Friday, March 11, 2011

వినాయకుడు మూర్ఛపోయాడు


ఎక్కడనుంచో అదివో అల్లదివో పాట లీలగా వినబడుతుంటే వినాయకుడికి మెలకువ వచ్చింది. ఎవడబ్బా ఈ దుర్వాసనా భరిత కాసార సాగర మధ్యమున వేంకటేశ్వరుని భజిస్తున్నది అంటూ సగం కరిగి, సగం విరిగిన చేతిని సర్దుకుంటూ మెల్లగా తల తిప్పి చూసాడు. నడుం విరిగినా నారాయణ కీర్తన మానని అన్నమయ్య అంతబాధలోనూ కీర్తన ఆలపిస్తున్నాడని గుర్తించి, అంతలోనే అతను ఇక్కడికి ఎలా వచ్చాడు? కొంపతీసి వినాయక నిమజ్జనం లానే ఈ హైదరాబాదీలు అన్నమయ్య చవితి చేసి అన్నమయ్య విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తున్నారా అని ఖంగారు పడ్డాడు. కానీ ఒకే విగ్రహం ఉండటం తో కాస్త స్తిమిత పడి "ఏం నాయనా అన్నమయ్యా? ఇలా వచ్చావు?" అని ప్రేమగా అడిగాడు. "రాలేదు స్వామీ తోసేసారు " అన్నాడు అన్నమయ్య ఒక పక్క బాధ భరిస్తూ. "తప్పు నాయన తోసేసారు అనకూడదు, దీనిని నిమజ్జనం అంటారు. నీకు కొత్తేమో కానీ నాకిది మామూలే" అన్నాడు వినాయకుడు. "భక్తితో ముంచితే నిమజ్జనం అంటారు, ద్వేషంతో ముంచితే తోసేసారు అంటారు, అన్నమయ్య వారు వాడిన పదం బాషా పరంగా సరియినదే స్వామీ" అని ఇంకో గొంతు వినగానే వినాయకుడికి చిర్రెత్తుకొచ్చింది. 

