Sunday, January 9, 2011

నేడు నా ఫేవరేట్ సింగర్ మహేంద్రకపూర్ జయంతి - ఆయన రఫీ, ముఖేష్, కిషోర్ దా అంత ఫేమస్ కాకపోవచ్చు కానీ హిందీ సంగీతం లో ఆయనది తనదైన ముద్ర.



పాత హిందీ సింగర్స్ లో మీ అభిమాన గాయకుడు ఎవరంటే నూటికి తొంభై  మంది చెప్పే పేర్లలో మహేంద్ర కపూర్ పేరు ఉండక పోవచ్చు. నా అభిమాన గాయకుడు మాత్రం మహేంద్ర కపూరే. నా అల్ టైం ఫేవరెట్ సాంగ్ "చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బన్ జాయే హం దోనో" ఆయన గొంతులోనిదే. నాకు ఆయన గొంతులో నచ్చే విషయం ఆ వైవిధ్యం. ముఖ్యంగా "మేరె దేశ్ కి ధర్తీ" పాటలో, "ఫకీరా చల్" అనే పాటలో ఆయన పాడగలిగే పిచ్ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది."మేరె దేశ్ కి ధర్తీ"  పాటకి ఈయన ఉత్తమ గాయకుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ముఖ్యంగా నా అభిమాన సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ స్టైల్ అఫ్ మ్యూజిక్ కి ఈయన గొంతు భలే సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు.  

నా ఉద్దేశ్యం లో మహేంద్ర కపూర్ కి రావలసినంత పేరు రాకపోవడానికి  కారణం ఆయన రఫీ, కిషోర్, ముఖేష్ వంటి వాళ్ళలా సూపర్ స్టార్ లకి ఎక్కువగా పాడలేదు. ఎక్కువగా మనోజ్ కుమార్, సునీల్ దత్, బిస్వజిత్ లాంటి వాళ్లకి పాడారు. అలా అని ఈయన ఖాతాలో సూపర్ హిట్ సాంగ్స్ లేవా అంటే బోలెడున్నాయి. మొదటి పాట (రికార్డింగ్ జరుపుకున్న మొదటి పాట ఇది...రిలీజ్ అయిన మొదటి పాట నౌషాద్ సంగీతదర్శకత్వం లో సోనిమాహివాల్ అనే చిత్రంలోని "చాంద్ చుపా ఔర్ తారే డూబే") నవరంగ్ సినిమాలోని "ఆధా హై చంద్రమా" తో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేంద్ర కపూర్ పాడిన చాలా పాటలు మనం మనకి తెలియకుండానే పైన చెప్పిన గాయకుల ఖాతాలో వేసేసుంటాం. కొన్ని పాటలు ఒక్కోసారి వింటే వార్నీ, ఈ పాట పాడింది ఈయనా? అనిపిస్తుంది అని నా అభిప్రాయం. అన్నట్టు టివి మహాభారతం లో టైటిల్ సాంగ్ గుర్తుందా? ఆ పాట ఈయన పాడినదే. ఆ తరవాత ఎన్నో ప్రైవేట్ భక్తి గీతాలు పాడిన ఈయన కెరీర్ గ్రాఫ్, చూస్తే నాకు ఎందుకో మన తెలుగులో పి.బి.శ్రీనివాస్ గుర్తొస్తారు. టాలెంట్ ఉన్నా రావలసినంత గుర్తింపు ఇద్దరికీ రాలేదని నా ఫీలింగ్.

అలాంటి మహేంద్ర కపూర్ జయంతి (జనవరి 9) సందర్భంగా ఆయన పాడిన పాటల్లో నాకిష్టమయిన టాప్ టెన్ సాంగ్స్ లింక్స్ మీకోసం. కావాలనే ఈ పాటల వీడియో క్లిపింగ్స్ పెట్టట్లేదు అప్పుడు దృష్టి ఆ పాటలో నటించిన నటీనటుల మీదకు వెళ్లిపోతుందని నా బాధ. (అర్ధం చేసుకుంటారుగా :) )


Saturday, January 8, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరన్నర భాగం.......................వందయ్యేదాకా వదల బొమ్మాళీ వదల --ప్రస్తుతానికి ఒక పాతిక - చివరాఖరి భాగం ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి...చూస్తూనే ఉండండి www.blogavadgeetha.blogspot.com

