సినిమా హాల్ స్ట్రీట్ లో తెగ తిరిగేసి అలిసిపోయుంటారు గానీ కుసింత మా భానుగుడి సెంటర్ కొచ్చేయండి. చార్మినార్ లో స్పెషల్ బాదం టీ తాగుతూ కాసేపు హస్కేసుకుందాం. ఏటదీ..భానుగుడి సెంటర్ ఎక్కడా అంటారా? అక్కడే మరి నాకు మండుద్ది. నెల్లూరి పెద్దారెడ్డి తెలియకుండా పోలిస్ డిపార్ట్మెంట్ లో చేరినట్టు భానుగుడి సెంటర్ తెలియకుండా మీరు కాకినాడలో ఏం చేస్తున్నారండీ? సర్లెండి తప్పుద్దా మరి... దానిగురించీ చెప్తా.
భానుగుడి సెంటర్ కి ఆ పేరు రావడానికి కారణం ఆ ఏరియాలో ఉన్న సూర్యుడి గుడి. ఒకప్పుడు ఆ గుడి ప్రముఖం గా కనిపించేది. తరవాత తరవాత ఊరు విస్తరిస్తున్న కొద్దీ షాపింగ్ కాంప్లెక్స్ ల మధ్యలో పడి అక్కడో గుడి ఉంది అని ప్రత్యేకంగా చూస్తే గానీ తెలియని పరిస్థితికి వచ్చేసింది. నిజానికి మా కాకినాడలో మెయిన్ సెంటర్ హోదా మసీద్ సెంటర్ ది. అయితే భానుగుడిని యూత్ స్పెషల్ సెంటర్ గా చెప్పచ్చు. పివి హయాం లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాక ఇండియా పరిస్థితి మారిపోయినట్టు సుభద్ర ఆర్కేడ్ వచ్చాక భానుగుడి సెంటర్ ముఖచిత్రం కూడా మారిపోయింది. అంతకు ముందు జనసంచారం లేని అడవి అని చెప్పాను కానీ పెద్దగా రద్దీ ఉండేది కాదు. భానుగుడి సెంటర్ దాటిన తరువాత వచ్చే SP బంగ్లా, పోలీస్ క్వార్టర్స్, JNTU, రంగరాయ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, సర్పవరం జంక్షన్, APSP క్వార్టర్స్ ఇవన్నీ ఊరికి దూరంగా ఉన్నట్టు ఉండేవి. మా చిన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వెనక స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గరున్న మా అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర సిటీ బస్ దిగి అక్కడనుంచీ నడకే గతి.
సుభద్ర ఆర్కేడ్ వచ్చిన తరవాత అది మా ఊళ్ళో యూత్ మొత్తానికి డెన్ గా మారిపోయింది. అటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ఇటు పివిఆర్ ట్రస్ట్, ఐడియల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంక ఆదిత్య, ప్రగతి లాంటి జూనియర్ కాలేజీ మంద ఇలా అందరికీ అదే మీటింగ్ పాయింట్. ఆది సినిమాలో "ఈ ఊళ్ళో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత" అన్నట్టు మా ఊర్లో సగానికి పైగా జనానికి మొదట ఇంటర్నెట్ పరిచయం చేసింది ఈ కాంప్లెక్స్, మొదట బిలియర్డ్స్ టేబుల్ , పూల్ గేమ్స్ అలవాటు చేసింది ఈ కాంప్లెక్స్ అన్నమాట. :). ప్రేమికుల రోజు సినిమా చూసి మాకూ సోనాలి బెంద్రే దొరికేస్తుందని వెర్రి వెధవల్లా నమ్మి గంటకి అరవై రూపాయలిచ్చి( అదీ ఇద్దరు కలిపి షేరింగ్...అరగంట ఒకడు, ఇంకో అరగంట ఇంకొకడు చాట్ చేసుకునేలా అంతర్జాతీయ ఒప్పందాలు మరి) చాటింగ్ చేసింది ఇక్కడే.:(