ఎవడ్రా నాకే బాషా సూత్రాలు నేర్పిస్తున్నాడు. అంత గొప్ప పండితుడా? అనుకుంటూ తలతిప్పి చూస్తే విరిగిన ఘంటపు ముక్క వెతుక్కుంటూ ఒళ్ళంతా శిధిలమయిన ఎర్రాప్రగడ కనిపించాడు. వార్నీ నువ్వు కూడానా? "ఏమిది సాహితీ సరస్వతీ మూర్తులన్నీ ఇలా కట్టకట్టుకుని సాగరాన వచ్చి పడ్డాయి? ఇక్కడ చూస్తే నాకే దిక్కు లేదు, పోనీ నేనేమయినా మహారాజునా? చక్రవర్తినా వీళ్ళని పోషించడానికి, మొదటికే మా తండ్రి ఆదిభిక్షువు ఇంకా వీళ్ళకి నేనేం చేయగలను" అని పక్కనున్న ఎలకతో అనగానే అది కిసుక్కున నవ్వి ఆ సంగతి వీళ్ళని తోసిన వాళ్లకి తెలియదా స్వామీ, తెలుగు భాషకి ఇంత ఉన్నతిని కల్పించిన వీరందరినీ దగ్గరుండి చూసుకోడానికి అదిగో ఆంధ్ర భోజుడిని కూడా అమాంతం ఎత్తి ఇక్కడ పడేసారు. అటు చూడండి అని చూపించగానే అక్కడ రెండు కాళ్ళు విరిగి ఒక పక్క కూలబడ్డ కృష్ణ దేవరాయలు మీసం దువ్వుకుంటూ కనిపించాడు.  వినాయకుడిని చూసి నీరసంగానే నమస్కరించాడు. భళిరా నరోత్తమా నీవేల ఇటకు వచ్చితివి, ఇదేమీ హంపీ సరోవరం కాదే, ఈ మురుగు నీటిలో జలకాలాడవలేనన్న కోరిక నీకెలా కలిగినదయ్యా?" అన్న వినాయకుడి ప్రశ్నకి రాయలు జవాబిచ్చేనంతలోనే వినాయకుడి ఎలక "ప్రభూ బాగా ఆకలిగా ఉంది కాస్త ఏదైనా తిని మాట్లాడుకుందాం" అనగానే వినాయకుడు "అయితే ఆ పక్కకెళ్ళి తినేసోచ్చేయి. మేము ఈ లోగా ఇక్కడ ఏదో కతికామనిపిస్తాం"  అన్నాడు. "వీల్లేదు ఎలకైనా, ఏనుగైనా, ప్రభువైనా, బంటయినా అంతా ఒకే చోట కూర్చుని చాపకూడు తినాలి. ఈ ప్రపంచం లో అంతా సమానమే.  ఏం అన్నమయ్య స్వామీ "బ్రహ్మమొక్కడే" అన్న మీరయినా చెప్పరేమి?"  అని వినబడగానే విరిగిన తొండం సర్దుకుని వినాయకుడు ఆ మాటలు వచ్చిన వైపు తలతిప్పి చూసాడు" అక్కడ ఆజానుబాహుడిలా నిలబడి శరీరం చిద్రమయినా  మీసం మెలేస్తూ కనిపించిన వ్యక్తిని చూసి "ఎవరు నాయనా నీవు? సమానత్వం గురించి అంత ఆవేశ పడుతున్నావు?" అన్న వినాయకుడి ప్రశ్నకి "నన్ను బ్రహ్మనాయుడంటారు, మాది పలనాటి సీమ" అని జవాబిచ్చాడు బ్రహ్మనాయుడు. "నీవేమి ఇటుల వచ్చితివి విహారయాత్రకా?" అన్న వినాయకుడి ప్రశ్నకి అంత సేపూ ఓపిగ్గా వింటున్న ఎలక ఇంక ఆగలేక "స్వామీ మీకు ఈ మురికి మూసీ జల ప్రభావముతో మతి తప్పినట్టు ఉంది, తోసేసారు బాబో అని వాళ్ళు చెప్తుంటే మళ్ళీ అదే ప్రశ్న. ఒక పక్క ఆకలితో చస్తుంటే" అని విసుక్కుంది. "మూషికా మూర్ఖంగా మాట్లాడకు వీరందరూ మహనీయులే కదా, ఈ తెలుగు జాతికి  ప్రాతః స్మరణీయులే కదా మరి ఆ మాత్రపు ఇంగితము, మర్యాద లేకుండా వీరిని ఈ సాగరమున పడేసే దుర్మదాంధులేవరుంటారు?  అంతటి ఉన్మత్తులు, ఉన్మాదులు ఈ ప్రాంతమున కలరా? " అనగానే  అప్పటిదాకా వీళ్ళ గోలంతా వింటున్న బుద్ధుడు నీళ్ళలోకి తొంగి చూసి "పిచ్చి వినాయకా ఈ ప్రాంతం లో అంతటా ఉన్మత్తులు, ఉన్మాదులే కలరు, లోపలుండి నీకు తెలియట్లేదు కానీ రోజూ  నేను చూడలేక చూడలేక చూస్తున్నా ఈ ముదిరిన ప్రాంతీయ వాదాన్ని, ఇప్పుడు వీళ్ళని ఈ మురికి కూపం లో పడేసింది కూడా వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళనే కారణం తోనే. కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళనెందుకు ఇబ్బంది పెడతావు, ఇంకా కాలూ, చెయ్యీ కూడదీసుకోడానికి కొంచం సమయం పడుతుంది. మనకంటే అలవాటు అయిపోయింది కానీ ఈ కంపు వాళ్లకి కొత్త." అన్నాడు. 

బుద్ధుడి మాటలు అర్ధం కాని శ్రీకృష్ణ దేవరాయలు అయోమయంగా తన పక్కనే ఉన్న ఎలకతో "బుద్ధదేవుడికి కూడా బుద్ధి నశించిందా? వాళ్ళంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సరే, మాది కన్నడ సీమ. విజయనగర సామ్రాజ్య తేజో విరాజులం మమ్మల్ని పట్టుకుని ఆంధ్రుడు అంటాడేమిటి? అయినా నా రాజ్యం లో ఆంధ్ర ప్రాంతం కూడా ఉందనుకో కానీ నన్ను కన్నడ వాడిగానే జనాలు గుర్తిస్తారు. హంపీ కన్నడ దేశం లో ఉందని ఆయనకి తెలియదా? " అనగానే ఎలక్కి చిర్రెతుకోచ్చింది "కాస్త మూసుకుంటారా? అయితే మీకు ఆంధ్ర అను పదము తో సంబంధము లేదంటారు? తమ బిరుదేమి మహాశయా?" అని వ్యంగం గా ప్రశ్నించింది. పాపం ఆ వ్యంగం అర్ధం చేసుకునే స్థితిలో లేని రాయలు మీసం దువ్వుకుంటూ "ఆంధ్ర భోజులంటారు మమ్మల్ని" అన్నాడు. "ఆ ముక్కొక్కటి చాలు వాళ్లకి మిమ్మల్ని మూసీలో ముంచడానికి. తొక్కలో అనుమానాలు మీరూను, "తెలుగు వల్లభుండ" అని మీసాలు మేలేస్కోడం కాదు "తెలంగాణా బాధితుండ" అని ఏడవాలి తమరు" అని కసిరింది. 

