Sunday, February 27, 2011

ముళ్ళపూడి వెంకటరమణకు శతోపమాన నివాళి


ముళ్ళపూడి వెంకట రమణ రాతలలో సొగసేంటంటే ఒక్క మాటలో  ఏం చెప్తాం? ఎలా చెప్తాం?. అందుకే ఆయనకి నివాళిగా తన శైలి ఎలాంటిదో చెప్పడానికి ఉపమానాలను ఎంచుకోవాలని అనుకున్నా. ఐదో పదో ఉపమానాలు అనుకుని మొదలెట్టిన నేను "వందే" రమణా అనుకుంటూ ముగించాను. :)
 నిజానికి ఇది ఆయన మార్కు హాస్యం తోనే రాద్దామనుకున్నప్పటికీ భక్తివలనో, గౌరవం వలనో అంతటి సాహసం చేయలేక ఆరుద్ర ముద్ర, అక్కడక్కడ జరుక్ శాస్త్రి చమక్కు స్ఫూర్తిగాను జోడిస్తూ రాశాను. చదివి ఎలా ఉందో చెప్పండి. (మరీ పొయిటిక్ అయిపోతోందేమో అనుకున్నప్పుడల్లా కుసింత కామెడీ వాడుకున్నాను. సాధ్యమయినంత వరకూ ఏ రెండు పోలికలకూ సంబంధం ఉండకూడదని భావించి రాశాను. తప్పులుంటే మన్నించండి)

