మూసుకు కూర్చో, అసలు నువ్విక్కడ ఉండకు, నీ వాళ్ళ నా కాన్సంట్రేషన్ దెబ్బ తింటుంది, వెళ్లి టీవీ చూస్కో, ఈవేళ  నీకు గుత్తొంకాయ కూర చేసి తీరతానంతే" అని శపథం చేశా.  

శపధమైతే చేశా కానీ ఇంతకీ నా సమస్యకి పరిష్కారం మాత్రం దొరకలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక బ్రహ్మాండమయిన, అద్భుతమైన ఆలోచన వచ్చింది. అసలు అంత అద్భుతమయిన ఆలోచన వచ్చినందుకు నా భుజం నేనే తట్టుకుని వెంటనే అమలు చేద్దామని డిసైడయిపోయా. ఆవకాయ జాడీ మూత తీసి రెండు గరిటల ఆవకాయ చిన్న బౌల్ లోకి తీసుకున్నా. ఒక్కొక్క వంకాయలోకి ఆ ఆవకాయ కూర్చి మొత్తం మీద గుత్తొంకాయలు సిద్ధం చేశా. ఆ తరవాత ప్రొసీజర్ మనకి తెలిసిందే కదా. చక చకా వాటిని అప్పటికే విపరీతంగా మరుగుతున్న మూకుడులోని నూనెలో వేసేసి మూతపెట్టి యుద్ధం లో విజయం సాధించిన మహారాజులా హాల్లోకి వచ్చి మా తమ్ముడితో "రెడీగా ఉండు కాసేపట్లో గుత్తొంకాయ కూర తయారయిపోతుంది" అనగానే వాడు "గ్రైండర్ వేయలేదు? ఎలా చేసావ్?" అని వెధవ ప్రశ్నొకటి. అసలు సీక్రెట్ చెప్పకుండా "నోర్ముయ్, చెవిటి వెధవా, అంత సౌండ్ వచ్చింది... నీకు వినిపించాలేదా? అందుకే టీవీ అంత పెద్ద సౌండ్ తో చూడకూడదు" అని కసిరేసి కవర్ చేసేశా. 

కాసేపటికి (అంటే ఒక ఇరవై...ముప్ఫై నిమిషాల తర్వాత) వెళ్లి చూడగానే మూకుట్లో రెడ్, వైలెట్ కలిసి బ్లాక్ గా మారబోతున్న కలర్ లో ఒక పదార్ధం కనిపించింది. వంకాయలని గుర్తుపట్టి కూర రెడీ అయిపోయిందని డిసైడ్ అయిపోయా. అన్నీ రెడీ చేసి మా తమ్ముడిని పిలిచా. వాడు మొదట ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు జడ్జి తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఖైదీలా ఆత్రం గా చూసా. "ఎలా ఉంది?" అన్న నా ప్రశ్నకు ఒకట్రెండు చిత్ర విచిత్రమైన అర్ధం కాని ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి చివరికి "ఏమో... తెలియట్లేదు, తినేయచ్చులే" అన్నాడు.  

ఆ తర్వాత రెండ్రోజులకి ఇంటికి వచ్చిన మా అమ్మతో అన్నయ్య గుత్తొంకాయ కూర కూడా చేయగలడు తెల్సా...అని వాడు చెప్పడంతో అసలు నాకు రానే రాని రెసిపీని ఎలా చేసానో తెలుసుకుందామని నన్ను పిలిచి అడగడం తో అసలు రహస్యం చెప్పక తప్పలేదు. ఆ తర్వాత ఆ విషయాన్ని మా అమ్మ పక్కింటి అత్తయ్యగారికి, వాళ్ళ స్కూల్లో టీచర్లకి చివరాఖరికి ఇంటికి ఏ చుట్టాలోచ్చినా చెప్పడం, వాళ్ళు పడీపడీ నవ్వడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదంటే నచ్చలేదు. తెగ ఖోపం వచ్చేసేది. 

అదండీ నా వీర, భీభత్స గుత్తావకాయ రెసిపీ. మీరూ ఇంట్లో ట్రై చేసి చూడండి. అయితే దీని మీద పూర్తి పేటెంట్ హక్కులు కేవలం నాకు మాత్రమే ఉన్నాయన్నమాట.  