ఇదే సుభద్ర ఆర్కేడ్. అడగ్గానే నేను అడిగిన విధంగా ఫోటో తీసి పంపించిన నా ఫ్రెండ్ జగన్నాధ రాజు కి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు. |
ఇంక సుభద్ర ఆర్కేడ్ ని దాటి కాస్త బయటకి వస్తే ఆ పక్కనే చార్మినార్ టీ సెంటర్. ఆనంద్ థియేటర్ లో సినిమాకి టికెట్లు తీసుకుని ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా చార్మినార్ కి వచ్చి కలవమనే కుర్రాళ్ళు, సుభద్ర ఆర్కేడ్ లోకి ప్రవేశించే ముందు ఇక్కడ కాస్త ఆగి ఓ టీ కొట్టి రిలాక్సయ్యే యూత్ బ్యాచ్ లు, ఎండలో నిలబడీ నిలబడీ కాళ్ళు లాగేసి బుర్ర మీద టోపీ తీసి తల గోక్కుంటూ ఓసీ టీ తాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇక్కడ మీకు కనిపిస్తారు. ఇప్పటికీ ఈ టీ సెంటర్ బయట ప్లాట్ ఫారం మీద స్టాండ్ వేసిన బైక్ ల మీద కూర్చుని తీవ్రం గా చర్చించేసుకునే కుర్రాళ్ళని చూస్తే కప్పుల కొద్దీ టీ తాగుతూ, గంటలు గంటలు హస్కేస్తూ BSRB ప్రిపరేషన్ టెక్నిక్స్ నుంచీ, కొత్త నోటిఫికేషన్లు, కొత్త సినిమాలు, మా మా ఏరియాలో అమ్మాయిల ఆటో బయోగ్రఫీల వరకు అలుపు లేకుండా చర్చలు చేసుకుంటూ గడిపేసిన ఆకలిరాజ్యం రోజులు గుర్తొస్తాయి. :)
చార్మినార్ సెంటర్ దగ్గర శ్రీరాం నగర్ కెళ్ళే దారిలో బోలెడన్ని తోపుడు బళ్ళు పెట్టుకుని పళ్ళు అమ్ముతూ ఉంటారు. దాదాపు అర్ధరాత్రి దాకా వీళ్ళ సందడితో ఈ ఏరియా బిజీగానే ఉంటుంది. ఇక అక్కడినుంచి కాస్త ముందుకొచ్చి A-Z ఎంపోరియం, రాజు మెస్, మంగీలాల్ స్వీట్ షాప్ దాటుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకొస్తే లెఫ్ట్ సైడ్ పద్మప్రియ కాంప్లెక్స్. ఇక్కడ "యతి" అని పార్లర్ కం పిజ్జా కార్నర్ ఉంది లెండి. దాని ముందు నిలబడి బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదని విసుక్కునే అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఆ టైం లో అక్కడున్న అమ్మాయిలకి రేటింగ్ ఇచ్చే అబ్బాయిలు, నెయిల్ పాలిష్ కొనుక్కున్నా పార్టీ ఇచ్చేసుకునే అమాయకపు ఆడపిల్లల బ్యాచ్ లు గుంపులు గుంపులుగా దర్శనమిస్తారు.
ఇక కాస్త ముందుకెళ్తే ఆనంద్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ గురించి ఆల్రెడీ సినిమా హాల్ స్ట్రీట్ గురించి చెప్పినప్పుడు చెప్పేశాను. ఇక ఈ కాంప్లెక్స్ దాటితే టూ టౌన్ బ్రిడ్జి. అదండీ మా ఊరి భానుగుడి సెంటర్. కాకినాడ కబుర్లు మొదటి రెండు భాగాలు ఇక్కడ చూడండి.
NEXT : ఫలపుష్ప ప్రదర్శన అనబడే మా ఊరి కుళాయి చెరువు ఎగ్జిబిషన్
9 comments:
Wonderfull!
I love Kakinada just for its charm!
There is so much to Kakinada than its cinema street and masjid centre.