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి



౫౧. 
సిగరెట్ 
మనిషిని శివుడ్ని చేస్తుంది
గొంతులో గరళం నింపి

౫౨. 
అంతరిక్షం వైపు
రాకెట్, రేట్లు రెండూ ఎగిరాయి
రాకెట్ ఓడిపోయింది

౫౩. 
అవార్డులంటే 
అర్హులకు తప్ప
అందరికీ వచ్చేవి

౫౪. 
ఒక్కడి సంపాదనతో
చాలా మంది బతికే చోటు
దేవస్థానం

౫౫ 
మా ఆవిడ కొత్త వంట చేస్తోంది
అద్దంలో నాకు నేను
ల్యాబ్ లో ఎలకలా కనిపించాను 

౫౬ 
కొత్త ఊళ్ళో లైబ్రరీకెళ్లా
ప్రతి అరలోనూ
ఎంత మంది ఫ్రెండ్సో!!!

౫౭.
అవార్డు సినిమా ప్రీవ్యూ 
ఆడియన్సందరి గురక
స్పష్టంగా వినిపిస్తోంది 

౫౮ 
మళ్ళీ లేవక్కర్లేకుండా 
హాయిగా బజ్జోవడమే 
మరణం

౫౯ 
హిమాలయాల్లో సేల్స్ మాన్ 
మహర్షులని చూసి
రేజర్లమ్మడం మొదలెట్టాడు 

౬౦ 
పెళ్ళాం కన్నా ప్రేయసే బెటర్
తన తరపు ఫంక్షన్లకి 
వెళ్ళనవసరం లేదు

౬౧ 
వార్తల్లేని ఓ న్యూస్ చానెల్
భార్య భర్తల మధ్య
అక్రమసంబంధం వెలుగులోకి తెచ్చింది 

౬౨. 
అరవై మూడేళ్ళ స్వతంత్రం
అన్నీ నేర్చుకున్నాం
ప్రశ్నించడం తప్ప

౬౩ 
నాదో చిన్న సందేహం
"ఓంకారన్నయ్య"ని
వాళ్ళావిడ ఏమని పిలుస్తుందో?

౬౪. 
నా సెల్ పోయింది
ఒక్కసారిగా
బంధాలన్నీ తెగిపోయాయి 

౬౫ 
ఇంగ్లీష్ చదువు
బాబాయి, మావయ్య
ఇద్దరూ అంకుల్సే 

౬౬ 
మాతృభాష బ్రతికే ఉంది
దెబ్బ తగిలినప్పుడు 
"అమ్మా" అంటున్నాంగా

౬౭ 
టీవీలో యాంకర్ అమ్మాయి
ఎంత అందంగా
భాషను ఖూనీ చేస్తోందో !!!

౬౮ 
నేటి తెలుగు సినిమా పాట
శ్రద్ధగా వింటే 
ఒకట్రెండు తెలుగు పదాలు దొరక్కపోవు 

౬౯ 
అవసరాల్లోనే  గుర్తొచ్చే
ఒకే ఒక ఫ్రెండు 
దేవుడు

౭౦ 
ఒక్కసారీ లక్కు తగలని
ఏకైక లాటరీ
ఎన్నికలు

౭౧ 
చదువయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?
నాన్నారి ప్రశ్నకి నా సమాధానం 
సరైన సమయం లో సరైన నిర్ణయం 

౭౨ 
ఈజిప్ట్ లో  నే చూసిన గొప్ప విచిత్రం
డాడీ కూడా
చచ్చాక మమ్మీ అవడం 

౭౩ 
కొత్త బైక్ కొన్నా
చిత్రంగా
రోడ్డు రేస్ ట్రాక్ లా కనిపించింది 

౭౪ 
వెధవ బ్యాంకులు
వెహికల్ కి లోనిస్తారట కానీ
వెజిటబుల్స్ కి ఇవ్వరట 

౭౫ 
ఫస్ట్ టైం స్పీల్బర్గ్ సినిమా చూస్తున్న 
పక్కసీట్లో తాతగారి కామెంట్
"ఇవన్నీ విఠలాచార్య ఎప్పుడో తీసేసాడుగా"

ఇంకో పాతిక ఈ ఆదివారం సాయంత్రం పోస్ట్ చేస్తా... దాంతో వంద పూర్తవుతాయి. అన్నీ ఒకసారే అయితే బోరు కొట్టేయ్యదూ!! ముందు నాలుగు భాగాలూ చదివే ఉంటారుగా. లేకపోతే ఇదిగో ఓ లుక్కేయండి. 