ఇదంతా చూసిన వినాయకుడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. లయకారుడైన తండ్రిని తలచుకున్నాడు. "తండ్రీ లింగాకారుడవే!  నీ పేరుతో ఏర్పడిన ఈ త్రిలింగ దేశం లో ఆవేశ కావేశాలను అణచలేవా? " అని ఆవేదనతో ప్రార్ధించాడు. ఇంతలో  డుబుంగ్ అని శబ్దం వినిపించింది. అంతా తలతిప్పి సాగర గర్భం లో లింగడు అవతరించాడు అనుకుని అటువైపు చూసారు. కొట్టుకుపోయిన మోకాళ్ళు కూడదీసుకుని పంచె సర్దుకుంటూ ఒకాయన కనిపించాడు. ఆయన వీళ్ళకేసి తిరిగి, అందరినీ గుర్తుపట్టి వినయంగా నమస్కరించాడు. "అయ్యా నన్ను వీరేశ లింగం అంటారు" అన్నాడు. ఆ మాట వినగానే వినాయకుడు మూర్చపోయాడు.

(ఇంకా ఉంది)


ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది. 
నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు దీనిని చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను.

(అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని 
మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా. )





17 comments:

kiranpriya said...

ఇలాంటి విషాద సంఘటన నుంచి హాస్యం పిండాలని మీకెందుకనిపించిది>?

SHANKAR.S said...

@kiranpriya గారు
హాస్యానికి, వ్యంగ్య హాస్యానికి కుసింత తేడా ఉందండీ. ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది.
ఇది నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను.

(అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా. )

వాత్సల్య said...

ఎలా చెప్తే అర్ధం అవుతుందో ఉన్మాదుల్లా ప్రవర్తించే "పీడిత" జనానికి, మన సంస్కుతిని ధ్వంసం చేసుకోకూడదు రా బాబూ అని.

దశాబ్దాలుగా దోచుకోబడుతున్నారు కదా పాపం,చెప్పినా తలకెక్కదేమో కూడాలెండి

Anonymous said...

హైదరాబాదీలు అన్నారు దాని అర్థం తెలుసా మీకు, తెలిస్తే కొంచెం వివరించగలరు.

SHANKAR.S said...

రవీందర్ గారూ,
నా పోస్ట్ చూసి స్పందించినందుకు ముందుగా ధన్యవాదాలు.

హైదరాబాదీలు అంటే నా ఉద్దేశ్యం లో ఎక్కడనుండి వచ్చినా ఈ ఊరిని స్వంతం చేసుకుని, ఇక్కడి సంస్కృతితో మమైకమై ఇది నా ఊరు అనుకున్న వాళ్ళందరూ. అది కరీం నగర్ నుంచి వచ్చి కూకట్ పల్లి లో ఉంటున్న వారైనా? దిల్ సుఖ్ నగర్లో ఉంటున్న విశాఖ వాసైనా. ఎవరైనా సరే. ఇక్కడ ప్రజలకి తెలంగాణా/ ఆంధ్ర గొడవలతో సంబంధం లేదని నా ఉద్దేశ్యం. ఇక్కడ హైదరాబాదీ అని వాడింది నేను చూసిన గణేష్ నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకునే. సాగర్ లో ఉన్న వినాయకుడి గురించి చెప్తున్నాను కనుక ఆ పదం వాడాను. అంతే తప్ప ఏ మతాన్నో, ప్రాంతాన్నో ఉద్దేశించి నేను అనలేదండీ. ఇది నా ఉద్దేశ్యం. ఇక ఇందుకు బిన్నంగా మీకు ఏదైనా ఖచ్చితమైన అబిప్రాయం ఉంటే చెప్పండి.

Anonymous said...