 



   





 





Sunday, January 9, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరాఖరి భాగం. సెంచరీ కొట్టేసానోచ్........... :)


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౭౬
పిజ్జా కి నా నిర్వచనం 
చాలా సింపుల్ 
అది ఇటలీ వాళ్ళ ఊతప్పం 

౭౭ 
చిన్నప్పటి నా ఫోటో
నేనేం కోల్పోయానో 
వెక్కిరిస్తున్నట్టు చెప్పింది 

౭౮ 
అవసరమైతే రాజీనామా
అడ్డమైన లీడరూ
ఈ మధ్య ఇదే డ్రామా

౭౯ 
చిన్నప్పుడు పెద్దవ్వాలని
పెద్దయ్యాక బాల్యమే బెటరని
మనిషికి ఎప్పుడూ ఏడుపే 

౮౦ 
కొత్త హీరోయిన్
ఒక్క సినిమాతో 
పది షోరూం ఓపెనింగులు 

౮౧ 
కన్వీనియంట్ గా మార్చుకునే
ఒకే ఒక పుస్తకం
భారత రాజ్యాంగం 

౮౨
భలే చిత్రం గా ఉంది
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" ఫ్యూచరిప్పుడు
ఒక "ఇటాలియన్" చేతిలో ఉండటం

౮౩ 
"తెలుగు తల్లి ఎవరు?"
ఈ మాటని కెసిఆర్ 
ఇంకేదయినా భాషలో చెప్పి ఉండాల్సింది 

౮౪ 
అదేం చిత్రమో 
శలవురోజులు మాత్రం 
త్వరగా గడిచిపోతాయి

౮౫ 
మా ఆవిడ 
"మా పుట్టింటి వాళ్ళని చూడాలనుంది" అంది
నేను జూకి తీసుకెళ్లా

౮౬ 
అవును నిజమే
ఉద్యమాల్లో నేతలే ముందుంటారు
పోరుకోసం కాదు, పేరు కోసం

౮౭ 
పదిమంది ఎంపీలు నిరసన తెలిపితే
కసబ్ ని కూడా
వదిలేస్తుందేమో ఈ ప్రభుత్వం 

౮౮ 
ఓటేసి ఐదేళ్లవుతోంది
మా వూరి రోడ్డు మాత్రం
ఇంకా అలానే ఉంది

౮౯ 
హైదరాబాద్ లో పదేళ్లుగా కలిసున్న నా మిత్రుడు 
అకస్మాత్తుగా
నన్ను "సీమాంధ్రుడు" అంటున్నాడు 

౯౦ 
సకుటుంబంగా సినిమాకెళ్లా
సహస్రం వదిలింది
తలనొప్పి మిగిలింది 

౯౧ 
అవినీతి 
ఇది కూడా దేవుడిలా 
సర్వాంతర్యామే!

౯౨
జలుబు చేస్తే హాస్పిటల్ కెళ్లా
ఒక్క రోజులో
ప్రపంచంలో ఉన్న టెస్టులు అన్నీ తెలిసాయి

౯౩
"ఉభయకుశలోపరి"
ఈ మాట మర్చిపోయి
అప్పుడే ఒక తరం అయిపోతోంది

౯౪ 
"ట్వింకిల్ ట్వింకిల్" మోజులో
"సరస్వతీ నమస్తుభ్యం"
వెలవెలబోతోంది 

౯౫
బేబీ సోప్ యాడ్ లో
బికినీ పాపెందుకో
నాకిప్పటికీ అర్ధం కాదు 

౯౬ 
2010 ప్రశాంతంగా గడిచిందట
చిదంబరం
టీవీ చూస్తున్నట్లు లేదు 

౯౭ 
కాలం కన్నా
గొప్ప యాంటిబయోటిక్ 
నాకు ఇంతవరకు దొరకలేదు

౯౮ 
అమ్మకానికి "మనుషులు"
నమ్మకపోతే 
ఐపిఎల్ వేలం చూడండి 

౯౯ 
నువ్వు నువ్వుగా ఉండటమే
నా దృష్టిలో 
బాల్యమంటే 

౧౦౦ 
ఈ పోస్ట్ వలన నాకో లాభం 
వంద వరకు
తెలుగు అంకెలు తెలిసాయి 



అయ్యబాబోయ్!!!!!! వంద హైకూలు (వీటిని నేను అలా అనేసుకునే రాసేశా) పూర్తయిపోయాయి. కామెంట్లతో ఇప్పటివరకు నన్ను ప్రోత్సాహించిన బ్లాగ్మిత్రులందరికీ ఇదే నా "వంద"నం. 