Inka meeru Kokila restaurant gandhinagar park, subbaih hotel gurinchi cheppaledu (sorry earlier 2 parts, inka chadavaledu).
Ideal college daggara mamidi thotalu boat club, oh asalu enni vishayalu vunnayo cheppalsinavi.
Thanks for taking me to Kakinada again.
meedi kaakinadee
naadi kaakinaadee
naa chinnanaati chinna Kaakinada Joke okati panchukuntaanu ikkada...
Telugulo KAKINADA raasi ..
Kaaki KAAKINADA board meeda vaali
Retta vestey....
KA meeda
KI meeda
Daa meeda vesina taruvaata..
Inkaa retta ekkada padaali ani adugutundeyvaaru ....
Wonderful posts Keep it up and continue....
Avineeti ki jajjinakada janaarey jai jai annaa hajaarey !!
ఇంకా
వెన్నక్కి వెళ్లి తే
ఇసుకతిప్పలు, నరసన్నపేట దగ్గర
మామిడితోటలు
అక్కడనుంచి అడ్డదారిలో
సర్పవరం భావనారాయణ స్వామి
గుడికి వెళ్ళడం. ఇవన్ని నిజం గ
మరచిపోలేని జ్ఞపకాలు
భానుగుడి సెంటర్ !! వావ్...నా ఫ్రెండ్ ఒకమ్మాయి అక్కడ నాలుగేళ్లు ఉంది. బిటేక్ చదువుకున్న తను భానుగుడి సెంటర్లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో "ఓరకిల్" టీచ్ చేసేది. తనున్న నాలుగేళ్ళు కాకినాడ వెళ్ళినప్పుడల్లా నేను తనని కలవటానికి భానుగుడి సెంటర్ కి వెళ్ళేదాన్ని. అక్కడ కాంప్లెక్స్ పేరు గుర్తులేదు కానీ ఒకచోట "అభిరుచి" అనుకుంటా(పేరు గుర్తులేదు) రెస్టారెంట్ ఉండేది. (ఇంకా ఉండేమో?) అక్కడ తినేవాళ్లం ఇద్దరం.
ఇక A-z షాప్ కి నేను బోలెడు సార్లు షాపీంగ్ కి వెళ్ళా..:)))
ఇంక మీ next part కి నే ఒక టపా అంత వ్యాఖ్య రాస్తానేమో. "కుళాయి చెరువు ఎగ్జిబిషన్" was our most favourite thing in kakinada. We never missed it. I can write many things about that...!!
కాకి నాదా? అని చదివాడు మా అబ్బాయి మేము కాకినాడ మొదటి మాటు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో. అప్పుడు వాడు కష్టపడుతూ 1 వ క్లాస్ చదివేవాడు. ఆ తరువాత ఇంకో 7-8 మాట్లు వచ్చాము. నిజం చెప్పాలంటే నాకేమీ ప్రత్యేకం గా కనిపిచలేదు. ఏమిటో మీరు చెబుతుంటే ఏదో మిస్ ఆయానేమో ననిపిస్తోంది. లాస్ట్ విజిట్ 2002 అనుకుంటాను. అంతా శంకర మాయ కాదుకదా? :):)
అయిపోయిందాండి కాకినాడ. ఇంకేమీ లేదా. నేనైతే ఒక్కసారి కూడా చూడలేదండి.
కాకినాడ చూడాలని వుంది. ఇంతక ముందు చూసాను ,కానీ ఇప్పుడు మరలా చూడాలని ఉంది ఎందుకనో !
శంకరా,త్వరలో ఇండియాకొస్తున్నా...నన్ను కాకినాడ తీసుకెళతారా స్వాతి నువ్వు కలిసి?
కాకినాడ గురించి చాలా బాగా రాస్తున్నారండీ..! అన్నట్టు.. నాక్కూడా సుభద్ర ఆర్కేడ్లోనే ఇంటర్నెట్ పరిచయమయ్యింది...ఇంటికి వెళ్ళడం ఎప్పుడు కుదురుతుందా అని ఎదురుచూస్తున్నాను.
మీ నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నా..!
Post a Comment