Thursday, January 6, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరి భాగం -.... యాభై అయ్యాయి కదా!!! ఇంక చాల్లెండి. మిమ్మల్ని మరీ ఎక్కువ హింసిస్తున్నానేమో అనిపిస్తోంది.


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౩౭ 
తెలంగాణా ఉద్యమం
జనాల కన్నా
జేఏసి లే ఎక్కువున్నాయి

౩౮ 
ఛానెల్లో చర్చలు
ఎప్పుడు చూసినా
అవే మొహాలు 

౩౯ 
అతివృష్టి
ఎటుచూసినా నీళ్ళే
పొలంలో, రైతు కళ్ళలో

౪౦ 
గతేడాది పిల్లలకి
వేసవి శలవలతో పాటు
వేర్పాటు శలవలూ వచ్చాయి 

౪౧ 
కమిటీ రిపోర్టిచ్చింది
ఏడాది క్రితం పరిస్థితికి
తీసుకొచ్చి వదిలేసింది 

౪౨ 
శ్రీ కృష్ణ కమిటీ
కొండని తవ్వి
ఎలకనీ వదిలేసింది 

౪౩ 
అందరికీ ఆమోదయోగ్యం
అంటే
ఎవరికీ అక్ఖర్లేదని అర్ధం

౪౪ 
ఎవరన్నారు 
దేశం క్రీడల్లో వెనకుందని?
నేతలు జనాలతో ఆడుకోవట్లేదూ

౪౫ 
మార్కెట్ కెళ్లా
జేబు ఖాళీ అయి
సగం సంచి నిండింది 

౪౬ 
డైలీ సీరియల్ హీరొయిన్ 
వీలునామాలో 
తన పాత్ర మునిమనవరాలికి రాసింది 

౪౭ 
మా ముత్తాతకి , శ్రీ శ్రీ కి  
ఒక పోలికుంది
ఇద్దరూ కీర్తి శేషులే 

౪౮ 
ఎవరో అడిగారు నా వయసెంతని
12045 డైలీ సీరియల్ ఎపిసోడ్లు 
నా సమాధానం

౪౯ 
మా ఊరికి రైల్లో ప్రయాణం
రైలు ముందుకి
ఆలోచనలు వెనక్కి

౫౦ 
దేవతలకే కాదు మనకీ తెల్సు 
అమృతం రుచి
కాపోతే మనం అమ్మచేతి వంట అంటాం 



ఇంక చాలు మహాప్రభో అనుకుంటున్నారా? ఏదో మీ అభిమానం. ఈ సారికిలా కానిచ్చేయండి.










అయ్యబాబోయ్..ఈ రోజేంటి ఇలా బ్లాగేస్తున్నాను!!!! - జస్ట్ రాయాలనిపించింది అంతే - మూడవ భాగం .

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే . నచ్చితే భుజం తట్టండి

౨౨. 
రెండో క్లాసు కుర్రాడు 
పొద్దున్న స్కూలుకి 
సాయంత్రం ఐ ఐ టి కోచింగ్ కి

౨౩. 
ఒంటి నిండా బట్టలేని జనం
మురికివాడల్లోనూ
మెట్రో పబ్బుల్లోనూ 

౨౪. 
ఈ గతుకుల మీదొట్టు
ఈ రోడ్డు
మొన్నే వేశారు

౨౫. 
అన్ని చానెళ్ళలో 
అదే న్యూస్ 
ఎవడికి వాడే "ఎక్స్లూజివ్"

౨౬. 
దున్నపోతు ఈనిందట 
ఇది సీమాంధ్రుల కుట్రే 
ఓ వేర్పాటు వాది స్టేట్మెంట్  

౨౭. 
రోడ్ల భద్రతపై అధ్యయనానికి 
మన అధికారులు 
వెనిస్ వెళ్లి వచ్చారు 

౨౮. 
జీతం వచ్చింది
కాగితం మీద బడ్జెట్ తర్వాత
లోటు వెక్కిరించింది 

౨౯.
తాగుబోతు డ్రైవింగ్ 
వెధవరోడ్లు
తిన్నగా ఉండి చావవు

౩౦. 
ఈ ప్రపంచం లో 
అనంతమయినవి ఏమి లేవు
డైలీ సీరియల్స్ తప్ప

౩౧. 
బాలకృష్ణ సినిమా హిట్టట 
పుష్కర కాలం 
అసలు గడిచినట్టే తెలియలేదు 

౩౨. 
పైరసీని అరికట్టండి
హాలీవుడ్ కధ కాపీ కొట్టిన 
దర్శకుడి విజ్ఞప్తి 

౩౩. 
మా ఊళ్ళో బస్సు దిగా
అమ్మ ఒడిలో 
తలపెట్టినట్టు ఉంది 
(ఇప్పుడే "తోటయ్య" పోస్ట్ తో మా ఊరిని గుర్తుకు తెచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలతో)