మన రమణ శైలి 

తేనెలొలుకు తేట తెలుగు పద్యమంటిది
మధువులూరు మధురమైన వాద్యమంటిది

కృష్ణ శాస్త్రి కవిత లోని భావమంటిది
కొమ్మ మీది కోయిలమ్మ రావమంటిది

అమ్మ పాడు కమ్మనైన జోల వంటిది
అద్భుతాల నల్లనయ్య లీల వంటిది 

నిండుపున్నమేళ చందమామ వంటిది
నిలువెల్లా తడిపేసే ప్రేమ వంటిది 

కడలిలోన ఎగసిపడే అలల వంటిది
కలకాలం గుర్తుండే కలల వంటిది

పసిపాపల బోసినవ్వు సొంపు వంటిది
బాపు గారి బొమ్మ నడుము వంపు వంటిది

వేడి వేడి మొక్కజొన్న పొత్తు వంటిది
మహా వృక్ష మూలమైన విత్తు వంటిది

వాటంగా దోచుకున్న ముద్దు వంటిది
వద్దంటూ చెరిపేసే హద్దు వంటిది

గర్భగుడిన కాంతులీను దీపమంటిది
అమ్మ మీద పసిపాపడి కోపమంటిది

తిరుగులేని శ్రీరాముని బాణమంటిది
కిట్టమూర్తి కమ్మనైన వేణువంటిది

కొత్తావకాయలోని ఘాటు వంటిది
బుడుగ్గాడు చెప్పే ప్రైవేటు వంటిది

తొలకరిలో భువిని తాకు చినుకు వంటిది
అలసినపుడు అమ్మఒడిన కునుకు వంటిది

చలికాలపు గోర్వెచ్చని ఎండవంటిది
తొలిసారిగ లయతప్పిన గుండెవంటిది

పచ్చదనం పరుచుకున్న పంట వంటిది
వెచ్చదనపు సెగల భోగి మంట వంటిది

శోభనం గదికున్న తలుపువంటిది
ఆ మర్నాడు భార్య మేలుకొలుపువంటిది

ఇంటి ముందు అందమైన ముగ్గు వంటిది
అందమైన పడుచుపిల్ల సిగ్గు వంటిది

బీడువారు నేల తడుపు వర్షమంటిది
పురివిప్పిన నెమలి నాట్య హర్షమంటిది

అడక్కుండ పొందినట్టి వరమువంటిది
అక్షయతూణీరంలో శరము వంటిది

"నాతిచరామి" అనే బాస వంటిది
సొంతూర్లో మాటాడే యాస వంటిది

మత్తగజం చేసే ఘీంకారమంటిది
చిత్తమంత నిండిన ఓంకారమంటిది

కష్టంలో తోడుండే నేస్తమంటిది
స్నేహమనే సాటిలేని ఆస్తి వంటిది

"అనగనగా" అని చెప్పే కధలవంటిది
సాగరమధనంలో పుట్టిన సుధలవంటిది

సెలవుల్లో తాతగారి ఇల్లు వంటిది
రాములోరు విరిచేసిన విల్లు వంటిది

వేడివేడి పకోడీల పళ్ళెమంటిది
అవి చేసిచ్చిన అందమైన పెళ్ళమంటిది

కొబ్బరాకుమీంచి జారు వెన్నెలంటిది
పడవమీద ఎంకి వయసు వన్నెలంటిది

పుస్తకంలో దాచుకున్న పింఛమంటిది
రవివర్మ చేతిలోని కుంచె వంటిది

బాధలన్ని మరపించే హాస్యమంటిది
భారతీయ నృత్యంలో లాస్యమంటిది

సుప్రభాత సూర్యుని తొలి కిరణమంటిది
చెంగుచెంగుమని గెంతే హిరణమంటిది

కరకు బోయ పలికిన తొలి శ్లోకమంటిది
కష్టాలే ఉండని నవ లోకమంటిది

ఆరుబయట ఎండేసిన వడియమంటిది
ముచ్చటైన ఆడపిల్ల బిడియమంటిది

పొరపాటున తీర్చేసిన అప్పువంటిది
బిల్లు కన్నా ఎక్కువైన టిప్పు వంటిది

పెళ్లింట్లో ఆడుకునే పేక వంటిది
లంకాదహనం చేసిన తోక వంటిది

సినేమాలో వీరోయిన్ వయసు వంటిది
చిన్నప్పుడు తిన్న పుల్లఐసు వంటిది

గలగలమని పారే సెలయేరు వంటిది
అచ్చతెలుగు సాహిత్యపు తేరు వంటిది

అమ్మకడుపులో ఒదిగిన పిండమంటిది
యశోదమ్మ చూసిన బ్రహ్మాండమంటిది

సరదాగా సాయంత్రపు నడకవంటిది
ఆరుబయట వెన్నెల్లో పడక వంటిది

అమ్మ చీరతో వేసిన ఉయలంటిది
చైత్రంతో గొంతు విప్పు కోయిలంటిది

ఉట్టి మీద కుండలోని తరవాణి వంటిది
బ్రహ్మదేవుముంగిట సిరి వాణి వంటిది

మూడుముళ్ల వేళలోని ఉద్వేగమంటిది
తలపుకున్న తిరుగులేని వేగమంటిది

ఎంత చదివినా తీరని దాహమంటిది
మూడుకళ్ళ బిచ్చగాడి దేహమంటిది

బాల్యంలో ఆడుకున్న మిత్రుడంటిది
వైతరిణిని దాటించే పుత్రుడంటిది

పోపులపెట్లో దాగిన చిల్లరంటిది
పసితనాన చేసిన అల్లరంటిది

గోదారి రేవులోన నావవంటిది
దివిలోకమేగేందుకు త్రోవ వంటిది

శ్రీనాధ కవీంద్రుని కలము వంటిది
సాహిత్య క్షేత్రాన పోతన హలము వంటిది

భగవంతుడు బోధించిన గీత వంటిది
తెలుగోడి నుదుటి మీద రాత వంటిది

కొమ్మకొమ్మకూ దూకే కోతి వంటిది
వేమనయ్య చెప్పినట్టి నీతి వంటిది

కనుమూసాకే కలిసే మృత్యువంటిది
కడదాకా వెంటుండే భృత్యువంటిది

మహామంత్రి తిమ్మరుసు యుక్తివంటిది
సంద్రం దాటిన హనుమ శక్తివంటిది

రెండు జళ్ళ సీతకేయు లైను వంటిది
ఆపాతమధురమైన వైను వంటిది

విజ్ఞాన భాండమైన మన వేదమంటిది
శంకరునితో ఛండాలుని వాదమంటిది


  ఈ ఒక్క పోస్ట్ మాత్రం రమణ గారి స్మృతిలో నేను ప్రారంభించుకున్న "జాటర్ ఢమాల్" బ్లాగు లో కాక ఇక్కడ  పోస్ట్ చేస్తున్నాను. (వారం తర్వాత అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని మా సెగట్రీ కి చెప్పాన్లెండి)

  12 comments:

  బులుసు సుబ్రహ్మణ్యం said...