@ శంకర్ గారికి
మనిషి వ్యక్తిత్వానికి ప్రాంతానికి సంబంధం ఉండదు. తెలంగాణా లో పుడితే గోప్పవారిగాను ఆంధ్ర లో పుడితే దుర్మార్గులుగా పుడతారా.
తెలంగాణా అబివృద్ది జరిగిందనే ఆంధ్ర వాళ్ళ వాదన, తెలంగాణా ఆంధ్ర ప్రాంత పాలకుల వాళ్ళ వెనకబడింది అని అన్న తెలంగాణా వారి వాదన రెండు తప్పే .
అబివృద్ది చెందింది రెండు ప్రాంతాల నాయకులే. నిజానికి సైమక్యమైన ఆంధ్ర ప్రదేశ్ అయిన తెలంగాణా ఏర్పడ్డ అభివృద్ధి చెందేది కూడా వాళ్ళే.
నేను కొన్ని రోజుల నుంచి అందరి బ్లాగులను చదువుతున్నాను ఎందుకు అంత ఆవేశపడుతున్నారో అర్థం కావట్లేదు.
ఇక విగ్రహాలు అంటారా మనం పెట్టుకున్నవే అవి, వారి గొప్పతనము కూలిస్తే పోయేవా, దానికి చర్చ పెట్టి అనవసరముగా రచ్చ తప్పితే.
ఇప్పటికైనా ప్రాంతాల మద్య చిచ్చు వద్దు. ఉద్యమం దేనికోసమైన తెలంగాణా ప్రజలే తెలంగాణాలో ఉన్నవాళ్ళే ఇబ్బంది పడుతున్నారు.

నాకు మీలాగా రాయడము రాదు ఏదో ప్రయత్నించా.
.

SHANKAR.S said...

అయ్యబాబోయ్ రవీందర్ గారూ,
ఇంతకీ మీరు హైదరాబాదీ అన్న నా నిర్వచనం కరెక్టో కాదో చెప్పలేదు. నేను అనుకున్నట్టు హైదరాబాద్ లో ఉండే వాళ్లనేనా మీ ఉద్దేశ్యం?

ఏంటో మీరేదేదో రాసేసారు. సైన్స్ పేపర్లో తెలుగు పద్యం చూసినట్టు ఉంది నాకు. :) (just kidding)

Anonymous said...

ఇక్కడ పుట్టిన ప్రతివాడు హైదరాబాదినే, నేను ముందే చెప్పాగా నాకు మీలాగా రాయడం రాదు అని,

సుజాత వేల్పూరి said...

శంకర్ గారూ,
మీ పోస్టు లో ఆవేదన తప్ప నాకు వ్యంగ్యం ఎక్కడా కనిపించలేదండీ!బాధకి తొడుగేసి మనసు పొరల్లోకి తోసేసి, మొహానికి పులుముకున్న నవ్వే కనిపించింది.

చివరి పేరా కాసింత నవ్వు కూడా తెప్పించింది.

అసందర్భమేమో చెప్పడం ఇక్కడ....మీరు ఇలాంటి కొసమెరుపు రచనల్లో ప్రసిద్ధులైపోయారు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు బాగా వ్రాసారు. కొండొకచో మనం హాస్యం గానో వ్యంగం గానో వ్రాయాలని ఎంత ప్రయత్నించినా ఆవేదన దాచుకోలేము. సుజాత గారన్నట్టు మీ ఆవేదన కనిపిస్తోంది. చదివిన తరువాత నా మొహంలో ఒక wry smile.

ప్రవీణ said...

చాల ఆవేదన ఉందండి మీ పోస్ట్ లో.. చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్టు, మీరు ఎంత చెప్పిన అర్థం కాదులెండి ..

తృష్ణ said...

సుజాతగారి మాటే నాదీనండి..!
నాల్రోజులు ఊళ్ళో లేక, పేపర్ కానీ ,న్యూస్ కానీ ఫాలో అవటం కుదరనేలేదు..ఈలోపూ రాష్ట్రంలోనే కాక ప్రపంచంలో కూడా చాలా ఎన్ని అనర్ధాలు జరిగిపోయాయో..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఈవేళ మీ పుట్టిన రోజు కదూ! శుభాకాంక్షలు.

ఆ.సౌమ్య said...

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆ.సౌమ్య said...

బాగా రాసారండీ..వ్యగ్యం ఉన్నా ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాది...మీరన్నట్టు ఈ వ్యంగ్యంగా చేసి మాట్లాడుకుంటేనే బెటర్.

SHANKAR.S said...

@మందాకిని గారు, సౌమ్య గారు
ధన్యవాదాలండీ.

Nagaraju said...

plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystime.blogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines
galaxytechtime.blogspot.com - online photoshop and technical
Thanks