౩౪. 
అల్మారా సర్దుతుంటే 
పాత ఆల్బం దొరికింది
దాంతో పాటే జ్ఞాపకాలూనూ

౩౫ 
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడుతోంది
చిన్నప్పుడు
ఉగ్గు బదులు తేనె తాగేసిందేమో 

౩౬. 
రెండు శరీరాల్లో 
ఒకే ఆత్మ
బాపు - రమణ 


జస్ట్ రాయాలనిపించింది అంతే - రెండవ భాగం

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧౧. 
ఇప్పుడే భోజనమయింది 
ఇక ప్రకటించేయ్యచ్చు
ఒక్క పూట ఆమరణ దీక్ష

౧౨. 
మూడు తరాలుగా సాగుతోంది
ఆ టివి సీరియల్ 
ఇంకా సగం కూడా కాలేదట 

౧౩ 
ర్యాంక్ తగ్గింది
రైలు పట్టాల మీద 
ఇంటర్ కుర్రాడి శవం 

౧౪. 
అంతా ప్రశాంతం గా ఉంది 
ఆనందం గా లేనిది 
ఆ న్యూస్ చానెల్ వాళ్ళే 

౧౫. 
మన దేశం లో దొంగలకి 
మర్యాదేక్కువ
పార్లమెంట్లో కూర్చోపెడతాం 

౧౬. 
సొనియమ్మ కి మూడ్ బాలేదట 
ఎపి సిఎం 
మళ్ళీ మారతాడేమో

౧౭. 
నాస్తిక నేత మరణం 
కాల్చాలా? పూడ్చాలా? 
న్యూస్ చానెల్ లో SMS POLL 

౧౮.
పెళ్లి చూపులయ్యాయి 
అధిష్టానంతో సంప్రదించి చెప్తాం 
అబ్బాయి తరపు వారి సమాధానం

౧౯ 
అన్నిటికీ రాజీవ్, ఇందిరే
తన కొడుక్కి మాత్రం 
ఆ పేరు పెట్టలేదేందుకో ఆ నేత 

౨౦ 
మా వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలట 
ఇంటికి ఇద్దరు చొప్పున రమ్మని
స్కూల్ నించి ఆహ్వానం 

౨౧. 
ఘంటసాలా? ఏ ప్రోగ్రాం లో సింగర్? 
స్రిప్ట్ చదువుతున్న 
మ్యూజిక్ షో యాంకరమ్మ ప్రశ్న 

జస్ట్ రాయాలనిపించింది అంతే

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు . జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧.
పెద్ద బాలశిక్ష 
పేరెక్కడో విన్నా
వీక్లీయా? మంత్లీయా?

౨. 
కూతురు పుట్టిందట
grl brn అని 
బామ్మర్ది sms 

౩. 
మా వీధిలో గేదె ఈనింది
ఇందాకనే చూసా
ఏదో టీవి బ్రేకింగ్ న్యూస్ లో

౪. 
ఉల్లిపాయ 
కోసినా, కొన్నా
కన్నీళ్ళే 

౫ 
ఆదివారం తర్వాత ఏ వారం?
ఈ వారం రియాల్టీ షో లో 
ప్రేక్షకులకు sms ప్రశ్న

౬. 
బందులు, ధర్నాలతో 
ఏడాదంతా గడిచిపోయింది
రేపట్నించి కాలేజి లో ఎగ్జామ్స్ 

౭. 
రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
ముఖ్యమంత్రి స్టేట్మెంట్ 
సచివాలయం ఎదురుగా లాఠిచార్జ్ 

౮.
అహింసాయుత మార్గం లో స్వాతంత్రం
గొప్పగా చెప్పుకుందాం
రక్తపాతాల ఆర్తనాదాల మధ్య 

౯. 
నేటి పిల్లలకి 
టెల్గు బాగా వచ్చు
అ ఆ ఇ ఈ F 

౧౦
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని 
పుస్తకాల్లో హైదరాబాదే 
పాలన మాత్రం ఢిల్లీ లో 