మొదటి ఐదు భాగాలు ఇదిగో ఇక్కడున్నాయి. 









 



 









నేడు నా ఫేవరేట్ సింగర్ మహేంద్రకపూర్ జయంతి - ఆయన రఫీ, ముఖేష్, కిషోర్ దా అంత ఫేమస్ కాకపోవచ్చు కానీ హిందీ సంగీతం లో ఆయనది తనదైన ముద్ర.



పాత హిందీ సింగర్స్ లో మీ అభిమాన గాయకుడు ఎవరంటే నూటికి తొంభై  మంది చెప్పే పేర్లలో మహేంద్ర కపూర్ పేరు ఉండక పోవచ్చు. నా అభిమాన గాయకుడు మాత్రం మహేంద్ర కపూరే. నా అల్ టైం ఫేవరెట్ సాంగ్ "చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బన్ జాయే హం దోనో" ఆయన గొంతులోనిదే. నాకు ఆయన గొంతులో నచ్చే విషయం ఆ వైవిధ్యం. ముఖ్యంగా "మేరె దేశ్ కి ధర్తీ" పాటలో, "ఫకీరా చల్" అనే పాటలో ఆయన పాడగలిగే పిచ్ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది."మేరె దేశ్ కి ధర్తీ"  పాటకి ఈయన ఉత్తమ గాయకుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ముఖ్యంగా నా అభిమాన సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ స్టైల్ అఫ్ మ్యూజిక్ కి ఈయన గొంతు భలే సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు.  

నా ఉద్దేశ్యం లో మహేంద్ర కపూర్ కి రావలసినంత పేరు రాకపోవడానికి  కారణం ఆయన రఫీ, కిషోర్, ముఖేష్ వంటి వాళ్ళలా సూపర్ స్టార్ లకి ఎక్కువగా పాడలేదు. ఎక్కువగా మనోజ్ కుమార్, సునీల్ దత్, బిస్వజిత్ లాంటి వాళ్లకి పాడారు. అలా అని ఈయన ఖాతాలో సూపర్ హిట్ సాంగ్స్ లేవా అంటే బోలెడున్నాయి. మొదటి పాట (రికార్డింగ్ జరుపుకున్న మొదటి పాట ఇది...రిలీజ్ అయిన మొదటి పాట నౌషాద్ సంగీతదర్శకత్వం లో సోనిమాహివాల్ అనే చిత్రంలోని "చాంద్ చుపా ఔర్ తారే డూబే") నవరంగ్ సినిమాలోని "ఆధా హై చంద్రమా" తో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేంద్ర కపూర్ పాడిన చాలా పాటలు మనం మనకి తెలియకుండానే పైన చెప్పిన గాయకుల ఖాతాలో వేసేసుంటాం. కొన్ని పాటలు ఒక్కోసారి వింటే వార్నీ, ఈ పాట పాడింది ఈయనా? అనిపిస్తుంది అని నా అభిప్రాయం. అన్నట్టు టివి మహాభారతం లో టైటిల్ సాంగ్ గుర్తుందా? ఆ పాట ఈయన పాడినదే. ఆ తరవాత ఎన్నో ప్రైవేట్ భక్తి గీతాలు పాడిన ఈయన కెరీర్ గ్రాఫ్, చూస్తే నాకు ఎందుకో మన తెలుగులో పి.బి.శ్రీనివాస్ గుర్తొస్తారు. టాలెంట్ ఉన్నా రావలసినంత గుర్తింపు ఇద్దరికీ రాలేదని నా ఫీలింగ్.

అలాంటి మహేంద్ర కపూర్ జయంతి (జనవరి 9) సందర్భంగా ఆయన పాడిన పాటల్లో నాకిష్టమయిన టాప్ టెన్ సాంగ్స్ లింక్స్ మీకోసం. కావాలనే ఈ పాటల వీడియో క్లిపింగ్స్ పెట్టట్లేదు అప్పుడు దృష్టి ఆ పాటలో నటించిన నటీనటుల మీదకు వెళ్లిపోతుందని నా బాధ. (అర్ధం చేసుకుంటారుగా :) )


Saturday, January 8, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరన్నర భాగం.......................వందయ్యేదాకా వదల బొమ్మాళీ వదల --ప్రస్తుతానికి ఒక పాతిక - చివరాఖరి భాగం ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి...చూస్తూనే ఉండండి www.blogavadgeetha.blogspot.com