  >>శోభనం గదికున్న తలుపువంటిది
  ఆ మర్నాడు భార్య మేలుకొలుపువంటిది
  భావం చాలా బాగుంది. కొత్తగా ఉంది.
  శతోపమాన నివాళి చాలా బాగుంది.

  ravi said...

  మీరెందుకో సాహసం చేసారని అనిపిస్తుంది

  తృష్ణ said...

  బాగుందండి నివాళి..

  ఆ.సౌమ్య said...

  మొత్తం మీద బావుంది కానీ కొన్ని కొన్ని ఉపమానాలు నచ్చలేదు.
  ఎలాంటివంటే
  శోభనం గదికున్న తలుపువంటిది
  ఆ మర్నాడు భార్య మేలుకొలుపువంటిది
  మత్తగజం ఘీంకారమంటిది....etc.
  ఇలాంటివెందుకో అంత బావున్నట్టనిపించలేదు.

  పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

  మీ శైలి బావుంది.! సౌమ్యగారు చెప్పినట్లు అక్క్డడక్కడ కొంచెం పదాల పొందిక కుదరలేదమో అని అనిపించిది.
  ఇది ఈవాల్టి బ్లాగ్ గురించి స్పందన!

  యమ్వీ అప్పారావు (సురేఖ) said...

  అక్షరాలతో ఆడుకొనే ముళ్లపూడి
  ఆయనపై పై మీ శతోపమాన పదాల గారడి
  అందించిన మీకు నా హృదయపూర్వక అభినందలండి

  SHANKAR.S said...

  @ సుబ్రహ్మణ్యం గారు
  ధన్యవాదాలు.

  @ రవి గారు
  ఏమో మీరన్నట్టు సాహసమేనేమో. రమణ గారి మీద భక్తి తప్ప ఆ సమయం లో మరేదీ ఆలోచించలేదు.

  @తృష్ణ గారు
  ధన్యవాదాలు

  @ సౌమ్య గారు
  "శోభనం గదికున్న తలుపువంటిది
  ఆ మర్నాడు భార్య మేలుకొలుపువంటిది"

  మీకింకా పెళ్ళయినట్టు లేదు. ఆ తలుపుకున్న ప్రాముఖ్యత అలాంటిది అది తెరుచుకున్నప్పుడూ, మూసుకున్నప్పుడూ ఉండే ఉద్విగ్నత పెళ్ళయితే మీకర్ధమవుతుంది, మర్నాడు భార్య మేలుకొలుపులో జీవిత భాగస్వామితో పంచుకునే తొలి సూర్యోదయపు అనుభూతి ఉంటుంది అని నాకనిపించింది. అనుభవజ్ఞులు బులుసు సుబ్రహ్మణ్యం గారికి అర్ధమయింది. పైన ఆయన కామెంట్ చూడండి.

  "మత్తగజం ఘీంకారమంటిది...."
  అసలు ముందు పట్టపుటేనుగు అని పెడదామనుకున్నా. కోతికొమ్మచ్చి మొత్తం మీద నాకు నచ్చింది రమణ గారిలో ఆత్మవిశ్వాసంతో కూడిన ఆయన పొగరేనండీ. తస్సదియ్య ఏం ఇన్స్పైరింగ్ గా ఉంటుందో తెల్సా. అందుకే ఆ దిగ్గజాన్ని మత్తగజం అన్నాను. అలా పోల్చడం తప్పేమో గానీ ఇంకో ఆల్టర్నేటివ్ తట్టలేదు.

  మిగిలినవి బావున్నాయి అన్నందుకు ధన్యవాదాలు.