Sunday, January 2, 2011

"పావలా" కు నివాళి


"త్వరలో పావలా ని రద్దు చేసేస్తున్నరట్రా ఇక నుంచి అర్ధ రూపాయే కనీస విలువగా చలామణీ లో ఉంటుందిట" పేపర్లో చదివిన వార్త మా ఫ్రెండ్ తో పంచుకున్నప్పుడు "వెధవ పావలా దాన్ని ఉంచితే ఎంత? రద్దు చేస్తే ఎంత?, అయినా ఈ రోజుల్లో ఏమొస్తుంది పావలాకి? ముష్టి వాడు కూడా తీసుకోడు" అన్న వాడి మాటలకి కాస్త చివుక్కుమంది. నిజమే పావలాకి ఇప్పుడు ఏమొస్తుంది? ప్రభుత్వ పధకాలలో, ఎన్నికల వాగ్దానాలలో "పావలా వడ్డీ" అని చెప్పుకోడానికి తప్ప ఇప్పుడు దానికి విలువేముంది?  కానీ ఒకప్పుడు ఆ పావలాతోనే ఎన్నో సంతోషాలని కొనుక్కున్నా. 

చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఐస్ సోడా, వేరుశనగ ఉండలు, ఉప్పూ కారం అద్దిన మావిడికాయ ముక్కలు, కారపు నీళ్ళలో ఊరబెట్టిన పెద్ద ఉసిరికాయలు, పీచు మిఠాయి, సొంపాపిడి, చిన్న చిన్న మావిడి తాండ్ర ముక్కలు, బుల్లి కోన్ తో ఐస్ క్రీం, కాస్త పెద్ద సైజు రబ్బరు (ఇప్పుడు స్టైల్ గా ఎరేజర్ అంటున్నాం లెండి), బాల్ పాయింట్ పెన్ రీఫిలు, చిన్న సైకిల్ గంట అద్దె ..ఇలా ఒకటా.. రెండా చేతిలో పావలా ఉంటే నా పరిధిలో అన్ని విలాసాలు తీర్చేసుకోవచ్చు అని నమ్మేవాడిని. అవును మరి.. . అప్పట్లో ఎలిమెంటరీ స్కూలు కుర్రాడి రోజువారీ  పాకెట్ మనీ పావలా ఉంటే వాడు మహా రిచ్ గా లెక్క. 

స్కూలు ముందు ఒక ముసలాయన కర్రకి ఆ చివర రంగు రంగుల జీడిపాకం లాంటిది కట్టుకుని దాంతో వాచీ,కోతిబొమ్మ చేసేవాడు, దాని విలువ పావలాయే. ఇక మా ఊరి చొల్లంగి తీర్ధం లో పావలాకి ఇచ్చే జీళ్ళు (సాధారణం గా పావలాకి రెండు ఇచ్చేవాళ్ళు), అలాగే ఆ తీర్ధం లో  దాదాపు మా ఈడు కొడుకును పక్కనే నిలబెట్టుకుని  చేత్తో తిప్పే రంగుల రాట్నం నడిపే  ఒకతను దాన్ని ఎక్కడానికి మా దగ్గరనుంచి వసూలు చేసేది పావలాయే. రంగుల రాట్నం లో తిరుగుతున్న మమ్మల్ని ఆశగా చూసే ఆ కుర్రాడి చూపుల్లో "నీకూ నాకు తేడా ఒక్క పావలాయే" అన్న అర్ధం ఉండేదేమో అని ఇప్పుడనిపిస్తుంది. 

ఇక సంక్రాంతికి ఇంటిముందుకి వచ్చే హరిదాసుకి దోసిలి నిండా బియ్యం తో పాటు ఒక పావలాయో, అర్ధరూపాయో ఇవ్వడం, గంగిరెద్దులవాళ్ళు ఇంటి ముందు చేయించిన విన్యాసాలకి బహుమతిగా మా తాతగారు రూపాయో, రెండ్రూపాయలో ఇచ్చినప్పుడు, నేను సైతం అంటూ నా నిక్కరు జేబులో అపురూపంగా దాచుకున్న పావలాని వాళ్లకిచ్చేయడం (ఆ తరువాత నా దగ్గర దాచుకున్న పావలా వాళ్లకిచ్చేసానని మా తాతగారు నా చేతిలో ఏ అర్ధ రూపాయో పెట్టడం వేరే సంగతనుకోండి :) ) 

ఒక్కటా రెండా...పావలాతో ఇన్ని జ్ఞాపకాలు. అలాంటి ఆ పావలా ఇక ముందు కనిపించదంటే కలుక్కుమనదా మరి. 