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి



౫౧. 
సిగరెట్ 
మనిషిని శివుడ్ని చేస్తుంది
గొంతులో గరళం నింపి

౫౨. 
అంతరిక్షం వైపు
రాకెట్, రేట్లు రెండూ ఎగిరాయి
రాకెట్ ఓడిపోయింది

౫౩. 
అవార్డులంటే 
అర్హులకు తప్ప
అందరికీ వచ్చేవి

౫౪. 
ఒక్కడి సంపాదనతో
చాలా మంది బతికే చోటు
దేవస్థానం

౫౫ 
మా ఆవిడ కొత్త వంట చేస్తోంది
అద్దంలో నాకు నేను
ల్యాబ్ లో ఎలకలా కనిపించాను 

౫౬ 
కొత్త ఊళ్ళో లైబ్రరీకెళ్లా
ప్రతి అరలోనూ
ఎంత మంది ఫ్రెండ్సో!!!

౫౭.
అవార్డు సినిమా ప్రీవ్యూ 
ఆడియన్సందరి గురక
స్పష్టంగా వినిపిస్తోంది 

౫౮ 
మళ్ళీ లేవక్కర్లేకుండా 
హాయిగా బజ్జోవడమే 
మరణం

౫౯ 
హిమాలయాల్లో సేల్స్ మాన్ 
మహర్షులని చూసి
రేజర్లమ్మడం మొదలెట్టాడు 

౬౦ 
పెళ్ళాం కన్నా ప్రేయసే బెటర్
తన తరపు ఫంక్షన్లకి 
వెళ్ళనవసరం లేదు

౬౧ 
వార్తల్లేని ఓ న్యూస్ చానెల్
భార్య భర్తల మధ్య
అక్రమసంబంధం వెలుగులోకి తెచ్చింది 

౬౨. 
అరవై మూడేళ్ళ స్వతంత్రం
అన్నీ నేర్చుకున్నాం
ప్రశ్నించడం తప్ప

౬౩ 
నాదో చిన్న సందేహం
"ఓంకారన్నయ్య"ని
వాళ్ళావిడ ఏమని పిలుస్తుందో?

౬౪. 
నా సెల్ పోయింది
ఒక్కసారిగా
బంధాలన్నీ తెగిపోయాయి 

౬౫ 
ఇంగ్లీష్ చదువు
బాబాయి, మావయ్య
ఇద్దరూ అంకుల్సే 

౬౬ 
మాతృభాష బ్రతికే ఉంది
దెబ్బ తగిలినప్పుడు 
"అమ్మా" అంటున్నాంగా

౬౭ 
టీవీలో యాంకర్ అమ్మాయి
ఎంత అందంగా
భాషను ఖూనీ చేస్తోందో !!!

౬౮ 
నేటి తెలుగు సినిమా పాట
శ్రద్ధగా వింటే 
ఒకట్రెండు తెలుగు పదాలు దొరక్కపోవు 

౬౯ 
అవసరాల్లోనే  గుర్తొచ్చే
ఒకే ఒక ఫ్రెండు 
దేవుడు

౭౦ 
ఒక్కసారీ లక్కు తగలని
ఏకైక లాటరీ
ఎన్నికలు

౭౧ 
చదువయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?
నాన్నారి ప్రశ్నకి నా సమాధానం 
సరైన సమయం లో సరైన నిర్ణయం 

౭౨ 
ఈజిప్ట్ లో  నే చూసిన గొప్ప విచిత్రం
డాడీ కూడా
చచ్చాక మమ్మీ అవడం 

౭౩ 
కొత్త బైక్ కొన్నా
చిత్రంగా
రోడ్డు రేస్ ట్రాక్ లా కనిపించింది 

౭౪ 
వెధవ బ్యాంకులు
వెహికల్ కి లోనిస్తారట కానీ
వెజిటబుల్స్ కి ఇవ్వరట 

౭౫ 
ఫస్ట్ టైం స్పీల్బర్గ్ సినిమా చూస్తున్న 
పక్కసీట్లో తాతగారి కామెంట్
"ఇవన్నీ విఠలాచార్య ఎప్పుడో తీసేసాడుగా"

ఇంకో పాతిక ఈ ఆదివారం సాయంత్రం పోస్ట్ చేస్తా... దాంతో వంద పూర్తవుతాయి. అన్నీ ఒకసారే అయితే బోరు కొట్టేయ్యదూ!! ముందు నాలుగు భాగాలూ చదివే ఉంటారుగా. లేకపోతే ఇదిగో ఓ లుక్కేయండి. 