  @మాణిక్యాంబ గారు
  ధన్యవాదాలు. బహుశా మీరు చెప్పింది నిజమే కావచ్చు. భాష విషయంలో అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. తెలియజేస్తే సవరించుకుంటా. అయినా కన్నప్ప శివుడ్ని ఆరాధించేటప్పుడు వాడి భాష కన్నా భక్తినే చూడాలేమో :)

  @ అప్పారావు (సురేఖ) గారు
  ధన్యవాదాలు.
  నేను కూడా చివరిసారి ఆయనతో ఫోన్లో మాట్లాడింది ఆయన పెళ్లిరోజునే. ఫిబ్రవరి నెలాఖర్లో కొంచం పని వత్తిడి తగ్గిన తరువాత హైదరాబాద్ లో శ్రీరామ రాజ్యం షూటింగ్ స్పాట్ కి వచ్చి ఇద్దర్నీ కలుస్తానని చెప్పా. నా మాట నిలబెట్టుకునే లోపులే ఆయన ఆ రాములోరి దగ్గరికి వెళ్ళిపోయారు. :(

  బులుసు సుబ్రహ్మణ్యం said...

  శంకర్ గారు అనుభవజ్నులు అన్నారు. క్షమించాలి. ఒకటే పెళ్లి, ఒకటే భార్య, ఒకటే శోభనం.:):)

  చిన్నప్పుడు అంటే early 60s. లో ఒక కధ చదివాను. శీర్షిక కూడా గుర్తులేదు. ఇద్దరు అపరిచితులు మొదటి మాటు శోభనం గదిలోకి వెళ్ళేముందు వారి మనస్థితి, భయాలు, లోపలికి వెళ్ళినతరువాత మొదట బెరుకు, మెల్ల మెల్లగా మాటలు, మనసులు తనువులు కలిపే ప్రయత్నం. మర్నాడు ఉదయం వెళ్ళేముందు "మనమిద్దరం కలిసి బతకగలమన్ననమ్మకం కుదురుతోంది" అంటుంది అమ్మాయి.
  ఆ కధ గుర్తుకు వచ్చింది.

  SHANKAR.S said...

  @ సుబ్రహ్మణ్యం గారు
  ఇక్కడ మళ్ళీ మీ మార్కు చమక్కు చూపించారుగా
  అయ్యో నేను పెళ్ళిళ్ళు చేసుకున్న అనుభవం గురించి అనలేదండీ :)

  మీరు చెప్పిన ఉద్దేశ్యమే నాదీను. ఆ పోలికను మీ జీవితానుభవం (మాకు గురుతుల్యులు కాబట్టి మీరేలా అర్ధం చేసుకున్నారో సౌమ్య గారికి చెప్పాలన్నదే నా ఉద్దేశ్యమంతే.

  Ennela said...

  //పొరపాటున తీర్చేసిన అప్పువంటిది
  బిల్లు కన్నా ఎక్కువైన టిప్పు వంటిది//.. యీ లయిను నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది...అప్పు తీర్చేసి, తర్వాత చేతిలో డబ్బుల్లేక అయ్యొ యీ వైద్యుడు (అప్పిచ్చువాడు) మంచి వాడే, పొరపాటున భయపడి తీర్చేసామే అనిన్నీ, నలుగురిలో బాగుండదని పర్సులో ఉన్న ఆఖరి బిల్లు టిప్పు పెట్టి 'ఇట్ ఈస్ నాట్ వర్త్..హ్మ్' అనుకోటం..యీ రెండిట్లోను ఆనందం , దుఖం, గర్వం , విచారం కలగా పులగంగా కలిసి పోయి ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది....యీ పదాల అమరిక సూపర్...

  పెద్ద పోస్టులు వ్రాయడానికి నాతో పోటీ పడినందుకు అభినందనలు శంకరా

  సుమలత said...

  పదాల దోరణి సూపర్బ్ ;సౌమ్య గారు చెప్పినట్టు
  కొంచెం శోబనం లోని అమరిక కొంచెం నచ్చలేదు ;

  bharadwaj said...

  moodu kalla bichagaadu....vah