జనవరి ఐదవ తేదీ రాత్రి సమైక్య, వేర్పాటు వాదుల ఆలోచన ఎలా ఉంటుందన్న చిన్న చిలిపి ఆలోచనతో - ఒక పేరడీ

మంచి మిత్రులు సినిమాలో "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" నాకు చాలా ఇష్టమయిన పాటల్లో ఒకటి. రేపు జనవరి ఆరో తేదీన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మన ముందుకు రానున్న తరుణంలో ఐదవ తేదీ రాత్రి సమైక్య,వేర్పాటు వాదుల  ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న చిలిపి ఆలోచనతో ఏ పాట రాయడం జరిగింది. ఆ సినిమాలో ఇద్దరు మిత్రులు ఒకరినొకరు కలుసుకొనేటప్పుడు తమ ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి అవతలివాళ్ళకి చెప్పాలనే ఆత్రుతతో తెల్లరడం గురించి ఎదురుచూస్తూ ఉంటారని మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఆరవ తేదీ గురించి సమైక్య, విభజన వాదులు తమ ఆలోచనలు మార్చుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ పేరడీ కి స్ఫూర్తి. ఇంత సూపర్ హిట్ పాట  ట్యూన్ మీకు తెలియదని కాదు. అయినా ఏదో నా తృప్తి కొద్దీ పాట లింక్ కింద ఇస్తున్నాను. ట్యూన్ కి తగ్గట్టు పేరడీ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. 


http://www.box.net/shared/e3f7u0du1p



ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే 

ఇన్నినాళ్ళు దాచిన సత్యం
ఉబికి ఉబికి వస్తుంటే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

ఒకటిగా నిలిచిన జాతిని 
ఏ తంత్రం ఏమీ చేయదని 
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

నేనెరిగిన సమైక్య వాదం
నీతో చెప్పాలని వస్తే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

నేతలు తిరిగే జాతిలో 
ఏ ఐక్యత పనికి రాదనీ
ప్రగతిని కోరే స్టేటులో 
తమ ప్రాంత స్వార్ధమే మేలని 
నేచూసిన విభజనిజం
నీతో చెప్పాలని వస్తే 

ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

"విభజనిజం" అనే కొత్త పదం పుట్టించాల్సి వచ్చింది. దీనికి వీరతాడు వేసినా (ఎవరూ పుట్టించకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి - మాయా బజార్ లో ఘటోత్కచుడు), భాషను ఖూనీ చేసానని తిట్టుకున్నామీ  ఇష్టం. ఈ ప్రయత్నం నచ్చితే ఒక చిన్న కామెంట్ తో భుజం తట్టండి చాలు!!!! 





Thursday, December 30, 2010

అసలు శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్ట్ లో ఏం చెప్పింది?


నాకు మాత్రం ఏం తెలుసండీ? జనవరి ఆరో తారీఖు దాకా ఆగాల్సిందే అట. 
.
.
.
.
.
.
.
.
-
-
-
-
-
-
-
ఏమనుకోకండి, అసలు సంగతేంటంటే బాపు రమణ లను కలిసిన విశేషాలు మీ అందరితో పంచుకుందామని ఉత్సాహంగా  పోస్ట్ పెడితే ఎంత మంది చదివారో నాకు తెలియదు కానీ కామెంట్ల ద్వారా స్పందన మాత్రం చాలా తక్కువగా వచ్చింది. అసలు సమస్య పోస్ట్ హెడ్ లైన్ లో ఉందా లేక మరొకటా అనేది తెలుసుకోవడానికి ఇలా ఈ హెడ్ లైన్ తో పోస్ట్ పెట్టాల్సోచ్చింది. అన్యధా భావించకండి. 

కళాకారుడికి చప్పట్లు, బ్లాగ్గేయకారుడికి కామెంట్లే కదండీ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. కుసింత ఆలోచించండి. 

Wednesday, December 29, 2010

బాపు - రమణ పక్కన్నేనూ మా ఆవిడ.....రెండవ భాగం.

బాపు గారితో ఆయన స్టూడియో లోకి అడుగుపెడుతూనే ఎదురుగా లారెల్ అండ్ హార్డీ ఇలా పలకరించారు.

