Thursday, January 6, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరి భాగం -.... యాభై అయ్యాయి కదా!!! ఇంక చాల్లెండి. మిమ్మల్ని మరీ ఎక్కువ హింసిస్తున్నానేమో అనిపిస్తోంది.


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౩౭ 
తెలంగాణా ఉద్యమం
జనాల కన్నా
జేఏసి లే ఎక్కువున్నాయి

౩౮ 
ఛానెల్లో చర్చలు
ఎప్పుడు చూసినా
అవే మొహాలు 

౩౯ 
అతివృష్టి
ఎటుచూసినా నీళ్ళే
పొలంలో, రైతు కళ్ళలో

౪౦ 
గతేడాది పిల్లలకి
వేసవి శలవలతో పాటు
వేర్పాటు శలవలూ వచ్చాయి 

౪౧ 
కమిటీ రిపోర్టిచ్చింది
ఏడాది క్రితం పరిస్థితికి
తీసుకొచ్చి వదిలేసింది 

౪౨ 
శ్రీ కృష్ణ కమిటీ
కొండని తవ్వి
ఎలకనీ వదిలేసింది 

౪౩ 
అందరికీ ఆమోదయోగ్యం
అంటే
ఎవరికీ అక్ఖర్లేదని అర్ధం

౪౪ 
ఎవరన్నారు 
దేశం క్రీడల్లో వెనకుందని?
నేతలు జనాలతో ఆడుకోవట్లేదూ

౪౫ 
మార్కెట్ కెళ్లా
జేబు ఖాళీ అయి
సగం సంచి నిండింది 

౪౬ 
డైలీ సీరియల్ హీరొయిన్ 
వీలునామాలో 
తన పాత్ర మునిమనవరాలికి రాసింది 

౪౭ 
మా ముత్తాతకి , శ్రీ శ్రీ కి  
ఒక పోలికుంది
ఇద్దరూ కీర్తి శేషులే 

౪౮ 
ఎవరో అడిగారు నా వయసెంతని
12045 డైలీ సీరియల్ ఎపిసోడ్లు 
నా సమాధానం

౪౯ 
మా ఊరికి రైల్లో ప్రయాణం
రైలు ముందుకి
ఆలోచనలు వెనక్కి

౫౦ 
దేవతలకే కాదు మనకీ తెల్సు 
అమృతం రుచి
కాపోతే మనం అమ్మచేతి వంట అంటాం 



ఇంక చాలు మహాప్రభో అనుకుంటున్నారా? ఏదో మీ అభిమానం. ఈ సారికిలా కానిచ్చేయండి.










అయ్యబాబోయ్..ఈ రోజేంటి ఇలా బ్లాగేస్తున్నాను!!!! - జస్ట్ రాయాలనిపించింది అంతే - మూడవ భాగం .

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే . నచ్చితే భుజం తట్టండి

౨౨. 
రెండో క్లాసు కుర్రాడు 
పొద్దున్న స్కూలుకి 
సాయంత్రం ఐ ఐ టి కోచింగ్ కి

౨౩. 
ఒంటి నిండా బట్టలేని జనం
మురికివాడల్లోనూ
మెట్రో పబ్బుల్లోనూ 

౨౪. 
ఈ గతుకుల మీదొట్టు
ఈ రోడ్డు
మొన్నే వేశారు

౨౫. 
అన్ని చానెళ్ళలో 
అదే న్యూస్ 
ఎవడికి వాడే "ఎక్స్లూజివ్"

౨౬. 
దున్నపోతు ఈనిందట 
ఇది సీమాంధ్రుల కుట్రే 
ఓ వేర్పాటు వాది స్టేట్మెంట్  

౨౭. 
రోడ్ల భద్రతపై అధ్యయనానికి 
మన అధికారులు 
వెనిస్ వెళ్లి వచ్చారు 

౨౮. 
జీతం వచ్చింది
కాగితం మీద బడ్జెట్ తర్వాత
లోటు వెక్కిరించింది 

౨౯.
తాగుబోతు డ్రైవింగ్ 
వెధవరోడ్లు
తిన్నగా ఉండి చావవు

౩౦. 
ఈ ప్రపంచం లో 
అనంతమయినవి ఏమి లేవు
డైలీ సీరియల్స్ తప్ప

౩౧. 
బాలకృష్ణ సినిమా హిట్టట 
పుష్కర కాలం 
అసలు గడిచినట్టే తెలియలేదు 

౩౨. 
పైరసీని అరికట్టండి
హాలీవుడ్ కధ కాపీ కొట్టిన 
దర్శకుడి విజ్ఞప్తి 

౩౩. 
మా ఊళ్ళో బస్సు దిగా
అమ్మ ఒడిలో 
తలపెట్టినట్టు ఉంది 
(ఇప్పుడే "తోటయ్య" పోస్ట్ తో మా ఊరిని గుర్తుకు తెచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలతో)