 పెద్ద హాలు...ఎటు చూసినా నేల మీద  చిందర వందరగా పరచిన కాగితాలు, పుస్తకాలు, షెల్ఫ్ ల నిండా పుస్తకాలు, గదికి ఆ మూల ఒక కిటికీ, దాని పక్కన బాపు గారు నేలమీదే కూర్చుని బొమ్మలేసుకునే చిన్న టేబుల్. నాకు ఆ గదిలో అడుగుపెడుతూనే నాకు బాగా నచ్చినది ఆ కిటికీ. వర్షాకాలం ఆ కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ, వేడి వేడి పకోడీలు, టీ కాంబినేషన్ తో బాపు, రమణ గార్లతో  బాతాఖాని వేస్తే భలే ఉంటుందనిపించింది. 















ఇక అక్కడున్న ఫోటోలు అన్నిటిలో నాకు బాగానచ్చినది బడే గులాం అలీ ఖాన్, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గార్లు కలిసి ఉన్న ఫోటో. అక్కడే మెహదీ హసన్ హార్మనీ వాయిస్తూ ఉన్న స్కెచ్ చూసి నాకు కోతి కొమ్మచ్చి లో చదివిన దాని కధ గుర్తొచ్చింది. అలమారా అరల్లో వరుసగా పేర్చి ఉన్న ఆడియో కేసెట్ల కలెక్షన్ చూస్తేనే అవన్నీ బాపు గారికి ఇష్టమయిన ఘజల్స్ అని అర్ధమయిపోయింది. 


















ఇందులో మెహదీ హసన్ గారి సంతకం ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం.(తెలియక పోతే కోతి కొమ్మచ్చి మొదటి భాగం ఒక సారి తిరగెయ్యండి)


ఇంతలో ఆయన మెల్లగా తన ఆస్థాన స్థానం (అదే లెండి  కిటికీ పక్కన బల్ల దగ్గర) లో కూర్చుని మమ్మల్నీ కూర్చోమంటూ సైగ చేసారు. కూర్చుని ఆయన గది మొత్తం అబ్బురంగా (బాపు బొమ్మ పుట్టింది, పుట్టేది, పుట్టబోయేది ఇక్కడే కదా మరి) చూస్తూండగా ఆయన తన బొమ్మల ప్రింట్ లు తీసి "ఇందులో మీకు కావాల్సినవి తీసుకోండి" అన్నారు. ఆ క్షణంలో  భగవంతుడు బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి కావలసినన్ని వరాలు డ్రా చేసుకో అన్నట్టు అనిపించింది. అవి ఒక యాభై దాకా ఉన్నాయి. అన్నీ తీసుకుంటే ఏమనుకుంటారో (పరమ కక్కుర్తి వెధవ అనుకోవచ్చేమో అన్నా భయం....పాపం ఆయనకేం తెలుసు బాపు బొమ్మ ఇష్టపడని తెలుగోడు పుట్టలేదు, పుట్టబోడు అని?) ఆ క్షణం లో అన్ని చాయిస్ లు ఉండటం కూడా పే...ద్ద ఇబ్బందే సుమీ అనిపించింది. 

ఇంతలో నాకు బాపు గారి పైప్ విషయం గుర్తొచ్చి "సార్ మీ పైప్ ఒక సారి చూడచ్చా?" అన్నాను. ఆయన జవాబు చెప్పే లోపలే డాక్టర్ దగ్గరనుంచి ఆయనకోసం మందు తీసుకొచ్చిన బాపు గారి అమ్మాయి లోపలి వస్తూ కనిపించారు. వెంటనే బాపు గారు కళ్ళతోనే ఆగమని సైగ చేసి ఆవిడ రాగానే "మా అమ్మాయి" అంటూ మాకు పరిచయం చేసారు. ఆవిడ మమ్మల్ని పలకరించి డాక్టరు చెప్పిన సూచనలని (పధ్యం వగైరా) బాపు గారికి చెప్పి వెళ్ళిపోగానే "ఏమయింది సర్" అన్నా? " కాలు కాస్త బాలేదు" ఇదీ ఆయన సమాధానం. (వార్నీ ఇంత మిత భాషా? ). మళ్ళీ పైప్ విషయం గుర్తొచ్చి "అదీ మీ పైప్ గురించి ఏదో చెప్పబోయారు ..." అన్నా. "మానేయాల్సొచ్చింది. అది ఇప్పుడు ఎక్కడుందో ఏంటో, గుర్తు చెయ్యకండి...మళ్ళీ ఎక్కడో మనసు లాగుతుంది' అంటూ నవ్వారు. 


పైప్ - బాపు (పైపెక్కిన మెహది హసన్ పై అభిమానం)




















ఇంతలో మా ఆవిడ ఆయన ఇచ్చిన బొమ్మలలోంచి "కోటప్ప కొండ ఆలయమండలి మూల విరాట్" అని ఉన్న బొమ్మ ఆయనకు చూపించి "ఇది నేను తీసుకుంటా" అంది. ఆయన నవ్వుతూ తలూపారు. ఇంతలో నేను బాదామి గుహలలో పద్దెనిమిది చేతుల నటరాజు శిల్పం గురించి ఆయనకీ చెప్పి ఆ ఫోటో నా లాప్ టాప్ లో ఆయనకు చూపించా. "ఆ బొమ్మ మీరేస్తే చూడాలని ఉంది" అని నా కోరికను కూడా చెప్పా. "ఇది నాకొక కాపీ పంపించండి. వేసిస్తా" అన్నారు. అంటూ "అలాంటిదే ఆ మధ్య ఒక కృష్ణుడి బొమ్మ వేసాను...అన్ని చేతులు కాదు కానీ ఎనిమిది చేతులతో ఉంటుంది. ఉండండి చూస్తా" అంటూ వెతికి ఒక బొమ్మ తీసి చూపించి "ఇది మీ దగ్గరుంచండి" అన్నారు. ఇంతలో మా ఆవిడ మొహమాటం తో ఒకే బొమ్మ తీసుకుని మిగిలినవి నా చేతిలో పెట్టింది. "మీరూ కావలసినవి తీసుకోండి" అన్నారాయన. నేను ఆ బొమ్మల్లోంచి ఒక సరస్వతి దేవి బొమ్మ తీసుకుని "ఈ గెటప్ లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి  బొమ్మ గీసిస్తారా? అంటే ఇది తీసుకుంటున్నాను, సరస్వతి దేవి రూపం లో సుబ్బలక్ష్మి గారు కూర్చున్నట్టు బొమ్మ" అని ఆయన్నడిగా. 'ఆ మధ్య భానుమతి గారిది ఇలా వేసినట్టు గుర్తు. సుబ్బలక్ష్మి గారు అలా చూస్తున్న ఫోటో ఏదయినా దొరికితే పంపండి, నేనూ వెతుకుతా, ఐడియా బావుంది' అన్నారు. 
నాకిచ్చిన సరస్వతీ దేవి బొమ్మమీద సంతకం చేస్తూ బాపు గారు


















ఇంతలో మా ఆవిడ తను తీసుకున్న "కోటప్ప కొండ ఆలయమండలి మూల విరాట్" బొమ్మ ఆయన ముందు పెట్టి "మీరు ఆటో గ్రాఫ్ చేసి ఇవ్వండి" అని అడిగింది. ఆయన నవ్వుతూ ఆ బొమ్మ తీసుకుని దాని మీద "చి. సౌ. స్వాతి శంకర్ కు శుభాకాంక్షలతో బాపు" అని తారీఖు వేసి ఇచ్చారు. ఆయన రాస్తున్నప్పుడు నాకు కంప్యూటర్ లో బాపు ఫాంట్ గుర్తొచ్చింది. ఇంతలో మా ఆవిడ నా చేతిలో ఉన్న రెండు బొమ్మలూ తీసుకుని ఆయన ముందు పెట్టింది. ఆయన వాటి మీద కూడా "చి. సౌ. స్వాతి శంకర్ కు శుభాకాంక్షలతో బాపు" అనే రాశారు. చెప్పద్దూ!  నాకు మా ఆవిడ మీద భలే కోపం, ఉక్రోషం వచ్చింది. తీసుకున్న మూడు బొమ్మల మీదా తన పేరే వచ్చేసిందే అని. అంతలోనే అందులో ఉన్న "శంకర్" ను చూసి పోన్లే నన్నూ కలిపారు అనుకుని కాస్త కంట్రోల్ చేసుకున్నా.


 ఇవే "బాపు" ప్రసాదం :) - బాపుగారి వద్ద నుండి తీసుకున్న బొమ్మలు 




































దీనిమీదే  తరవాత నేను రమణ గారి ఆటో గ్రాఫ్  కూడా తీసుకున్నా  



















ఇంతలో బాపు గారు లేచి "పదండి పైకి వెళ్దాం" అంతతో రమణ గారి పోర్షన్ వైపు దారి తీసారు. మేమిద్దరం ఆయన్ని అనుసరించాం.

(మిగిలినది మూడో భాగం లో )