౩౪. 
అల్మారా సర్దుతుంటే 
పాత ఆల్బం దొరికింది
దాంతో పాటే జ్ఞాపకాలూనూ

౩౫ 
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడుతోంది
చిన్నప్పుడు
ఉగ్గు బదులు తేనె తాగేసిందేమో 

౩౬. 
రెండు శరీరాల్లో 
ఒకే ఆత్మ
బాపు - రమణ 


జస్ట్ రాయాలనిపించింది అంతే - రెండవ భాగం

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧౧. 
ఇప్పుడే భోజనమయింది 
ఇక ప్రకటించేయ్యచ్చు
ఒక్క పూట ఆమరణ దీక్ష

౧౨. 
మూడు తరాలుగా సాగుతోంది
ఆ టివి సీరియల్ 
ఇంకా సగం కూడా కాలేదట 

౧౩ 
ర్యాంక్ తగ్గింది
రైలు పట్టాల మీద 
ఇంటర్ కుర్రాడి శవం 

౧౪. 
అంతా ప్రశాంతం గా ఉంది 
ఆనందం గా లేనిది 
ఆ న్యూస్ చానెల్ వాళ్ళే 

౧౫. 
మన దేశం లో దొంగలకి 
మర్యాదేక్కువ
పార్లమెంట్లో కూర్చోపెడతాం 

౧౬. 
సొనియమ్మ కి మూడ్ బాలేదట 
ఎపి సిఎం 
మళ్ళీ మారతాడేమో

౧౭. 
నాస్తిక నేత మరణం 
కాల్చాలా? పూడ్చాలా? 
న్యూస్ చానెల్ లో SMS POLL 

౧౮.
పెళ్లి చూపులయ్యాయి 
అధిష్టానంతో సంప్రదించి చెప్తాం 
అబ్బాయి తరపు వారి సమాధానం

౧౯ 
అన్నిటికీ రాజీవ్, ఇందిరే
తన కొడుక్కి మాత్రం 
ఆ పేరు పెట్టలేదేందుకో ఆ నేత 

౨౦ 
మా వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలట 
ఇంటికి ఇద్దరు చొప్పున రమ్మని
స్కూల్ నించి ఆహ్వానం 

౨౧. 
ఘంటసాలా? ఏ ప్రోగ్రాం లో సింగర్? 
స్రిప్ట్ చదువుతున్న 
మ్యూజిక్ షో యాంకరమ్మ ప్రశ్న 

జస్ట్ రాయాలనిపించింది అంతే

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు . జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧.
పెద్ద బాలశిక్ష 
పేరెక్కడో విన్నా
వీక్లీయా? మంత్లీయా?

౨. 
కూతురు పుట్టిందట
grl brn అని 
బామ్మర్ది sms 

౩. 
మా వీధిలో గేదె ఈనింది
ఇందాకనే చూసా
ఏదో టీవి బ్రేకింగ్ న్యూస్ లో

౪. 
ఉల్లిపాయ 
కోసినా, కొన్నా
కన్నీళ్ళే 

౫ 
ఆదివారం తర్వాత ఏ వారం?
ఈ వారం రియాల్టీ షో లో 
ప్రేక్షకులకు sms ప్రశ్న

౬. 
బందులు, ధర్నాలతో 
ఏడాదంతా గడిచిపోయింది
రేపట్నించి కాలేజి లో ఎగ్జామ్స్ 

౭. 
రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
ముఖ్యమంత్రి స్టేట్మెంట్ 
సచివాలయం ఎదురుగా లాఠిచార్జ్ 

౮.
అహింసాయుత మార్గం లో స్వాతంత్రం
గొప్పగా చెప్పుకుందాం
రక్తపాతాల ఆర్తనాదాల మధ్య 

౯. 
నేటి పిల్లలకి 
టెల్గు బాగా వచ్చు
అ ఆ ఇ ఈ F 

౧౦
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని 
పుస్తకాల్లో హైదరాబాదే 
పాలన మాత్రం ఢిల్లీ లో